ఇమేజ్ సిటీలో ఏఎండీ భాగస్వామ్యం | AMD share the image of the city | Sakshi
Sakshi News home page

ఇమేజ్ సిటీలో ఏఎండీ భాగస్వామ్యం

Jun 4 2016 3:45 AM | Updated on Aug 30 2019 8:24 PM

ఇమేజ్ సిటీలో ఏఎండీ భాగస్వామ్యం - Sakshi

ఇమేజ్ సిటీలో ఏఎండీ భాగస్వామ్యం

గేమింగ్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇమేజ్ సిటీలో భాగస్వాములు కావాల్సిందిగా ప్రముఖ చిప్ తయారీ సంస్థ అడ్వాన్స్‌డ్ మైక్రో డివెసైస్ (ఏఎండీ)ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖల

- చిప్ తయారీ సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ
- ఏఎండీ పరిశోధనల్లో రాష్ట్ర విద్యా సంస్థలకు చోటు!
- వీఎల్‌ఎస్‌ఐ అకాడమీలో భాగస్వామ్యానికి సుముఖత
 
 సాక్షి, హైదరాబాద్: గేమింగ్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇమేజ్ సిటీలో భాగస్వాములు కావాల్సిందిగా ప్రముఖ చిప్ తయారీ సంస్థ అడ్వాన్స్‌డ్ మైక్రో డివెసైస్ (ఏఎండీ)ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె. తారక రామారావు కోరారు. అమెరికా సిలికాన్ వ్యాలీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ శుక్రవారం సన్నీవేల్‌లోని ఏఎండీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మార్క్ పేపర్‌మాస్టర్, వైస్ ప్రెసిడెంట్ రూత్ కాటర్‌లతో భేటీ అయ్యారు. గ్రాఫిక్స్, వర్చువల్ రియాలిటీ, గేమింగ్, మాన్యుఫాక్చరింగ్ రంగాలను ఏఎండీ ప్రతినిధులు తమ ప్రాథమ్యంగా పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఆయా రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు, విస్తరణ అవకాశాలతోపాటు.. ఇమేజ్ సిటీ ప్రత్యేకతలను మంత్రి వివరించారు. ప్రాధాన్య రంగాల్లో పరిశోధనలకు ఏఎండీ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణలోని విద్యా సంస్థలను ఇందులో భాగస్వాములను చేయాలని కోరారు. ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, బిట్స్ పిలానీ, వరంగల్ ఎన్‌ఐటీ, బాసర ట్రిపుల్ ఐటీ తదితర విద్యా సంస్థలకు పరిశోధనల్లో చోటు కల్పించాలనే సూచనకు ఏఎండీ సానుకూలంగా స్పందించింది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను వివరించిన మంత్రి కేటీఆర్.. రాష్ట్రంలో ఏఎండీ ఉత్పత్తుల తయారీకి ప్రణాళికలు రూపొందించాలని కోరారు.

 వీఎల్‌ఎస్‌ఐ అకాడమీలోభాగస్వామ్యం
 తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (వీఎల్‌ఎస్‌ఐ) అకాడమీలో భాగస్వామ్యం వహించేందుకు ఏఎండీ సుముఖత వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తర్వాతి పరిణామాల్లో హైదరాబాద్‌లోని కంపెనీ కార్యకలాపాలు, భవిష్యత్తుపట్ల అనుమానాలను ప్రభుత్వం పటాపంచలు చేసిందని పేర్కొంది. హైదరాబాద్‌పై తమ నమ్మకాలను కాపాడినందుకు ఏఎండీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మార్క్ పేపర్‌క్రాఫ్ట్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ నూతన ఉత్పత్తులు, మార్కెటింగ్ వ్యూహాలను మంత్రి కేటీఆర్‌కు వివరించారు. తమ సంస్థ నూతన ఉత్పత్తి జెన్ చిప్‌ను పూర్తిగా హైదరాబాద్‌లోనే డిజైన్ చేసినట్లు వెల్లడించారు. తమ చిప్ టెక్నాలజీతో బాహుబలి వంటి ప్రముఖ సినిమాలకు గ్రాఫిక్స్ అందించామని.. తెలుగుతోపాటు ఇతర భాషా చిత్రాలకు గ్రాఫిక్స్ విభాగంలో భాగస్వాములయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఏఎండీ ప్రతినిధులు కేటీఆర్‌కు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement