మద్యం మత్తులో స్నేహితుడిని చంపేశారు.. | Man brutally killed by his friends | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో స్నేహితుడిని చంపేశారు..

Jan 11 2016 6:57 PM | Updated on Jul 30 2018 8:29 PM

వీకెండ్‌లో మద్యం పార్టీ నిర్వహించుకున్న నలుగురు స్నేహితులు.. ఆ మత్తులో మాటా మాటా అనుకోవడంతో ఇద్దరు యువకులు కలిసి మరో స్నేహితుడిని బేస్‌బాల్ బ్యాట్‌తో కొట్టి, కత్తితో పొడిచి చంపేశారు.

అడ్డగుట్ట (హైదరాబాద్) : వీకెండ్‌లో మద్యం పార్టీ నిర్వహించుకున్న నలుగురు స్నేహితులు.. ఆ మత్తులో మాటా మాటా అనుకోవడంతో ఇద్దరు యువకులు కలిసి మరో స్నేహితుడిని బేస్‌బాల్ బ్యాట్‌తో కొట్టి, కత్తితో పొడిచి దారుణంగా చంపేశారు. ఇది చూసి తీవ్ర భయాందోళనకు గురైన మరో స్నేహితుడు అక్కడి నుంచి పారిపోయాడు. మరుసటిరోజు తాపీగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ స్నేహితుడిని హతమార్చామని లొంగిపోయారు. ఈ సంఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ కరణ్‌కుమార్ సింగ్ తెలిపిన కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా దాసిరెడ్డి గూడెంకు చెందిన కొమిరెళ్లి ప్రదీప్‌రెడ్డి (24) ఆగస్టులో నగరానికి వచ్చి శాంతినగర్‌లోని అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు.

'మా ఊరి అమ్మాయినే ప్రేమిస్తావా..'

శాంతినగర్‌లో నివసించే ప్రదీప్‌రెడ్డి ఇంటికి శనివారం తన స్నేహితులు ఉదయ్, నాగేశ్వర్‌రావు, లింగస్వామిలు రావడంతో రాత్రి సుమారు 8.30 గంటలకు విందు ఏర్పాటు చేసి, మద్యం పార్టీ చేసుకున్నారు. తాగిన మత్తులో ఉన్న ఉదయ్‌కిరణ్ తాను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని, తను మీ గ్రామంలోనే ఉంటుందని, ఎలాగైనా ఆ అమ్మాయిని నువ్వే ఒప్పించాలని ప్రదీప్‌రెడ్డితో ఆవేశంగా చెప్పాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రదీప్‌రెడ్డి క్షణికావేశంలో మా ఊరి అమ్మాయినే ప్రేమిస్తావా అని అంటూ పక్కనే ఉన్న బేస్‌బాల్ బ్యాట్‌లో ఉదయ్‌కిరణ్ తలపై కొట్టాడు. ఆ వెంటనే మరో స్నేహితుడు నాగేశ్వర్‌రావు ఒక చిన్న కత్తితో ఉదయ్ ఛాతిలో, కడుపులో పొడిచాడు. లింగస్వామి ఎంత ఆపడానికి ప్రయత్నించినా వినకుండా ప్రదీప్‌రెడ్డి, నాగేశ్వర్‌రావులు తీవ్రంగా కొట్టి, కత్తితో పొడిచి ఉదయ్‌ను హతమార్చారు. ఒక్కసారిగా రక్తపు మడుగులో ఉన్న వీరిని చూసి లింగస్వామి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

శనివారం ఉదయ్‌కిరణ్‌ను హత్య చేసిన ప్రదీప్‌రెడ్డి, నాగేశ్వర్‌రావులు ఇద్దరు అతని మృతదేహాన్ని రూమ్‌లోనే ఉంచి బయటి నుంచి ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఆదివారం రాత్రి సుమారు 11 గంటలకు స్థానిక లాలాగూడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో జరిగిన సంఘటన గురించి వివరించి హత్య చేసింది తామేనని చెప్పి లొంగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రూమ్‌లో ఉన్న పది బీరు బాటిళ్లు, బేస్‌బాల్ బ్యాట్, చిన్న కత్తి, వికెట్లను లాలాగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు పాల్పడిన ప్రదీప్‌రెడ్డి, నాగేశ్వర్‌రావులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న లింగస్వామి కోసం గాలిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement