జీరో ఎఫ్‌ఐఆర్‌ ఎప్పుడు, ఎలా?

Mangari Rajendar Writes Article About Zero FIR In Two Telugu States - Sakshi

‘దిశ’ సంఘటన తరువాత ‘జీరో’ ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) గురించిన చర్చ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతోంది. తమకు అధికార పరిధి లేదన్న కారణంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ని తీసుకోలేదని ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో జీరో ఎఫ్‌ఐఆర్‌ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. నేర సమాచారం అందిన వెంటనే చట్టప్రకారం కేసు నమోదు చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలు పోలీసులను ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్‌ పోలీసు యంత్రాంగం ఈ విషయం గురించి సర్క్యులర్‌ని కూడా జారీ చేసింది. తమకు కేసుని దర్యాప్తు చేసే అధికార పరిధి లేకున్నా ఎఫ్‌ఐఆర్‌ని విడుదల చేయాలన్నది ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ సారాంశం. నేర తీవ్రత ఎక్కువగా ఉండి, వారెంట్‌ అవసరం లేకుండానే అరెస్టు చేయగలిగే కేసుల్లో (కాగ్నిజబుల్‌) నేర సమాచారం అందుకున్న తరువాత పోలీసులు తమ అధికార పరిధితో నిమిత్తం లేకుండా ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయాలని, ఆ విధంగా చేయకపోతే వాళ్లపై భారతీయ శిక్షాస్మృతి లోని సె.166ఏ ప్రకారం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సెప్టెంబర్‌ 19, 2019 రోజున కర్ణాటక పోలీసులని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.

కాగ్నిజబుల్‌ నేర సమాచారం అందినప్పుడు పోలీసులు (155లోని) తమ అధికార పరిధితో నిమిత్తం లేకుండా కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. పోలీసులు తమ కోర్టు అధికార పరిధిలోని కేసులనే దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె.156(1) చెబుతుంది. అందుకని తమ అధికార పరిధిలేని కేసులో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ విడుదల చేసిన తరువాత, మొత్తం కేసు డైరీని తదుపరి దర్యాప్తు నిమిత్తం సంబంధిత పోలీసులకి పంపించాల్సి ఉంటుంది.

జీరో ఎఫ్‌ఐఆర్‌ భావన
డిసెంబర్‌ 2012 సంవత్సరంలో ఢిల్లీలో నిర్భయ సంఘటన తరువాత ఈ జీరో ఎఫ్‌ఐఆర్‌ అన్న పదబంధం తెరమీదికి వచ్చింది. ఆ సంఘటన జరిగిన తరువాత నియమించిన జస్టిస్‌ వర్మ కమిటీ తన నివేదికలో ఈ భావనని ప్రతిపా దించింది. కేసుని దర్యాప్తు చేసే అధికార పరిధి లేని పోలీసు అధికారి కాగ్నిజబుల్‌ నేర సమాచారం అందుకుని ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయడాన్ని ఇప్పుడు కొత్తగా జీరో ఎఫ్‌ఐఆర్‌ అని అంటున్నారు. నేరం ఎక్కడ జరిగినా దగ్గరలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు ప్రథమ సమాచారాన్ని ఇవ్వవచ్చు. బాధితుల సౌకర్యం కోసం ఈ భావ నని తీసుకొని వచ్చారు. ఇది చట్టంలో ఉన్న విష యమే. లైంగిక నేరాలకు సంబంధించిన సమా చారం అందుకుని పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌ విడుదల చేయకపోతే వాళ్లు భారతీయ శిక్షాస్మృతిలోని సె.166ఏ ప్రకారం నేరం చేసినట్లు అవుతుంది. అది కాగ్నిజబుల్‌ నేరం.

