ఆదర్శ రాజకీయ నేత.. శివయ్య

Ideal Political Leader Guntur - Sakshi

రూ.250 గౌరవ వేతనమే సంపాదన

ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే సీటులోనే ప్రయాణం

రాజకీయ నేతలకే స్ఫూర్తి వెంకటశివయ్య 

సాక్షి, తెనాలి: నైతిక విలువలు, ప్రజల సమస్యలపై నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుల తరానికి చెందిన ఆదర్శప్రాయుడు మాజీ ఎమ్మెల్యే బండ్లమూడి వెంకట శివయ్య. చేబ్రోలు మండలం, నారాకోడూరు స్వస్థలం. అయితే ప్రకాశం జిల్లా మార్టూరు నియోజకవర్గం (ప్రస్తుతం రద్దయింది) నుంచి 1955లో శాసనసభలోకి అడుగుపెట్టిన శివయ్య రాజకీయ జీవితం నిబద్ధతతో కూడుకుంది. ఎన్నికల్లో పోటీకి ఆయన లక్షల రూపాయలు ఖర్చుచేయలేదు. గెలిచింతర్వాత కమిషన్లు దండుకుందీ లేదు. 1962 వరకు ఎమ్మెల్యేగా ఉంటూ నెలనెలా ఇచ్చిన రూ.250 గౌరవ వేతనం చాలనుకున్నారు. ఇళ్లస్థలం ఇస్తామంటే వద్దన్నారు. ఆర్టీసీ బస్సుల్లో అదీ ‘ఎమ్మెల్యే సీటు’లోనే ఆయన ప్రయాణించారు. విశ్రాంత జీవనంలోనూ పొగాకు రైతుల సంక్షేమం, గ్రామ అభ్యుదయం కోసం పాటుపడ్డారు. 
 

సర్పంచి–ఎమ్మెల్యే–సర్పంచి
రైతు కుటుంబంలో జన్మించిన శివయ్య విద్యపై మక్కువతో బీఎస్సీ చేశారు. గుంటూరు ఏసీ కాలేజీలో అధ్యాపకుడిగా ఉద్యోగజీవితం ఆరంభించారు. అప్పట్లో రైతుబాంధవుడిగా గుర్తింపు పొందిన ఆచార్య ఎన్జీ రంగా ఉపన్యాసాలు విని ప్రభావితుడయ్యారు. ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించి నారాకోడూరు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1955లో గుంటూరు జిల్లాలోనే ఉన్న మార్టూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా శివయ్య, ఐక్య కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో పోటీచేశారు. కందిమళ్ల బుచ్చయ్యకు టిక్కెట్‌ ఇచ్చే ఉద్దేశం ఎన్జీ రంగాకు లేకపోవటంతో అనుచరుడినైన తనను మార్టూరుకు తీసుకొచ్చారని శివయ్య చెప్పేవారు. అప్పటికాయన వయసు 35 ఏళ్లు. గడువుకు చివరిరోజున నామినేషను దాఖలు చేసిన శివయ్య ఆ ఎన్నికల్లో 12 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 
 

ఆర్భాటం లేని ప్రచారం
ఎన్నికల్లో ప్రచారం కోసం రోజూ బస్సులో నారాకోడూరు నుంచి మార్టూరు వెళ్లేవారు. అక్కడ నుంచి మళ్లీ బస్సులో లేదా పూనూరుకు చెందిన వెంకయ్య గుర్రపుబండిలో గ్రామాల్లో ప్రయాణిస్తూ ఓటర్లను కలుసుకునేవారు. అంత సాధారణంగా ఆనాటి ఎన్నికల ప్రచారం ఉండేదట! తన నియోజకవర్గంలో పూనూరు నుంచి పసుమర్రు వరకు రోడ్డు నిర్మాణంలో ఆనాడే ప్రజల భాగస్వామ్యాన్ని తీసుకున్నారు. ప్రభుత్వం రూ.6 లక్షలు మంజూరుచేస్తే, సరిపోదని రైతుల నుంచి ఎకరాకు రూ.6 చొప్పున వసూలుచేసి రోడ్డు నిర్మించారు. స్వతంత్ర పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా 1965–70 మధ్య పనిచేశారు. 1971లో కాంగ్రెస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే హోదాలోనే సర్పంచ్‌ పదవికి పోటీచేసి గెలిచారు. 
 

పొగాకు రైతులకు బాసటగా...
రాజకీయ గురువు రంగా బాటలోనే రైతుల సమస్యలపై దృష్టి సారించి ముఖ్యంగా పొగాకు రైతులను పట్టించుకున్నారు. టుబాకో అభివృద్ధి మండలి డైరెక్టరేట్‌ చైర్మన్‌గా 1971–74 వరకు రెండు పర్యాయాలు నామినేట్‌ అయ్యారు. కేంద్ర రాజకీయాల్లో కీలకపాత్ర వహించిన కొత్త రఘురామయ్య ఆధ్వర్యంలో రైతులతో కలిసి టుబాకో బోర్డును స్థాపించేందుకు శివయ్య విశేషకృషి చేశారు. ఐఏఎస్‌ అధికారి చైర్మన్‌గా ఉండే పొగాకు బోర్డుకు శివయ్య నాలుగు పర్యాయాలు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పొగాకు రైతుల కోసం ‘వాయిస్‌ ఆఫ్‌ వర్జీనియా టొబాకో గ్రోయర్‌’ పేరుతో పుస్తకాన్ని రాశారు. పొగాకు బోర్డు రజతోత్సవాల సందర్భంగా శివయ్య 80వ ఏట ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కాలక్రమంలో రాజకీయాల్లో వచ్చిన మార్పులు తన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండటం, దీనితోపాటు ఆరోగ్యపరిస్థితి సహకరించకపోవటంతో శివయ్య రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తమవి సత్తెకాలపు రాజకీయాలు అంటుండేవారు. ‘ఓట్ల కోసం నోట్లు ఖర్చుపెడుతున్నారు, ఖర్చుపెట్టాం కాబట్టి గెలిచాక సంపాదించుకుంటాం’ అన్నట్టుగా రాజకీయ నేతల వ్యవహారశైలి ఉండటంపై ఆయన విచారం వెలిబుచ్చేవారు. క్రమశిక్షణ, నైతిక విలువలు కలిగిన మాజీ ఎమ్మెల్యేలకు కనీస గౌరవం ఇవ్వాలని చెబుతుండే శివయ్యను, రాష్ట్రప్రభుత్వం స్వర్ణోత్సవ సంబంరాల్లో భాగంగా 2005లో సత్కరించి గౌరవించింది. ఆ తర్వాత కొంతకాలానికే ఆయన  కన్నుమూశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top