తెలుగు సెంటిమెంట్‌ పండుతుందా? | Vice Presidential Elections 2025: Telugu Sentiment, BRS Dilemma, and Revanth Reddy’s Strategy | Sakshi
Sakshi News home page

తెలుగు సెంటిమెంట్‌ పండుతుందా?

Aug 23 2025 10:58 AM | Updated on Aug 23 2025 11:19 AM

KSR Political Commentes On Vice President Election

మోకాలికి... బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే. రెండు లక్షల టన్నుల యూరియా సరఫరా చేసి రైతులను ఆదుకునే పక్షానికే తాము ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో  మద్దతి ఇస్తామని బీఆర్‌ఎస్‌ చెప్పడం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఆమల్లోకి రావాలంటే కాంగ్రెస్‌ అధ్వర్యంలో ఇండియా కూటమి అభ్యర్థి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డికి మద్దతివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి‌ చెబుతున్నారు. తెలుగువాడైన జస్టిస్ సుదర్శన రెడ్డిని గెలిపించుకోవడానికి తెలుగు రాష్ట్రాల ఎంపీలు అందరూ కలిసి రావాలని కూడా ఆయన కోరారు. గతంలో పీవీ నరసింహారావు ప్రధాని అయినప్పుడు ఆయన లోక్ సభకు ఎన్నిక అవ్వడానికి అప్పటి టీడీపీ అధినేత ఎన్టీ రామారావు మద్దతిచ్చిన విషయాన్ని రేవంత్  రెడ్డి గుర్తు చేస్తున్నారు. 

ఉప రాష్ట్రపతి ఎన్నికలో సెంటిమెంట్ రాజకీయాలు పనిచేసే అవకాశం తక్కువే. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. కాగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అప్పాయింట్‌మెంట్‌ ఇస్తే తాను కలిసి మద్దతు కోరతానని రేవంత్  రెడ్డి అంటే, కాంగ్రెస్ ఒక చిల్లరపార్టీ అని, రేవంత్  రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్ధికి మద్దతిచ్చే ప్రసక్తి లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ అధ్యక్షుడు కేటీఆర్‌ తేల్చేశారు. మరో వైపు తాము బీఆర్‌ఎస్‌ మద్దతు కోరలేదని కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి చెప్పారు. బీఆర్‌ఎస్‌తో సంబంధాలు పెట్టుకోవడానికి బీజేపీ ఇష్టపడడం లేదన్నమాట. తెలంగాణలో సొంతంగా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో కేసీఆర్‌ను సంప్రదించలేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

మరోవైపు జస్టిస్‌ సుదర్శనరెడ్డి.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తనకు సత్సంబధాలు ఉన్నట్టుగా మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బీఆర్‌ఎస్‌ తెలంగాణకు చెందిన పార్టీ. ఆ రాష్ట్రానికే చెందిన ప్రముఖుడు ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నప్పుడు ఆయనకు మద్దతివ్వడం ఒక నైతిక బాధ్యత. జస్టిస్ సుదర్శనరెడ్డి పట్ల వీరికి వ్యతిరేకత కూడా ఉండదు కానీ ఆయన కాంగ్రెస్ కూటమి పక్షాన పోటీలో ఉండడం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామే అన్నట్టుగా బీఆర్‌ఎస్‌ పోటీపడుతోంది. అలాంటి సమయంలో రేవంత్  రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్ధికి మద్దతు ఇస్తే, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు అయ్యాయన్న బీజేపీ ఆరోపణలకు బలం చేకూర్చినట్లవుతుందన్నది వారి భయం కావచ్చు.