మహిళల మీద నేరాలు జరిగినప్పుడు వాళ్లు తమకు దగ్గరలో ఉన్న స్టేషన్లో ప్రథమ సమాచారం ఇచ్చే వీలు చిక్కుతుంది. అదే విధంగా హత్య, ఆక్సిడెంట్‌ లాంటి నేరాలు జరిగినప్పుడు జీరో ఎఫ్‌ఐఆర్‌ విడుదల చేయడంవల్ల సాక్షులను కాపాడటానికి వీలుపడుతుంది. క్రిమినల్‌ ప్రొసీ జర్‌ కోడ్‌లోని సె.156(1) ప్రకారం తన అధికార పరిధిలోని కేసులనే దర్యాప్తు చేసే అధికారం పోలీ సులకి ఉంటుంది. అదే నిబంధనలోని సబ్‌ సెక్షన్‌ (2) ప్రకారం–పోలీసులు దర్యాప్తు చేయడానికి అధికార పరిధి లేదన్న కారణంగా, ప్రశ్నించే అవ కాశం లేదు. సె.156(3) ప్రకారం నేరాన్ని సె.190 ప్రకారం గుర్తించే అధికారం ఉన్న మేజిస్ట్రేట్‌ దర్యాప్తుని ఆదేశించవచ్చు.

దర్యాప్తు తరువాత తనకి అధికార పరిధి లేదన్న అభిప్రాయానికి పోలీసు అధికారి వచ్చిన ప్పుడు కేసు డైరీని సంబంధిత పోలీసులకి పంపిం చవచ్చు. అంతేకానీ ఎఫ్‌ఐఆర్‌ని నమోదు చేయ డానికి నిరాకరించకూడదు. దిశ కేసులో పోలీసులు అధికార పరిధి లేదన్న కారణంగా ఎఫ్‌ఐఆర్‌ని విడుదల చేయకపోవడంతో వాళ్లని సస్పెండ్‌ చేశా రని పత్రికల్లో చూశాం. ఒకవేళ ఆ ఆరోపణ నిజ మైతే వాళ్లు శాఖాపరమైన చర్యలకే కాదు.. భార తీయ శిక్షాస్మృతిలోని సె.166ఏ ప్రకారం కూడా శిక్షార్హులే.

జీరో ఎఫ్‌ఐఆర్‌వల్ల ఉపయోగాలతో బాటూ నష్టాలూ ఉన్నాయి. కొంతమంది ఈ భావ నని దుర్వినియోగం చేయడంవల్ల బాధితులకి నష్టం కలుగుతుంది. కొంతమంది దురుద్దేశంతో తమ ప్రయోజనాలకి అనుగుణంగా కేసు విషయా లను ప్రథమ సమాచార నివేదికలో పొందుపరిచి, తమకు అనుకూలంగా ఉన్న పోలీసులతో కుమ్మక్కై బాధితులకి నష్టం కలుగజేసే అవకాశం ఉంది. అయితే ఈ పరిస్థితిని పై అధికారులు సరిచేసే అవ కాశం ఉంది. కోర్టులు కూడా సరిచేయవచ్చు.

జీరో ఎఫ్‌ఐఆర్‌ భావనని తీసుకొని తమకు అనుకూ లంగా పోలీసు స్టేషన్లలో కేసులని నమోదు చేయిం చుకొని దుర్వినియోగంచేసే అవకాశం ఉంది.  హత్య, అత్యాచారం లాంటి కేసుల విష యంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలి. మిస్సింగ్‌ కేసులని కూడా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. జీరో ఎఫ్‌ఐఆర్‌ చట్టబద్ధం. 1976లోనే ఈ విషయాన్ని సుప్రీంకోర్టు జీరో ఎఫ్‌ఐఆర్‌ అని చెప్పకుండా అధికార పరిధితో నిమిత్తం లేకుండా విడుదల చేయాలని చెప్పింది.

క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె.154 ఇదే విష యాన్ని చెబుతుంది. ఇన్ని సంవత్సరాలు గడిచినా పోలీసులు ఈ విషయాన్ని గుర్తించకపోవడం బాధని కలుగజేస్తుంది. తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా వాళ్లకే తెలి యాలి. కనీసం నిర్భయ ఘటన తరువాతైనా ఈ విషయాన్ని పట్టించుకోక పోవడం శోచనీయం. దిశ సంఘటన తరువాత అలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగవని ఆశిద్దాం.


వ్యాసకర్త,
మంగారి రాజేందర్‌,

మొబైల్‌ : 94404 83001 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top