బాబు జూదంలో విలువలు బలి

Chandrababu Naidu Fails To Fight For Special Status  - Sakshi

డేట్‌లైన్‌ హైదరాబాద్‌ 

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ముందు బీజేపీని మాత్రమే బోనులో నిలబెట్టాలన్న చంద్రబాబు ప్రయత్నానికి ఇంటా బయటా చుక్కెదురే అయ్యేట్టుంది. ఢిల్లీలో తానూ రెండు రోజులు వేసిన పగటి వేషాల గురించి వివరిస్తాను రమ్మని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఒక్క రాజకీయ పార్టీ కూడా హాజరు కాకపోవడం మించి ఒక ముఖ్యమంత్రికి అవమానకరం అయిన విషయం ఏముంటుంది? ప్రతిపక్షాల అవసరమే రాష్ట్రానికి లేదన్న అహంభావిని అదే ప్రతిపక్షాలు గుండు గుత్తగా తిరస్కరించడం మనం ఆంధ్రప్రదేశ్‌లోనే చూస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును మించిన జూదగాడు ఈ ప్రపంచంలో మరొకరు ఉండరనడంలో సందేహం అక్కర లేదు. రాజకీయాల్లో గెలుపు కోసం, అధికారాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం ఆయన ఈ నలభై ఏళ్లలో ఆడని జూదం లేదు. ఆ జూదంలో ఆయన ఎవరినయినా సరే పావులను చెయ్యడం, వారిని చంపుడు పందెంలో పణంగా పెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆ పావులు కాసేపు ప్రజలు కావొచ్చు, మరి కాసేపు తన సొంత పార్టీ వాళ్లే కావచ్చు, చివరికి ఆప్తమిత్రులూ, రక్త సంబంధీకులు కూడా కావచ్చు. ఆయనకు కావాల్సింది అధికారంలో చిరకాలం ఉండటం. జూద క్రీడలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి, కొంత నీతిని పాటించాల్సి ఉంటుంది. పక్కా జూదగాడు కూడా వాటిని పాటిస్తాడు. రాజకీయాలు జూద క్రీడ కాదు. ప్రజల జీవితాలను బాగుపరిచేవి రాజకీయాలు. 

వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే జూద క్రీడలోనే నియమాలు పాటిం చాల్సి ఉన్నప్పుడు సమాజం మొత్తాన్ని ప్రభావితం చేసే రాజకీయాల్లో ఇంకెంత నీతిమంతంగా ఉండాలి అన్న విషయం చంద్రబాబుకు పట్టదు. ఆట తన సొంతం కావడానికి ఆయన ఏమయినా చేస్తారు. ఆటను క్రీడాస్ఫూర్తితో తీసుకోవడం ఆయన ఎరగడు. ఎప్పుడూ తనదే గెలుపు కావాలి. అందుకోసం ఎవరిని బలిపెట్టడానికి అయినా సిద్ధం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి హోదా కోసం జరుగుతున్న పోరాటంలో ఆయన అటువంటి ఒక ఆటను ప్రమాద స్థాయికి తీసుకుపోతున్నారు. ఈ ఆటలో ఆయన ఈసారి బలి చెయ్యదలుచుకున్నది కేంద్రంలో నిన్నటి దాకా తానూ అధికారం పంచుకున్న భారతీయ జనతా పార్టీని. నిన్న విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ ఈ నాలుగేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీని ఎదిరించిన ఏకైక పార్టీ తెలుగుదేశం అన్నారు. సునాయాసంగా అసత్యాలు మాట్లాడటంలో తెలుగుదేశం నాయకులందరికీ నాయకుడి నుంచే శిక్షణ లభించినట్టుంది.

