తబు రాయని డైరీ

Tabu unwritten diary by Madhav Singaraju - Sakshi

కోల్‌కతాలో దిగాను. ముంబైలో ఎలా ఉందో, క్లైమేట్‌ ఇక్కడా అలాగే ఉంది. చలిగా లేదు. వెచ్చగా లేదు. బాగుంది.
డమ్‌డమ్‌లో ఫిల్మ్‌ ఫెస్టివల్‌. నాదే ఈసారి ఇనాగరేషన్‌. మొదటిది ఐదేళ్ల క్రితం జరిగింది. తర్వాత మూడేళ్లు బ్రేక్‌. లాస్ట్‌ ఇయర్‌ రెండోది. ఇది మూడోది.
బ్రేక్‌ లేకుండా ఈవెంట్స్, బ్రేకప్స్‌ లేకుండా రిలేషన్స్‌ ఉండవా అనిపిస్తుంది! మళ్లీ ఎవరో ఒకరు పూనుకోవాలేమో ఈవెంట్స్‌ని కొనసాగించడానికి, రిలేషన్స్‌ని కలపడానికి. ఈవెంట్‌ని ఎవరైనా కొనసాగించగలరు. రిలేషన్‌నే ఎవరికి వారు కలుపుకోవాలి. మధ్యలోకి మూడోవాళ్లు, నాలుగోవాళ్లు వచ్చి కూర్చుంటే రిలేషన్‌ కూడా ఈవెంట్‌ అయిపోతుంది.

ఎయిర్‌పోర్ట్‌కి మనిషిని పంపించారు బ్రత్యాబసు. మినిస్టర్‌ ఆయన. డమ్‌డమ్‌ ఎమ్మెల్యే. డైరెక్టర్, యాక్టర్‌ కూడా. సినిమాలంటే ఇష్టం. సినిమాల్లోంచి పాలిటిక్స్‌లోకి వచ్చారు. సినిమాలన్నీ తీసేసి, అలసటతో పాలిటిక్స్‌లోకి రాలేదు. ‘‘ఐ లవ్‌ టు ఎంజాయ్‌ యువర్‌ యాక్టింగ్‌ తబూజీ’’ అన్నారు, ఫోన్‌లో ఫెస్టివల్‌ ప్రారంభోత్సవానికి నన్ను ఇన్వైట్‌ చేసినప్పుడు.
‘‘థ్యాంక్యూ బ్రత్యాజీ’’ అన్నాను నవ్వుతూ. బ్రత్యాజీ మూవీ లవర్‌. మమతాజీ నుంచి టైమ్‌ తీసుకున్నారట.. ఫిల్మ్‌ ఫెస్టివల్‌ని ఆర్గనైజ్‌ చేయించడానికి.
‘‘మీలా నేనూ సినిమాల్లోనే ఉండిపోతే, మీలా నాకూ సినిమాల్లో పాతికేళ్ల కెరియర్‌ ఉండేది తబూజీ’’ అన్నారు నవ్వుతూ బ్రత్యాజీ.. సాయంత్రం మేం కలుసుకున్నప్పుడు! సినిమా అంటే ఆయనకు అఫెక్షన్‌.
రెండు సినిమాలు కూడా డైరెక్ట్‌ చేశారు. గొప్ప సినిమాలేం కావవి అంటారు బ్రత్యాజీ నవ్వుతూ. సినిమా గొప్పగా రాకపోవచ్చు. థీమ్‌ నాకు గొప్పగా అనిపించింది.
‘‘ఎలా చేస్తారు.. మీరు అంత గొప్పగా..’’ అన్నారు బ్రత్యాజీ చిన్న మట్టి పాత్రలోని టీని నా చేతికి అందిస్తూ.
‘‘గొప్పగా చెయ్యడం ఉంటుందా బ్రత్యాజీ, గొప్పగా చేయిస్తాయి అనుకుంటాను.. ఆ పాత్రలు, ఆ డైరెక్టర్‌..’’ అని నవ్వాను. ‘అస్తిత్వ’ గురించి, ‘చండీబార్‌’ గురించి ఆయన మాట్లాడారు. ‘అస్తిత్వ’లో నమ్రతా శిరోద్కర్‌కు అత్తగారిలా, ‘హైదర్‌’లో షాహిద్‌ కపూర్‌కు తల్లిగా చేయడం గురించి కూడా మాట్లాడారు. ఎక్కువసేపు ఉండలేదు. వెళ్లిపోయారు.

తర్వాత మీడియా నుంచి ఎవరో వచ్చారు.
‘‘మీ లైఫ్‌లో బ్రేకప్స్‌ ఉన్నాయా? సింగిల్‌ ఉమన్‌గా ఎందుకు ఉండిపోయారు?’.. ఎప్పటిలా చివరి రెండు ప్రశ్నలు.
నవ్వాను. ఏం చెప్పాలి? జీవితంతో నాకున్న ఏ రిలేషన్‌నీ నేను బ్రేక్‌ చేసుకోను. ఎప్పుడూ ఇవే ప్రశ్నల్ని అడుగుతుండే సమాజంతో కూడా. అభిమానం ఉంటేనే కదా ఎవరైనా అడుగుతారు.
- మాధవ్‌ శింగరాజు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top