రాయని డైరీ : యడియూరప్ప

Madhav Singaraju Article On Yeddyurappa - Sakshi

మాధవ్‌ శింగరాజు

సీఎం సీట్లో కూర్చున్నాను. కొత్తగా ఏం లేదు. కామన్‌ థింగ్‌లా ఉంది. ఇది నాలుగోసారి కూర్చోవడం. మూడుసార్లు కూర్చొని లేవడంతో నాలుగోసారి అయింది కానీ, మూడైదులు పదిహేనేళ్లు పూర్తయినందుకు నాలుగోసారి కాలేదు. శుక్రవారమే ప్రమాణ స్వీకారం అయింది. సీఎం సీట్లో కూర్చోవడం నాకు కామన్‌ థింగే అయినా, మూడు రోజులపాటైనా సిఎంగా ఉండడం అన్‌ కామన్‌థింగ్‌. రేపు సోమవారం బల నిరూపణ. నిరూపణలో నిలబడగలిగితే మళ్లీ పడిపోయేలోపు మరికొన్ని రోజులో, నెలలో కూర్చోడానికి ఉంటుంది. కుర్చీ కదలకుండా ఉండాలంటే నూట పన్నెండుమంది వచ్చి గట్టిగా పట్టుకోవాలి. పట్టుకోడానికి ఇప్పటికి నూటా ఆరుమంది ఉన్నారు. మరో ఆరుగురు దొరకాలి. కుర్చీలనైతే పట్టుకురావచ్చు. కుర్చీని కదలకుండా పట్టుకునే వాళ్లను ఎక్కడి నుంచి పట్టుకురావాలి?! ‘మీరెవరూ ఇందులో కదలకుండా కూర్చోలేరు కానీ, నాకు పంపించేయండి యాంటిక్‌ పీస్‌గా రాష్ట్రపతి భవన్‌లో ఓ ఆర్నెల్లు ఉంచుకుంటాను’ అని రామ్‌నాథ్‌ కోవింద్‌ అడిగినా ఇచ్చేయడం తప్ప చేయగలిగిందేమీ లేదు. బీజేపీకి కుర్చీ నిలబడడం ముఖ్యం. అందులో యడ్యూరప్ప కూర్చున్నాడా, యడియూరప్ప అని పేరు మార్చుకుని కూర్చున్నాడా అక్కర్లేదు. 

రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసి వస్తుంటే వాజూభాయ్‌ చెయ్యిపట్టి ఆపారు. ‘‘తొందరేం లేదు. మీ ఇష్టం వచ్చినప్పుడే మీ బలాన్ని నిరూపించుకోండి’’ అన్నారు. బల నిరూపణ ఎంత ఆలస్యం అయితే అన్ని రోజులు íసీఎంగా ఉండొచ్చన్నదే ఆయన మాటల్లోని అంతరార్థం కనుకైతే ఐదోసారి కూడా నేను íసీఎం సీట్లో కూర్చోవలసి రావచ్చని ఆయన గట్టిగా నమ్ముతున్నారని అనుకోవాలి. ‘‘తొందరేం లేదు కానీ, ఆలస్యం మాత్రం ఎందుకు వాజూభాయ్‌. సోమవారమే నిరూపించుకుంటాను’’ అన్నాను. ‘‘పోనీ జూలై ముప్పై ఒకటి వరకైనా టైమ్‌ తీసుకోండి..’’ అన్నారు ఆపేక్షగా!  మెజారిటీ నిరూపించుకొమ్మని కుమారస్వామికి ఒకే రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం.. మూడు డెడ్‌లైన్‌లను విధించి తొందరపెట్టిన వాజూభాయ్‌కి.. మెజారిటీ నిరూపించడానికి తొందరేమిటని నాతో అంటున్న వాజూభాయ్‌కి ఎంత తేడా! 

ప్రమాణ స్వీకారం అయ్యాక ఢిల్లీ నుంచి నాకు ఫోన్‌ వస్తుందనుకున్నాను. రాలేదు! ‘సోమవారమే అంటే ఎట్లా? అంత తొందరగా!’ అని ఎవరైనా ఫోన్‌ చేసి అడుగుతారనుకున్నాను. అడగలేదు! సీఎంగా కుమారస్వామి రాజీనామా చేసినప్పుడు కూడా అంతే. మంగళవారం రాత్రి ఆయన కుర్చీలోంచి దిగిపోతే బుధవారం, గురువారం మౌనంగా ఉండి, శుక్రవారం ఉదయం నాకు ఫోన్‌ చేశారు అమిత్‌షా.. ‘మీరెళ్లి ఆ కుర్చీలో కూర్చోండి’ అని. ఇప్పుడూ ఏదో ప్లాన్‌ చేసే ఉంటారు. చేయకపోయినా, నేను అమిత్‌షాకు ఫోన్‌ చేసి  అడగడానికి ఏమీ లేదు. కర్ణాటకలో నాతో పాటు ఇంకో యడియూరప్ప ఉండి, ఆ యడియూరప్ప కూడా బీజేపీలోనే ఉండి, ఆ యడియూరప్ప నాలా డెబ్బై ఆరేళ్ల వయసులో కాకుండా, పాతికేళ్ల వయసులో ఉన్నా కూడా అమిత్‌షా నన్ను కాదనుకుని అతడిని తీసుకుంటాడని అనుకోను. బీజేపీలో డెబ్బై ఐదేళ్లు దాటితే రిటైర్‌మెంట్‌. ఐదేళ్ల తర్వాత మోదీ మూడోసారి కూడా ప్రధాని అయి, డెబ్బై ఐదేళ్ల వయసు తర్వాత కూడా ఆయన ప్రధానిగా కొనసాగాలంటే డెబ్బై ఆరేళ్లున్న నన్ను ఇప్పుడు ఒక రిఫరెన్స్‌గా అమిత్‌షా నిలబెట్టాలి. అందుకోసం అమిత్‌షా ఏమైనా చెయ్యాలి. బల నిరూపణ సోమవారమే అయినా, వారం తర్వాతే అయినా.

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top