ఉగ్రరూపం దాలుస్తున్న వాయు కాలుష్యం

Guest Column By Narasimha Reddy Over Air Pollution - Sakshi

మన చుట్టూ కాలుష్యం పెరిగిపోతున్నది. ఒకప్పుడు, కేవలం పారిశ్రామిక ప్రాంతాలకే పరిమితం అయిన కాలుష్యం, అంతటా పాకిపోయింది. కాలుష్యం కేవలం ఒక వనరుకే పరిమితం కాకుండా, పంచ భూతాలు అన్ని కూడా కలుషితం అయినాయి. కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాల కంటే, మానవాళి ఒక సాంకేతిక విరుగుడుతో తమ జీవన విధానంలో మార్పులు లేకుండా పయనం సాగిస్తున్నది. ధ్వని, నీరు, భూమి, ఆకాశంతో పాటు వాయు కాలుష్యం పెరుగుతున్నది. భూమి ఉష్ణోగ్రత పెరగడానికి గల కారణాలలో వాయు కాలుష్యం పాత్ర గణనీయమైనది. అయినా, దాని పట్ల శ్రద్ధ లేకపోవడం స్పష్టం. హైదరాబాద్‌ నగరంలో ప్రతి ఇంట్లో జలుబు, దగ్గు, పడిశం రావడానికి గాలిలో ఉన్న దుమ్ము, ధూళితో పాటు వాహనాల నుంచి నత్రజని, కర్బన వాయువులు కారణం కాగా, ఈ మధ్య కాలంలో కేన్సర్‌ కూడా సాధారణం కావడానికి ప్రాణవాయువుతో పాటు మనం పీలుస్తున్న ఇతర కేన్సర్‌ కారక వాయువులు కూడా ఒక బలమైన కారణం.

మునిసిపల్‌ చెత్తను ఎందరో అనేక రకాలుగా తగలబెడుతుంటారు. వీటిలో ఉండే ప్లాస్టిక్‌ను కాల్చేయడం వల్ల భయంకరమైన డైఆక్సిన్లు, ఫ్యురాన్లు ఉత్పన్నమై ప్రాణవాయువులో కలిసిపోయి ప్రాణాంతకంగా మారుతున్న పరిస్థితి ఉంది. పట్టణ పేదలు, మునిసిపల్‌ కార్మికులు, అవగాహన లేని పౌరులు, అధికారులు తదితరులు చెత్తను తగలపెట్టడంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. చివరకు, ప్రభుత్వం, మునిసిపల్‌ అధికారులు సైతం రోజూ వచ్చే టన్నుల కొద్దీ చెత్తను నిర్వహించలేక, తగలపెట్టడమే పరిష్కారంగా భావించి జవహర్‌ నగర్‌లో చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో వచ్చే విద్యుత్‌ కంటే, ఖర్చు అయ్యే విద్యుత్‌ ఎక్కువగా ఉంటుంది. ఆ ప్లాంట్‌ నుంచి రక రకాల విష వాయువులు వెలువడి ప్రజారోగ్యం మీద దీర్ఘకాల ప్రభావం పడుతుంది. చెత్త తయారు కాకుండా విధానాలు, ప్రక్రియల మీద దృష్టి పెట్టకుండా, ‘సులువైన, ప్రమాదకరమైన పరిష్కారాలు చేపట్టడం శ్రేయస్కరం కాదు.

హైదరాబాదులో జరుగుతున్న ఈ తంతు తెలంగాణలో ఇతర పట్టణాలు, నగరాలు, పల్లెలకు కూడా పాకింది. ‘చెత్తను పోగు చేయడం, తగులపెట్టడం’ ఒక సమాజహిత ప్రక్రియగా చేపడుతున్న వైనం తెలంగాణ వ్యాప్తంగా కనపడుతుంది. దీని వలన, తెలంగాణ వ్యాప్తంగా విష వాయువుల ఉత్పత్తి పెరిగి, పెద్దలు, పిల్లలు కూడా తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఇంటి నుంచే బయటకు వచ్చే చెత్త పరిమాణం తగ్గించాలి. ఎక్కువగా వచ్చే తడి చెత్తను ఎరువుగా స్థానికంగానే మార్చుకోవాలి. మిగతా వాటిని, ఒక దగ్గరికి చేర్చి పునఃవినియోగంలోకి తీసుకురావాలి. చెత్తను ఎట్టి పరిస్థితులలోను కాల్చరాదు.
గాలి కాలుష్యం పెరగటంలో రవాణా రంగం పాత్ర చాల ఎక్కువగా ఉంది. జాతీయ రహదార్లు, చిన్న పట్టణాలు, పెద్ద ఊర్లు, ఇతర రోడ్ల పైన కూడా వాహనాల సంఖ్య పెరగడంతో గాలి కాలుష్యం పెరుగుతున్నది. తెలంగాణా వ్యాప్తంగా వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరిగింది. హైదరాబాద్‌ నగరంలో 2005 నుంచి 2016 మధ్య వ్యక్తిగత వాహనాల సంఖ్య భారీగా పెరిగింది.

జనాభా కంటే వాహనాల పెరుగుదలే ఎక్కువగా ఉందని తేలడం గమనార్హం. అధికారిక గణాంకాల ప్రకారం హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 2014 మార్చి నాటికి 21.75 లక్షల వాహనాలుండగా.. ఆ సంఖ్య 2018 మార్చి నాటికి 29.09 లక్షలకు చేరుకుంది. ఇక గ్రేటర్‌వ్యాప్తంగా తీసుకుంటే అధికారిక గణాంకాల ప్రకారమే 50 లక్షల మార్కును దాటింది. ఇతర జిల్లాలకు చెందిన వాహనాలతో కలుపుకొంటే ఆ సంఖ్య 60 లక్షల నుంచి 70 లక్షల వరకు ఉంటుందని అంచనా. దీనితో, కొన్ని ప్రాంతాల్లో రద్దీ విపరీతం. గాలి కాలుష్యం పెరుగుతున్నది. రవాణా రంగం వలన వచ్చే వాయుకాలుష్యం తగ్గాలంటే వాహనాల ఇంధనంలో మార్పులు తీసుకు రావాలి. డిజిల్, పెట్రోల్‌ ఇంధనం కంటే విద్యుత్‌ వాహనాలు, ఇంకా ఇతర ఇంధనాల వినియోగం పెరగాలి.

పారిశ్రామిక రంగం వల్ల కూడా గాలి కాలుష్యం పెరుగుతున్నది. ప్రమాదకరమైన సాల్వెంట్లు కూడా ఇష్టారీతిన వదిలివేయడం వల్ల, హైదరాబాద్‌ నగరం చుట్టుప్రక్కల పారిశ్రామిక ప్రాంతాలు, సమీప నివాస ప్రాంతాలలో ప్రాణవాయువు తగ్గిపోతున్నది. ఇంటిలో కూడా రకరకాల పదార్థాలు, వస్తువుల వినియోగంతో గృహాలలో కూడా గాలి కాలుష్యం పెరుగుతున్నది. వ్యవసాయంలో వాడే నత్రజని ఎరువులు, విష రసాయనాలు, పెరుగుతున్న డీజిల్, విద్యుత్, ప్లాస్టిక్‌ వినియోగం వల్ల కూడా పల్లెలలో గాలి కాలుష్యం పెరిగింది. హైదరాబాద్‌ నగరంలో వర్షపు నీరు దుమ్ము, ధూళి, సీసం తదితర కలుషితాలవల్ల భూగర్భ జలాలలో సీసం ఉన్నట్లు పరిశోధనలలో తేలింది. అనేక రకాలుగా కాలుష్యం పెరిగిపోయి, అనేక రకాలుగా విష వాయువులు అదనంగా చేరి, గాలిలో ప్రాణ వాయువు యొక్క పరి మాణం తగ్గిపోతున్నది.

కాలుష్యాన్ని ఇముడ్చుకునే శక్తి ప్రకృతిలో తగ్గిపోతున్నది. అటువంటి శక్తి తగ్గిన కొద్దీ, మున్ముందు ఒక అగ్గిపుల్ల కాల్చినా కూడా కాలుష్య భారం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. అందువల్ల, పరిష్కారంగా మనం బొగ్గు, డీజిల్, పెట్రోల్‌ మరియు ఇతర ఇంధనాలను ‘కాల్చే’ ప్రక్రియల మీద దృష్టి పెట్టి, వాటిని ఏ ఏటికాయేడు తగ్గించుకునే లక్ష్యాలు ఏర్పరుచుకోవాలి. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను తక్షణమే మూసివేయాలి. వాహనాల వాడకం తగ్గించాలి. కొత్త వాహనాలు రోడ్ల మీదకు రాకుండా ‘సామూహిక’ రవాణా వ్యవస్థలకు శ్రీకారం చుట్టాలి. ప్రజలు కూడా తమ జీవన శైలిలో మార్పులు తీసుకురావాలి. పర్యావరణహిత ప్రభుత్వ విధానాల కొరకు పోరాడాలి.

డి. నరసింహా రెడ్డి
వ్యాసకర్త విధాన విశ్లేషకులు
ఈ-మెయిల్‌: nreddy.donthi16@gmail. com

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top