ఈ ప్రజా తీర్పు మత దురభిమాన సంకేతమేనా?

Guest Column By Mohammed Farooky Over National Politics - Sakshi

సందర్భం
ప్రజాస్వామ్యం అంటే ఒక పెద్ద ఎన్నిక మాత్రమే అని సూత్రీకరించడం కష్టం. అది ప్రతి రోజూ లక్షలాది, కోట్లాది ప్రజాస్వామిక ప్రక్రియలకు, ప్రతీ నిత్యం జరిగే సూక్ష్మ ఘర్షణలకు సంబంధించినది. ప్రజాస్వామ్యంలో ఈ సూక్ష్మాతిసూక్ష్మ ఘర్షణలు నిత్యం జరుగుతూంటాయి. జరుగుతూనే ఉండాలి కూడా. ఈ కోణంలో చూస్తే, మనలో చాలామందికి 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు దేశాన్ని, ప్రజలను అంధకారంలోకి నెట్టివేయనున్నట్లుగా కనిపిస్తుండవచ్చు. 2014 వేసవిలో కూడా చాలామంది ఇదేరకమైన అభిప్రాయాన్ని కలిగి ఉండేవారు. కానీ 2019 వేసవి ఒక అధికారాన్ని సుస్థిరపరిచిందని, దాన్ని తిరగతోడటం ఇక సాధ్యం కాదని పెరుగుతున్న భయాందోళనలను తోసిపుచ్చలేం. నరేంద్రమోదీ హయాంలో తొలి ఐదేళ్లు చాలామందికి విధ్వంసకర ఫలితాలను అందించాయి కాబట్టి నేటి ఫలితాలు వీరిని మరింత నిరాశలోని నెట్టవచ్చు. కానీ ఇలాంటివారే మోదీని తిరిగి ఎన్నుకున్నారు. 

ఈ ఫలితాలను మనం అంగీకరించితీరాలి. అన్ని నివేదికలూ మోదీ అసాధారణ జనాదరణను నిలబెట్టుకున్నారని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లు చాలామంది గత అయిదేళ్ల పాలనలో తమకేమీ ఒరగలేదని, ఉద్యోగాలు రాలేదని, పెద్దనోట్ల రద్దు తమను విపరీతంగా దెబ్బతీసిందని భావిస్తున్నప్పటికీ మోదీకి మరొక్క అవకాశం ఇవ్వాలని భావించారు. దాని పర్యవసానమే ఈ అసాధారణ ఫలితం. దేశాన్ని కాపాడగలరని, దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో గర్వించేలా చేశారని  దేశానికి భవిష్యత్తులోనూ మంచి చేస్తారని భావించి నందునే జనం ఆయనకు ఓటేశారు.

ఒకటి మాత్రం నిజం. ఈ ప్రజాతీర్పును విద్వేష రాజకీయాల, మత దురభిమానాల ప్రతిఫలనంగా తక్కువచేసి మాట్లాడలేం. ఈ ఎన్నికల్లో హిందూ ముస్లిం సమస్యపై కనీవినీ ఎరుగని స్థాయిలో సమాజాన్ని విభజించివేసిన వాస్తవాన్ని మనం తోసిపుచ్చలేం. కానీ ప్రజా మద్దతు స్థాయిని దీని ఆధారంగా వివరించలేం. మోదీని ఆయన ప్రభుత్వాన్ని బలపర్చిన కోట్లాది మంది వ్యక్తుల ఉద్దేశాలకు వక్రభాష్యాలు పలికే హక్కు మనకు లేదు. ఈ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ నిజమైన నేతగా ఆవిర్భవించారని కొంతమంది భావిస్తూ ఉండవచ్చు. కానీ ఓటర్లు, ప్రత్యేకించి హిందీ ప్రాబల్య ప్రాంత ఓటర్లు రాహుల్‌ని పూర్తిగా తిరస్కరించారు. అంటే దీనర్థం రాహుల్‌ పోరాడలేదని కాదు. ప్రతిపక్షం మొత్తంలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్రమైన దాడి చేసిన మొట్టమొదటి నేత రాహుల్‌. చివరివరకూ దాన్ని కొనసాగిం  చారు. కానీ మోదీ పట్ల ప్రజాదరణ మొగ్గు చూపిన తీరుతో రాహుల్‌ చెప్పిందీ, చేసింది పూర్తిగా అపరిపక్వతతో కొనసాగినట్లు కనిపించింది.

