ముందస్తు కోతలు

Sri Ramana Article On Early Elections In Telangana - Sakshi

అక్షర తూణీరం

ఆ సంవత్సరం మామిడి కాపు బావుంటుంది. రెమ్మ రెమ్మకీ గుత్తులు గుత్తులుగా పిందెలుంటాయ్‌. తోట యజమాని ఆశగా లెక్కలు వేసుకుంటూ వుంటాడు. పిందెలు కాయలవుతాయ్‌. మరింత సంతోషపడ తాడు. మార్కెట్‌లో మామిడికి మంచి ధర కూడా ఉంటుంది. యజమాని చాలా టెన్షన్‌కి గురి అవు తాడు. రేప్పొద్దున అన్ని తోటలూ, అన్ని చెట్లూ కోత కొస్తాయ్‌. ఒక్కసారి రేటు పడిపోయే ప్రమాదం ఉందని యోచన చేస్తాడు. మర్నాడే, టెంక ముద రకుండానే కాయలు కోస్తాడు. మంచి ధరకి మార్కె ట్‌కి పంపుతాడు. మార్కెట్‌ వాళ్లు లేతకాయల్ని కృత్రి మంగా పండబెట్టి జనం మీదికి వదులుతారు.

ఎకరాకి అవలీలగా కోటి ఆదాయం తీసే ఆదర్శ రైతు కేసీఆర్‌ ఇప్పుడు ముందస్తుకు వచ్చి సరిగ్గా అదే వ్యూహం అమలు చేశారు. సుఖంగా కుటుంబ సభ్యు లంతా మూడు పదవులు ఆరు శాఖలుగా రాష్ట్రాన్ని ఏలుకుంటూ ఉండగా 9 నెలలు ముందుకు కోరి తెచ్చుకున్నారనిపిస్తోంది. ‘నాలుగున్నర సంవత్స రాలు ఇంటిళ్లిపాదీ రాష్ట్ర ప్రజకే అంకితమైపోయిన పుడు మళ్లీ గెలుపు గురించి జంకెందుకు?’ అని అజ్ఞానులు కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. జనం ఎంత చేసినా ఇంకా ఏదో చెయ్యలేదనే భావనలో ఉంటారు. బంగారు తెలంగాణ చేస్తే ప్లాటినం తెలం గాణ చెయ్యలేదని అసంతృప్తి పడుతూ ఉంటారు. తాగునీరు, సాగునీరు ఇస్తే ఇంకో కుళాయిలో ఇంటిం టికీ పాలు ఇవ్వచ్చుగదా అంటారు. పాలు కూడా ఇస్తే ఇంకో నల్లాలో ‘పాపాలు’ ఇవ్వచ్చుగదా అని వాపోతారు. మీకు తెలియదు రామరాజ్యంలోనే నెగటివ్‌ ఓట్లు పేరుకుపోయాయ్‌. వాటితోనే కదా రాముడి జీవితం మీడియాపాలై, పల్చనైపోయింది. ‘కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలుంటాయ్‌. చేసిన వాడికే చెరుపు’ అంటూ ఓ అనుభవజ్ఞుడు చాలా బాధ పడ్డాడు.

చంద్రబాబుకి ముందస్తు అనే మూడక్షరాలు వినిపిస్తే దడ. అప్పట్లో అలిపిరి సంఘటనని ఆసరా చేసుకుని సింపతీ వేవ్‌ని సృష్టించడం నల్లేరుమీద బండి నడకని భావించిన బాబు పరమ ఘోరంగా దెబ్బతిన్నారు. పాపం, ఒడ్డున వున్న వాజ్‌పేయిని కూడా ముందస్తు గోతిలోకి దింపారు. చివరకి అటల్‌జీకి ఐదేళ్లు దేశాన్ని పాలించామనే తృప్తి కీర్తి లేకుండా చేశారు. అందుకని చంద్రబాబు పొరబా టున కూడా ప్రిపోల్స్‌ మాటెత్తరని తెలుగు తమ్ముళ్లు చెబుతూ ఉంటారు. చంద్రబాబుకి దిగితే తిరిగి ఎక్కగలం అన్నది ఎప్పుడూ డౌటే. ఇప్పుడు ఇంకా ఆర్నెల్లకైనా ఎన్నికల ముందుకి రాక తప్పదు. నాలు గున్నరేళ్లు గడిచినా చంద్రబాబుకి పాకుడు రాళ్లే తప్ప కాస్త కాలు మోపి నిలబడే రాయి చిక్కనే లేదు. ‘విశ్వవిఖ్యాత కాపిటల్‌’ కొండకి పట్టించిన నాగలిగా, గొంగళి చందంగా మిగిలింది. లక్ష ఎకరాల్లో దాదాపు పన్నెండు పంటలు వృథా అయినాయ్‌. భూమాతని గొడ్రాలుగా మిగిల్చినవారు శాపగ్రస్తులవుతారని ఒక సిద్ధాంతిగారు కంటతడి పెట్టారు. నేలని పిండి నూనె తీసిన కర్ణుడు శాపగ్రస్తుడైన మాట ఆయన గుర్తు చేశారు.

చంద్రబాబు చెప్పిన పోలవరం కదల్లేదు. కబుర్లే గానీ ఫలించిన పథకం ఒక్కటీ లేదని ప్రజలు అను కుంటున్న మాట నిజం. ఇప్పుడు గడువు దగ్గర పడే  సరికి ఏవేవో ఆలోచనలు పుట్టుకొస్తున్నాయ్‌. చివరకు ప్రధాని మోదీ ఏపీకీ శత్రువనీ, మొత్తం ఆయన వల్లే తనేమీ చేయలేకపోయానని పదే పదే మన సీఎం చెబుతున్నారు. ఇదే ప్రస్తుతం చంద్రబాబు చేతిలో ఉన్న అస్త్రం. దాన్ని పదునుపెట్టే క్రమంలో మోదీ పెద్దమనిషి కానేకాడనీ ప్రచారంలోకి దిగారు. రాష్ట్రంలో తుఫాన్‌ వచ్చినా, వ్యాపార సంస్థలమీద ఆదాయపన్ను దాడులు జరిగినా, వైరల్‌ జ్వరా లొచ్చినా మోదీ చేస్తున్న కుట్రగానే చెబుతున్నారు. దీనివల్ల ఏపీ ఓటర్లు చంద్రబాబు చిత్తశుద్ధిని శంకించ రని ఆయన ఉద్దేశం.

మావూళ్లో ఒక మహిళా ఓటరు రెండు ఐడి యాలిచ్చింది. తాగుడుతో మేమంతా విసిగి వేసారి ఉన్నాం. వారానికి ఒక్కరోజు మందు బంద్‌ చేసినా చాలండి జనం వోట్లేస్తారంది. అమలు చేయడం కష్టం కదా అన్నాను. చంద్రబాబు చెప్పినవి ఏవి అమలు చేశారు కాబట్టి.. అని పెదవి విరిచింది. ఇక రెండో ఐడియా ఏవిటన్నాను. అందరితో ఎడాపెడా పొత్తు పెట్టుకోవడమే అన్నదా మహిళ.

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top