పేరు జబ్బు

జీవన కాలమ్
తెలుగునాట తరచుగా విని పించే మాట ఒకటుంది: ‘ఆ పనిని నేను సాధించలేక పోతే నా పేరు మార్చు కుంటాను’ అని. ఇది నిజంగా పేరున్నవాడికి చెల్లే మాట. పేరు మార్చుకో వడం నామోషీ, చిన్నతనం. ఓటమి. పరువు తక్కువ– అని నానుడి.
మరొక్కరే ‘పేరు’తో కసరత్తు చేయగలరు– రాజకీయ నాయకులు. ‘మమ్మల్ని పదవిలో నిల పండి. పేరు మార్చకపోతే...’ ఇది రాజకీయం. వాళ్ల పేర్లు ఎలాగూ వచ్చే ఎన్నికలదాకా నిలవవు కనుక.
ఇప్పుడు పదవిలో ఉన్న ఉత్తరప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి ఒకాయన ఎడాపెడా పేర్లు మార్చే స్తున్నారు. ఆయన చెప్పే కారణం– అలనాడు మొగ లాయీ పాలకులు, ముస్లిం పాలకులు వాళ్లకి లాయకీ అయిన పేర్లు పెట్టారు. ఇప్పుడు మనం మనకి ఇష్టమయిన పేర్లు పెట్టుకుంటున్నాం– అని. మొదట గురుగాం మీద పడ్డారు. అది ‘గురుగ్రామం’ అయింది. ఇంతకీ ఈ గురువు ఎవరు? ద్రోణాచా ర్యులట! 62 సంవత్సరాల కిందట ‘వారణాశి’ అయినా ఇంకా ‘బెనారస్’ అనేవారూ, ‘కాశీ’ అనే వారూ ఉన్నారు.
అలనాడు మేడమ్ మాయావతిగారు వారి హయాంలో కాన్షీరామ్ నగర్. మహామాయా నగర్ వెలిశాయి.
మొగల్‌సరాయ్‌ని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ నగర్ చేశారు. ఇప్పుడు వరసపెట్టి ఆగ్రాని ‘ఆగ్రా వన్’గా, ముజాఫర్ నగర్‌ని ‘లక్ష్మీనగర్’గా, సిమ్లాని ‘శ్యామల’గా, అహమ్మదాబాద్‌ని ‘కర్ణావతి’గా, ఔరం గాబాద్‌ని ‘శంభాజీ నగర్’గా మార్చేస్తున్నారు. ఈ లెక్కన ఫైజాబాద్ ‘అయోధ్య’ అవుతుందట. బిజ్నోర్ మహాత్మా విదుర్ నగర్ అవుతుందట. ఈ మధ్య పేపర్లలో ఈ పేర్ల మార్పు గురించి కోకొల్లలుగా వ్యాసాలు వచ్చాయి. ఇలాంటి మార్పులు ఈ దేశం మీద ‘హిందూమతం’ పులమడమేనని చాలామంది వాపోయారు. దానికి వారందరూ వారి వారి కార ణాలు చెప్పారు. వారి మతాతీత దృక్పథానికి జోహార్లు.
అయితే నాకు అర్థం కాని విషయం ఒకటుంది. గత 60 సంవత్సరాల పైచిలుకు– మన అభిమాన కాంగ్రెస్ పార్టీ పదవిలో ఉండగా కేవలం 450 సంస్థలకు మాత్రమే మన ‘అభిమాన’ కుటుంబం– నెహ్రూ కుటుంబం– వారి పేర్లను పెట్టారు. ఇందులో 12 కేంద్ర, రాష్ట్ర పథకాలు, 28 క్రీడా టోర్నమెంట్లు, 19 స్టేడియంలూ, 5 ఎయిర్‌పోర్టులూ, పోర్టులూ, 98 విద్యా సంస్థలు, 51 అవార్డులూ, 15 ఫెలోషిప్‌లూ, 15 జంతు పరిరక్షణ శాలలూ, 39 ఆసుపత్రులూ, వైద్య సంస్థలూ, పరిశోధనా సంస్థలూ, 37 ఇతర రకాల సంస్థలూ, విశ్వవిద్యాలయాలలో పరిశోధనా పీఠాలూ, ఉత్సవాలూ, 74 రోడ్లూ, భవంతులూ ఉన్నాయి.