గత ఎన్నికల్లో 44 ఎంపీ స్థానాలు సాధించిన కాంగ్రెస్‌ ఈ దఫా ఎన్నికల్లో కాస్తంత భిన్నంగా కనిపించలేకపోయింది. తమ శక్తికి, ప్రభావానికి మించిన ప్రచారంలో ఆ పార్టీ మునిగితేలింది. కానీ మోదీ విషయానికి వస్తే ప్రారంభం నుంచి ఆయన కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. తన ముందున్న మార్గంలో సిద్ధాంతపరంగా, సంస్థాగతంగా తనకు ఎదురుగా నిలబడింది కాంగ్రెస్‌ పార్టీయేనని, తన విధానాలపై నిర్భీతిగా, రాజీలేని విధంగా పోరాడుతున్నట్లు కనిపించిన ఒకే ఒక వ్యక్తి రాహుల్‌ గాంధీ అని మోదీ స్పష్టంగా గుర్తించారు. అందుకే ఇప్పటికీ బీజేపీ రాహుల్‌ను  నిర్మాణాత్మకమైన ఆగ్రహంతో వెన్నాడుతోంది. 

ఎన్నడూ లేనివిధంగా ఈ దఫా ఎన్నికల్లో భావజాలం రీత్యా కాకుండా వ్యక్తిత్వం ఆధారంగా పోరాడుతూ వచ్చారు. తానెంతగానో అభిమానించే అమితాబ్‌ బచ్చన్‌ శైలిలో మోదీ తన్ను తాను తీర్చి దిద్దుకున్నారు. భారతీయ సినిమా చరిత్రలో ఒక దశాబ్దం పాటు అమితాబ్‌ 1 నుంచి 10 వరకు అన్నీ తానై పేరు గాంచారు. ప్రస్తుత వాతావరణంలో మోదీ కూడా భారత రాజకీయాల్లో 1 నుంచి 10 వరకు  అన్నీ తానై నిలుస్తున్నారు. చాలామంది 2014 నాటి ఆధిపత్యాన్ని మోదీ ఈసారి చలాయించలేరని భావించారు. కానీ ఆధిపత్యంతో పనిలేకుండానే భారత రాజకీయాలను శాసించే స్థాయిని మోదీ ప్రస్తుతం చేరుకున్నారు. చాలా అంశాల్లో రాహుల్‌ మోదీకి సరి సమానంగా నిలబడాలని చూశారు కానీ మోదీకి సమీప దూరంలోనే నిలబడిపోయారు. 

ఈ దఫాకూడా మోదీకే ప్రజలు ఓట్లు వేశారు. కానీ విద్వేష రాజకీయాలకు, మత ఛాందస వాదానికి అనుకూలంగా వారు ఓటేశారని చెప్పడం అసందర్భం అనే చెప్పాలి. మీడియాలోనూ, సోషల్‌ మీడియాలోనూ మత దురభిమాన ప్రచారాన్ని నేను తక్కువ చేసి చెప్పడం లేదు. కానీ, సోషల్‌ మీడియాలోని విద్వేష శక్తులకంటే ఓటర్లు పరిణతి ప్రదర్శిం చారు. అలాగని ప్రజలు విజ్ఞతతో ఓటు వేయలేదని చెప్పడానికీ లేదు. ప్రజలు ఏం కోరుకున్నారు అని నిర్ణయించడానికి మనం ఎవరం? అలాగే ప్రజలు తప్పు అని మనం ఏ కోణంలోంచి నిర్ధారించగలం?

జాతి మానసిక స్థితి ఎలా ఉందో గ్రహించడానికి సర్వేలకేసి పరిశీలించండి. దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఉగ్రవాదం ప్రధానమైందని భారతీ యులు భావిస్తున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చర్యల తీసుకోగల నాయకుడిని వారు కోరుకుంటున్నప్పుడు  ప్రజల నిర్ణయం తప్పు ఎలా అవుతుంది? 1980లు, 90లలో పుట్టి పెరిగినవారికి పాకిస్తాన్‌ ఉగ్రవాద అనుకూల చర్యలతో భారత్‌ ఎంత గాయపడిందో స్పష్టంగా తెలుసు. అలాంటప్పుడు పాకిస్తాన్‌కు గట్టి సమాధానం ఇవ్వగల నేత కనబడినప్పుడు ప్రజలు అలాంటి నేతకు మద్దతు ఇవ్వడం తప్పెలా అవుతుంది? ఇకపోతే ముస్లింల విషయం ఏమిటి? మోదీకి ముస్లింల పట్ల ప్రేమ లేదంటే ఆశ్చ ర్యపడాల్సింది లేదు. నిజానికి హిందూ వైభవం పునాదిని కలిగిన బీజేపీకే ఆ భావం లేదు. అలాగే తొలినుంచి ముస్లింలకు కూడా ఆరెస్సెస్‌ అన్నా, బీజేపీ అన్నా ప్రేమ లేదు. అయితే రాడికల్‌ రాజకీయాల స్వభావాన్ని చరిత్ర నేపథ్యంలో చూసినట్లయితే ఒకనాటి కరడుగట్టిన ఛాందసవాదులు తదనంతరం కాస్త ఉదారవాదంవైపు మళ్లడం తెలిసిందే. మనదేశంలోనూ ముస్లింల పట్ల అలాంటి మార్పు వస్తుందని ఎదురుచూడాల్సిందే మరి.

ముస్లి ఓటు అనేది ఇప్పుడు అసందర్భ విషయంగా మారింది. గత అయిదేళ్లుగా ముస్లింలు ఈ దేశంలో చాలా భయభీతులతో జీవిస్తున్నారన్నది నిజం. అయితే దేశవిభజనానంతర హింసాత్మక పరిస్థితుల్లోనూ వారు జీవించగలిగారు. గత  కొన్ని దశాబ్దాలుగా మహానగరాలు, పట్టణాల్లో తమపై జరిగిన దాడుల నేపధ్యంలోనూ వారు జీవించగలిగారు. గత అయిదేళ్ల బీభత్స పరిస్థితుల్లోనూ  వారు జీవించగలిగారు. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? కానీ, అంబేడ్కర్‌ ఆనాడు చెప్పినట్లుగా ప్రజల జీవితాల్లో సూక్ష్మాతిసూక్ష్మమైన ఘర్షణలు, పోరాటాలు జరుగుతూనే ఉంటాయి.
ఈ దేశంలోని 20 కోట్లమంది ముస్లింలతో ఎలా వ్యవహరించాలి అనే అంశంపై ఆరెస్సెస్‌ పునరాలోచించాల్సిన అవసరముంది.

ఇన్ని కోట్లమందిని నిషేధించలేం. వీరిని క్యాంపుల్లో పెట్టి నిర్బంధించలేం. హతమార్చలేం. లేక వారు ఈ దేశంనుంచి మాయమైపోరు కూడా. భారతదేశంలోని అయిదింట ఒకవంతు జనాభాను రెండో తరగతి పౌరులుగా ముద్రిస్తూ వారిలో తీరని అసంతృప్తి, అశాంతిలను పెంచి పోషిస్తున్నంత కాలం ఈ దేశం వైభవంతో, సౌభాగ్యంతో ఉంటుందనుకోవడం సందేహమే. ముస్లింలను చిన్న చూపు చూసే రాజకీయాల్లో దేశభక్తి ఉండదు పైగా అవి జాతీయవాద వ్యతిరేకమైనవి కూడా. భారత్‌  అభివృద్ధి చెందాలని నిజంగా కోరుకుంటున్న భారత భక్తాదులు ఈ విషయాన్ని పదే పదే మననం చేసుకోవాల్సి ఉంది. 


మహ్మద్‌ ఫారూఖీ
వ్యాసకర్త పాత్రికేయుడు, ‘ది వైర్‌’ సౌజన్యంతో..

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top