చైనా వ్యతిరేక బాటలో మరో తరం

Rajdeep Pakanati Guest Column On China Border Dispute - Sakshi

విశ్లేషణ

హిందీ చీనీ భాయి భాయి అనే స్ఫూర్తికి 1962 నాటి యుద్ధంలో చైనా తూట్లు పొడిచిందనే భావం భారతీయ తరాలను వెంటాడుతూ వస్తోంది. తాజాగా ఇరుదేశాల సరిహద్దుల పొడవునా చైనా దూకుడు చర్యలకు పాల్పడుతుండటంతో ప్రస్తుత తరం భారతీయుల్లో కూడా చైనా వ్యతిరేక భావాలు ప్రబలిపోతున్నాయి. కరోనా వైరస్‌ను చైనా వైరస్‌ అని ఆరోపించేంత స్థాయిలో చైనా పట్ల వ్యతిరేకత నేటి భారతీయ తరంలోనూ వ్యాపిస్తోంది. చైనాపై ఇంతటి వ్యతిరేకతకు సహేతుకమైన, అహేతుకమైన కారణాలు కూడా ఉండవచ్చు కానీ.. చైనా పట్ల దృఢమైన ప్రతికూల అభిప్రాయంతోనే మరో భారతీయ తరం కూడా గడిపేయడంలో నిజమైన ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్నాను. నాతల్లిదండ్రుల తరం నుంచి భారతీయులు సర్వసాధారణంగా చైనాపట్ల వ్యతిరేక భావనలతోనే పెరుగుతూ వస్తున్నారు. 1962లో భారత్‌–చైనా యుద్ధ కాలం నాటి వారి జ్ఞాపకాలనుంచే ఈ వ్యతిరేక భావన పుట్టుకొస్తూ ఉంది.

మన ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, చైర్మన్‌ మావో జెడాంగ్‌ ప్రోత్సహించిన హిందీ చీనీ భాయి భాయి అనే స్ఫూర్తికి నాటి యుద్ధం ద్వారా చైనా వెన్నుపోటు పొడిచిందని, ద్రోహపూరితంగా వ్యవహరించిందని భారతీయులు భావిస్తూ వస్తున్నారు. ఆ తరంలో బలపడిన భావాలను మనం ఒకమేరకు అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంతవరకు తటస్తంగా ఉంటూ వస్తున్న ప్రస్తుత తరం భారతీయులు కూడా గత కొన్నేళ్లుగా చైనా పట్ల ప్రతికూల భావాలను పెంచుకుంటూ పోతున్నారు. దీనికి మూడు కీలకమైన ఘటనలు దోహదం చేస్తున్నట్లు కనబడుతోంది. ఒకటి, భారత్‌–చైనా సరిహద్దులోని మూడు సెక్టార్లలోనూ చైనా దూకుడు చర్యలకు పాల్పడుతుండటం. రెండు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ పోరును ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో చైనా వ్యతిరేకించడం. మూడు. అణు సరఫరా బృందంలో (ఎన్‌ఎస్‌జి) చేరడానికి భారత్‌ చేస్తున్న ప్రయత్నాలను చైనా వ్యతిరేకించడం.

భారతీయ నూతన తరం ప్రధానంగా పాశ్చాత్య దృక్పధంతో ప్రభావితమవుతోంది. అమెరికాలో లేక యూరప్‌లో చదువులు, విదేశీ ఉత్పత్తుల వినియోగం, సినిమాలు, టీవీ షోలు చూడటం, విహారయాత్రలు, ఉద్యోగావకాశాలు వంటి అనేక విషయాల్లో మన యువతరం పశ్చిమ దేశాలవైపే ఉంటోంది. 2019 నాటికి అమెరికాలో చదువుతున్న మొత్తం భారతీయ విద్యార్థుల సంఖ్య 2,02,014 కాగా చైనాలో చదువుతున్న వారి సంఖ్య 23,000 మాత్రమే. అమెరికాలో 26 లక్షల 50 వేలమంది భారతీయులు నివసిస్తున్నారని అధికారిక లెక్కలు. ఇక చైనాలో కేవలం 55 వేల మంది భారతీయులు మాత్రమే నివసిస్తున్నారు. అది కూడా షాంఘై, బీజింగ్, గాంగ్జౌ వంటి మహానగరాలకే వీరు పరిమితం. ఇక హాంకాంగ్‌లో 31,569మంది భారతీయులు నివసిస్తున్నారు. ఈవిధంగా పాశ్చాత్య, ఇంగ్లిష్‌ చలామణిలో ఉన్న దేశాల పట్ల ఇంత మక్కువ చూపుతున్నందువల్లే భారతీయ యువతరం సాధారణంగానే ఆ దేశాల పట్ల సానుకూలవైఖరిని, సదభిప్రాయాన్ని కలిగి ఉంటోంది.

లోవీ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించిన 2013 ఇండియా పోల్‌ ఆయా దేశాలపై భారతీయులు పెంచుకున్న జనరంజక మనోభావాలు, ఆసక్తి, స్నేహపూర్వకమైన ఆత్మీయ భావనలకు సంబంధించిన థెర్మోమీటర్‌ సూచిని తయారు చేసింది. ఈ సూచిక ప్రకారం అమెరికా పట్ల భారతీయ యువతరం 62 డిగ్రీల మేరకు సానుకూలత ప్రదర్శిస్తుండగా చైనా పట్ల 44 డిగ్రీల సదభిప్రాయాన్ని మాత్రమే ప్రదర్శిస్తున్నారు. ఇక పాకిస్తాన్‌ పట్ల అయితే 20 డిగ్రీల కనిష్ట స్థాయి సానుకూలతనే మనవాళ్లు ప్రదర్శిస్తున్నారు. అలాగే ప్యూ గ్లోబల్‌ సంస్థ ఇటీవలే నిర్వహించిన ఒపీనియన్‌ పోల్స్‌ ప్రకారం 23 శాతం భారతీయులు మాత్రమే చైనాకు అనుకూల వైఖరితో ఉండగా, 46 శాతం మంది చైనా వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నట్లు తేలింది. అంటే ఇటీవలికాలంలో చైనా పట్ల భారతీయుల వ్యతిరేకత బాగా పెరిగిందన్నమాట. 

కాగా, తక్షశిల ఇన్‌స్టిట్యూషన్‌ నిర్వహించిన ర్యాపిడ్‌ పోల్‌లో పాల్గొన్న 1299 మందిలో 67 శాతం మంది భారతీయులు కోవిడ్‌–19 వైరస్‌ వ్యాప్తికి చైనాదే బాధ్యత అని నమ్ముతున్నట్లు స్పష్టమైంది. వీరిలో 50 శాతంమందికి పైగా ఈ వ్యాధిని చైనీస్‌ వైరస్‌ అని పిలుస్తూ, కరోనా వ్యాధిని వ్యాపింపచేయడంలో తన బాధ్యతను పొరుగుదేశమైన చైనా తప్పించుకోలేదు అనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నట్లు తేలింది. భారత్, చైనాలు 1962లో పరిమితమైన సరిహద్దు యుద్ధంలో పాల్గొన్నాయి. దీంతో ఆనాటి నుంచి 1989 వరకు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా స్తంభించిపోయాయి. సరిహద్దు సమస్యపై భారత్, చైనాలకు చెందిన ప్రత్యేక ప్రతినిధులు ఇంతవరకు 22 దఫాలుగా చర్చలు నిర్వహిస్తూ వచ్చారు కానీ ఈ సమస్యపై ఒక సమగ్ర పరిష్కారాన్ని చేరుకోలేకపోయారు.

అయితే సరిహద్దులలో చొరబాట్ల కారణంగానే సరిహద్దు సమస్యలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయంటూ భారత మీడియాలో పదే పదే జరుగుతున్న ప్రచార, ప్రసార అంశాలు మన యువతరంపై తమదైన ప్రభావాన్ని ప్రతిఫలింపచేస్తున్నాయి. పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజహర్‌ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో గ్లోబల్‌ టెర్రరిస్టుగా ప్రకటించే విషయంలో మొదట్లో చైనా తీవ్రంగా వ్యతిరేకించడం తెలిసిన విషయమే. కాగా 2001లో పార్లమెంటుపై దాడి, 2008లో ముంబై దాడులు మొదలుకుని భారతదేశంలో అత్యంత హీనాతిహీనమైన ఉగ్రదాడులకు మసూద్‌ అజహర్‌ సూత్రధారి అని ప్రపంచానికంతటికీ తెలుసు. 2016లో పఠాన్‌ కోట్‌ వైమానిక స్థావరంపై, 2019లో పుల్వామాలో జాతీయరహదారిలో సైనికుల కాన్వాయిపై ఉగ్రదాడులు మసూద్‌ పథకరచనే అని అందరూ భావిస్తున్నారు. 

గత 20 ఏళ్లుగా మసూద్‌ అజహర్‌ నేతృత్వంలో జరుగుతూ వస్తున్న ఈ ఉగ్రవాద దాడులు దేశంలో వందలాదిమంది ప్రాణాలను బలిగొనడమే కాదు.. దేశవ్యాప్తంగా ప్రజాజీవితంలో బీభత్సం సృష్టించాయి. కానీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థను నిషిద్ధ జాబితాలో పెట్టించేందుకు భారతదేశం చేసిన తీవ్ర ప్రయత్నాలను 2009, 2016, 2017 సంవత్సరాల్లో చైనా నాయకత్వం అడ్డుకుంది. అంతర్జాతీయ సమాజం ఉగ్రవాద బాధిత దేశంగా భారత్‌ను గుర్తించి మద్దతు పలుకుతున్న నేపథ్యంలో చైనా ఎట్టకేలకు సాంకేతికపరమైన తన అభ్యంతరాలను పక్కనబెట్టి మసూద్‌ అజహర్‌ని గ్లోబల్‌ టెర్రరిస్టుగా ప్రకటించాలనే ఐరాస భద్రతామండలి ప్రతిపాదనకు 2019 మే నెలలో ఆమోదం తెలిపింది.  భారత్‌ ప్రయత్నాల పట్ల చైనా ఇంతగా వ్యతిరేకత ప్రదర్శించడం పాకిస్తాన్‌కి మద్దతు తెలుపడంలో భాగమేనని తెలిసిన విషయమే.

అమెరికాతో 2005లో కీలకమైన పౌర అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత 2016 మే నుంచి అణు సరఫరా బృందంలో చేరడానికి భారతదేశం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. అణుపరీక్షల నిషేధ ఒప్పందం (ఎన్‌పీటీ) పై సంతకం చేయకుండా అణుసరఫరా బృందం (ఎన్‌ఎస్‌జీ)లో చేరడానికి భారత్‌కు మినహాయింపు ఇవ్వకూడదంటూ చైనా చేస్తున్న వ్యాఖ్యానం సరైందే కావచ్చు. కానీ ఇదే అంశంలో పాకిస్తాన్‌కు మధ్దతు తెలుపడం ద్వారా చైనా తన నిబద్ధతకు తానే తూట్లు పొడుస్తోంది. పాకిస్తాన్‌ సైతం అణుపరీక్షల నిషేధ ఒప్పందంపై సంతకం పెట్టలేదు. కానీ అణుసరఫరా బృందంలో సభ్యత్వం కోసం పాకిస్తాన్‌ చేస్తున్న ప్రయత్నాలకు చైనా తొలినుంచి మద్దతు ఇస్తూనే ఉంది. అణుసరఫరా బృందంలో సభ్యత్వం విషయంలో భారత్‌ ప్రయత్నాలకు చైనా అడ్డుపడుతుండటంపై భారతదేశానికి చెందిన ప్రముఖ మేధోచింతన బృందాల్లో ఒకటైన అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ వ్యాఖ్యానిస్తూ, ఎన్‌ఎస్‌జీలో చేరిక విషయంలో భారతదేశం ఏకంగా చైనా గోడతోనే తలపడుతోందని పేర్కొంది. 

ఈరోజు భారతీయ యువతరం ఇండియన్‌ మార్కెట్లో సింహభాగం ఆక్రమించిన వివో, ఒప్పో, జియోమి వంటి సంస్థలకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌లతో పాటు పలు చైనా ఉత్పత్తులను వినియోగిస్తోంది. ఇక చైనా ఉత్పత్తి అయిన టిక్‌ టాక్‌ భారత్‌లో ఎంత పాపులర్‌ అయిందో చెప్పనవసరం లేదు. అయితే ఇటీవలి సరిహద్దు వివాదం తర్వాత ‘రిమూవ్‌చైనాయాప్స్‌’అనే భారతీయ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి పదిలక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. దీంతో ఒక దేశం వ్యాపార ప్రయోజనాలకు భంగకరంగా వ్యవహరిస్తోందని చెబుతూ గూగుల్‌ ప్లే స్టోర్‌ ఈ యాప్‌ను తొలగించింది. వినియోగదారులు వాడుతున్న ఫోన్లలో చైనా అప్లికేషన్లు ఏవి అని వారికి చూపిస్తూ చైనా యాప్‌లను తమ స్మార్ట్‌ ఫోన్లనుంచి తొలగించడానికి ‘రిమూవ్‌చైనాయాప్స్‌’ అనే యాప్‌ తోడ్పడుతుంది. అలాగే చైనా నుంచి విదేశీ పెట్టుబడిపై నూతన ఆంక్షలను భారత ప్రభుత్వం విధించడాన్ని సోషల్‌ మీడియా చక్కగా స్వాగతించడం విశేషం. ఈ అంశంలో కూడా భారతీయ యువత అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. 

అంతర్జాతీయ వ్యవహారాల్లో అధ్యాపకుడిగా, నా విద్యార్థులు కోవిడ్‌ సాంక్రమిక వ్యాధి విస్తరణకు గాను చైనానే నిందించడానికి ప్రయత్నించే టాపిక్స్‌నే తమ చర్చల్లో ఎక్కువగా ఎంచుకుంటుండటాన్ని చూస్తుంటాను. భారతీయ మునుపటి తరాలు 1962 యుద్ధం తర్వాత చైనా గురించి తమ మనస్సుల్లో నిర్దిష్టంగా వ్యతిరేక వాతావరణం పెంపొందించుకున్నారు. అయితే ప్రస్తుత భారతీయ తరం కూడా అదే క్రమాన్ని అనుసరిస్తున్నారేమోనని నేను భీతిల్లుతున్నాను. మార్కెట్‌ వాటాపై తాత్కాలిక ప్రభావాన్ని మించి, చైనా గురించిన దృఢమైన వ్యతిరేక అభిప్రాయంతోనే మరోతరం కూడా గడిపేయడంలో నిజమైన ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్నాను.

వ్యాసకర్త ప్రొఫెసర్, ఇంటర్నేషనల్‌ పాలిటిక్స్, ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్శిటీ
డాక్టర్‌ రాజ్‌దీప్‌ పాకనాటి. 
mail : rpakanati@jgu.edu

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top