త్వరలో 4,000 ‘విద్యుత్‌’ కొలువులు

4000 Electricity department posts coming soon - Sakshi

అందులో 1,000 వరకు ఏఈ పోస్టులు

వారం పది రోజుల్లో నియామక ప్రకటనలు!

కసరత్తు చేస్తున్న విద్యుత్‌ సంస్థలు

పాత పద్ధతిలోనే భర్తీ.. రాత పరీక్షలు

సాక్షి, హైదరాబాద్‌
రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో ఖాళీ పోస్టుల భర్తీకి యాజమాన్యాలు కసరత్తు చేస్తున్నాయి. ట్రాన్స్‌కో, జెన్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సంస్థల్లో అసిస్టెంట్‌ ఇంజనీర్, సబ్‌ ఇంజనీర్, జూనియర్‌ లైన్‌మెన్‌ తదితర పోస్టుల భర్తీకి వారం, పది రోజుల్లో సంస్థలు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నాయి. మొత్తంగా 4 వేల పోస్టుల భర్తీకి ప్రకటనలు రానున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. నాలుగు సంస్థల్లో కలిపి 1,000 వరకు అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నాయి. అలాగే ట్రాన్స్‌కోలో 330 అసిస్టెంట్‌ ఇంజనీర్, 174 సబ్‌ ఇంజనీర్‌.. 1,100 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులు భర్తీ చేయాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. మిగిలిన 3 విద్యుత్‌ సంస్థల్లో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు తెలియాల్సి ఉంది. గురువారం హైదరాబాద్‌లోని విద్యుత్‌ సౌధలో జరగనున్న విద్యుత్‌ సంస్థల బోర్డు సమావేశంలో నియామక ప్రకటనల జారీపై నిర్ణయం తీసుకోనున్నారు.

సుప్రీం తీర్పు నేపథ్యంలో..
గతంలో వేర్వేరు ప్రకటనలతో ఏఈ పోస్టుల భర్తీ చేపట్టగా వందల సంఖ్యలో అభ్యర్థులు రెండు కన్నా ఎక్కువ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో నియామక ప్రక్రియలో గందరగోళం ఏర్పడింది. తొలి మెరిట్‌ జాబితాతో పోస్టుల భర్తీ ముగిసిన తర్వాత మిగిలిన పోస్టులకు రెండో మెరిట్‌ జాబితా ప్రకటించడంతో నిరుద్యోగులు అభ్యంతరం తెలుపుతూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. చివరకు సుప్రీంకోర్టు నుంచి ప్రత్యేక అనుమతి పొంది రెండో జాబితాతో మిగిలిన పోస్టులను విద్యుత్‌ సంస్థలు భర్తీ చేశాయి.

రెండో జాబితా తర్వాత కూడా పోస్టులు మిగలడంతో మూడు, నాలుగో జాబితానూ ప్రకటించాల్సి వచ్చింది. దీంతో పోస్టుల భర్తీకి ఉమ్మడిగానే ప్రకటన జారీ చేయాలని అప్పట్లో యాజమాన్యాలు నిర్ణయించాయి. కానీ రెండో జాబితాతో మిగిలిన పోస్టుల భర్తీకి సుప్రీం అనుమతించిన నేపథ్యంలో మళ్లీ పాత పద్ధతిలోనే వేర్వేరుగా ప్రకటనలు జారీ చేయాలని తాజాగా నిర్ణయానికొచ్చాయి. ఒకే కేటగిరీ పోస్టులు, విద్యార్హతలున్నా రాత పరీక్షలు వేర్వేరుగా ఉండనున్నాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top