ఇందిర ఆత్మ, జాతి వాణి హక్సర్‌

Jai Ram Ramesh New Book On Indira Gandhi - Sakshi

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ రచించిన ‘ఇంటర్‌ట్వైన్డ్‌ లివ్స్‌: పీఎన్‌ హక్సర్‌ అండ్‌ ఇందిరాగాంధీ, ఎ బయాగ్రఫీ ఆఫ్‌ హక్సర్‌‘ పుస్తకాన్ని జూన్‌ 19న ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సాక్షి ప్రతినిధి కృష్ణమోహన్‌రావుకి ఇంటర్వ్యూ ఇచ్చారు. భారతీయ దౌత్యం, విదేశీ విధానాలపై విస్తృతానుభవం కలిగిన పీఎన్‌ హక్సర్‌ని 1950లో తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఎంపిక చేసుకున్నారని, పదిహేనేళ్లపాటు నెహ్రూ ఆధ్వర్యంలో పనిచేసిన హక్సర్‌ని 1967లో ఇందిరాగాంధీ మళ్లీ ఎంపిక చేసుకున్నారని జైరాం చెబుతున్నారు. హక్సర్‌.. భారతీయ రాజకీయ చరిత్రలోని సంక్లిష్ట దశలో, అత్యంత సంక్షుభిత సంవత్సరాల్లో చాణక్యుడి పాత్రను పోషించారు. ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శిగా.. జాతి వాస్తవ చైతన్య ప్రదాతగా, ఇందిరాగాంధీకి విశ్వసనీయ వ్యక్తిగా చరి త్రకెక్కారు. సంజయ్‌ గాంధీ కలల ప్రాజెక్టు అయిన మారుతి కారు తయారీపై విభేదించిన హక్సర్, ఇంది రకు దూరం జరిగారు. జైరాం రమేష్‌ ఇంటర్వ్యూ సంక్షిప్తపాఠం సాక్షి పాఠకులకు అందిస్తున్నాం.

హక్సర్‌పై పుస్తకం రాయడానికి కారణం? 
ఇందిరాగాంధీ హయాంలో 1967–73 మధ్యకాలంలో పీఎన్‌ హక్సర్‌ అత్యంత ప్రభావశీలుడైన, శక్తిమంతుడైన ప్రభుత్వ ఉన్నతాధికారిగా వ్యవహరించారు. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు, బంగ్లాదేశ్‌ ఆవిర్భావం, పాకిస్తాన్‌పై విజయం, 1971 లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు, 1972లో సిమ్లా ఒప్పందం, పాకిస్తాన్, న్యూ ఢిల్లీ మధ్య 1973 నాటి ఒప్పందం వంటి ఇందిర సాటిలేని విజయాలన్నింటికీ సూత్రధారి హక్సర్‌. 

ఈ అన్నింటిలో హక్సర్‌దే ప్రధాన పాత్రా?
ఇందిరాగాంధీ రాజకీయనేత. కానీ ఈ పరిణామాలన్నింటిలో కీలకపాత్ర వహించింది మాత్రం పీఎన్‌ హక్సర్‌. ఇద్దరి భాగస్వామ్యమే ఈ విజయాలకు మూలం. సుదీర్ఘకాలంగా నెహ్రూ, ఇందిర కుటుం బంతో హక్సర్‌ సన్నిహిత సంబంధాలు నెరిపారు. జీవితాంతం మార్క్సిస్టుగానే ఉండిన హక్సర్‌ 1970లలో భారత ఆర్థిక వ్యవస్థ వామపక్షవిధానాల వైపు మొగ్గు చూపడానికి తానే బాధ్యుడు. 1969లో బెంగళూరులో జరిగిన జాతీయ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నిలువునా చీలిపోవడం, తదుపరి పరి ణామాలన్నింట్లో హక్సర్‌ ఇందిర వెన్నంటే ఉన్నారు. ఇందిరకు భావజాలపరంగా, నైతికంగా మూలస్తంభంగా హక్సర్‌ వ్యవహరించారు.

