మేనిఫెస్టోల్లో ప్రజాసమస్యలు మాయం

Political Parties Not Mentioned About Heavy Population In Manifesto - Sakshi

కొత్త కోణం

భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధిక జనాభా సమస్యల ప్రస్తావన మచ్చుకైనా మేనిఫెస్టోల్లో లేకపోవడం విచారకరం. బీజేపీతోసహా రాజకీయ పార్టీల ప్రణాళికల్లోనూ, నేతలు గుప్పిస్తోన్న హామీల్లోనూ ఎక్కడా కూడా ప్రజల నిజమైన సమస్యలను ప్రతిబింబిస్తున్న దాఖలాల్లేవు. ప్రతి ఎన్నికల ప్రచారం వివాదాలకు ఆజ్యం పోయడంతోనే ముగుస్తోంది. మానవాభివృద్ధి నివేదికల్లో మన దేశం చిన్న చిన్న దేశాల కంటే అట్టడుగుస్థానంలో పడిపోయింది. 20 కోట్ల మంది ప్రజలు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో నిద్రపోతున్న దయనీయమైన స్థితి, 19 కోట్ల 60 లక్షల మంది పోషకాహార లోపంతో జీవిస్తుండటం.. ఇవేవీ మేనిఫెస్టోల్లో చోటుచేసుకోకపోవడం గర్హనీయం.

ఎవరైతే సమాజగమనాన్ని మార్చడానికి నిరంతరం శ్రమిస్తారో, పరిష్కారమార్గాలకోసం పరితపిస్తారో, తమ కార్యాచరణ ద్వారా ప్రజల జీవితాల్లో పెనుమార్పులకు కారణమవుతారో, వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల మనసుల్లో చిరంజీవులుగా నిలిచిపోతారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మన దేశంలోనూ, ప్రపంచవ్యాప్తం గానూ ఎందరో త్యాగధనులు దేశ భవిష్యత్తుకోసం తమ జీవితాలను ధారపోశారు. కానీ ఇటీవల మన దేశంలో జరుగుతున్న పరిణామాలనూ, నడుస్తున్న చరిత్రనూ గమనిస్తే నిరాశే మిగులుతుంది. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికల పోరు జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో పాల్గొనే పార్టీలు చాలా ఉత్సాహంతో, ప్రణాళికలతో ప్రజల్లోకి వెళుతున్నాయి. సభల్లో అధినాయకుల ప్రసంగాల్లోనూ ప్రజలకు హామీలు గుప్పించేస్తున్నారు. అయితే చాలా వరకు రాజకీయ పార్టీల ప్రణాళికల్లోనూ, ఓటర్ల సాక్షిగా నేతలు గుప్పిస్తోన్న హామీల్లోనూ ఎక్కడా కూడా ప్రజల నిజమైన సమస్యలను ప్రతిబింబిస్తున్న దాఖలాల్లేవనడంలో సందేహం అక్కర్లేదు. ప్రజల సమస్యలు పాక్షికంగానే ప్రస్థావనకు వచ్చాయి. కొన్ని ముఖ్యమైన సమస్యలకు వాళ్ళ ప్రణాళికల్లో, ప్రసంగాల్లో చోటు దక్కడంలేదన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం.

ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రణాళికను గమనిస్తే మరింత ఆందోళన కలుగుతోంది. ఈ దేశంలో అన్ని విషయాలతో పాటు కులం ఒక నిజం. కులం ఒక వర్గీకరణ మాత్రమే కాదు. అది వివక్షకూ, అణచివేతకూ, అసమానతలకూ ప్రతిరూపం. ఇప్పటికీ అంటరానితనానికీ, అవమానాలకూ గురవుతున్న దళితుల విషయంగానీ, సమాజానికి దూరంగా అడవుల్లో నివసిస్తూ, తమ జీవితాలతో పాటు అల్లుకొని వున్న అటవీ సంపదనూ, ఖనిజవనరులనూ కొల్లగొడుతుంటే చూస్తూ నిస్సహాయంగా మిగిలిపోతున్న ఆదివాసుల ఊసుగానీ ఈ ప్రణాళికల్లో కనిపించకపోవడం గమనించాల్సిన విషయం. అలాగే వృత్తులనూ, ఉపాధినీ కోల్పోయి పొట్టచేత పట్టుకొని ఎక్కడెక్కడికో వలసపోతున్న బీసీ కులాల గురించిగానీ, మతం పేరుతో వివక్షకూ, హింసకూ గురవుతున్న మైనారిటీల గురించిగానీ ఎన్నికల ప్రణాళికలు పట్టించుకున్న పాపాన పోలేదు. భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధిక జనాభా ప్రస్థావన మచ్చుకైనా ప్రణాళికల్లో లేకపోవడం గర్హనీయమైన విషయం. గతంలో ఇదే బీజేపీ ప్రణాళికల్లో మాట వరసకైనా ఈ విషయాలను చేర్చింది. కానీ ఈసారి అవేవీ వీరి దృష్టినైనా తాకకపోవడం విచారకరం. పైగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల పేదల కోసం ప్రకటించిన పదిశాతం రిజర్వేషన్ల విషయం మాత్రం చాలా ప్రముఖంగా పేర్కొన్నారు. ఆ పార్టీలో కొనసాగుతున్న ఈ వర్గాల నేతలుగా కొనసాగుతున్న వారు కూడా ఎందుకు నోరు మెదపడంలేదో అర్థం కాని విషయం. పైగా, ఈ దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో పేదరికం, ఆకలి, అభద్రత, ఆరోగ్యం, విద్య లాంటి సమస్యలు కూడా ఏ ఎన్నికల ప్రణాళికలోనూ చర్చకు రావడం లేదు.

ప్రపంచ ఆహార భద్రత, పోషకాహార స్థితిగతులపై 2018లో విడుదలైన ఒక నివేదిక ఎన్నో కఠినమైన విషయాలను బయటపెట్టింది. ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ అధ్యయనంలో దాదాపు 19 కోట్ల 60 లక్షల మంది పోషకాహార లోపంతో జీవిస్తున్నట్టు తేలింది. 20 కోట్ల మంది ప్రజలు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఉంటున్న దయనీయ స్థితి ఉన్నదని తెలిసింది. దేశంలోని 21 శాతం మంది పిల్లలు వయసుకి తగ్గ శారీరక ఎదుగుదల లేక అనారోగ్యంతో బతుకులీడుస్తున్నారని కూడా ఆ సంస్థ వివరించింది. ప్రపంచవ్యాప్త ఆకలి సూచికలో మన దేశం 103వ స్థానంలో ఉంది. ఈ సంస్థ సర్వే చేసిన దేశాలు 119 మాత్రమే. అంటే మన దేశం అ«ట్టడుగు స్థితిలో 7వ స్థానంలో ఉంది. వీటన్నింటితో పాటు, గ్రామీణ, పట్టణ పేద మహిళలు దాదాపు 51.4 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. తీవ్ర ఆందోళన కలిగించే ఇలాంటి అంశాలేవీ ఈ అతిపెద్ద ఎన్నికల్లో చర్చకు నోచుకోకపోవడం గమనార్హం. చర్చలే జరగకపోతే, మన పొరుగున ఉన్న నేపాల్, బంగ్లాదేశ్‌ వంటి చిన్న దేశాలు  సైతం ఆకలి సూచికలో మనకంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి.

ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ మార్చిలో విడుదలైన ఏడవ ప్రపంచ సంతోషదాయక నివేదిక మన దేశంలో గూడుకట్టుకున్న దుఃఖాన్ని ప్రతిబింబించింది. మన పొరుగుదేశమైన భూటాన్‌ ఆలోచన ప్రకారం మనిషికి ఆర్థికంగా అందే ప్రయోజనాలతో పాటు, ప్రజలు సంతోషంగా ఉన్నారా? లేరా? అనేది కూడా పరిశీలించాలనే ప్రయత్నం మొదలైంది. మార్చి 21న ప్రతి సంవత్సరం సంతోష దినోత్సవం జరుపుతూ గత ఏడేళ్ల నుంచి ఐరాస నివేదికలను విడుదల చేస్తున్నది. అందులో మన దేశం మొదటి నుంచీ వెనుకబడే ఉంది. 2013లో 111వ స్థానం, 2015లో 117వ స్థానం, 2016లో 118వ స్థానం, 2017లో 122వ స్థానం, 2018లో 122వ స్థానం. ఇక 2019లో 140వ స్థానానికి పడిపోవడం మన దేశ దుస్థితినీ, ప్రజల్లోని అసంతృప్తినీ చాటిచెపుతోంది. దేశ ప్రజల సంతోషం గ్రాఫ్‌ విషయంలో పాక్, బంగ్లాదేశ్, లాంటి దేశాలు కూడా మనకన్నా మెరుగ్గా ఉన్నాయి. ఈ నివేదికలో గృహ వసతి, ఆదాయం, విద్య, వైద్యం, పర్యావరణం, ఉద్యోగం, ఉపాధి, ప్రజల మధ్య సంబంధాలు, ఆయుర్దాయం, రక్షణ లాంటి విషయాలను పరిగణనలోనికి తీసుకున్నారు.

మన దేశంలో ఆదాయాలు ఎక్కువగా ఉన్న వర్గాలు కూడా సంతోషంగా లేవని ఈ నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆరోగ్యంపై పెరుగుతున్న భారం మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. పిల్లల విద్య విషయంలో అవుతున్న వ్యయం కూడా ఈ వర్గాలను వేధిస్తున్నది. ముఖ్యంగా నగరీకరణ పెరుగుతుం డటం వల్ల ఏర్పడుతున్న పర్యావరణ సమస్యలు ప్రజలకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. నగరాలలోకి ఆడపిల్లలను పంపాలనే ఆలోచన కూడా తల్లిదండ్రులను భయపెడుతున్నది. గత ఐదేళ్ళలో భిన్న విశ్వాసాలు, ప్రజల్లో పెరుగుతున్న వైషమ్యాలు కూడా ఈ దేశంలోని ప్రజల్లో నెలకొన్న ఆందోళనకు కారణంగా భావించొచ్చు. వీటన్నింటితో పాటు దేశానికి శక్తివంతమైన మానవ వనరులు మన యువత. ఈ దేశంలోని కోట్లాది మంది యువతీ, యువకులు అభద్రతలో కొట్టుమిట్టాడుతున్నారు. 2018లో మన నిరుద్యోగం రేటు 3.5 శాతం. దాదాపు 40 కోట్ల మంది యువతీయువకులు నిరుద్యోగులుగానే జీవితాలను గడుపుతున్నారు. ఇది మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసే అంశం. ఎందుకంటే, సమాజ స్థితిని తెలియజేసేది యువత ఎదుగుదల మాత్రమే. ఈ ప్రమాదకర పరిస్థితి మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

అయితే ఇన్ని సమస్యలున్నా భారతదేశం పేద దేశం మాత్రం కాదు. ఇది అభివృద్ధి చెందుతున్న దేశమే. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి మన స్థూల జాతీయదాయం చూస్తే మన దేశ ఆర్థిక పురోగతి అర్థం అవుతుంది. 1951 నుంచి మన సరాసరి స్థూల జాతీయాదాయం 6.21 శాతంగా ఉండింది. కానీ 2010లో 11.40 శాతాన్ని చేరుకొని రికార్డు సృష్టించింది. మన దేశ స్థూల జాతీయాదాయం దాదాపు రెట్టిం పైంది. అయితే ఇది ప్రజల బతుకుల్లో ఎక్కడా కనిపించడంలేదు. మన దేశంలో దేశ సంపద పెరుగుతున్నది. కానీ అది కొద్దిమంది చేతుల్లోకే చేరుతున్నది. ‘పెరుగుతున్న అంతరాలు’ పేరుతో ఆక్స్‌ఫామ్‌ అనే అంతర్జాతీయ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, ఆదాయాల్లో అంతరాల గురించి సవివరంగా పేర్కొన్నారు. మనదేశంలోని పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ 59 వ నివేదికలో ఇదే రకమైన ఆందోళనను వ్యక్త పరిచింది.

దేశంలో అంతరాలు 1990 నుంచి పెరగడం ఎక్కువైంది. సరళీకరణ ఆర్థిక విధానాలూ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ వల్ల ఆదాయాల్లో అంతరాలు ఆకాశాన్నంటుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది. 2017లో వెలువరించిన ప్రపంచ సంపద నివేదికలో పేర్కొన్నట్టు, 2002లో పది శాతం మంది చేతుల్లో 52.9 శాతం సంపద ఉండగా, 2012 కి వచ్చేసరికి 62.1 శాతానికి పెరిగింది. అదేవిధంగా 2002లో 15.7 శాతం సంపద కేవలం ఒక్కశాతం మంది చేతుల్లోనే  పోగుపడింది. 2012లో అది 25.7 శాతానికి మించి పోయింది. దీనివల్ల దేశంలో ప్రజల్లో ఆకలి, నిరుద్యోగం, అనారోగ్యం పెరిగిపోతున్నది. ఈ విషయాలేవీ కూడా ఈ ఎన్నికల్లో చర్చకు కూడా రాకపోవడం గమనార్హం. దీనికి బలమైన కారణం ఉన్నది. ఈ దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ నాయకులూ, వ్యాపారులూ, పారిశ్రామిక వేత్తలూ, వాణిజ్యవేత్తలూ, అవినీతిమయమైన బ్యూరోక్రసీ ఒక కూటమిగా ఏర్పడింది. దీనితో ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో ఏర్పడిన బడ్జెట్‌లూ, సహజ వనరులైన భూమి, అడవి, భూగర్భ సంపద అంతా కొందరి చేతుల్లోకి పోయింది. దానితో లక్షల రూపాయల పెట్టుబడులతో ప్రారంభమవుతున్న వాళ్ళు అనతికాలంలోనే వేలకోట్లకు అధిపతులుగా మారుతున్నారు. ఈ స్థితిలో జరుగుతున్న ఎన్నికలు ప్రజల నిజమైన సమస్యలను ప్రతిబింబించకపోవడంలో ఆశ్చర్యమేమీలేదు. కానీ సమాజం దీన్ని సమస్యగా భావించకపోవడమే నేరమౌతుంది.

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077
మల్లెపల్లి లక్ష్మయ్య

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top