
ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ విజయ ప్రస్థానం ఇదీ..
జాతీయవాద రాజకీయాలకు ఆదరణలేని తమిళనాట 16వ ఏటనే సంఘ్‌లో చేరిక
1998, 1999 లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూరు ఎంపీగా ఘన విజయం
2004 నుంచి 2007 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా సేవలు
బూత్‌స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి..
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లో మొదలైన ప్రస్థానం.. ద్రవిడ గడ్డపై కమలం జెండాను రెపరెపలాడించిన పోరాటం.. గవర్నర్‌గా రాజ్యాంగబద్ధ పాలనకు అందించిన సహకారం.. వెరసి అంతిమంగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌ను భారత ఉపరాష్ట్రపతిని చేశాయి. తమిళనాడులోని ఒక సామాన్య ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త నుంచి ఉపరాష్ట్రపతి వరకు సీపీ రాధాకృష్ణన్ సాగించిన సుదీర్ఘ రాజకీయ యాత్ర మంగళవారం విజయతీరాలకు చేరింది.
పార్టీ సిద్ధాంతాలే శ్వాసగా, గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ అధిష్టానం అప్పగించిన ప్రతి బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించిన నాయకుడికి దక్కిన అత్యున్నత గౌరవం ఇది. రాధాకృష్ణన్ నియామకం కేవలం ఒక వ్యక్తికి దక్కిన పదవిగా కాకుండా బీజేపీ భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు ముఖ్యంగా ‘మిషన్ సౌత్’కు అద్దం పడుతోంది. రాధాకృష్ణన్ ఎంపిక వెనుక కమలదళం రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక కోణాలు దాగిఉన్నాయి.
సిద్ధాంత పునాదులు.. సంఘ్‌లో శిక్షణ
తమిళనాడులోని తిరుప్పూరులో 1957 అక్టోబర్ 20న జన్మించిన రాధాకృష్ణన్.. చిన్నతనం నుంచే ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి ఆకర్షితులై పూర్తిస్థాయి కార్యకర్తగా మారారు. జాతీయవాద రాజకీయాలకు ఆదరణ లేని తమిళనాట.. ద్రవిడ ఉద్యమమే ఊపిరిగా సాగే సామాజిక వాతావరణంలో.. రాధాకృష్ణన్ తన 16వ ఏటనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. అది ఆయన జీవితాన్ని, రాజకీయ భవిష్యత్తును నిర్దేశించిన కీలక మలుపు. అప్పటి నుంచే జాతీయవాదం, హిందూత్వం, క్రమశిక్షణ, దేశ సేవ వంటి సంఘ్ మౌలిక సిద్ధాంతాలు ఆయనలో బలంగా నాటుకుపోయాయి.
పార్టీ నిర్మాణం, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవడం, సైద్ధాంతిక స్పష్టత వంటి లక్షణాలను ఆయన అక్కడే అలవర్చుకున్నారు. 1974లో నాటి జనసంఘ్ తమిళనాడు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. 1980లో బీజేపీ ఆవిర్భావంతో లాంఛనంగా అందులో చేరి నాటి అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయికి అనుచరుడిగా మారారు. ఈ పునాదే ఆయన్ను తర్వాతి రాజకీయ జీవితంలో ఎదురైన ఎన్నో సవాళ్లను తట్టుకొనేలా చేసింది.
ద్రవిడ కోటలో సంచలనం..
రాధాకృష్ణన్ రాజకీయ ప్రస్థానంలో 1998, 1999 కోయంబత్తూరు లోక్‌సభ విజయాలు అత్యంత కీలకమైనవి. 1998 ఎన్నికలకు కొన్నిరోజుల ముందు కోయంబత్తూరులో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ‘అల్–ఉమ్మా’జరిపిన వరుస బాంబు పేలుళ్లతో నగరం దద్దరిల్లింది. ఈ ఘటన జరిగినప్పుడు అధి కారంలో ఉన్న డీఎంకేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అభద్రతాభావం ఆందోళన రేకెత్తించింది.
ఈ వాతావరణంలో దేశభక్తి, హిందూ రక్షణ నినాదాలతో బీజేపీ బరిలోకి దిగింది. రాధాకృష్ణన్‌ను జాతీయవాదానికి ప్రతీకగా చూసిన ప్రజలు ముఖ్యంగా హిందూ ఓటర్లు ఏకతాటిపైకి వచ్చి ఆయనకు పట్టంకట్టారు. ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి సవాల్ విసురుతూ ఒక జాతీయ పార్టీ అభ్యర్థి అక్కడ గెలవడం సంచలనం సృష్టించింది. 1999లోనూ అదే ఊపును కొనసాగించి రెండోసారి గెలవడం ద్వారా అది గాలివాటు విజయం కాదని ఆయన నిరూపించారు.
దక్షిణాదిపై గురి
రాధాకృష్ణన్ అభ్యర్థిత్వం వెనుక బీజేపీ స్పష్టమైన రాజకీయ ప్రణాళిక కనిపిస్తుంది. దక్షిణాదిలో పార్టీ విస్తరణపై దృష్టిపెట్టిన కమలదళం.. తమిళనాడుకు చెందిన వ్యక్తిని, అందులోనూ బలమైన హిందూత్వ నేపథ్యం ఉన్న నాయకుడిని ఉప రాష్ట్రపతిని చేయ డం ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు, కార్యకర్తలకు ఒక సందేశం పంపినట్లయింది. ఈ పరిణా మం భవిష్యత్తులో పొత్తులు, పార్టీ విస్తరణకు మార్గం సుగమం చేయనుంది.
వివాదరహిత, సౌమ్య ముద్ర
గవర్నర్‌గా రాధాకృష్ణన్ పనితీరు వివాదరహితంగా ఉంది. ఇప్పుడు రాజ్యసభ చైర్మన్‌గా, ప్రతిపక్షాలు బలంగా ఉన్న సభను నడిపించడానికి ఆయన సౌమ్య స్వభావం, రాజ్యాంగ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడతాయి. ఇది వ్యూహాత్మకంగా సరైన ఎంపిక. రాధాకృష్ణన్ ప్రస్థానం ఒక వ్యక్తి విజయగాథ మాత్రమే కాదు.. ఇది ఆధునిక బీజేపీ రాజకీయాలకు ప్రతిబింబం. సైద్ధాంతిక నిబద్ధత, సంస్థాగత విధేయత, వ్యూహాత్మక రాజకీయ ప్రయోజనం.. ఈ మూడు అంశాలనూ సమన్వయం చేస్తూ బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం.
పార్టీయే శాశ్వతం.. ఓడినా చెదరని పట్టుదల
రెండుసార్లు ఎంపీగా గెలిచినప్పటికీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాధాకృష్ణన్ ఓట మిని చవిచూశారు. అయినా ఆయన నిరాశ చెందలేదు. అధికారం లేనప్పుడే అసలైన నాయకత్వ పటిమ బయటపడుతుందన్న ట్లుగా ఆయన పార్టీ నిర్మాణానికే సమయాన్ని కేటాయించారు. 2004–07 మధ్య తమిళ నాడు బీజేపీ అధ్యక్షుడిగా ఆ రాష్ట్రంలో పార్టీకి సంస్థాగత రూపాన్ని ఇవ్వడానికి తీవ్రంగా శ్రమించారు. బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడంపై దృష్టిపెట్టారు.
నదుల అనుసంధానం, ఉగ్రవాద నిర్మూలన, ఉమ్మడి పౌరస్మృతి అమలు, డ్రగ్స్‌రహిత రాష్ట్రం తదితర డిమాండ్లతో 93 రోజులపాటు సుమారు 19 వేల కి.మీ. మేర ఆయన రథయాత్ర చేపట్టారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిన రాధాకృష్ణన్.. పదవులున్నా లేకున్నా పార్టీని, సిద్ధాంతాన్ని అంటిపెట్టుకొనే ఉన్నారు. ఈ లక్షణమే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి అగ్రనేతల దృష్టిలో ఆయ న్ను ప్రత్యేకంగా నిలబెట్టింది.
2023 ఫిబ్రవరిలో కేంద్రం ఆయన్ను జార్ఖండ్ గవర్నర్‌గా నియమించింది. ఆ తర్వాత నాటి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామాతో తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. 2024 జూలైలో మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ ఏడాది జూలైలో అప్పటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాతో బీజేపీ అధినాయకత్వం రాధాకృష్ణన్ ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిపింది.