తల్లిదండ్రుల అత్యాశకు పరాకాష్ట..! | fake caste certificates over MBBS seats | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల అత్యాశకు పరాకాష్ట..!

Oct 17 2015 11:27 AM | Updated on Sep 3 2017 11:06 AM

తల్లిదండ్రుల అత్యాశకు పరాకాష్ట..!

తల్లిదండ్రుల అత్యాశకు పరాకాష్ట..!

ఎంసెట్-మెడికల్ కౌన్సెలింగ్‌లో ఏటా నేరపూరిత అభ్యర్థులు హల్‌చల్ చేస్తూనే ఉన్నారు. చదవకుండానే తమ పిల్లలు డాక్టర్ కావాలనే తల్లిదండ్రుల అత్యాశకు పరాకాష్టకు నిదర్శనంగా... ప్రతి ఏడాది నేరప్రవృత్తి కొత్త రూపం సంతరించుకొంటోంది.

     ఎంసెట్-మెడికల్ కౌన్సెలింగ్‌లో నేరప్రవృత్తి
     బోగస్ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్‌లో చేరికలు
     తాజా ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు..
     బోగస్ అభ్యర్థులపై కఠిన చర్యలు


సాక్షి, విజయవాడ: ఎంసెట్-మెడికల్ కౌన్సెలింగ్‌లో ఏటా నేరపూరిత అభ్యర్థులు హల్‌చల్ చేస్తూనే ఉన్నారు. చదవకుండానే తమ పిల్లలు డాక్టర్ కావాలనే తల్లిదండ్రుల అత్యాశకు పరాకాష్టకు నిదర్శనంగా... ప్రతి ఏడాది నేరప్రవృత్తి కొత్త రూపం సంతరించుకొంటోంది. గతేడాది పీజీ మెడికల్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీని మరువక ముందే... ఈ ఏడాది బోగస్ కుల ధ్రువీకరణ పత్రాలతో ఎంబీబీఎస్ సీట్లు కొట్టేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. కర్నూలు జిల్లా, కల్లూరు మండల తహసీల్దార్ ఇచ్చిన బోగస్ కుల ధ్రువీకరణ పత్రాలతో ఎంబీబీఎస్ సీట్లు కొల్లగొట్టారని హెల్త్ యూనివర్సిటీ అధికారులు పసిగట్టినా... మెడికల్ కౌన్సెలింగ్ ప్రక్రియపై ఎంసీఐ(భారత వైద్య మండలి) కటాఫ్ తేదీ ముగియడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాజాగా ప్రకటించిన ఏడుగురే కాకుండా ఇంకెంత మంది ఉన్నారనే దానిపై ఆందోళన వ్యక్తమవుతోంది.


 అసలు జరిగింది ఇదీ...
రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్లను కౌన్సెలింగ్ కేంద్రంలో ఆయా బీసీ/ఎస్సీ/ఎస్టీ శాఖాధికారులతో తనిఖీ చేయిస్తారు. వీరంతా ఎంసెట్ ర్యాంకు కార్డులో ఓసీగా నమోదై ఉంటే, బీసీగా కులధ్రువీకరణ పత్రం తీసుకువచ్చారు. ఇదేమని కౌన్సెలింగ్ అధికారులు ప్రశ్నించగా, ‘మేము చదివిన కళాశాల యాజమాన్యం తమ కులం పేరు తప్పుగా ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసింది. అందుకే ర్యాంకు కార్డులో కులం పేరు తప్పుపడింద’ని చెప్పారు. దీంతో వీరిని బీసీ సర్టిఫికెట్లను పరిశీలించేందుకు వచ్చిన బీసీ వెల్ఫేర్ కమిషన్ అధికారుల వద్దకు పంపించారు. వారు కర్నూలు జిల్లా కల్లూరు తహసీల్దార్ ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రం సంతకాలు, దాని రూపురేఖలు పరిశీలించి బీసీలుగానే తేల్చారు. బీసీ వెల్ఫేర్ అధికారులు ఓకే చెప్పడంతో వర్సిటీ అధికారులు సీట్లు కేటాయించారు. ఒకవేళ కౌన్సెలింగ్ అధికారులకు అనుమానం వచ్చి సీటు కేటాయించేందుకు నిరాకరించినా.. కుల ధ్రువీకరణ పత్రం సరైనదై, సదరు అభ్యర్థి కోర్టు కెళితే రూ.లక్షల్లో జరిమానా కట్టాల్సి వస్తుందని భయపడ్డారు. ఎంసెట్‌లో ర్యాంకులు సాధించిన అభ్యర్థుల జాబితాను ఉన్నత విద్యామండలి నుంచి సంపాదించి ఈ రాకెట్‌ను నిర్వహించినట్లు తెలుస్తోంది. ర్యాంకులను బట్టి బీసీలలో(ఏ,బీ,సీ,డీ,ఈ) ఆయా కేటగిరీల  కుల ధ్రువీకరణ పత్రాలిచ్చారు.


 మరికొన్నింటిపై విచారణ...
మెడికల్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయి అడ్మిషన్లు పొందిన అభ్యర్థుల జాబితా ఎంసీఐకి పంపే క్రమంలో ఏడుగురు అభ్యర్థులతో పాటు మరింతమంది బోగస్ సర్టిఫికెట్లు బయటపడ్డాయని తెలుస్తోంది. వీరిపైనా దర్యాప్తు చేస్తున్నారు. ఇలా సీటు పొందిన అభ్యర్థుల్లో ఒకరు ఇటీవలే సీటు రద్దు చేసుకొని వెళ్లిపోయినట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నారు. కౌన్సెలింగ్‌కు సదరు అభ్యర్థులతో ఎవరెవరు వచ్చారు అనే విషయమై కౌన్సెలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీల్లో రికార్డు చేసిన ఫుటేజిని పరిశీలిస్తున్నారు.


విద్యార్థులపై కఠిన చర్యలు...
బోగస్ సర్టిఫికెట్ల విషయంలో దర్యాప్తు జరుగుతోందని హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. కొద్ది రోజుల్లో విషయం తేలిపోతుందన్నారు. ఈ ఏడుగురు అభ్యర్థులను సస్పెండ్ చేయమని ఆయా మెడికల్ కళాశాలలను ఆదేశిస్తామన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement