
వేగం పెంచండి
పోలవరం కుడి ప్రధాన కాలువ పనులను వారంలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జలవనరుల శాఖాధికారులను ఆదేశించారు.
పట్టిసీమ, పోలవరం కుడికాలువల నిర్మాణంపై సీఎం సమీక్ష
సాక్షి, విజయవాడ బ్యూరో: పోలవరం కుడి ప్రధాన కాలువ పనులను వారంలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జలవనరుల శాఖాధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో గురువారం మంత్రులు, అధికారులతో పట్టిసీమ, పోలవరం కుడికాలువ పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ, ఇతర శాఖలను కూడా ఈ పనులకే వినియోగిస్తున్న దృష్ట్యా పనులు వేగంగా చేయాలని సూచించారు.
గెయిల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలు వేసిన పైపు లైన్లను వేరే చోటుకు తరలించే విషయం గురించి సీఎం ఆ కంపెనీల చైర్మన్లతో ఫోన్‌లో మాట్లాడారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అధిక సామర్థ్యం గల యంత్రాలను రప్పిస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం నీటిని కుడి ప్రధాన కాలువకు మళ్లించేందకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తమ్మిలేరు ఆక్విడెక్ట్ పనుల్లో ప్రస్తుతం 260 మంది నిపుణులు పనిచేస్తున్నారని, ఇంకా 150 మంది అవసరమవుతారని అధికారులు ఆయనకు వివరించారు.
నెల్లూరు జిల్లా సోమశిల, వెలిగొండ ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును ముఖ్యమంత్రి సమీక్షించారు. సమావేశంలో మంత్రులు దేవినేని ఉమ, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. సమీక్ష తర్వాత ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఆవరణలో నిలిపి ఉంచిన బస్సులోకి వెళ్లారు. రాత్రికి ఇక్కడే బస చేసిన ముఖ్యమంత్రి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.
చంద్రబాబు ఓఎస్‌డీగా కృష్ణమోహన్
సాక్షి, హైద రాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కార్యాలయం ప్రత్యేకాధికారిగా (ఓఎస్‌డీ)గా పి.కృష్ణమోహన్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐైవె ఆర్ కృష్ణారావు గురువారం ఉత్తర్వులిచ్చారు. ఏడాది పాటు ఓఎస్‌డీగా కొనసాగుతారు. ప్రస్తుతం కృష్ణమోహన్ విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(ఎస్‌పీఏ) రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు.