ఎందుకీ విన్యాసాలు?!

K Ramachandra Murthy Analysis On Elections And Exit Polls - Sakshi

త్రికాలమ్‌  

ఈ రోజు సాయంత్రం అయిదు గంటలకు ఏడవ దశ పోలింగ్‌ పూర్తియిన తర్వాత టీవీ న్యూస్‌ చానళ్ళు ఎగ్జిట్‌పోల్‌ వివరాలు వెల్లడిస్తాయి. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడానికి ముందు జనాభిప్రాయ సేకరణ పేరుతో సర్వేలు జరిపి ప్రకటించే ఫలితాల కంటే ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు మే 23 న వెల్లడి కాబోయే అసలు ఫలితాల ఉప్పు అందిస్తాయి. ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలను నమ్మవద్దంటూ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుగానే హెచ్చరించారు. సర్వే జరిపిన పెద్ద సంస్థలలో ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్‌లోని  మొత్తం 25 లోక్‌సభ స్థానాలలో ఐదారుకు మించి టీడీపీకి వస్తాయని చెప్పలేదు. ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీకి 18 నుంచి 23 స్థానాలు రావచ్చునంటూ వివిధ సంస్థలు చాటాయి. ఇండియా టుడే, టైమ్స్‌ నౌ వంటి పెద్ద సంస్థలు, విశ్వసనీయత కలిగిన సర్వేసంస్థలతో కలిసి జరిపించిన సర్వేల ఫలితాలు ఎటువంటి సందేహాలకూ ఆస్కారం లేకుండా వైఎస్‌ఆర్‌సీపీ ఘన విజయం సాధించబోతున్నదని ఘంటాపథంగా చెప్పాయి.

ఆ సంస్థలే నిర్వ హించిన ఎగ్జిట్‌ సర్వే ఫలితాలు అంతకంటే భిన్నంగా ఉండే అవకాశాలు లేవని చంద్రబాబునాయుడికి తెలియని విషయం కాదు. కానీ 23వ తేదీ మధ్యాహ్నం వరకూ గాంభీర్యం ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ మంత్రులూ, ఇతర నాయకులూ నేత చూపిన బాటలో నడుస్తున్నారు. పార్టీలో లేకపోయినా పార్లమెంటు మాజీ సభ్యుడు, పెప్పర్‌స్ప్రే ప్రవీణుడు లగడపాటి రాజగోపాల్‌ తన సహకారం అదిస్తున్నారు. కొంతకాలం కిందటి వరకూ ఎన్నికల ఫలితాల జోస్యం చెప్పడంలో లగడపాటి ఘనాపాటి అని చెప్పుకున్నారు. లగడపాటికి ఎవరు సాటి అంటూ ప్రశ్నించిన రోజులు ఉన్నాయి. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోస్యం చెప్పే సమయానికి ఇతరేతర కారణాలు కమ్ముకొని రావడంతో దృష్టి మందగించింది. తప్పులో కాలేశారు. దీనితో లగడపాటి రాజగోపాల్‌ ఏపాటి అంటూ ప్రజలు ప్రశ్నించడం ప్రారంభించారు. శనివారంనాడు కూడా తెలంగాణ తోవలోనే నడిచిన లగడపాటి మాటలు ఏ మాత్రం విలువలేని పిచ్చాపాటిగా పరిగణించవలసి వస్తుంది. 

తన అధికారం, ప్రాభవం  కొనసాగే అవకాశాలు మృగ్యమని చంద్రబాబు నాయుడుకు పోలింగ్‌ జరిగిన ఏప్రిల్‌ 11వ తేదీ ఉదయం పది గంటలకే స్పష్టంగా తెలిసిపోయింది. అప్పుడే ఈవీఎంలపైన వీరంగం ప్రారంభించారు. పోలింగైన తర్వాత రెండు రోజుల వరకూ డీలాపడినట్టు కనిపించారు. అంతలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ దక్కడం ఖాయమని చెప్పడం ప్రారంభించారు. 95 సీట్లు అని ఒకసారీ, 105 అని మరోసారీ, 120 అని ఇంకోసారీ, 130 వరకూ రావడం తథ్యమని చివరిసారీ సంఖ్య పెంచుతూ పోయారు. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రం పోలింగ్‌ జరిగిన తర్వాత ఒకే ఒకసారి విలేకరులతో మాట్లాడిన సందర్భంలో ఘన విజయం సాధిస్తామని (ల్యాండ్‌ స్లైడ్‌) చెప్పారు. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలపైన వ్యాఖ్యానించలేదు. తన పార్టీ విజయం ఖాయమని ఆయన సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్టు ఆయన దేహభాష స్పష్టం చేస్తున్నది. 2014లో కొద్ది తేడాతో ఓడిపోయినప్పుడు సైతం ప్రజల తీర్పును గౌరవిస్తాననీ, బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామనీ వైఎస్‌ జగన్‌ అన్నారు. అంతేతప్ప చంద్రబాబులాగా ఈవీఎంలను నిందించలేదు. ఎన్ని కల కమిషన్‌పైన ఆరోపణలు చేయలేదు. ఇందుకు పూర్తిగా విరుద్ధం చంద్రబాబు నాయుడి వైఖరి. 

వార్తలలో ఉండటమే లక్ష్యమా?
జాతీయ స్థాయిలో ముఖ్యమైన పాత్ర పోషించాలనే సంకల్పంతోనే చంద్రబాబు ఈవీఎంలపైన యాగీ చేస్తున్నారనీ, ఎన్నికల కమిషన్‌పైన నిందారోపణలు శ్రుతి మించి చేస్తున్నారనీ రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఎన్నికల కమిషన్‌పైన దాడిలో భాగంగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పునేఠాను తొలగించి ఆయన స్థానంలో ఎల్‌వీ సుబ్రహ్మణ్యంను నియమించడాన్ని గట్టిగా వ్యతిరేకించారు. ఆ తర్వాత మంత్రివర్గ సమావేశం పెట్టుకోవాలంటూ గోల చేశారు. ఎన్నికల సంఘం అనుమతితో జరిగిన సమావేశంలో చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు. ఆ విధంగా పంతం నెగ్గించుకున్నారు. అంతవరకే. ఈ నెల 19 న అయిదు చోట్ల రీపోలింగ్‌ జరపాలని నిర్ణయించినందుకు ఎన్నికల సంఘం పైన విమర్శనాస్త్రాలు సంధించారు. శుక్రవారం సాయంత్రం ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి ఎన్నికల కమిషన్‌ని కలుసుకొని తీవ్రమైన అభ్యంతరం చెప్పారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కొన్ని పోలింగ్‌ కేంద్రాలలో టీడీపీ నాయకులు దళితులను ఓటు వేయనీయకుండా అడ్డుకొని రిగ్గింగ్‌కు పాల్పడినట్టు స్థానిక శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి  ఫిర్యాదు చేశారు. తనకు అందిన ఫిర్యా దును ప్రధాన కార్యదర్శి ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీకి పంపిం చారు. ఈ విషయంపై నివేదిక పంపించవలసిందిగా చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్నను ద్వివేదీ ఆదేశించారు. కలెక్టర్‌ సదరు ఫిర్యాదుపైన తన నివేదిక పంపుతూ దానితో పాటు సీసీ ఫుటేజీని కూడా పంపించారు. నివేదికనూ, సీసీ ఫుటేజీనీ కేంద్ర ఎన్నికల సంఘానికి ద్వివేదీ పంపించారు.

టీడీపీ నాయకుల నిర్వాకం కళ్ళారా చూసిన ఎన్నికల సంఘం మళ్ళీ పోలింగ్‌  నిర్వహించాలని నిర్ణయించింది, ఇందులో తప్పు ఏమున్నది? నిజం గానే ఆ  కేంద్రాలలో ఏప్రిల్‌ 11న ఓటర్లు టీడీపీకి ఓటు వేసి ఉంటే రీపోలింగ్‌లో కూడా టీడీపీకే ఓటు వేస్తారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకోలేక పోయినవారు ఈసారి వినియోగించుకుంటారు. ఆ గ్రామాలలో 30 ఏళ్ళుగా దళితులను ఓటింగ్‌కు దూరంగా ఉంచు తున్నారు. ఎన్నికల సంఘం సభ్యులు చూపించిన సీసీ ఫుటేజీలు చూసిన చంద్రబాబునాయుడు అవాక్కైనట్టు సమా చారం. ఆయన కూడా పోటీగా కొన్ని కేంద్రాలలో రీపోలింగ్‌ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రెండు కేంద్రాల విషయంలో ఆయన మాట మన్నించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. జాతీయ స్థాయిలో మోదీతో పోరాడుతున్న ప్రధాన ప్రతిపక్ష  యోధుడిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న తాపత్రయం చంద్ర బాబు నాయుyì చేత నేలవిడిచి సాము చేయిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షం కాదు. ఒకటి, రెండు సందర్భాలలో మినహా నరేంద్ర మోదీ కానీ అమిత్‌ షా కానీ చంద్రబాబునాయుడు ప్రస్తావన చేయలేదు. ఆయనను ప్రధాన ప్రత్యర్థిగా గుర్తించలేదు. టీడీపీ అధినేత ఎంత ఘాటైన ఆరోపణలు చేసినా, ఎంత కవ్వించినా నరేంద్ర మోదీ, అమిత్‌ షాలు రెచ్చిపోయి తమ దాడిని మమతా బెనర్జీ (దీదీ) నుంచి చంద్రబాబునాయుడివైపు ఏమాత్రం మర ల్చలేదు. 

దీదీపై మోదీ, షా దాడి
పశ్చిమబెంగాల్‌లో పరిస్థితులు వేరు. అక్కడ తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఢీకొడు తున్న పార్టీ బీజేపీ. రెండు పార్టీలూ సర్వం ఒడ్డి పోరాడుతున్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు పోరాటంలో లేవు. అమిత్‌షా రోడ్డు షో నిర్వహించిన సందర్భంలో సంఘసంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ ప్రతిమను పగుల కొట్టిన దుండగులు మీరంటే మీరంటూ తృణమూల్, బీజేపీ నాయకులు వాదులాడుకున్నారు. కొన్ని రోజులుగా మోదీ, షాల బాణాలన్నీ మమతాదీపైనే ఎక్కుపెట్టారు. మమత కూడా ఇద్దరికి దీటుగా సమాధానాలు చెబుతూ వచ్చారు. ‘జైశ్రీరామ్‌’ అని మోదీ నినదిస్తే ‘కాళీమాతా కీ జై’ అంటూ మమతాదీ ఎలుగెత్తి చాటారు.  బీజేపీ అగ్ర నాయకులు పశ్చిమబెంగాల్‌పైన ఎందుకంతగా దృష్టి కేంద్రీకరించారు? 2014 సార్వత్రిక ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌ (యూపీ)లో మొత్తం 80 లోక్‌సభ సీట్లలో 71 సీట్లను బీజేపీ, రెండు సీట్లను బీజేపీ మిత్రపక్షం ‘అప్నాదళ్‌’ గెలుచుకున్నాయి. హిందీ రాష్ట్రాలలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీకి మొత్తం 282 స్థానాలు లభించాయి. ఈ సారి యూపీలో బీజేపీ అంతటి సానుకూల వాతావరణం లేదు. అప్నాదళ్‌ చీలిపోయింది. 2014లో విడివిడిగా పోటీ చేసిన సమాజ్‌వాదీ  (ఎస్‌పీ), బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) ఈ సారి ఒక్కటైనాయి. మరో ప్రతిపక్షమైన రాష్ట్రీయ లోక్‌దళ్‌ని ఈ కూటమిలో కలుపుకున్నారు. కాంగ్రెస్‌ విడిగా పోటీ చేస్తేనే బీజేపీ ఓట్లను చీల్చే అవకాశం ఉన్నదని బీఎస్‌పీ అధినేత మాయా వతీ, ఎస్‌పీ నేత అఖిలేష్‌యాదవ్, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ భావిం చిన కారణంగానే కూటమిలో కాంగ్రెస్‌ లేదని కొందరి అభిప్రాయం. దళితులలో జాతవ్‌ (చమర్‌) కులానికి చెందిన నేత మాయావతి. బీసీలలో యాదవ్‌ కుల దీపుడు అఖిలేష్‌. జాతవేతర దళితులనూ, యాదవేతర వెనుక బడిన వర్గాలనూ సుముఖం చేసుకొని సంఘటిత పరిచిన కారణంగానే 2014 లోక్‌సభ ఎన్నికల లోనూ, 2017 అసెంబ్లీ ఎన్నికలలోనూ బీజేపీ ఘనవిజయం సాధించగలిగింది. ఆ వర్గాలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలను బీజేపీ కొనసాగించింది. 2014 లోక్‌సభ ఎన్నికలలో యూపీఏ పదేళ్ళ పాలన పట్ల వ్యతిరేకత, 2017లో ఎస్‌పీ అయిదేళ్ళ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత బీజేపీకి లాభం చేకూర్చాయి. ఇప్పుడు కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అయిదేళ్ళు పూర్తి చేసింది. రెండేళ్ళుగా యోగీ ఆదిత్యనాథ్‌  అధికారంలో ఉన్నారు.  మోదీ పట్ల వ్యతిరేకత లేదు. యోగీ పట్ల ప్రతికూలత ఉన్నది.

ఈ నేపథ్యంలో యూపీలో ఎస్‌పీ– బీఎస్‌పీ–ఆర్‌ఎల్‌డీ కూటమి 30–35 స్థానాలు సాధించే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ అయిదు స్థానాలు గెలుచుకున్నా ఆశ్చర్యం లేదు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో కూడా ఇదివరకు వచ్చినన్ని సీట్లు బీజేపీకి రావడం అసాధ్యం. హిందీ రాష్ట్రాలలో మొత్తం 70 సీట్ల వరకూ తగ్గే అవకాశం ఉంది. అందుకే పశ్చిమబెంగాల్‌లో సాధ్యమైనన్ని ఎక్కువ  సీట్లు సంపాదించాలని శక్తివంచన లేకుండా ప్రయత్నం. బెంగాల్‌లో, ఒడిశాలో, అస్సాంలో కూడా మెరుగైన ఫలితాలు సాధించగలిగితే బీజేపీకి స్వయంగా 200 సీట్లకు పైగా రావచ్చుననీ, పాత ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలతోపాటు కొత్త భాగస్వాములను చేర్చుకొని అధికారంలో బీజేపీ కొనసాగే అవకాశాలు ఉన్నాయనీ అంచనా. శుక్రవారం మీడియా సమావేశంలో నరేంద్ర మోదీ మాటలు జాగ్రత్తగా గమనించినవారికి ఈ విషయం బోధపడి ఉంటుంది. బీజేపీకి స్వయంగా 300 సీట్లు వస్తాయనీ, అయినా సరే మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడంలో అంతరార్థం అదే. 

చంద్రబాబు చక్రవిన్యాసం
1996–97లో పరిస్థితులు వేరు. అప్పుడు సీపీఎం నాయకుడు హరికిషన్‌సింగ్‌ సూర్జిత్, డిఎంకె అధినేత ఎం కరుణానిధి ఉండేవారు. వారే ముఖ్యమైన నిర్ణ యాలు తీసుకునేవారు. చంద్రబాబు నాయుడు యువ ముఖ్యమంత్రిగా, యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా, అనుసంధానకర్తగా పని చేసేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. ఎవరి ప్రేరణ లేకుండానే వివిధ పార్టీల నాయకులు ఎన్నికలలో తాము గెలిచిన సీట్ల సంఖ్య ఆధారంగా, తమ ప్రయోజనాల పరిరక్షణే పరమావధిగా నిర్ణయాలు తీసుకుంటారు. నాడు చంద్రబాబు నాయుడి చొరవతో ఏర్పడిన దేవగౌడ, ఐకె గుజ్రాల్‌ ప్రభుత్వాలు చెరి సంవ త్సరం కూడా నిలబడలేదు. అటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్య మైతే దేశానికి అంతకంటే అపకారం మరొ కటి ఉండదు. సుస్థిర ప్రభుత్వమే దేశానికి క్షేమదాయకం. ఎన్నికల సంఘం సభ్యులను కలుసుకున్న అనంతరం చంద్రబాబు ఎన్‌సీపీ నాయకుడు శరద్‌పవా ర్‌నీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌నీ, శనివారంనాడు రాహుల్‌గాంధీనీ, మాయావతినీ, అఖిలేష్‌ యాద వ్‌నీ కలుసుకున్నారు. మమతా బెనర్జీతో సైతం సంప్రదింపుల్లో ఉన్నారు. వారం దరితో ఏమి మాట్లాడి ఉంటారు? వారంతా చంద్రబాబు నాయుడుకు ఏమి చెప్పి ఉంటారు? ఏమీ చెప్పరు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత 23వ తేదీ సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధీ ఏర్పాటు చేసిన సమా వేశానికి హాజరు కావాలా లేదా అని ఆలోచిస్తున్న మాయావతి, అఖిలేష్‌ చంద్రబాబు నాయుడుతో ఏమి చెబుతారు? ఆయన ఏదైనా చెబితే ఆలకించి ఉంటారు. ఎవరు ఎవరిని గుర్తిస్తారో, గౌరవిస్తారో. ఎవరు ఎవరితో కలసి నడు స్తారో  ఈ సాయంత్రం వెలువడే ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు నిర్ణయిస్తాయి. ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయనే ఒకే ఒక అంశంపైన వారికి ఢిల్లీలో లభించే మన్నన ఆధారపడి ఉంటుంది. ఈ లోగా ఎవరి విన్యాసాలు వారు ప్రదర్శించవచ్చు.


కె. రామచంద్రమూర్తి
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top