వామపక్షాల దారి ఎటు?

Guest Columns On Communist Parties Political Future In AP - Sakshi

సందర్భం  

తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి, అశ్రిత పక్షపాతం, అహంకార ధోరణులపై నేడు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పడే ఓట్లు చీలిపోవాలని బాబు కోరుకుంటున్నారు. బీజేపీ వ్యతిరేక, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయం మాటలతో గందరగోళ పరిస్థితుల్లో కమ్యూనిస్ట్‌ పార్టీలు చిక్కుకుని చివరికి తమతో చేతులు కలుపుతారేమోనన్న ఆశ బాబులో ఉందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. గతంలో అవసరం తీరాక మిత్రపక్షాలతో టీడీపీ వ్యవహరించిన తీరును గుర్తుచేసుకుని వామపక్షాలు సహా అన్ని ప్రతిపక్షాలు ఏపీలో చంద్రబాబును మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడానికి చేతులు కలపాల్సిన సమయం ఆసన్నమైంది.

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభు త్వాన్ని ఓడించడమే ప్రధాన కర్తవ్యంగా వామపక్షాలు భావిస్తున్నాయి. ఆ కర్తవ్య నిర్వహణకు కాంగ్రెస్‌ భాగస్వామిగా ఉన్న ఏ కూట మిలోనూ ఎన్నికల ముందు చేరడానికి తాము సిద్ధంగా లేమని సీపీఎం స్పష్టం చేసింది. ఎన్నికల తర్వాతే వివిధ రాష్ట్రాల్లో అక్కడి ప్రత్యేక పరిస్థితులను బట్టి ఏర్పడే వివిధ పార్టీలకు వచ్చే సీట్లను బట్టి ప్రభుత్వాన్ని ఎవరితో కలసి ఏర్పాటు చేయాలో నిర్ణ యిస్తామని ఈ పార్టీ తెలిపింది. కాంగ్రెస్‌ను, బీజేపీని ఒకే గాటిన కట్టేందుకు సీపీఐ సిద్ధంగా లేదు. తమ వ్యూహానికి అనుగుణంగా ఎన్నికల పొత్తులు నిర్ణ యించుకునే స్వేచ్ఛను పార్టీ శాఖలకు సీపీఎం ఇచ్చింది. జలంధర్‌లో 1978లో జరిగిన పదో జాతీయ మహాసభల సందర్భంగా సీపీఎం వ్యవ స్థాపక ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య కూడా ఇలాంటి సూచన చేశారు. ఆయన ప్రతిపాదన అప్పట్లో వీగిపోయింది. నాటి సుందరయ్య సూచన ఆచరణాత్మక రూపం దాల్చేందుకు నేటి సీపీఎం వైఖరి కొంతవరకు దోహదం పడుతోందని ఆశిం చవచ్చు. ఈ నేపథ్యంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు ఏం చేయాన్న ప్రశ్న తలెత్తుతుంది. 

తెలంగాణలో సీపీఎం ఓ చరిత్రాత్మక ప్రయో గానికి రెండు సంవత్సరాల ముందే స్వీకారం చుట్టింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఉధృతంగా సాగుతున్నప్పుడు పార్టీ కేంద్ర నాయకత్వం సూచిం చిన సమైక్య విధానంతో  తెలంగాణ ప్రజల మనోభా వాలకు భిన్నంగా వ్యవహరించింది. అంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలోనే కొంత బలం కలిగిన పార్టీగా ఉన్న∙సీపీఎం ప్రజలకు దూరమైంది. తిరిగి తెలంగాణ ప్రజలతో మమేక మయ్యే అవకాశం కోసం ఎంతగానో ప్రయత్నిం చింది. ఇందులో భాగంగా ‘బహుజన వామపక్ష సంఘటన’ ఆవిర్భావంలో ప్రధాన పాత్ర వహిం చింది. హైదరాబాద్‌లో ‘లాల్‌–నీల్‌’ ఐక్యత నినాదం మొదటిసారి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హైదరాబాద్‌లో ప్రకటించారు. నిజానికి ఎన్నికల్లో కూడా బహుజన, వామపక్ష సంఘటన పేరుతో పాల్గొనాలని నిర్ణయించింది. దళిత, ఆది వాసీ, నేత, గీత తదితర వృత్తుల వారికి తగినన్ని స్థానాలను సైతం కేటాయిస్తామని ప్రకటించింది. సీపీఎం కృషి అభినందనీయమే కాక అనుసరణీయం కూడా. దేశంలో మార్కిజాన్ని అనుసరించాలంటే శ్రామికవర్గ పోరాట మార్గమే సరిపోదు. పార్టీ నేతలు  పుట్టుకతో వచ్చిన వర్గ దృక్పథాన్ని వదిలించుకోవ డమే కాదు, ఆధిపత్య కుల అహంకారాన్ని విడి చిపెట్టడం కూడా అవసరం.

బాబు పాలనకు ముగింపే ప్రధాన కర్తవ్యం 
నేటి ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ పరిస్థితి తెలంగాణలో కంటే మరీ అధ్వానంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి ఆంధ్రలో బీజేపీని ఓడించడమన్నది అంత ముఖ్యమైన అంశం కాదు. సీఎం బాబు నాయ కత్వంలోని టీడీపీ పాలన నేడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల పురోగతి, శాంతి సౌభాగ్యాలకు ప్రధమ శత్రువు. కనుక వామపక్షాల కర్తవ్యం తెలుగుదేశం పార్టీని ఓడించడమే. పైగా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పాల నను వ్యతిరేకిస్తున్నట్టు  చంద్రబాబు చెబుతున్నారు. నరేంద్ర మోదీకి నాలుగేళ్లు సాగిలపడిన తెలుగుదేశం బూటకాన్ని తెలుగు ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. అలాగే పెద్ద నోట్లరద్దు, జీఎస్టీ అమలు వంటి మోదీ ప్రజా వ్యతిరేక చర్యలను వేనోళ్ల పొగిడింది చంద్ర బాబు అన్న సంగతి కూడా ప్రజలకు గుర్తుంది. ఇప్పుడు మోదీపై లాలూచీ కుస్తీకి చంద్రబాబు తెర తీశారు. ఈ పరిస్థితుల్లో బాబు టీడీపీ పాలనకు చర మగీతం పాడటం రాష్ట్ర ప్రజల ముందున్న ప్రధాన తక్షణ కర్తవ్యం. ఇదే నేడు ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూ నిస్టులు గుర్తించాల్సిన వాస్తవం.
అందితే జుట్టు, అందకపోతే కాళ్లు– ఇదీ చంద్ర బాబు నైజం. తెలుగు ప్రజలకు ఆత్మ గౌరవ నినాదం అందించి, అంతవరకు ఓటమెరుగని కాంగ్రెస్‌ పార్టీని మట్టికరిపించిన ఎన్టీఆర్‌ చంద్రబాబుకు పిల్లనిచ్చి, రాజకీయ పునర్జన్మ కూడా ప్రసాదించారు. పదవీ వ్యామోహంతో బాబు ఎన్టీఆర్‌నే పదవీచ్యుతుడ్ని చేసిన విషయం మరచిపోలేము. ఆ విషయం నేటి తరం యువతకు కూడా నిరంతరం గుర్తు చేయాలి. 

గెలుపుపై ధీమా లేకనే బీజేపీతో బాబు పొత్తు!
2014 ఎన్నికల్లో  వైఎస్సార్‌సీపీపై తెలుగుదేశం ఒంట రిగా పోటీచేసి విజయం సాధించగలదనే  నమ్మకం లేకనే చంద్రబాబు అప్పటికే వీస్తున్న మోదీ హవాను వాడుకోవాలనుకున్నారు. వెంటనే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. అంతకు ముందు 1999, 2004లో కూడా ఏబీ వాజ్‌పాయ్‌ ప్రధానిగా ఉండగా బీజేపీతో చేతులు కలిపారు. 2004లో పరాజయంతో ఇక ఎన్న టికీ బీజేపీతో పొత్తుపెట్టుకునే ప్రశ్నే లేదని ప్రకటిం చారు. కాని ఒట్టు తీసి గట్టున పెట్టి 2014లో ప్రధాన మంత్రి పదవికి బీజేపీ అభ్యర్థి మోదీ అండతోనే ఎన్ని కల్లో పాల్గొన్నారు. అయినా ఆంధ్రలో బీజేపీ బలం సరిపోదని భావించి, సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ ఇంటికి వెళ్లి మరీ తనకు మద్దతు ఇవ్వమని అర్థిం చారు. అయితే అందుకు బదులు జనసేనకు రాజ్య సభ సీటు ఇస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు. ఈ విషయం ఇటీవలే పవన్‌ కల్యాణ్‌ స్వయంగా ప్రక టించారు. ఇలా మాట తప్పడం, తప్పుడు వాగ్దా నాలతో ‘పోయేదేముంది మాటే కదా.. వచ్చేది పదవి  కదా’ అనే ధోరణి చంద్రబాబుది. అప్పటికి  తెలుగు దేశం అధినేత నైజం తెలియని పవన్‌ ఎన్నికల్లో తెలు గుదేశం పార్టీకి సహకరించారు. నిజానికి నాడు తెలుగుదేశం పార్టీకి ఈ సహకారమే లేకపోతే ఆ ఎన్నికల్లో ఓడిపోయేది. ఇక చంద్రబాబు మోసానికి బలైన పార్టీల్లో వామపక్ష పార్టీలూ ఉన్నాయి. 1995లో ఎన్టీఆర్‌ను పదవీచ్యుడ్ని చేసిన చంద్రబాబు దొడ్డిదారిన ముఖ్యమంత్రి కావడానికి ఆయనకు  వామపక్షాలు అండగా ఉన్నాయి. ఆ తర్వాత కొంత కాలానికి ఇదే ముఖ్యమంత్రి కమ్యూనిస్టు పార్టీలకు కాలంచెల్లిందని హేళన చేశారు. అయినా 2009లో మళ్లీ ఆ కమ్యూనిస్టుల వద్దకే వెళ్లి మహా కూటమిలో చేరాలని చంద్రబాబు అభ్యర్థించారు. అందుకు రెండు కమ్యూనిస్ట్‌ పార్టీలూ అంగీకరించి మహాకూట మిలో చేరినా ఫలం దక్కలేదు. ఎంతో అనుభవ మున్న కమ్యూనిస్టులు ఎలా చంద్రబాబు బుట్టలో పడ్డారో తెలియదు. 2014లో చంద్రబాబు మళ్లీ బీజేపీతో చేతులు కలిపి అధికారం సంపాదించారు. ఇలాంటి చంద్రబాబుతో గతంలో పొత్తు పెట్టుకో వడం, ఎన్నికల్లో చేతులు కలపడం పొరపాటని కమ్యూనిస్ట్‌ పార్టీలు ఇంతవరకు బహిరంగ ఆత్మ విమర్శ చేసుకోలేదు.
 

కాపులకు ద్రోహం చేసింది ఎవరు?
వామపక్షాలు పవన్‌ కళ్యాణ్‌తో చేతులు కలిపి, తృతీ యఫ్రంట్‌ ఏర్పాటు చేసే అవకాశం ఉందని సీపీఎం నేత బీబీ రాఘవులు చెప్పారు. చంద్రబాబు మాది రిగా ఓట్ల కోసం వైఎస్‌ఆర్‌సీపీ ప్రజలను వంచిం చడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాతో పాటు విభజన హామీల అమలుకు కేంద్రంలో ఏ పార్టీ కృషి చేస్తుందో ఆ పార్టీకి తమ మద్దతు ఇస్తామని ఈ పార్టీ గతంలోనే స్పష్టం చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే సుప్రీంకోర్టు తీర్పు కార ణంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాము అంతకు మించి ప్రస్తుత రిజర్వేషన్ల అమలు చేయడం సాధ్యం కాదు కనుక చంద్రబాబులా ఓట్ల కోసం రిజర్వేషన్లు వచ్చేలా చూస్తామని చెప్పలేనని వైఎస్‌ఆర్‌సీపీ నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టంచేశారు. అంటే కాపు లను గాలికొదిలేశారని కాదు. వారికి తమ పరిధిలో ఎంత ఎక్కువ మేలు చేయగలనో అంత ఎక్కువగా చేస్తానని, కాపు కార్పొరేషన్‌కు నిధులు రెట్టింపు చేసి, కాపుల సంక్షేమానికి కృషిచేస్తానని కూడా చెప్పారు. నాలుగేళ్ల పాటు తానిచ్చిన కాపు రిజర్వేషన్‌ హామీని తుంగలో తొక్కిన తెలుగుదేశం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. ఇలాంటి స్వభావం వైఎస్‌ఆర్‌సీపీది కాదు. అమలు చేయగలిగితేనే హామీ ఇవ్వాలి. వాగ్దానం చేశాక నిలబెట్టుకోవాలి. కాపు
లకు మేలు జరిగే పోరాటానికి తన అండదండలు ఎప్పుడూ ఉంటాయని వైఎస్‌ఆర్‌సీపీ హామీ ఇస్తూనే ఉంది. 

2014లో చంద్రబాబు అవకాశవాద రాజకీయా లను మరోసారి ఆచరణలో అమలు చేసి విజయం సాధించారు. బీజేపీతో పొత్తుపెట్టుకుని, జనసేన మద్దతు తీసుకుని  అధికారంలోకి వచ్చారు. ఈసారి ఈ తరహా రాజకీయ ఎత్తుగడలు చంద్రబాబుకు సాధ్యపడకపోవచ్చు. తెలుగుదేశం ప్రభుత్వం అవి నీతి, అశ్రిత పక్షపాతం, అహంకార, ఆధిపత్య ధోర ణులపై నేడు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. పైగా బాబుది మాటల గారడీయేగాని ఆయన కార్య శూరుడు కాదన్న భావన కూడా ఈ నాలుగేళ్లలో బలపడింది. అందుకే తెలుగుదేశం పార్టీకి వ్యతి రేకంగా పడే ఓట్లు చీలిపోవాలని చంద్రబాబు కోరు కుంటున్నారు. కిందటి ఎన్నికల్లో కమ్యూనిస్ట్‌ పార్టీ లకు ఆంధ్రప్రదేశ్‌లో సీట్లేమీ రాని మాట నిజమే. అయితే, ఇంకా వామపక్షాలకు ప్రజల్లో ఎంత లేదన్నా ఇంగువ కట్టిన గుడ్డ మాదిరిగా పేరు ప్రతిష్ట లున్నాయి.

బీజేపీ వ్యతిరేక, కాంగ్రెసేతర ప్రత్యా మ్నాయం మాటలతో గందరగోళ పరిస్థితుల్లో కమ్యూనిస్ట్‌ పార్టీలు చిక్కుకుని చివరికి తమతో చేతులు కలుపుతారేమోనన్న ఆశ చంద్రబాబులో ఉందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అది జరగని పక్షంలో ఎన్నో కూటములు, పార్టీలు ఎన్ని కల్లో పోటీ చేస్తే తన వ్యతిరేక ఓట్లు చీలిపోయి తెలు గుదేశం విజయం సాధిస్తుందని ఆయన భావిస్తు న్నారు. ఏదో దింపుడు కళ్లెం ఆశ చంద్రబాబులో ఉన్నట్టు కనిపిస్తోంది. గతంలో అవసరం తీరాక మిత్ర పక్షాలతో తెలుగుదేశం వ్యవహరించిన తీరును గుర్తుచేసుకుని వామపక్షాలు సహా అన్ని ప్రతిపక్షాలు ఏపీలో చంద్రబాబును మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడానికి చేతులు కలపాల్సిన సమయం ఆస న్నమైంది.

వ్యాసకర్త: డాక్టర్‌ ఏపీ విఠల్‌, మార్క్సిస్టు విశ్లేషకులు
మొబైల్‌ : 98480 69720

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top