పోస్టాఫీసుల ద్వారానే ‘ఆసరా’ పింఛన్లు | Asara pension from post offices | Sakshi
Sakshi News home page

పోస్టాఫీసుల ద్వారానే ‘ఆసరా’ పింఛన్లు

Apr 2 2017 3:07 AM | Updated on Sep 5 2018 8:24 PM

పోస్టాఫీసుల ద్వారానే ‘ఆసరా’ పింఛన్లు - Sakshi

పోస్టాఫీసుల ద్వారానే ‘ఆసరా’ పింఛన్లు

ఈ నెల నుంచి ‘ఆసరా’ పింఛన్లను పోస్టాఫీసుల ద్వారానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు.

లబ్ధిదారులకు సక్రమంగా చేరేలా సర్కారు చర్యలు: జూపల్లి  

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల నుంచి ‘ఆసరా’ పింఛన్లను పోస్టాఫీసుల ద్వారానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం 2,551 గ్రామాల లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా పింఛన్ల పంపిణీ జరుగుతోందని, మండలంలో ఉండే ఒక బ్యాంక్‌ వద్దకే అన్ని గ్రామాల నుంచి లబ్ధిదారులు రావడం ఇబ్బందికరంగా మారిందన్నారు. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పోస్టాఫీసు ఉన్న ప్రతి గ్రామంలోనూ బయోమెట్రిక్‌ విధానంతో పింఛన్లను అందించాలని నిర్ణయించామన్నారు.

పంచాయతీలకు సమీపంలో తండాల్లోని లబ్ధిదారులు కూడా వారి ఇంటివద్దనే పింఛన్‌ సొమ్ము అందుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గతంలో.. వేలి ముద్రలు సరిపోలని వారికి పంచాయతీ కార్యదర్శి ద్వారా పింఛన్‌ సొమ్మును అందజేశామని, అందులోనూ అవకతవకలు జరుగుతున్నందున, ఐరిస్‌ విధా నాన్ని అమలు చేయాలని భావిస్తున్నామన్నారు. కొల్లాపూర్‌ నియోజకవర్గం గోపులాపూర్‌లో ఓ వృద్ధురాలికి గత 4 నెలలుగా పింఛన్‌ సొమ్ము ఇవ్వకుండా, అక్రమాలకు పాల్పడుతున్న పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేసినట్లు మంత్రి జూపల్లి పేర్కొన్నారు.

అత్యధికంగా ఉపాధిహామీ పనులు
2016–17 ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,618 కోట్ల పనులు జరిగాయని, గత 10 సంవత్సరాలతో పోల్చితే అత్యధికంగా ఉపాధిహామీ నిధులు ఖర్చు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. పదేళ్లలో దాదాపు రూ.3,827 కోట్లు ఖర్చు చేయక పోవడంతో ఆ నిధులు మురిగి పోయాయన్నారు. 2017–18లో సుమారు రూ. వెయ్యికోట్ల మేర సిమెంట్‌ రహదారుల నిర్మాణానికి వెచ్చించాలని ప్లాన్‌ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పనికోరిన ప్రతి ఒక్కరికి ఆన్‌లైన్‌ ద్వారానే జాబ్‌ కార్డు మంజూరు చేసి, ప్రతి కుటుంబానికి 100 రోజుల పాటు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి జూపల్లి చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు బాలరాజు, రామ్మోహన్‌రెడ్డి, రవికుమార్, మహబూబ్‌నగర్‌ జెడ్పీ చైర్మన్‌ భాస్కర్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement