
సాక్షి, హైదరాబాద్: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ సమయంలో సుదర్శన్ రెడ్డి గెలుపు అవసరం అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే తాను ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు సుదర్శన్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీపీఐ సీనియర్ నేత నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, కర్ణాటక రాజ్యసభ సభ్యుడు నసీర్ హుస్సేన్, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఏ పార్టీతో సంబంధం లేదు, సభ్యత్వం కూడా లేదు. ఓటు చోరీ జరుగుతున్న ఈ సమయంలో న్యాయ కోవిదుడి గెలుపు అవసరం. మీ ఆత్మప్రబోధానుసారం ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయండి. రాజ్యాంగాన్ని మార్చాలని ఎన్డీయే ప్రయత్నిస్తోంది. సుదర్శన్ రెడ్డి గెలుపు తెలుగు వారి ప్రతిష్ట పెరుగుతుంది. ఓట్ల చోరీతో ఎన్నికల్లో గెలవాలని బీజేపీ చూస్తోంది. పార్టీలకు అతీతంగా ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించాం. సుదర్శన్ రెడ్డి రాకతో ఎన్డీయేకు బలమైన పోటీ ఇస్తున్నాం. జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ సమయంలో సుదర్శన్ రెడ్డి గెలుపు అవసరం. ఉపరాష్ట్రపతి రాజీనామా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. రాజకీయాలు పక్కన పెట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అసదుద్దీన్ ఒవైసీలు మద్దతు ఇవ్వాలని గతంలో విజ్ఞప్తి చేశాను. మళ్ళీ కోరుతున్నాను అని అన్నారు.
అనంతరం, అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. నేను రాజకీయాల్లోకి ప్రవేశించలేదు. నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. ఇక ముందు కూడా ఉండదు. రాజకీయం అనే ముళ్ల కిరిటాన్ని నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నావు అని చాలా మంది అడిగారు. రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అని చెప్పాను. పౌర హక్కులు, సామాజిక న్యాయం గురించి మాట్లాడతాను. ఒక తీర్పు గురించి చర్చను ప్రారంభించారు. ఆ తీర్పు గురించి చర్చిస్తే నేను భయపడతానని అనుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు గురించి చర్చ చేసేటప్పుడు ముందు దాన్ని చదవాలి’ అని హితవు పలికారు.