‘చంద్రుల’ నోట చైనా పాట

Devulapalli Amar Guest Column on Telugu Cm's - Sakshi

డేట్‌లైన్‌ హైదరాబాద్‌
తెలుగు రాష్ట్రాల పాలకులు ఇద్దరూ తమకు అడ్డంకిగా మారిన ప్రతిపక్షాలను ఖాళీ చేయించడానికి అన్ని ప్రజాస్వామ్య సూత్రాలనూ కాలరాస్తున్నారు. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక ప్రతిపక్షాల అవసరం లేదంటారు. నిరసనలకు తావే లేదంటారు. అక్కడా ఇక్కడా ప్రభుత్వం చేస్తున్న తప్పులను గురించి వేలెత్తి చూపే హక్కు, గొంతెత్తి మాట్లాడే హక్కూ లేకుండా చెయ్యడం నిత్యకృత్యం అయిపోయింది. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం మరిచిపోయి జిన్‌పింగ్‌లాగా శాశ్వతంగా అధికారంలో కొనసాగుతామని అనుకుంటూ ఉన్నందువల్లనే ఇద్దరు సీఎంలకూ అభివృద్ధిలో చైనా ఆదర్శంగా కనిపిస్తున్నట్లుంది.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఈ మధ్య వేర్వేరు సందర్భాలలో చైనాలో పరిపాలనను, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని ఉదహరించారు. ఇటు తెలం గాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తాను జాతీయ రాజకీయాలకు వెళ్లనున్నట్టు ప్రకటించిన సభలో చైనాను ప్రస్తావిస్తే, అటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు అక్కడి శాసనసభలో మాట్లాడుతూ చైనాను కొనియాడారు. ఇద్దరి మాటల్లోనూ మనకు అర్థం అయింది ఏమిటంటే అభివృద్ధి సాధించాలంటే చైనాను ఆదర్శంగా తీసుకోవాలి అని. అభివృద్ధి అంటే ఏమిటి? అది ఎవరి అభివృద్ధి? దేన్నయినా పణంగా పెట్టి ఆ అభివృద్ధి సాధించుకోవలసిందేనా? చైనా సాధిస్తున్న అభివృద్ధిని గురించి ఇంకోసారి చర్చించుకుందాం. ఇటీవలే చైనా దేశ రాజ్యాంగాన్ని సవరించి ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ జీవితకాలం పదవిలో కొనసాగేందుకు వెసులుబాటు కల్పించింది ఆ దేశ పార్లమెంట్‌. రెండు సార్ల కంటే ఎక్కువగా అధ్యక్ష పదవిలో ఎవరూ కొనసాగకూడదన్న నియమాన్ని సవరించి జిన్‌పింగ్‌కు నిరాఘాటంగా అధికారంలో కొనసాగే అవకాశం కల్పించడం చైనా దేశాన్ని ఏకవ్యక్తి నియంతృత్వం వైపు నెట్టడమే అన్న విమర్శను అక్కడి ప్రభుత్వం తోసిపుచ్చి ఈ చర్యకు ప్రజల ఆమోదం ఉందని తేల్చేసింది. 

చైనా మోడల్‌ దేనికి నిదర్శనం?
అభివృద్ధి పేరిట చైనా దేన్ని పణంగా పెడుతుందో ఈ తాజా చర్యల వల్ల మనకు అర్థమవుతుంది. అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఎంత గొప్పగా ఉందో, అభివృద్ధి కోసం దేశాన్ని నియంతృత్వ పాలకుల చేతుల్లో ఎలా పెట్టెయ్యవచ్చునో, దానికోసం స్వేచ్ఛాస్వాతంత్య్రాల అవసరం అసలే అక్కరలేదనో ఎవరయినా ఆర్థిక శాస్త్ర పండితులు చెప్తారేమో. కానీ భావ ప్రకటనా స్వేచ్ఛను, జీవించే హక్కును కోరుకునే వారెవ్వరూ ఇప్పటి చైనా  పోకడలను హర్షించరు, ఆమోదించరు. విచిత్రంగా చైనాలో ఈ రాజ్యాంగ సవరణ జరుగుతున్న సమయంలోనే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరి నోటా చైనా అభివృద్ధి పాట వినిపించింది. నిజంగా ఈ ఇద్దరు నాయకులను చైనాలో జరుగుతున్న అభివృద్ధి ఆకర్షించిందా లేకపోతే జిన్‌పింగ్‌ లాగా తమకు శాశ్వత అధికారం కట్టబెడితేనే చైనా మోడల్‌ అభివృద్ధి సాధిస్తామని ప్రజలకు చెప్పదల్చుకున్నారా తెలియదు. ఈ సందేహం రావడానికి కారణం ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులూ తాము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక ప్రతిపక్షాల అవసరం లేదంటారు. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి నిరసనలకు తావు లేదంటారు. అక్కడా ఇక్కడా ప్రభుత్వం చేస్తున్న తప్పులను గురించి వేలెత్తి చూపే హక్కు, గొంతెత్తి మాట్లాడే హక్కూ లేకుండా చెయ్యడం నిత్యకృత్యం అయిపొయింది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు తానూ చెయ్యబోయే అభివృద్ధిని 2050 సంవత్సరం వరకూ విస్తరిస్తుంటారు. అంటే ఆయన, ఆయన కొడుకు లోకేష్, ఆ తరువాత మనుమడు దేవాన్‌‡్ష కూడా ముఖ్యమంత్రులు అయిపోవొచ్చు ఈ 52 ఏళ్ళ కాలంలో. అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 20 ఏళ్ళ దాకా మాదే అధికారం అంటారు. ప్రతిపక్షాలు లేనే లేవు, ఎప్పుడు ఎన్నికలొచ్చినా రాష్ట్ర శాసనసభలోని 119 స్థానాల్లో 106 మావేననీ, వచ్చే 20 ఏళ్ళు అధికారం మాదే అని కూడా అంటుంటారు. ఇద్దరూ ప్రతిపక్షాలను ఖాళీ చేయించడానికి అన్ని ప్రజాస్వామ్య సూత్రాలనూ, విలువలనూ కాలరాస్తుంటారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం మరిచిపోయి జిన్‌పింగ్‌లాగా శాశ్వతంగా అధికారంలో కొనసాగుతామని అనుకుంటూ ఉన్నందువల్లనే ఇద్దరు ముఖ్యమంత్రులకూ అభివృద్ధిలో చైనా ఆదర్శంగా కనిపిస్తున్నట్టు ఉన్నది.

ప్రత్యేక హోదాపై మొదటి నుంచి కుప్పిగంతులే!
రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖలిచ్చి, విడిపోతున్న సమయంలో 15 ఏళ్ళు ప్రత్యేక తరగతి హోదా కావాలని డిమాండ్‌ చేసి ఆ తరువాత అధికారంలోకి వచ్చాక అదే హోదా కోసం పోరాటం చేస్తున్న ప్రతిపక్షాన్ని, ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం కదలనివ్వదు, జైళ్ళలో పెడుతుంది. కేసులు పెడుతుంది. హోదా సంజీవని కాదు, ప్యాకేజీతోనే ప్రయోజనం అని చెప్పి చెప్పి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేసి, చివరికి ప్రజాగ్రహానికి తలొగ్గక తప్పని స్థితిలో మళ్ళీ ప్రత్యేక హోదా పాట అందుకున్నది. ఎన్నికల ఎత్తుగడగా బీజేపీని వదిలించుకోవాలని ఆలోచిస్తున్నప్పటికీ చంద్రబాబుకు పూర్తి ధైర్యం చాలడం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వంలో నుండి మాత్రం తన మంత్రులతో రాజీనామా చేయించి ఎన్‌డీఏ కూటమిలో మాత్రం కొనసాగుతున్నారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ కేంద్రంతో తగాదా పడలేము, మంచిగా ఉండి సాధించుకోవాలి అనే పాట పాడుతూ వొచ్చిన చంద్రబాబుకు, ఆయన పార్టీ నాయకులకూ ఇప్పుడు బీజేపీతో సంబంధాలు చెడేసరికి సహకార ఫెడరలిజం గుర్తొచ్చింది. 2016 సెప్టెంబర్‌ 8న కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తున్న ప్యాకేజీ గురించి ప్రకటించినప్పుడు ఉబ్బితబ్బిబ్బయిపోయి ఆయనకు సన్మానాలు చేసిన చంద్రబాబు, అదే ప్రకటనను అక్షరం పొల్లుపోకుండా 2018 మార్చిలో చేస్తే మాత్రం అన్యాయం జరిగిందని ప్రకటనలు చేస్తున్నారు. అధికారాన్ని మళ్ళీ ఎట్లాగయినా దక్కించుకోవాలన్న ఆరాటం స్పష్టంగా కని పిస్తూనే ఉంది ఆయన నిర్ణయాల్లో. తాము ఇంకా బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏలో భాగస్వామిగా కొనసాగుతూనే, ప్రత్యేక హోదా ఇచ్చే ఏ పార్టీకయినా మద్దతు ఇస్తామన్న ప్రతిపక్షాన్ని మాత్రం బీజేపీలో చేరబోతున్నది అని నిందించేందుకు చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు శతవిధాలా చేస్తున్న ప్రయత్నాన్ని ఏపీ ప్రజలు అర్థం చేసుకోలేరని అనుకుంటే పొరపాటు.

ఇక దేశానికే రాజకీయ ప్రత్యామ్నాయాన్ని తాను ఇస్తాననీ మూడవ ఫ్రంట్‌కు తాను నాయకత్వం వహిస్తానని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రైతు సమస్యల మీద కేంద్రాన్ని నిలదీయడానికి ఉద్యమం చేస్తానని,  ఢిల్లీ జంతర్‌ మంతర్‌ దగ్గర ధర్నా చేస్తానని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉండదు. హైదరాబాద్‌లో ధర్నా చౌక్‌ ఎత్తేసి నిరసనకారులను ఇళ్ళల్లో నిర్బంధించి అవసరం అయితే పోలీస్‌ స్టేషన్‌లకు తరలించి ముఖ్యమంత్రి మాత్రం జంతర్‌ మంతర్‌కు నిరసన కార్యక్రమం నిర్వహించడానికి వెళతారు. రిజర్వేషన్‌ల పెంపు డిమాండ్‌ మీద ఆయన పార్టీ ఎంపీలు లోక్‌సభను స్తంభింప చెయ్యొచ్చు, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలపవచ్చు కానీ తెలంగాణ అసెంబ్లీలో మాత్రం విపక్షాల నిరసనకు అనుమతి లేదు. ప్లకార్డులు ధరించి సభకు రావడం అరాచకం. 

దాడుల రాజకీయంలోనూ పక్షపాతమే!
శాసనసభలో గవర్నర్‌ మీద దాడి హేయమయిన చర్య. ఎవరూ సమర్థించకూడని చర్య. అయితే గవర్నర్‌ ప్రసంగం సమయంలో నిరసన తెలపడం ఇవాళ కొత్తగా జరుగుతున్నదేమీ కాదు. నిలబడి నిరసన తెలపడం, నినాదాలు చెయ్యడం, ప్రసంగాల ప్రతులను చించివెయ్యడం చాలా కాలంగా శాసనసభల్లో మామూలు అయిపోయింది. అయితే భౌతికంగా గవర్నర్‌ మీద దాడికి దిగడం ఎవరితో ప్రారంభం అయింది? ఉమ్మడి రాష్ట్రంలో ఇదే గవర్నర్‌ గారి మీద ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ సభ్యులు కాదా దాడి చేసింది. శాసన సభ ఆవరణలో ఒక ఎంఎల్‌ఏను కొట్టండిరా తన్నండిరా అని రెచ్చగొట్టిన పెద్ద మనిషి ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో నంబర్‌ టూగా ఉన్నాడు. రేపో మాపో ఆయనే ముఖ్యమంత్రి కూడా అవుతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ సంఘటనను ఆదర్శంగా చేసుకుని గవర్నర్‌ మీద మళ్లీ దాడి చెయ్యడాన్ని ఎవరూ సమర్థించరు. చెప్పేదేమంటే మేం చేస్తే మంచిది, ఇతరులు చేస్తే చెడ్డది అన్న ప్రభుత్వాల, రాజ కీయ పక్షాల వైఖరి సరయినది కాదు అనే.

తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమం అనేక మార్గాల్లో, అనేక పద్ధతుల్లో సాగింది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఆకాంక్ష ప్రజల్లో ఎంత బలంగా ఉందో చెప్పడానికి మిలియన్‌ మార్చ్, సాగర హారం, సకల జనుల సమ్మె, వంటా వార్పూ వంటి పలు కార్యక్రమాలు జరి గాయి. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ ఆ ఉద్యమ కార్యక్రమాలు అన్నింట్లో భాగస్వామి. వాటిల్లో ఒకటయిన మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తి సభ జరుపుకోవడాన్ని ఎందుకు ప్రభుత్వం అడ్డుకున్నట్టు? ఉద్యమ కాలంలో తెలంగాణ సాధన కోసం ఆ నాటి ప్రభుత్వంతో తలపడిన దానికి, ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడానికి తేడా లేదా? మిలియన్‌ మార్చ్‌ నిర్వహణను నిషేధించడానికి ఆ నాడు ప్రభుత్వం ఏ కారణాలు చెప్పిందో, స్ఫూర్తి సభను నిషేధించడానికి నేటి ప్రభుత్వమూ అవే కారణాలు చూపడం విడ్డూరం. ఆ నాటి దృశ్యమే ఈనాడూ ట్యాంక్‌ బండ్‌ చుట్టూ కనిపించింది. ఆనాడు వేల మంది పోలీసులు ఉద్యమకారుల మీద విరుచుకుపడి అరెస్టులు సాగిస్తే ఈనాడు పోలీసులు అంతకంటే ఎక్కువ దాష్టీకం చేశారు, దౌర్జన్యం చేశారు. పాలకులు ఎవరయినా ప్రజా ఉద్యమాల పట్ల, వారి ఆకాంక్షల పట్ల ప్రదర్శించే అసహనంలో మాత్రం మార్పు ఉండదేమో! మన పాలకులూ చైనా దారి పట్టినట్టు ఉన్నారు..!!


దేవులపల్లి అమర్‌
ఈమెయిల్‌ : datelinehyderabad@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top