ఏపీలో బదిలీలకు గేట్లు బార్లా! | ap government issued orders to cadre employee transfers | Sakshi
Sakshi News home page

ఏపీలో బదిలీలకు గేట్లు బార్లా!

Aug 20 2014 1:46 AM | Updated on Aug 10 2018 9:40 PM

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తుంగలోకి తొక్కి మరీ యథేచ్ఛగా ఉద్యోగుల బదిలీలకు అనుమతించటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైరవీలకు తెరతీసింది.

గెజిటెడ్ అధికారులకు యథేచ్ఛగా స్థాన చలనం
రాజకీయ పైరవీలకు తెరతీసిన సర్కారు
రాష్ట్ర స్థాయి కేడర్‌పై కేంద్రం ఆదేశాలు గాలికి వదిలిన సర్కారు
అక్టోబర్ 1 నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం

 
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తుంగలోకి తొక్కి మరీ యథేచ్ఛగా ఉద్యోగుల బదిలీలకు అనుమతించటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైరవీలకు తెరతీసింది. గెజిటెడ్ అధికారులను ఎక్కడి నుంచి ఎక్కడికైనా స్వేచ్ఛగా బదిలీ చేసుకోవచ్చంటూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గెజిటెడ్ అధికారులు ఆ పోస్టులో ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారనే అంశంతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా బదిలీ చేయవచ్చని పేర్కొంది.
 
అంటే ఆ పోస్టులోకి వచ్చి కొన్ని నెలలే అయినా టీడీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇష్టం లేకుంటే వేరే చోటకు బదిలీ చేయవచ్చు. ఎన్నికల్లో సహకరించని అధికారులందరినీ బదిలీ చేయాలని ఏకంగా మంత్రివర్గ సమావేశంలోనే రాజకీయ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ద్వారా బదిలీలపై ఉత్తర్వులు జారీ చేయించింది. బదిలీలపై నిషేధాన్ని సెప్టెంబర్ ఆఖరు వరకు సడలిస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజేయ కల్లాం ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి తిరిగి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. బదిలీల నుంచి సచివాలయ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చారు. కింది స్థాయి ఉద్యోగులు మూడేళ్ల నుంచి ఒకే చోట పని చేస్తుంటే  బదిలీ చేయాలని సూచించారు. ఉపాధ్యాయులను మాత్రం కౌన్సిలింగ్ ద్వారా బదిలీ చేస్తారు.
 
కేంద్రం వద్దన్నా వినలేదు
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి మరీ ఏపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల బదిలీలకు ఆదేశాలు జారీ చేసింది. బదిలీ నుంచి రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగులకు మినహాయింపు ఇద్దామని, పంపిణీ పూర్తి అయ్యాక చేపడదామని అధికారులు సూచించినా ప్రభుత్వ పెద్దలు అంగీకరించలేదు. రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు బదిలీ చేయరాదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement