మువ్వన్నెల జెండాకు ముప్పాతికేళ్లు

Special Story On 75th Anniversary Of National Flag - Sakshi

మన భారతదేశపు జెండా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి రేపటికి 75 ఏళ్లు. 1943లో పోర్ట్‌బ్లెయిర్‌లోని సెల్యులార్‌ జైలులో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ తొలిసారిగా ఈ జెండాను ఎగురవేశారు. తెలంగాణలోని ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని నడిగూడు గ్రామంలో పింగళి వెంకయ్య జెండా రూపనిర్మాణానికి బీజం వేశారు. కృష్ణాజిల్లా భట్ల పెనుమర్రులో హనుమంత రాయుడు, వెంకటరత్నమ్మలకు 2 ఆగస్టు 1878న జన్మించిన వెంకయ్య విద్యాభ్యాసం మచిలీ పట్నంలో జరిగింది. 1906లో కోల్‌కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సభలకు హాజరు కావడం, వందేమాతరం ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూడటం వెంకయ్య జీవితాన్ని మలుపుతిప్పింది.  

పింగళి వెంకయ్య ఓ అసాధారణ పత్తిరైతు. అమెరికా నుండి కంబోడియా రకం విత్తనాలు తెప్పించి, వాటిని దేశవాళీ వాటితో కలిపి సంకరజాతి పత్తిని సృష్టించారు. సూర్యాపేటలోని చల్లపల్లిలో జరిగిన ఈ ప్రయోగాలను గుర్తించిన లండన్‌లోని రాయల్‌ అగ్రికల్చరల్‌ సొసైటీ వెంకయ్యను ఫెలోషిప్‌తో గౌరవించింది.  పరిశోధనలపై ఆసక్తితో కొలొంబో వెళ్లి సీనియర్‌ కేంబ్రిడ్జ్‌ పూర్తి చేశారు. భూగర్భ శాస్త్రంలో పీహెచ్‌డీ చేయ డంతోపాటు నవరత్నాలపై అధ్య యనం చేశారు.  

1916లో ఏ నేషనల్‌ ఫ్లాగ్‌ ఫర్‌ ఇండియా పేరిట పుస్త కాన్ని వెలువరిం చిన వెంకయ్య 1921 వరకు వివిధ దేశాల పతాకాలపై పరిశోధనలు చేశారు. వెంకయ్య తొలి సారి రూపొందించిన జెండాను కోల్‌కతాలోని బగాన్‌ పార్సీ దగ్గర ఎగురవేశారు. 22 జూలై 1948న ఆ జెండాను జాతీయపతాకంగా స్వీకరించారు. త్రివర్ణ పతాకంలో అశోక చక్రం ఉంచాలనే ఆలోచన కాంగ్రెస్‌ కమిటీ సభ్యురాలైన సురయా త్యాబ్జిది. త్రివర్ణంలోని కాషా యం సంపదను, తెలుపు జ్ఞానాన్ని, ఆకుపచ్చ రక్షణ శక్తిని సూచిస్తుండగా, 24 గీతలతో ఉన్న అశోక చక్రం నైతిక విలువల ధర్మానికి ప్రతీకగా నిలుస్తుంది.  (జాతీయ జెండా ఎగురవేసి 30 డిసెంబర్‌ 2018నాటికి 75 ఏళ్లు) 

వ్యాసకర్త: గుమ్మడి లక్ష్మీనారాయణ మొబైల్‌ : 94913 18409

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top