‘ఎయిడెడ్‌’లో ఎడాపెడా దోపిడీ | Along the lines of the private colleges to double fees | Sakshi
Sakshi News home page

‘ఎయిడెడ్‌’లో ఎడాపెడా దోపిడీ

Published Mon, Jan 16 2017 3:04 AM | Last Updated on Thu, Mar 21 2019 9:07 PM

‘ఎయిడెడ్‌’లో ఎడాపెడా దోపిడీ - Sakshi

‘ఎయిడెడ్‌’లో ఎడాపెడా దోపిడీ

ఎయిడెడ్‌ కాలేజీల్లో ఇష్టా రాజ్యంగా ఫీజుల దందా కొనసాగుతోంది

  • ప్రైవేటు కాలేజీల తరహాలో రెట్టింపు ఫీజులు
  • అడ్డగోలుగా వసూలు చేస్తున్నా పట్టించుకోని కళాశాల విద్యాశాఖ
  • డిగ్రీ కోర్సులకు ఓయూ నిర్ణయించిన ఫీజు రూ.3,890
  • కానీ కొన్ని కాలేజీల్లో ఏకంగా రూ.18 వేల దాకా వసూలు
  • సాక్షి, హైదరాబాద్‌: ఎయిడెడ్‌ కాలేజీల్లో ఇష్టా రాజ్యంగా ఫీజుల దందా కొనసాగుతోంది. అధిక ఫీజులు వసూలు చేస్తూ నిరుపేద కుటుంబాలకు చెందిన ఎస్సీ, ఎస్సీ, బీసీ విద్యార్థులను కాలేజీలు దోచుకుంటున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కాకుండా ఏకంగా రెట్టింపు ఫీజులు గుంజుతున్నాయి. హైదరాబాద్‌లో ఎంతో పేరుండి, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే పలు ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో ఈ దందా కొనసాగుతున్నట్లు ఆరో పణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత విద్యా శాఖ అధికారులు, కాలేజీల యాజమాన్యాలు కుమ్మక్కై అడ్డగోలుగా ఫీజులను నిర్ణయించి విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నట్లు విద్యా శాఖకు ఫిర్యాదులందాయి.

    అయినా సదరు కాలేజీ యాజమాన్యాలపై చర్యలు చేపట్టడం తో ఇటు కళాశాల విద్యా శాఖ, అటు ఉస్మానియా వర్సిటీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవ హరిస్తోందన్న ఆరోపణలున్నాయి. కళాశాల విద్యాశాఖ జరిపిన విచారణలో ఆంధ్ర విద్యా లయ(ఏవీ) తదితర కాలేజీల యాజమా న్యాలు రకరకాల పేర్లతో అదనపు ఫీజులను వసూలు చేసినట్లు తేలింది. ఆ ఫీజులను వెనక్కి ఇచ్చేయాలని చెప్పారే తప్ప సదరు కాలేజీ యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

    ఫీజులు పెంచకున్నా..
    ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో వసూలు చేయాల్సిన ఫీజులను వర్సిటీ 2013లో నిర్ణయించింది. ఇప్పుడు కూడా అదే ఫీజుల విధానం కొనసాగుతోంది. కానీ ఆ వివరాలను ఈ విద్యా సంవత్సరంలో యూనివర్సిటీ తన వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంచలేదు. 2013–14 విద్యా సంవత్సరంలో ఏవీ కాలేజీతోపాటు కొన్ని ఎయిడెడ్‌ కాలేజీలు బీఎస్సీ రెగ్యులర్‌ కోర్సుకు ఒక్కో విద్యార్థి నుంచి ఏటా రూ.6,500 వసూలు చేశాయి. దీనికి అదనంగా పరీక్ష ఫీజు కింద ఏటా రూ.890 వసూలు చేశాయి. అంటే ఒక్కో విద్యార్థి నుంచి మొత్తంగా 7,400 వరకు వసూలు చేశాయి.

    వాస్తవానికి ఎయిడెడ్‌ కాలేజీలకు యూనివర్సిటీ నిర్ణయించి వార్షిక ఫీజు రూ.3,890 మాత్రమే. ఈ విషయాన్ని ఉస్మానియా యూనివర్సిటీనే స్వయంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునే ఈపాస్‌ వెబ్‌సైట్‌కు అందజేసింది. దాని ప్రకారం ఏటా ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీల్లో ట్యూషన్‌ ఫీజు కింద రూ.2 వేలు, స్పెషల్‌ ఫీజు కింద రూ.1000, పరీక్ష ఫీజు కింద రూ.890 కలిపి... మొత్తంగా రూ.3,890 మాత్రమే వసూలు చేయాలి. కానీ ఈ విద్యాసంవత్సరం (2016–17) కాలేజీని బట్టి రూ.13,835 నుంచి రూ.18 వేల వరకు వార్షిక ఫీజును వసూలు చేశాయి. తాము గతంలో నిర్ణయిం చిన ఫీజులనే కొనసాగిస్తున్నామని, అదనంగా ఫీజుల వసూలుకు ఎలాంటి నిర్ణయం తీసుకో లేదని అటు ఉస్మానియా యూనివర్సిటీ వర్గా లు చెబుతున్నాయి. కానీ కళాశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) వెబ్‌సైట్‌లో మాత్రం... కాలేజీ యాజమాన్యాలు అదనపు ఫీజులను ఎలా పెట్టారన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. దీనిపై ఉన్నత విద్యాశాఖ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.

    నిబంధనల ప్రకారమే వసూలు చేశాం
    మేం నిబంధనల ప్రకారమే ఫీజులను వసూలు చేస్తున్నాం. ఎక్కువ ఫీజులు వసూలు చేయడం లేదు. ఇందులో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు లేవు. కొంతమంది చేస్తున్న ఆరోపణలు అవాస్తవం.            
    –రఘువీర్‌రెడ్డి, ఏవీ కాలేజీ కరస్పాండెంట్‌

    అన్ని ఎయిడెడ్‌ కాలేజీల్లో ఒకే ఫీజు
    యూనివర్సిటీ పరిధిలో ఎయిడెడ్‌ కాలేజీలన్నింటికీ ఒకేలా ఫీజు నిర్ణయించాం. ఒక్కో దాంట్లో ఒక్కోలా ఉండదు. కానీ కొన్ని ఎయిడెడ్‌ కాలేజీలు భారీ మొత్తంలో వసూలు చేస్తున్నట్లు మాకు ఫిర్యాదులు అందాయి. వాటిపై కాలేజీల వివరణ కోరాం. అవి అందగానే తదుపరి చర్యలు చేపడతాం.    
     –గోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్, ఉస్మానియా యూనివర్సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement