వర్షాలకు తగ్గట్టు జీహెచ్‌ఎంసీ భారీ చర్యలు

GHMC Takes Action in the Wake of Heavy Rain in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా జీహెచ్‌ఎంసీ భారీ స్థాయిలో చర్యలు చేపట్టింది. సహాయక చర్యలకోసం ఏకంగా 384 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఇందులో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి చెందిన 13 ప్రత్యేక డిజాస్టర్‌ రెస్క్యూ బృందాలు కూడా ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా వర్ష ప్రభావాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌లు మంగళవారం రాత్రి నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సిబ్బందికి సూచనలిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌ నెంబర్‌ 040- 21111111 ఫోన్‌ చేయాలని ప్రజలకు విజ్జప్తి చేశారు. మరోవైపు జోనల్‌ కమిషనర్లతో కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వారిని అప్రమత్తం చేశారు. 

(చదవండి : హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం)

భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ చేపట్టిన చర్యలు 
మినీ మొబైల్ ఎమ‌ర్జెన్సీ బృందాలు (120): టాటాఏస్‌, లేదా ఓమ్నీ వ్యాన్‌, జీప్‌తో న‌లుగురు లేబ‌ర్లు ట్రీ క‌ట్ట‌ర్‌, పంప్‌, గొడ్డ‌ళ్లు, క్రోబార్స్ త‌దిత‌ర ప‌రిక‌రాల‌తో ఉంటారు.

మొబైల్ మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ బృందాలు(38): ప్ర‌తి ఇంజ‌నీరింగ్ డివిజ‌న్‌కు ఒక మొబైల్ మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ బృందాన్ని కేటాయించారు. దీనిలో డి.సి.ఎం వ్యాన్‌లో ఐదుగురు లేబ‌ర్లు, ఒక జ‌న‌రేట‌ర్‌, నీటిని తొల‌గించే పంపులు, చెట్ల‌ను క‌ట్‌చేసే మిష‌న్లు ఇతర ప‌రిక‌రాల‌తో సిద్దంగా ఉంటారు.

సెంట్ర‌ల్ ఎమ‌ర్జెన్సీ బృందాలు (15): సెంట్ర‌ల్ కంట్రోల్ రూంలో 15 ఎమ‌ర్జెన్సీ బృందాల‌ను అందుబాటులో ఉంచారు. ప్ర‌తి బృందంలో డి.సి.ఎం వ్యాన్‌, ఐదుగురు లేబ‌ర్లు, ఒక జ‌న‌రేట‌ర్‌, నీటిని తొల‌గించే పంపులు, చెట్ల‌ను క‌ట్‌చేసే మిష‌న్లు ఇతర ప‌రిక‌రాల‌తో సిద్దంగా ఉంటారు.

స్థానిక ఎమ‌ర్జెన్సీ బృందాలు (132): న‌గ‌రంలోని అత్యంత స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో ఎమ‌ర్జెన్సీ బృందాల‌ను స్థానికంగా నియ‌మించారు. న‌లుగురు కార్మికులు, ప‌లు ప‌రిక‌రాల‌తో ఉండి నాలాల్లో నీటి ప్ర‌వాహాన్ని నిలువ‌రించే ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌ను తొల‌గించ‌డం చేప‌డుతారు. వీటితో పాటు  నీటి నిల్వ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తొల‌గించ‌డానికి 255 పంపుల‌ను సిద్దంగా ఉంచారు.

Read latest Hyderabad City News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top