
సాక్షి, హైదరాబాద్: ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీఆర్‌ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఎన్డీయే, ఇండియా కూటమి.. రెండూ తెలంగాణకు ద్రోహం చేశాయని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగానే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ తటస్దంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
వివరాల ప్రకారం.. ప్రస్తుతం దేశ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నోటా ఆప్షన్ లేకపోవడంతో తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిర్ణయాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. కాగా, బీఆర్‌ఎస్‌కు రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. బీఆర్‌ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, సురేష్ రెడ్డి, దామోదర్ రావ్, పార్థ సారథి రెడ్డి ఎంపీలుగా కొనసాగుతున్నారు.
మరోవైపు, బీఆర్‌ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ..‘ఉపరాష్ట్రపతి ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరిస్తుంది. మా అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మా కార్యకర్తలపై దాడులకు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది . అందులో భాగంగానే ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వం. కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెట్టే చర్యలకు పాల్పడుతోంది. యూరియా సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ ఓట్లు అక్కర్లేదని మాట్లాడిన తీరుకు వాళ్ళ అభ్యర్థికి మద్దతు ఇవ్వం. రెండు కూటముల అభ్యర్థులు సమర్థులైనప్పటికీ.. కూటములు చేసే చర్యల వల్ల ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం’ అని చెప్పుకొచ్చారు.