అలాగని బీజేపీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతిస్తే బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిసిపోయాయన్న కాంగ్రెస్‌ ప్రచారానికి బలం చేకూరినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు ఉన్న నాలుగు ఓట్లు ఎవరికి పడతాయన్నది ఆసక్తికరంగా మారింది. తటస్థంగా ఉండే అవకాశం ఉంది. పీవీ నరసింహరావు నంద్యాల నుంచి లోక్‌సభకు పోటీ చేసినప్పుడు టీడీపీ ఆయనకు మద్దతిచ్చిన మాట వాస్తవమే కానీ.. తరువాతి కాలంలో పీవీ తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు టీడీపీని చీల్చి ఏడుగురు ఎంపీలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. పైగా... పీవీ ప్రధానిగా ఉండగా.. ఆ తరువాత కూడా కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదన్న విషయాన్ని బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఇప్పుడు ఎత్తి చూపుతున్నాయి. పీవీ మరణాంతరం ఆయన భౌతిక కాయాన్ని ఏఐసీసీ ఆఫీస్ ఆవరణలోకి అనుమతించలేదని ఆ పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. వీటికి కాంగ్రెస్ సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు. 

ఇంకో విషయం. ప్రముఖ నేత నీలం సంజీవరెడ్డి తొలిసారి కాంగ్రెస్‌ అధికారిక అభ్యర్ధిగా రాష్ట్రపతి పదవికి పోటీ చేసినప్పుడు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ పార్టీ నిర్ణయాన్ని కాదని స్వతంత్ర అభ్యర్ది వీవీ గిరికి మద్దతిచ్చారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ నీలం సంజీవరెడ్డికి కాకుండా వీవీ గిరికి మద్దతిచ్చింది. ఆ సమయంలో కాసు బ్రహ్మానందరెడ్డి సీఎంగా ఉన్నారు. అప్పుడు కూడా తెలుగు సెంటిమెంట్ పట్టించుకోలేదన్నమాట. నీలం సంజీవరెడ్డి రెండోసారి జనతా పార్టీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు.తెలుగువాడైన వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేసినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సపోర్టు చేసిందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అప్పట్లో  కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ గోపాలకృష్ణ గాంధీని బలపరిచింది. 

ఇక ఏపీ విషయాన్ని చూస్తే రెండు సభలలో కలిపి తెలుగుదేశం కు 17 మంది ఎంపీల బలం ఉంది. జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. బీజేపీకి ఆరుగురు సభ్యులు ఉన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు 11 మంది ఎంపీలున్నారు. తమకు మద్దతివ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ వైసీపీ అధ్యక్షుడు జగన్ ను కోరారు. రాజ్యాంగ పదవులకు ఎన్నిక జరిగినప్పుడు అనుసరించడానికి జగన్ ఒక పద్దతి పెట్టుకున్నారు. ఆ ప్రకారమే ఎన్డీయేకు మద్దతిస్తున్నట్లు శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇక టీడీపీ, జనసేనలు ఎన్డీయేలోనే ఉన్నందున అవి సుదర్శనరెడ్డికి ఓటు వేసే పరిస్థితి లేదు.చంద్రబాబుకు, రేవంత్  రెడ్డి కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ రాజకీయంగా ఉప రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్  కూటమికి టీడీపీ మద్దతు ఇవ్వలేదు. కాకపోతే జస్టిస్ సుదర్శనరెడ్డి తనకు చంద్రబాబుతో ఉన్న సంబంధాల గురించి వ్యాఖ్యానించిన తీరు ఆసక్తికరంగా ఉంది. 

చంద్రబాబుతో ప్రత్యేక అనుబంధం ఉందని కాని, సంబంధం లేదని కానీ చెప్పలేనని ఆయన అంటున్నారు. 1995లో ఎన్టీఆర్‌, చంద్రబాబుల మధ్య జరిగిన న్యాయ పోరాటానికి సంబంధించి తీర్పు ఇచ్చిన బెంచ్‌లో తాను కూడా సభ్యుడనని ఆయన వెల్లడించారు. చంద్రబాబు మంచి, చెడు బెరీజు వేసుకోవచ్చని, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. సుదర్శనరెడ్డి వ్యూహాత్మకంగా మాట్లాడినా చంద్రబాబు ఇప్పటికిప్పుడు ఎన్డీయేను కాదనే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఒక ప్రకటన చేస్తూ సుదర్శనరెడ్డికి మద్దతు ఇచ్చి తన కృతజ్ఞత తెలుపుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుపై ఆశలు పెంచుకుంటున్నట్లుగా ఉంది. 

