వంచన ఇంకెన్నాళ్లు?

Dr AP Vital Says His Opinion on Special Status - Sakshi

విశ్లేషణ

ప్రత్యేక హోదాను వదులుకునేందుకు సిద్ధపడిందీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎత్తుకున్నదీ, ప్రపంచ స్థాయి మహోన్నత రాజధాని పేరుతో, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం వేలాది ఎకరాలు సేకరించిందీ ఎందుకు? తనవారి, వందిమాగధుల ఎస్టేట్‌లు పెంచి, పోషించుకోవాలని కదా! కానీ తాడిని తన్నేవాడి తలదన్నేవాడు మరొకడు అన్నట్లయింది మోదీతో పొత్తు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌తో సరిపెట్టుకుంటే అఖిల భారతాన్నే అన్యపక్ష విముక్త భారత్‌ చేయాలని ఆత్రంగా ఉన్నారు మోదీ.

పత్రికలలో వాణిజ్య ప్రకటనల పటాటోపం గురించి ‘సాక్షి’ వ్యాసాలలో పానుగంటి లక్ష్మీనరసింహారావు పంతులుగారు వందేళ్ల క్రితం రాసినది గుర్తు కొస్తున్నది. ‘కోతి మార్కు నల్ల పళ్లపొడి మీ దంతములను పాలవలె తెల్లగా శుభ్రపరుచును, అన్న ప్రకటనను పత్రికలో చదివినంతనే మరునాడుద యము వరకు పండ్లుండునో లేదో అన్నట్లు హడావిడి పడిపోయి కొనితెచ్చు కొందుము. మాటకున్న వేగము గాలికెక్కడిది?’ అంటూ జంఘాలశాస్త్రి చేత అనిపించారు. రోజులు మారిపోయాయి. ఏది ప్రకటనో, ఏది వార్తో గుర్తిం చలేనంతగా పరిస్థితి తయారైంది. ఇప్పుడు కొన్ని పత్రికలు  తమ రాజకీయ దృక్పథం ఏమిటో స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. ఉదా: సాక్షి దినపత్రిక డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫొటోను ప్రచురిస్తుంది. ఒకప్పుడు మార్క్సిస్టు పార్టీ పత్రిక ప్రజాశక్తి మీద సుత్తీ కొడవలి నక్షత్రం కనిపించేవి. దీనివల్ల పాఠకుడు పత్రిక స్వభావం విషయంలో వంచనకు గురయ్యే అవకాశమే లేదు. 

కొన్ని పత్రికలు అలా కాదు. అవి ఎలా ఆరంభమైనప్పటికి తమది ‘నిర్భయంగా నిజాలు చెప్పే పత్రిక’ అంటూ,l‘నిష్పక్షపాతంగా’ ఉంటా మంటూ, ‘దమ్ము ధైర్యం’తో వాస్తవాలనే ప్రచురిస్తాం అని చెప్పుకుంటూ శుద్ధ వక్రీకరణలకు, అవాస్తవాలకు పెద్ద పీట వేస్తాయి. ఏదో రాజకీయ పార్టీకి ప్రకటనలనదగ్గ  వార్తలను వండి ప్రజలకు వడ్డిస్తుంటాయి. నిర్భయం, నిజా యితీ వంటి మాటల మాటున అలాంటి వంచక తాటస్థ్యం జుగుప్సాకరంగా ఉంటుంది. 

అత్యవసర పరిస్థితిలో నా అనుభవం ఒకటి చెబుతాను. అప్పుడు నేను ది హిందూ పత్రిక పాఠకుడిని. 1976లో అనుకుంటాను. మద్రాసును తుపాను ముంచెత్తింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌ గాంధీ మద్రాసులో పర్యటించారు. సన్నగా చినుకులు పడుతున్నాయి. సంజయ్‌ ముందు నడుస్తున్నారు. ఆయన వెనుక నాటి  తమిళనాడు ముఖ్య మంత్రి సుబ్రహ్మణ్యం, ఆయన మంత్రులు, ఇతర అధికారులు నడుస్తు న్నారు. ఎవరో సంజయ్‌గాంధీకి గొడుగు కూడా పడుతున్నారు. అప్పటికి సంజయ్‌కి ఎలాంటి అధికార పదవి లేదు. ఈ ఫొటోను ది హిందూ మొదటి పేజీలో ప్రచురించారు. వెంటనే ఆ పత్రిక ఎడిటర్‌ పేరున ఒక ఉత్తరం రాశాను. 

‘ది హిందూ వంటి ప్రతిష్టాత్మకమైన పత్రిక కూడా ఇలాంటి ఫొటోను ప్రచురించడం ‘తల వంచుము ప్రభుత్వం ఆదేశిస్తే’ అంటూ సాష్టాంగ దండ ప్రమాణాలు చేసినట్టుంది అని రాశాను. తరువాత కొంత కథ నడిచింది. అది అప్రస్తుతం. అదే సమయంలో  ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అధిపతి రామనాథ్‌ గోయెంకాకు సంబంధించి జరిగిన ఉదంతం గురించి మాకినేని బసవపున్నయ్య ఒక సందర్భంలో చెప్పారు. ఇందిరమ్మ కుటుంబానికి విధే యంగా ఉండమని గోయెంకాపై ఒత్తిడి తెచ్చారట. అందుకు గోయెంకా ఆంధ్రప్రభ, దినమణి వంటి పత్రికలను వారి కుటుంబ సభ్యులే తీసుకోవచ్చు నని, ఒక్క ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ తన అధీనంలో ఉంచుకుంటానని చెప్పారట. ఈ లోకంలోకి మొలతాడు కూడా లేకుండా వచ్చాను, అలాగే మొలతాడు  లేకుండానే పోతాను, అంతేగానీ తల వంచను అని గోయెంకా అన్నాడని మాకినేని చెప్పారు. నిజానికి ఈనాడు కూడా సంజయ్‌గాంధీలు ఉన్నారు.

చంద్రబాబు చరిత్ర వినండి
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చరిత్ర ఈ తరం వారికి తెలియకపోవచ్చు. తన మామగారు ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీనీ, ఎన్టీఆర్‌ను మొదట ఆయన అవహేళన చేశారు. కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి భంగపడ్డారు. ఆ తరువాత దొడ్డిదారిన ఎన్టీఆర్‌ పంచన చేరారు. ఎన్టీఆర్‌ దగ్గర తన స్వార్థ ప్రయోజనాలు నెరవేరడం లేదని పార్టీలోనే ఉన్న కొందరి ప్రోత్సాహంతో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు. ఆయనను పదవీ భ్రష్టు డిని చేసి పార్టీనీ జెండానీ అప్రజాస్వామికంగా తన సొంతం చేసుకున్నారు చంద్రబాబు. 

నాటి స్పీకర్‌ (నేటి ఆర్థికమంత్రి), నాటి గవర్నర్‌ల అండదండ లతో దొడ్డిదారిన అందలం ఎక్కారు చంద్రబాబు. అందుకే ప్రస్తుత తెలుగు దేశం పార్టీని  చంద్రబాబు  తెలుగుదేశం అని  ప్రత్యేకంగా పేర్కొనాలి. లేదా తెలుగుదేశం (వి) అని పిలవడం సమంజసం. కానీ చంద్రబాబును వెన్ను పోటు పొడవడానికి అల్లుడు లేడు. తన తనయుడు లోకేశ్‌నే అప్రకటిత వార సునిగా మంత్రిని చేశారు. కొడుకు అయినంత మాత్రాన అనర్హుడని కాదు. ప్రజాఉద్యమాలలో కానీ, రాజకీయాలలో గానీ ప్రమేయం లేని, కొంచెమైనా అర్హత లేని వారిని అందలం ఎక్కించడమే ప్రశ్నార్థకం.

సొంత బలం హుళక్కి
ఇవేమీ దృష్టిలో లేనట్టు చంద్రబాబు (వి) పార్టీనీ ఆ పార్టీ నేత చంద్ర బాబునూ  రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేయగల సమర్థుడంటూ వార్తలు ప్రచు రిస్తున్న పత్రికలను ఏమనాలి? ఒక్క ఎన్నిక అంటే ఒక్క ఎన్నిక అయినా చంద్రబాబు (వి) స్వతంత్రంగా గెలిచారా? బీజేపీ, వామపక్షాలు ఇలా ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోకుండా చంద్రబాబు (వి) గెలిచి అధికారం పొందిన సందర్బం లేదు. తాను 2002లో తీవ్రంగా విమర్శించిన ‘మోదీ’ నేతృత్వాన బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఇంకా రాజకీయ అరంగేట్రం పూర్తిగా చేయని ‘కొణిదల పవర్‌ స్టార్‌’ను ఇంటికి వెళ్లి మరీ బ్రతిమలాడి  తెచ్చుకుని 2014లో గెలిచారు. వీటికితోడు అన్ని అబద్ధపు వాగ్దానాలు చేసి, కేవలం 1.6 శాతం ఓట్లతో గెలిచిన చంద్రబాబు రాజకీయం తెలుగు పత్రికా రంగ ప్రముఖులకు, మీడియా నేతలకు తెలియనిదా?

ప్రత్యేక హోదాను వదులుకునేందుకు సిద్ధపడిందీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎత్తుకున్నదీ, ప్రపంచ స్థాయి మహోన్నత రాజధాని పేరుతో, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం వేలాది ఎకరాలు సేకరించిందీ ఎందుకు? తనవారి, వందిమాగధుల ఎస్టేట్‌లు పెంచి, పోషించుకోవాలని కదా! కానీ తాడిని తన్నేవాడి తలదన్నేవాడు మరొకడు అన్నట్లయింది మోదీతో పొత్తు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌తో సరిపెట్టుకుంటే అఖిల భారతాన్నే అన్యపక్ష విముక్త భారత్‌ చేయాలని ఆత్రంగా ఉన్నారు మోదీ. 

‘మోదీ–షా’ ఇరువురూ కలిసి చంద్రబాబుకి చుక్కలు చూపిస్తున్నారు. అయినా నాలుగేళ్లుగా తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ రాగలిగారు చంద్రబాబు. ఈలోపల ప్రజలు కూడా చంద్రబాబు నైజం తెలుసుకోసాగారు. ప్రతి పక్షం వైఎస్పార్‌సీపీ ఉద్యమం, వామపక్షాలు, పౌర సమాజం తరఫున ప్రత్యేక హోదా సాధన సమితి వాదన ప్రజలను ఆలోచింప చేస్తున్నాయి. ప్రధానంగా వైఎస్సార్‌ సీపీ నేత పాదయాత్ర వలన చంద్రబాబుకు దిక్కు తోచని స్థితి ఏర్పడింది. ఇక చంద్రబాబు తాను సైతం ప్రత్యేక హోదానే డిమాండ్‌ చేస్తు న్నట్లు  ‘నటన’ మొదలెట్టారు. ప్యాకేజీ మంచిదని చెప్పి తాను ప్రజలను మోసం చేసిన విషయం మరచిపోయి, తానే మోసానికి గురైనట్టు, బీజేపీ తనను మోసం చేసినట్టు ప్రచారం చేయించుకోసాగారు. 

ఇన్నాళ్లు హోదా  విష యంలో ప్రజలను వంచించి, ఇప్పుడు మాట మారుస్తూ ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నానంటున్నారు. ఇప్పుడనిపిస్తుంది. సాక్షి పత్రిక, సాక్షి చానల్‌ లేకపోయినట్లయితే ప్రత్యేక హోదా పరిస్థితి, పోరాటం గురించిన వాస్తవాలు మాత్రమే కాదు, బాబుగారి బండారం కూడా ప్రజలకు తెలిసే అవకాశం ఉండేది కాదు. ఒకరిని మించి ఒకరు చంద్రబాబు (వి) భక్త బృందాలు పోటీపడి ప్రజలను చెవిటివారిగా, మూగవారిగా చేసే యత్నం చేశాయి. ఈ సందర్భంగా తెలుగు ప్రజల తరఫున సాక్షికి కృత జ్ఞతలు చెప్పడం నా బాధ్యతగా భావిస్తున్నాను.

మీడియా కర్తవ్యం మరచిపోరాదు
ఇక్కడే ఒక విషయం ప్రస్తావించాలి. మీరు మార్క్సిస్టు విశ్లేషకుడినని చెప్పు కుంటారు కదా, రేపు సాక్షి బీజేపీకి మతతత్వంతో జత కడితే ఏమంటారు? అంటూ మిత్రులు, మిత్రులు కాని వారు కూడా అడుగుతూ ఉంటారు. ఈ విషయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత ఒక స్పష్టత ఇచ్చారు. ‘ఏ పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందో ఆ పార్టీకే మా మద్దతు. రేపు ఆ పని బీజేపీ చేసినా, కాంగ్రెస్‌ చేసినా, ఇంకో కూటమి చేసినా వారికి మా పార్టీ మద్దతు ఉంటుంద’ని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ముందున్న కీలక సమస్య అది. అది నెరవేరాలంటే తెలుగు ప్రజలంతా కలసి పోరాడాలి. అందుకు కేంద్రం మీద అవిశ్వాస తీర్మానం పెడతాం మీరూ కలసి రండి లేదా మీరు పెట్టండి మేం బలపరుస్తామని చెప్పింది వైఎస్పార్‌సీపీ. 

వైస్సార్‌సీపీ అవిశ్వాస తీర్మానం పెడితే బలపరుస్తామని  చంద్రబాబు చెప్పారు. కానీ పది గంటలు గడచే లోపునే మాట మార్చారు. ఈ రాజకీయ పోరాటంలో తాను తన పార్టీ నాయకునిగా కాక, అనుచరుడినయ్యానని, ప్రజలలో చులకన అవుతానని అనుకున్నారో ఏమో మళ్లీ మాజీ మంత్రి సుజనా చౌదరి ద్వారా కేంద్రంతో లాలూచీ యత్నాలు చేశారు. ఈ సందర్భంలోనే చంద్రబాబు బినామీ మీడియా ఒక సూటి ప్రశ్న సంధించింది. చంద్రబాబు తప్ప మరె వరూ అడగలేడన్నట్టు బినామీ పత్రిక తాటికాయలంత అక్షరాలతో మొదటి పేజీలో ఆ ప్రశ్నను ప్రచురించింది. ఆ ప్రశ్న ఏమిటంటే  రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ పక్షాన ఉన్నారా? లేదా రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న తెలుగు దేశం (వి) తరుఫున ఉంటారా? మీరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటారా? పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారా అన్నట్టే ఉంది ప్రశ్న. దీనిని గ్రహించలేనంతటి అమాయకులు కారు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు.

ఈ పరిస్థితిలో చంద్రబాబు చివరి అస్త్రం ఒకటి సంధించేందుకు యత్ని స్తున్నారు. తన వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు మరో తృతీయ ఫ్రంట్‌ రాదా అని ఆశతో యత్నిస్తున్నారు. ఈసారి విజయం వైఎస్సార్‌సీపీదేనని అందులో అను మానం లేదని తెలుగు ప్రజలు ఇప్పటికే గ్రహించారు. ప్రజాగ్రహంలో చంద్ర బాబుతో కలసి మసై పోవడానికి ఏ ఇతర విపక్షం సాహసించదు. అంతగా అయితే వైఎస్సార్‌ సీపీతో ఐక్య సంఘటన కట్టలేకపోయినా తెలుగు దేశం (వి) వ్యతిరేక ఓటు చీలకుండా ఆ పార్టీతో పరస్పర పోటీ నివారణ చేసుకునే అవగాహనకైనా అవి సిద్ధపడతాయి. ఈ పరిణామాలను, వాస్తవాలను గ్రహించడం మీడియా కర్తవ్యం. ఇప్పటికైనా మీడియా కొంత నిజాయి తీగా ఉండాలి. నాటి ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రపత్రిక స్థాయి లేకున్నా సత్యా న్వేషణ చేయడానికి, ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి ఇక ముందు మన మీడియా సహకరిస్తుందనుకోవడం దురాశ కారాదు.

- డాక్టర్‌ ఏపీ విఠల్‌
వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్‌ : 98480 69720

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top