ఇందిర కుమారుడు సంజయ్‌ గాంధీతో విభేదాల కారణంగా 1973 జనవరి 15న హక్సర్‌ ఇందిరకు దూరం జరిగారు. ఇందిరకు హక్సర్‌ పంపిన చివరి సూచన పీవీ నరసింహారావుకు సంబంధించింది కావడం విశేషం. మొదట జై తెలంగాణ ఉద్యమాన్ని, తర్వాత జై ఆంధ్రా ఉద్యమాన్ని బలపర్చిన పీవీ తన్ను తాను పూర్తి అసమర్థుడిగా నిరూపించుకున్నారని, ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై దృఢవైఖరి అవలంబించాలని ఇందిరకు హక్సర్‌ సలహా ఇచ్చారు. హక్సర్‌ అంత శక్తివంతుడైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధునిక భారత చరిత్రలో కానరారు. 

ఇందిర నియంతృత్వానికి హక్సరే కారణమా?
లేదు.. లేదు. 1973 జనవరిలో ఇందిరకు హక్సర్‌ దూరం జరిగారు. కానీ ఆమె ఆయన్ని మళ్లీ ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా నియమించారు. ఈ స్థానంలో హక్సర్‌ 1975 మార్చి వరకు ఇందిరతో పనిచేశారు. 1975లో ఇందిర విధించిన ఆంతరంగిక అత్యయిక పరిస్థితిని హక్సర్‌ వ్యతిరేకించారు. ఎమర్జెన్సీ కాలంలో ఆయన సంజయ్‌ గాంధీ బాధితుడైనప్పటికీ, ఇందిరకు విధేయుడిగానే ఉండేవారు. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ బహిరంగంగా దాని గురించి వ్యాఖ్యానించలేదు. జరుగుతున్న పరిణామాల గురించి హక్సర్‌ ఇందిరను వ్యక్తిగతంగా కలిసి చెప్పేవారు. 

బ్యూరోక్రాట్‌గా హక్సర్‌ ఔన్నత్యం ఏమిటి?
పాలనా వ్యవహారాల్లో హక్సర్‌ అత్యంత నిజాయితీపరుడు. అందుకే 1987లో రాజీవ్‌ గాంధీ చైనాతో సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకురావడం కోసం హక్సర్‌ను చైనాకు పంపారు. ఆ తర్వాతే రాజీవ్‌ 1988లో చైనా పర్యటించారు. 

పాలనపై హక్సర్‌ ప్రభావం స్థాయి ఏమిటి?
పాలనలో సరైన వ్యక్తులను ఎంచుకోవడమే హక్సర్‌ గొప్పదనం. ఆయన ఎంపిక చేసినవారే ఆధునిక భారత వ్యవస్థ నిర్మాతలయ్యారు. ఆయన తీసుకొచ్చిన ఎంఎస్‌ స్వామినాథన్‌ అత్యున్నత వ్యవసాయ శాస్త్రజ్ఞుడై హరిత విప్లవానికి ఆద్యుడయ్యారు. ఇక ఆయన ఎంపిక చేసిన డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ 1970లో ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అయ్యారు.  ఇస్రో చైర్మన్‌గా హక్సర్‌ ఎంపిక చేసిన సతీష్‌ ధావన్‌ భారత అంతరిక్ష కార్యక్రమాలకు పితామహుడయ్యారు. ఇక హోమీ సేత్నా పొఖ్రాన్‌ అణుపరీక్షల్లో కీలక పాత్ర పోషించారు. హక్సర్‌ సలహమేరకే సోనియా గాంధీ పీవీ నరసింహారావును కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నియమించారు. అలా పీవీ ప్రధాని కావడానికి కూడా హక్సరే ఆద్యుడు. 1973లో పీవీ అసమర్థుడని పేర్కొన్న హక్సర్‌ 1991లో కాంగ్రెస్‌లో లుకలుకలు లేకుండా వీవీ చేయగలడని నిర్ధారించుకోవడం విశేషం.

సంజయ్‌గాంధీతో విభేదాలకు కారణం?
భారత్‌కు ప్రజా రవాణా ముఖ్యం కానీ కార్లు కావని హక్సర్‌ అభిప్రాయం. రెండోది ప్రధానమంత్రి నివాసంలో ఉంటూ ఆమె కుమారుడు కారు తయారీలో పాలుపంచుకోవడంతో హక్సర్‌ విభేదించారు. అయితే మారుతి కార్‌ ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చనుందని గుర్తించగానే హక్సర్‌ ప్రధాని కార్యాలయం నుంచి బయటకు వచ్చేశారు. 
జైరాం రమేష్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top