బీహారు శాసనసభ ఎన్నికలలో బీజేపీ కూటమి ఓడిపోతే, కేంద్రంలో మోడీ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని, చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వస్తారని కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు అల్కా లాంబా జోస్యం చెప్పారు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చెప్పలేం కాని చంద్రబాబుతో కాంగ్రెస్‌కు ఉన్న రహస్య సంబంధాలను ఆమె తెలియచేసినట్లుగా ఉంది.రేవంత్  రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో చంద్రబాబు హాట్ లైన్ పెట్టుకున్నారని ఇప్పటికే మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలంగాణ వరకు చూస్తే లోక్ సభలో కాంగ్రెస్‌కు ఎనిమిది, రాజ్యసభలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. బీజేపీకి 8 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఎంఐఎంకు ఒకటి, బీఆర్‌ఎస్‌కు నాలుగు రాజ్యసభ స్థానాలూ ఉన్నాయి. ఈ రకంగా చూస్తే సుదర్శనరెడ్డికి కేవలం ఈ 12 మంది మద్దతు మాత్రమే లభించే పరిస్థితి ఉంది. 

కాగా తెలుగు సెంటిమెంట్‌ను రేవంత్  రెడ్డి  వాడితే, బీజేపీ కూటమి తమిళ సెంటిమెంట్ వాడే అవకాశం ఉంటుంది. అక్కడ మెజార్టీ స్థానాలు డీఎంకే పార్టీకి ఉన్నాయి. కాంగ్రెస్, డీఎంకేలు ఒకే కూటమిలో ఉన్నాయి. అక్కడ బీజేపీ పక్షాన ఒక్క ఎంపీ కూడా లేరు. అన్నాడీఎంకేకు మాత్రం ముగ్గురు రాజ్యసభ సభ్యులు  ఉన్నారు. మిగిలిన వారు డీఎంకే, కాంగ్రెస్‌ కూటమికి చెందినవారే. అయినప్పటికీ తమిళనాడుకు చెందిన బీజేపీ నేతను ఉప రాష్ట్రపతి పదవికి పోటీలో దించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఈ ఎంపిక చేసి ఉండవచ్చు. పోటీచేస్తున్న రాధాకృష్ణన్ తన సొంత రాష్ట్రమైన తమిళనాడులో, సుదర్శనరెడ్డి తెలుగు రాష్ట్రాల నుంచి  మెజార్టీ మద్దతు  పొందలేరన్నమాట. కాగా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పదే,పదే ప్రస్తావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్  రెడ్డి రెడ్డి అగ్రవర్ణాలకు చెందిన ప్రముఖుడిని అభ్యర్ధిగా ఎలా పెడతారని బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ప్రశ్నిస్తున్నాయి.

 సుదర్శనరెడ్డి గెలిస్తే బీసీ రిజర్వేషన్లకు కేంద్రంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుందని రేవంత్  రెడ్డి  అంటున్నారు. ఇది కూడా మోకాలికి, బోడు గుండుకు ముడిపెట్టడమే. కాగా ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్‌ బీసీ వర్గానికి చెందినవారని బీజేపీ ప్రచారం చేస్తోంది. అందువల్ల కాంగ్రెస్ బీసీ కార్డు ఈ సందర్భంగా పనిచేసే అవకాశం ఉండదు. మొత్తం మీద జస్టిస్ సుదర్శనరెడ్డిని ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ లో రేవంత్  రెడ్డి తన పరపతి పెంచుకునే అవకాశం ఉంది.అంతకు  తప్ప ఆయన ప్రయోగించిన తెలుగు సెంటిమెంట్ కాని, బిసి రిజర్వేషన్ ల వాదన కాని ఫలించే పరిస్థితి  కనిపించడం లేదు.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement