గోదావరి కుడిగట్టుపై పట్టిసీమ పథకాన్ని చేపట్టిన తరహాలోనే ఎడమగట్టుపై మరో ఎత్తిపోతల స్కీమును చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
- ఎడమ గట్టుపై పురుషోత్తమపట్నం వద్ద నిర్మాణానికి ప్రణాళిక
- పోలవరం ఎడమకాల్వ ద్వారా 35 టీఎంసీల మళ్లింపు లక్ష్యం
సాక్షి, హైదరాబాద్ : గోదావరి కుడిగట్టుపై పట్టిసీమ పథకాన్ని చేపట్టిన తరహాలోనే ఎడమగట్టుపై మరో ఎత్తిపోతల స్కీమును చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తమపట్నం వద్ద దీన్ని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. గోదావరి నదికి జూన్ నుంచి సెప్టెంబరు మధ్య వరదొచ్చే వంద రోజుల్లో రోజుకు 3,500 క్యూసెక్కుల చొప్పున 35 టీఎంసీలను పోలవరం ఎడమకాల్వ ద్వారా తరలించి ఏలేరు ఆయకట్టుకు చెందిన 53 వేల ఎకరాలకు నీళ్లందించడంతోపాటుగా విశాఖ నగర తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చాలనే పేరుతో ఈ పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం పనులకు రూ.954 కోట్లతో ఆగస్టు మొదటివారంలో టెండర్ నోటిఫికేషన్ జారీచేసేందుకు జలవనరులశాఖ కసరత్తు చేస్తోంది.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన ఎడమకాల్వను ఇందుకోసం ఉపయోగించుకోవాలని చూస్తుండడం గమనార్హం. 181.5 కిమీల పొడవైన పోలవరం ఎడమకాల్వ పను ల్లో 75 శాతం వైఎస్ హయాంలోనే పూర్తయ్యాయి. తక్కిన 25 శాతం పనులు పూర్తి చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం కుస్తీలు పడుతోంది. పోలవరం ఎడమకాల్వ కింద 4 లక్షల ఎకరాలకు నీళ్లందించడం, 540 గ్రామాలకు, విశాఖ ప్రజలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాల్ని తీర్చాలనే లక్ష్యం సాకారం కావాలంటే హెడ్‌వర్క్స్ సత్వరమే పూర్తి చేయాలి.
అయితే హెడ్‌వర్క్స్ పనుల్ని పక్కనపెట్టి ఎడమగట్టుపై తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తమపట్నం వద్ద రూ.954 కోట్లతో యుద్ధప్రాతిపదికన ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని నిర్ణయించింది. పురుషోత్తమపట్నం వద్ద 325 క్యూసెక్కుల సామర్థ్యంతో 12 పంపుల్ని ఏర్పాటు చేసి నీటిని తోడి మూడు కిలోమీటర్ల పొడవైన పైపులైను ద్వారా తరలించి.. పోలవరం ఎడమకాల్వ 1.7 కిలోమీటర్ వద్ద కలపాలని భావిస్తున్నారు. ఎడమకాలువపై 57 కిలోమీటర్ వద్ద రెగ్యులేటర్ నిర్మించి ఏలేరు ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు విశాఖకు నీటిని తరలించవచ్చనేది యోచన.