
ప్రపంచీకరణకు ప్రయోగశాలగా ఏపీ
ప్రపంచీకరణకు హైదరాబాద్‌ను ప్రయోగశాలగా మార్చిన పెద్దమనుషులే ప్రస్తుతం రెట్టించిన ఉత్సాహంతో...
♦ హైదరాబాద్‌ను మార్చిన పెద్దలే ఏపీనీ అలాగే చేయాలని చూస్తున్నారు
♦ రైతు ఆత్మహత్యల వార్తలు ఏపీలోనూ వినిపించే ప్రమాదముంది
♦ అఖిల భారత రైతు సంఘం జాతీయ సభల్లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచీకరణకు హైదరాబాద్‌ను ప్రయోగశాలగా మార్చిన పెద్దమనుషులే ప్రస్తుతం రెట్టించిన ఉత్సాహంతో పొరుగునున్న ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలని తాపత్రయపడుతున్నారని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఏడాది కాకున్నా వచ్చే ఏడాదో, ఆపై ఏడాదో ప్రస్తుతం తెలంగాణలో వినపడుతున్న రైతు ఆత్మహత్యల వార్తలే అక్కడా వినపడతాయన్నారు.
నయా ఉదారవాద ఆర్థిక విధానాలు, ఆశ్రీత పెట్టుబడిదారీ విధానం, బంధుప్రీతి, ప్రభుత్వాల అపసవ్య విధానాల ఫలితంగా వ్యవసాయరంగంలో సంక్షోభం నెలకుంటోందని చెప్పారు. సంక్షోభ సుడిగుండం నుంచి రైతును గట్టెక్కించేందుకు ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు, వ్యక్తులు, పార్టీలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. గురువారమిక్కడ ప్రారంభమైన అఖిల భారత రైతు సంఘం(ఏఐకేఎస్) 29వ జాతీయ మహాసభల్లో ఆయన కీలకోపన్యాసం చేశారు. ఫోర్బ్స్ జాబితాలో చోటుకోసం ప్రపంచదేశాలతో పోటీ పడుతున్న భారతదేశం.. రైతు ఆత్మహత్యల నివారణలో మాత్రం వెనుకబడిపోతోందని ఆవేదన వెలిబుచ్చారు.
ప్రభుత్వాలు సబ్సిడీలిస్తున్నా, కల్తీ లేని విత్తనాలిస్తున్నా, రాయితీపై ఎరువులిస్తున్నా రైతు ఆత్మహత్యల పరంపర సాగుతూనే ఉందని.. ఇలా ఎందుకు జరుగుతుందో బాధ్యతాయుతమైన పౌరసమాజం ఆలోచించాలన్నారు. వెనుకబడిన రాష్ట్రాల్లో ఆత్మహత్యలు జరగడం లేదని, పెట్టుబడిదారులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయని వివరించారు. ప్రభుత్వాల అపసవ్య విధానాలకు రైతులు ఎందుకు మూల్యం చెల్లించాలన్నారు.
ఐదేళ్ల తర్వాత ఆదాయం పెరిగితే ఫలితమేముందీ?
దేశంలో అరగంటకో రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే ఎప్పుడో ఐదేళ్ల తర్వాత అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పడంలో అర్థమేముందని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈరోజు బతికేమార్గం చెప్పకుండా ఐదేళ్ల తర్వాత చెబుతామంటే ఫలితమేముంటుందన్నారు. సమగ్ర ధృక్పథంతో ముందుకు సాగడానికి బదులు తాత్కాలిక ఉపశమనం వల్ల రైతుకు మేలు జరగదన్నారు. పార్టీలను ఫిరాయించేవాళ్లు, ప్రోత్సహించేవాళ్లు, అధికారాన్ని అనుభవించాలనుకునేవాళ్లు కాకుండా ప్రజాస్వామిక విధానాలు, విలువలు, సమానత్వం, సౌభ్రాతృత్వం, వ్యక్తిగత గౌరవ ప్రతిష్టలున్నవాళ్లు సమస్యలకు హేతుబద్ధమైన, శాస్త్రీయ
యోచన చేయకపోతే సమాజ మనుగడ కష్టతరమవుతుందన్నారు. కేంద్రీకృత విధానాలకు స్వస్తిచెప్పి ప్రకృతి వనరులు కొందరి చేతుల్లోనే పోగుబడకుండా ఉండాలన్న రాజ్యాంగ ఆదేశిక సూత్రాల అమలుకు నడుం కట్టనంతకాలం సాగు సంక్షోభానికి పరిష్కారం లభించదన్నారు. కాగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. సిద్ధాంతం లేని పార్టీలు, వ్యక్తులకున్న ఆదరణ సమయోచితంగా ప్రజాసమస్యలపై పోరాడుతున్న సంస్థలు, పార్టీలు, వ్యక్తులకు ఎందుకు రావట్లేదో ఆత్మపరిశీలన జరగాలని సూచించారు.
సమావేశానికి ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు ప్రబోధ్ పాండా అధ్యక్షత వహించారు. సమావేశంలో సంఘం ఉపాధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్‌తోపాటు పశ్య పద్మ, తెలంగాణ జేఏసీ నేత కోదండరాం, విమలక్క, సీపీఎం అనుబంధ రైతుసంఘం జాతీయ కార్యదర్శి హన్నన్ మొల్లా, విదేశీ సౌహార్ద్ర ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మహాసభలు ఆరోతేదీ వరకు కొనసాగుతాయి. వ్యవసాయ రాయితీలపై శనివారం జరిగే సదస్సుకు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ హాజరవుతున్నారు.