పడవల పోటీకి సై!

Boat competition in nagayalanka - Sakshi

రేపటి నుంచి నాగాయలంకలో రెండు రోజుల పాటు నిర్వహణ

రాష్ట్రస్థాయి సంప్రదాయ పడవల పోటీలకు నాగాయలంక పడవల రేవు సిద్ధమైంది. సంక్రాంతి పండగ సందర్భంగా నాలుగేళ్ల క్రితం ఇక్కడ సంప్రదాయ ఈ పోటీలు ప్రారంభించారు. రెండేళ్ల నుంచి రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, ఈ ఏడాది వినూత్నంగా జరిపేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రత్యేక పడవలను రప్పించగా, పోటీదారులు రిహార్సల్స్‌ చేస్తున్నారు. శని, ఆదివారాల్లో జరిగే ఈ పోటీలకు లక్షమంది హాజరవుతారని అంచనా.

అవనిగడ్డ/నాగాయలంక: రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా నాగాయలంకలో నాలుగేళ్ల నుంచి కేరళ తరహాలో సంప్రదాయ పడవల పోటీలు నిర్వహిస్తున్నారు. తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎక్కువగా ఉండటం, సంప్రదాయ పోటీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సంక్రాంతి సందర్భంగా నాలుగేళ్ల క్రితం నాగాయలంక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ పోటీలు ప్రారంభించారు. 2017 నుంచి రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే ఈ పోటీలు పర్యాటకశాఖతో పాటు జిల్లా యంత్రాంగం, నాగాయలంక గ్రామ అభివృద్ధి కమిటీ, స్వచ్ఛ నాగాయలంక, గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో జరుగుతాయి.

విజేతలకు నజరానా
కోల పడవలు, మెడ్డుడు, డ్రాగన్‌ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. తొమ్మిది మంది పాల్గొనే కోలపడవ విభాగంలో మొత్తం 36 టీంలు పాల్గొంటాయి. మొదటి బహుమతిగా రూ.25వేలు, ద్వితీయ రూ.15వేలు, తృతీయ రూ.10వేలతో పాటు పాల్గొన్న ప్రతి పడవకు రూ.4వేలు ప్రోత్సాహక బహుమతి ఇస్తారు. ఒక పురుషుడు, ఒక మహిళ పాల్గొనే మెడ్డుడు పడవల పోటీలకు 50 టీంలు  అనుమతిస్తారు. ప్రథమ బహుమతిగా రూ.10వేలు, ద్వితీయ రూ.6వేలు, తృతీయ రూ.3వేలతో పాటు పాల్గొన్న ప్రతి పడవకు రూ.1,000 ఇస్తారు. 11 మంది పాల్గొనే డ్రాగన్‌ విభాగంలో 36 టీంలను అనుమతిస్తారు. ఈ పోటీలో మొదటి బహుమతిగా రూ.25వేలు, ద్వితీయ రూ.15, తృతీయ బహుమతిగా రూ.10వేలతో పాటు పాల్గొన్న ప్రతి పడవకు రూ.4,500 నగదు బహుమతి ఇస్తారు. 13వ తేదీన కోలపడవల పోటీలు నిర్వహించనుండగా, 14న డ్రాగన్, మెడ్డుడు పోటీలు జరుగుతాయి.

మహిళలకు పోటీలు
సంప్రదాయ పడవల పోటీలను పురస్కరించుకుని మహిళలకు ప్రత్యేక పోటీలు నిర్వహించనున్నారు. ఈనెల 13వ తేదీన పాస్‌ ద బాల్, లెమన్‌ అండ్‌ స్పూన్, డార్జ్‌ బాల్, 14న భోగిపళ్లు, మ్యూజికల్‌ చైర్స్, టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీలు జరుగుతాయి. విజేతలకు ప్రత్యేక బహుమతులు ఇస్తారు.

సినీ సందడి
13వ తేదీ ఉదయం 8 గంటలకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ జల క్రీడలలో ఉపయోగించే కెనోయింగ్, కయా కింగ్, రోయింగ్, సెయిలింగ్‌ పడవలతో అద్భుత విన్యాసాలు ఉంటాయి. ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, సినీ గాయకుడు ధనుంజయ్, గాయని ఉష, మాళవిక సంగీత విభావరి ఉంటుంది. ఈ సందర్భంగా పడవల రేవును ప్రత్యేక పడవలు, రంగురంగుల తెరచాపలతో అందంగా అలంకరించారు. పోటీలు నిర్వహించనున్న శ్రీపాద క్షేత్రంలో వేదికను సిద్ధం చేస్తున్నారు. కలెక్టర్‌ లక్ష్మీకాంతం, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌తో పాటు పలువురు మంత్రులు, రాష్ట్రస్థాయి అధికారులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top