మన అదృష్టం బాగుండి కొద్దిలో తప్పిపోయిం దిగానీ అచిర కాలంలో మనకి ‘మౌరీన్ నగర్’ ‘మౌరీన్ శిశు సంక్షేమ కేంద్రం’ వెలిసేది. ఏమంటారు? మౌరీన్ ఎవరా? తమరికి కారాగార శిక్ష విధించాలి. మేడమ్ మౌరీన్ సోనియా గాంధీగారికి స్వయానా వియ్యపు రాలు. రాబర్ట్ వాద్రాకి జన్మ నిచ్చిన తల్లి. ప్రియతమ ప్రియాంకా గాంధీ అత్తగారు.
మరి నాటి నుంచి మేధావులు, రాజకీయ విశ్లేష కులూ నోరెత్తలేదేం? నెహ్రూ కుటుంబం మీద భక్తా Perhaps they have the sycophancy of giv- ing in to the vageries of one family to the collective ethos of one political thinking. ఈ దేశంలో చెలరేగిన విమర్శల్లో పాక్షికమైన ‘అస హిష్ణుత’ ‘ఆత్మవంచన’ 'Intellectual hypocra- cy' స్పష్టంగా కనిపిస్తుంది.
తమిళనాడులో ‘తైతక్కలు’ ఇంకా హాస్యా స్పదం. బోగ్ రోడ్‌కి పద్మభూషణ్ బి.ఎన్.రెడ్డిగారి పేరు పెట్టారు. భేష్! ఆ మధ్య రోడ్ల పేర్లలో కులాల ప్రసక్తి రాకూడదని ఓ ద్రవిడ నాయకుడు భావిం చినట్టుంది. కనుక ‘డాక్టర్ బి.ఎన్.రెడ్డి వీధి’ కేవలం ‘డాక్టర్ బీఎన్ వీధి’ అయింది. ఈ కత్తిరింపులో తలలేదని ఎవరో ముక్కుమీద వేలేసుకుని ఉంటారు. కనుక ‘బీఎన్ వీధి’ ఏకంగా ‘నరసింహన్ వీధి’ అయింది. ఎవరీ నరసింహన్. ఇది ఎవరిని గౌరవిం చడానికి. ఈ లెక్కన ‘మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ’ పేరు కేవలం ‘కరమ్‌చంద్’ అయి కూచుం టుంది కదా? మరి ఇప్పుడే అన్నాశాలై పక్కనే ‘ముత్తు రామలింగ తేవర్ నగర్’ ఉన్నదే. ‘తేవర్’ వర్గం నోరు పెద్దదా? టీనగర్‌లో వ్యాసారావు స్ట్రీట్ ఉండేది. అది న్యాయంగా ‘వ్యాసా స్ట్రీట్’ కావాలి కదా? కానీ ‘వ్యాసార్ స్ట్రీట్’ అయింది. ‘వ్యాసార్’ ఎవరు? అజ్ఞానానికి పరాకాష్ట. బోర్డుమీద ‘వియా సార్ స్ట్రీట్’ అని రాశారు. మరో టర్మ్ ఉంటే రాయ పేట ‘ఎడ్డిపాడి పేట’ అయితే ఆశ్చర్యం లేదు... ఏమి ఈ సంకరం?
మహానుభావుల స్మరణకి కావలసింది ఊరి పేర్లుకావు. నిశ్శబ్దంగా వెలుగునిచ్చే ఆల్వా ఎడిసన్, లూయీ పాశ్చర్, భారతీయ సంస్కృతికి ప్రాణం పోసిన ఆదిశంకరులు, కరుణకి శాశ్వతత్వాన్ని కల్పిం చిన జీసస్ వీరి పేర వీధులు, సందులూ, గొందులూ అక్కరలేదు. మహానుభావుల చిరంజీవత్వానికి లౌకి కమయిన గుర్తులు ఆయా పార్టీల ‘ప్రాథమిక’ స్థాయిని తెలుపుతాయి. మహానుభావుడు జీవించేది సైనుబోర్డుల్లో కాదు. జాతి జీవన సరళిని ఉద్బుద్ధం చేయడంలో.
-గొల్లపూడి మారుతీరావు
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి