యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీకి సన్నాహాలు! | Arrangements for posts in Universities | Sakshi
Sakshi News home page

యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీకి సన్నాహాలు!

May 20 2016 2:12 AM | Updated on Aug 15 2018 9:30 PM

తెలంగాణలో పలు యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు వర్సిటీల స్థితిగతులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని బుధవారం నిర్వహించిన సమీక్ష సమావే శంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు, వాటికి వెచ్చించాల్సిన బడ్జెట్ వివరాలను అందజేయాలని సీఎం కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు వర్సిటీల వారీగా సమీక్ష సమావేశాలు ప్రారంభించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 30, ఉస్మానియాలో 669 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. మిగతా వర్సిటీల్లో ఖాళీల వివరాలు, వాటి భర్తీకి చేపట్టాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ద్వారానే నియామకాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.
 
 అయితే, వర్సిటీలకు స్వయం ప్రతిపత్తి హోదా, ప్రత్యేక నియామక విభాగాలున్న నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీకి ఆ బాధ్యతలనిస్తే  సాంకేతికపరమైన సమస్యలు తలెత్తుతాయా... అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. దీనిపై వర్సిటీల అభిప్రాయాలను కోరినట్లు సమాచారం. హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో(జేఎన్‌టీయూహెచ్) పోస్టుల భర్తీ విషయంలోనూ ప్రభుత్వం వర్సిటీని వివరణ అడిగినట్లు తెలిసింది. భర్తీ విధానంతోపాటు గతంలో భర్తీ చేసిన పోస్టులు, కోర్టు వివాదాలపైనా చర్చించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement