పెదగొట్టిపాడులో చల్లారని ఉద్రిక్తత

dalith womens protest in pedagottipadu - Sakshi

రెండు వర్గాల మధ్య సద్దుమణగని వివాదం

శాంతి కమిటీల ఏర్పాటుకు ముందుకు రాని ఓ వర్గం

దళిత సంఘాల నేతలు, వైకే అరెస్ట్‌లపై ఆగ్రహం

గ్రామంలో ధర్నాకు దిగిన దళిత మహిళలు

సాక్షి, గుంటూరు: జిల్లాలోని ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. గతేడాది డిసెంబరు 31వ తేదీ రాత్రి జరిగిన చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. గ్రామంలో రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. అప్రమత్తమైన పోలీసులు గ్రామంలో పికెట్‌ ఏర్పాటు చేసి 144 సెక్షన్‌ విధించారు. గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జనవరి 1న దాడులు జరిగిన గంటల వ్యవధిలోనే జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్, అర్బన్‌ ఎస్పీ సి.హెచ్‌.విజయారావు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చించి గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో ఓ వర్గానికి చెందిన 18 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు మరికొన్ని సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. మరోవర్గానికి చెందిన 35 మందిపై కేసులు నమోదయ్యాయి.

గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేందుకు గ్రామంలోకి బయటి వ్యక్తులు ఎవరూ వెళ్లకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. గ్రామంలో 144 సెక్షన్‌ అమలులో ఉన్న నేపథ్యంలో సున్నిత సమస్య జఠిలం కాకుండా చూసేందుకు రాజకీయ నాయకులు, ప్రజాసంగాలు, దళిత సంఘాలతో సహా ఎవరిని గ్రామంలోకి అనుమతించలేదు. స్థానిక ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు సైతం పత్తిపాడు మండల కేంద్రం నుంచే ఇరువర్గాలతో చర్చలు జరుపుతున్నారు. నాలుగు రోజులుగా రావెల జరుపుతున్న శాంతి చర్చలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఫలితాన్ని ఇవ్వడం లేదు. దీంతో తిరిగి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరుగకుండా అర్బన్‌ ఎస్పీ విజయారావు ప్రతిరోజూ పెదగొట్టిపాడు గ్రామానికి వెళ్లి  గ్రామం మొత్తం తిరుగుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డ్రోన్‌ కెమెరాలు ఏర్పాటు చేసి  ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు ఇస్తున్నారు. పెదగొట్టిపాడు గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రజా, దళిత సంఘాల నేతలను పోలీసులు ఎక్కడిక్కడే అరెస్టులు చేశారు.

ఇరువర్గాలతో శాంతి కమిటీలను ఏర్పాటు చేసేందుకు 1వ తేదీ నుంచి అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. శాంతి కమిటీలకు ఓ వర్గం ముందుకు వస్తున్నప్పటికీ రెండో వర్గం మాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గుంటూరు నగరంలోని కలెక్టరేట్‌ వద్ద పెదగొట్టిపాడు సంఘటనపై దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దళితులపై జరుగుతున్న దాడులను ఆపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దళిత సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

ధర్నాకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్తత
తమను కలిసేందుకు గ్రామానికి వస్తున్న దళిత, ప్రజాసంఘాల నేతలతోపాటు న్యాయవాది వైకేను పోలీసులు అరెస్టు చేయడంపై ఆగ్రహించిన దళిత మహిళలు గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ధర్నా చేశారు. దీంతో గ్రామంలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పకుండా గ్రామానికి అదనపు బలగాలను పంపారు. సంఘటన జరిగిన రోజు ఎస్పీ, కలెక్టర్‌ గ్రామానికి వచ్చినప్పుడు తమపై దాడులకు పాల్పడ్డవారిని వెంటనే అరెస్టు చేస్తామంటూ హామీ ఇచ్చారని ఇంత వరకు వారిని అరెస్టు చేయడం లేదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా పోలీసులను భారీ ఎత్తున మోహరింప చేశారు. గుంటూరు వెస్ట్‌ డీఎస్పీ సరితను పంపి మహిళలతో చర్చించారు. వైకేను గ్రామానికి పిలిచి మాట్లాడించడంతో పరిస్థితి కొంత సద్దు మణిగింది. 

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top