ఏమిటి ఈయన ప్రత్యేకత?

Gollapudi Maruthi Rao Write On Balantrapu Rajanikanta Rao - Sakshi

జీవన కాలమ్‌
రేడియో సంగీతానికి ఒక నిలకడని, నిబ్బరాన్ని, సంగీత ప్రాధాన్యాన్నీ, అంతకుమించి ప్రత్యేకమైన ‘ఆకాశవాణి బాణీ’ని ఏర్పరచిన బ్రహ్మ రజనీ కాంతరావు. రేడియో సంగీతానికి ఆయన ఒక శయ్యను రూపుదిద్దారు. 

నేను ఆలిండియా రేడి యోలో చేరే నాటికి నాకు 23 సంవత్సరాలు. రజనీగారికి 43. నా ముందు మహాను భావులైన ఆఫీసర్లు– బాలాంత్రపు రజనీకాంతరావు, యండమూరి సత్యనారాయ ణరావు, దాశరథి, బుచ్చి బాబు– ఇలా. ఇక పండిత ప్రకాండుల బృందం ఆ తరానికే మకుటాయమానం. దేవులపల్లి కృష్ణశాస్త్రి, స్థానం నరసింహారావు, ముని మాణిక్యం నరసింహారావు, నాయని సుబ్బారావు, బందా కనకలింగేశ్వరరావు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, డాక్టర్‌ జీవీ కృష్ణారావు – ఈ జాబితా అపూర్వం. వీరందరూ తేలికగా మాకంటే 30–35 సంవత్సరాలు పెద్దవారు. ఓ తరాన్ని జాగృతం చేసిన అద్భుతమైన ప్రక్రియలకు ఆద్యులు.

భారతదేశంలోని అన్ని ప్రక్రియలకు తగిన ప్రాధా న్యం కల్పించాలనే దురాశతో– ఆయా రంగాలలో లబ్ద ప్రతిష్టులైన వృద్ధులందరినీ రేడియోలోకి ఆహ్వానిం చారు పెద్దలు. వీరెవరికీ మాధ్యమంమీద ఒడుపుగానీ, అవగాహనగానీ, తర్ఫీదుగానీ లేనివారు. రిటైరై పెన్షన్‌ పుచ్చుకుంటున్న బాపతు మహానుబావులు. ఆ మాట కొస్తే మాకే ఇంకా తర్ఫీదు లేదు. ఉద్యోగంలో చేరిన ఒక్కొక్క బ్యాచ్‌ని ఢిల్లీ పంపుతున్నారు. ఇదొక రకమైన అవ్యవస్థ. అయితే ‘అసమర్థత’ తెలుస్తోంది. మార్గం తెలియడం లేదు.

ఈ దశలో మాకంటే కేవలం 12 సంవత్సరాల ముందు –ఒక కార్యశూరుడు– మాధ్యమం అదృష్టవ శాత్తూ దక్షిణాది ప్రసార మాధ్యమంలో అడుగు పెట్టారు. ఆయన పేరు బాలాంత్రపు రజనీకాంత రావు.
ఆ రోజుల్లో మద్రాసు రేడియో స్టేషన్‌ అంటే తెలు గువారి పుట్ట. 1941లో చేరిన రజనీకాంతరావుగారు 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి అటు పార్లమెంటులో నెహ్రూ ఈ దేశ స్వాతంత్య్రాన్ని గురించి ఉపన్యాసం ఇస్తూంటే ఇక్కడ– మద్రాసులో కేవలం 26 ఏళ్ల యువ కుడు 1947 ఆగస్టు 15 తెల్లవారుజామున ఎలుగెత్తి ‘మ్రోయింపు జయభేరి’ అని నగారా మ్రోయించారు. 

ఎందరికి దొరుకుతుంది ఈ అదృష్టం. ‘మాదీ స్వతం త్ర దేశం’ అని టంగుటూరి సూర్యకుమారి మైకుల ముందు ఉరిమింది. ఆ రోజు కమాండర్‌–ఇన్‌చీఫ్‌  రోడ్డులో ఉన్న రేడియో స్టేషన్‌లో లేనిదెవరు? కొత్తగా పెళ్లయిన బుచ్చిబాబు తన భార్యతో సహా స్డుడియోలో ఉన్నారు. అదొక ఆవేశం. మరో 40 ఏళ్ల తర్వాత టంగు టూరి సూర్యకుమారిని ఇంగ్లండు కెంట్‌లో ఒక పార్టీలో ఈ విషయం చెప్పి పులకించాను.

రేడియో స్టేషన్‌ అంటే– ఆ రోజుల్లో దాదాపు సగం సంగీతం. ఏం సంగీతం? మరిచిపోవద్దు. మద్రా సులో సంగీతం అంటే వర్ణం, కీర్తన, జావళి వగైరా. మామూలు పాటలంటే సినీమా తైతక్కలు. కానీ రేడియో సంగీతానికి ఒక నిలకడని, నిబ్బరాన్ని, సంగీత ప్రాధాన్యాన్నీ, అంతకుమించి ప్రత్యేకమైన ‘ఆకాశవాణి బాణీ’ని ఏర్పరచిన బ్రహ్మ రజనీకాంత రావు. దీన్ని ఇంకా చాలా రేడియో కేంద్రాలు ఇప్పటికీ పట్టుకోలేదంటే తమరు నన్ను క్షమించాలి– బాణీ.

‘ఊపరె ఊపరె ఉయ్యాల... చిన్నారి పొన్నారి ఉయ్యాల’ వంటి రజని పాటలు (ఎస్‌. వరలక్ష్మిగారు పాడారు) నాకు బహిఃప్రాణం. మరో 35 సంవత్సరాల తర్వాత– జీవితం నాకు అవకాశమిచ్చి వరలక్ష్మమ్మ గారూ (నాకంటే 12 ఏళ్లు పెద్ద) నేనూ భార్యాభర్తలుగా నటించినప్పుడు ఆమెకి ఈ పాటని ఆమె చెవిలో గుర్తు చేసి పాడించుకుని పులకించాను.
అలాగే పాకాల సావిత్రీదేవి, శాంతకుమారి, టంగుటూరి సూర్యకుమారి, ఏ.పీ. కోమల– ఇలా ఎందరో. వీరంతా నేను రేడియోలో చేరడానికి పెట్టు బడులు. ఆయనతో ‘బావొచ్చాడు’ ‘అతిథిశాల’ వంటి ఎన్నో సంగీత రూపకాలలో తలదూర్చిన అనుభవం ఉంది.

ఇక నా కథకు వస్తాను. రజనీకాంతరావుగారు అప్పుడే స్టేషన్‌ డైరెక్టర్‌గా వచ్చారు. నాకు పిడుగు లాంటి వార్త. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా ప్రమోషన్‌ ఇచ్చి నన్ను శంబల్పూరు (ఒరిస్సా) బదిలీ చేశారని. ముమ్మ రంగా సినీ రచన సాగుతున్న సమయం. రజనీగారి గదిలోకి నా రాజీనామా కాగితంతో వెళ్లాను. రజనీ గారు తీరి కగా నా రాజీనామా పత్రం చదివారు. చదివి అడ్డంగా చించేశారు. ‘తప్పనిసరిగా వెళ్లండి. ఉద్యోగం మానేయవద్దు. అవసరమైతే ముందు ముందు చూద్దు రుగానీ’ అన్నారు. బయటికి నడిచాను. ఆ తర్వాత మరో 12 సంవత్సరాలు పనిచేసి– మరో ప్రొమోషన్‌ 
కడపలో అసిస్టెంట్‌ స్టేషన్‌ డైరెక్టరునై, అనుకోకుండా నటుడినై రాజీనామా చేశాను. 

ఇప్పటికీ– ఆయన ఏ 40 ఏళ్ల కిందటో– ఇంకా వెనుకనో– రచించి, బాణీ కూర్చి, పాడించిన (బాల మురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం) ‘మన ప్రేమ’ పాట ఒక్కటీ కేవలం 70 సంవత్సరాలు రేడియో నడ కనీ, వయ్యారాన్ని రజనీ రచనా పాటవాన్నీ, రేడియో తనాన్నీ తెలియజేస్తూ జెండా ఊపుతున్నట్టుంటుంది. రజనీకాంతరావు గారు రేడియో సంగీతానికి ఒక శయ్యను రూపుదిద్దారు. రేడియోకి ఒక రజనీ చాలడు. ప్రతీ కేంద్రానికీ కావాలి. ఈ మాధ్యమానికి కావాలి. ఇప్పటికీ కావాలి.

- గొల్లపూడి మారుతీరావు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top