బాబు జూదంతో రాష్ట్రానికి పెను నష్టం

కొడాలి నాని ఈ మాట అనడానికి రెండు రోజుల ముందు ఏం చేసయినా సరే చంద్రబాబు నాయుడు చేతిలో నుండి అధికారం జారిపోకుండా చూడడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్న ఒక మీడియా యజమాని రాసిన విషయాలు గుర్తు చేసుకుంటే చంద్రబాబూ, ఆయన పార్టీ ఈ నాలుగేళ్లలో మోదీనీ, బీజేపీనీ ఎదిరించారా లేక వెన్నుపోటు పొడవడానికి రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నారా అన్న విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం పక్కకు పోయి ప్యాకేజీ వ్యవహారం ముందుకు వచ్చినప్పుడు పార్టీలో చర్చ జరిగితే ఇప్పుడు వచ్చే నిధులు తీసుకుందాం రెండేళ్ల తరువాత బీజేపీతో ఎవరుంటారు, వొదిలేద్దాం అన్నారట. రెండేళ్ల తరువాత అంటే ఎన్నికల సంవత్సరంలో బీజేపీని వదిలేసి వేరే దారి చూసుకోవాలని చంద్రబాబు అప్పుడే నిర్ణయించుకున్నారన్న మాట. ఈ విషయం వాళ్ల ద్వారా వీళ్ల ద్వారా తెలుసుకున్న బీజేపీ నాయకత్వం అప్పటి నుండే నిధుల విడుదల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నదనీ, కొన్ని నిధులను వాపసు తీసుకుందనీ తెలిసింది.

 విభజన తరువాత మిగిలిన ఆంధ్రప్రదేశ్‌ కష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉంది అనుభవజ్ఞుడు అయితే గట్టెక్కిస్తాడని స్టేట్స్‌మన్‌ చంద్రబాబుకు ప్రజలు అధికారం ఇస్తే ఆయన ఆడిన ప్రమాదకరమయిన జూదం రాష్ట్రానికి ఎంత నష్టం చేసిందో ఇది స్పష్టం చెయ్యడం లేదా. అమరావతిలో అంతర్జాతీయ ఆనంద నగరాల సదస్సు ప్రారంభంలో మాట్లాడుతూ ఆయన సంతోషంగా ఉండడానికి ప్రజలకు కొన్ని చిట్కాలు చెప్పారు, ఆడండి పాడండి, అవేవీ చెయ్యలేకపోతే వారానికి ఒకసారి రెండు మూడు గంటలు గట్టిగా అరవండి అని. మానసిక ఒత్తిడి నుండి బయటపడటానికి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పారాయన. తన రాజకీయ జీవితం మొత్తంలో గెలిచిన రెండుసార్లూ అందుకు కారణం అయిన బీజేపీని షరామామూలుగానే మళ్ళీ బలి చెయ్యడానికి పథకం రచించిన క్రమంలో చంద్రబాబు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారనీ అందులో నుంచి బయట పడటం కోసం ప్రతిపక్షం లేని శాసనసభ సమావేశాలను కొద్ది రోజులు పొడిగించి మరీ గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చారని అధికార పక్షం వారే వ్యాఖ్యానిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు ఆడుతున్న జూదంలో పావులుగా మారి బలి అయిపోవడానికి ప్రస్తుత బీజేపీ నాయకత్వం వాజ్‌పేయి, అడ్వాణీల చేతుల్లో లేదు, తాడిని తన్నే వాడుంటే తలదన్నే వాడు ఉంటాడన్న చందంగా బీజేపీ నాయకత్వం ఇప్పుడు మోదీ, అమిత్‌ షాల చేతుల్లో ఉంది. అక్కడే చంద్రబాబు తన ఎత్తు జిత్తుల్లో విఫలం అయ్యాడు. చివరి సంవత్సరంలో బీజేపీని వదిలేసి, ఈ నాలుగేళ్ళూ జరిగిన అసమర్థ పాలనకు బాధ్యత కేంద్రం మీదకు నెట్టి తాను తప్పుకుని మళ్ళీ ప్రజల మద్దతు పొందాలన్నది ఆయన ఆలోచన. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్నది అదే.

ఇంటా–బయటా చుక్కెదురే!
ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ సభ్యులు పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్షకు కూడా కూర్చుని దేశ రాజధానిలో రాష్ట్ర ప్రజల సమస్యను ఎలుగెత్తి చాటుతుంటే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌ సభ్యులు మాత్రం పగటి వేషాలు కూడా ఎక్కువసేపు వెయ్యలేక ప్రధాన మంత్రి ఇంటి దగ్గర ధర్నాతోనూ, మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళితోనూ సరిపుచ్చి అమరావతి దారి పట్టారు. ఈ నాలుగేళ్ళు రాష్ట్రంలో జరిగిన అసమర్థ, అవినీతి పాలన నుండి ప్రజల దృష్టి మళ్ళించడానికి రాష్ట్రమంతటా బస్‌ యాత్రలు చేసి బీజేపీని విమర్శించండి అంటే అందుకు కూడా టీడీపీ పార్లమెంట్‌ సభ్యులు సిద్ధంగా లేనందువల్ల వాయిదా పడ్డట్టు వార్తలు వచ్చాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ముందు బీజేపీని మాత్రమే బోనులో నిలబెట్టాలన్న చంద్రబాబు నాయుడు ప్రయత్నానికి ఇంటా బయటా చుక్కెదురే అయ్యేట్టుంది. 

ఢిల్లీలో తానూ రెండు రోజులు వేసిన పగటి వేషాల గురించి వివరిస్తాను రమ్మని అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఒక్క రాజకీయ పార్టీ కూడా హాజరు కాకపోవడం మించి ఒక ముఖ్యమంత్రికి అవమానకరం అయిన విషయం ఏముంటుంది? ప్రతిపక్షాల అవసరమే రాష్ట్రానికి లేదన్న అహంభావిని అదే ప్రతిపక్షాలు గుండు గుత్తగా తిరస్కరించడం మనం ఆంధ్రప్రదేశ్‌లోనే చూస్తున్నాం. అఖిల పక్షం పేరిట ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన కొందరు భజనరాయుళ్ల పొగడ్తలే మిగిలాయి తప్ప రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు మాత్రం పరిష్కారం దొరకలేదు. రాష్ట్రానికి, ప్రజలకూ కావాల్సింది ఏమిటో గుర్తు చేసి ఆ దారిలోకి తననూ తన పార్టీని మళ్లించిన ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తుంటే రాష్ట్రాధినేతగా మద్దతు ప్రకటించకపోతే కనీసం సానుభూతి కూడా తెలుపని ఏలికను బహుశా చంద్రబాబు నాయుడులోనే చూస్తాం. పైగా తన అనుకూల మీడియాలో ఢిల్లీ వేదికగా ప్రతిపక్ష పాండవులు చేస్తున్న పోరాటం ప్రజలకు చేరకుండా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మెజారిటీ మీడియా ఒక ముఖ్యమంత్రికి ఇంతగా లొంగిపోవడం భారతదేశ చరిత్రలో ముందెన్నడూ లేదు.

ఏపీకి అన్యాయం చేసింది బీజేపీయేనా?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగేళ్ళు తానూ బీజేపీతో ప్రయాణం చేసి ఇప్పుడు ప్రతిపక్షానికి ఆ పార్టీతో సంబంధం అంటగట్టే ప్రయత్నం, బీజేపీని మాత్రమే దోషిగా నిలబెట్టే ప్రయత్నమూ చెయ్యడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బీజేపీ అన్యాయం చేసింది, అయితే ఆ అన్యాయం బీజేపీది మాత్రమే అని చెప్పదలచుకున్న చంద్రబాబునాయుడు ఎత్తుగడ రాష్ట్ర ప్రజలకు అర్థం కాకుండా ఉంటుందా? ఆయన ప్రయత్నాలను మోదీ షా ద్వయం చూస్తూ ఊరుకుంటారా? ఈ నాలుగేళ్ళలో తాము ఇచ్చిన నిధులు, వాటి దారి మళ్లింపు గురించిన సమాచారంతో బీజేపీ నాయకులు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నారు. వచ్చే నెల జరగనున్న కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అవినీతి చిట్టాను బయట పెట్టేందుకు అంతా సిద్ధం అయిందన్న వార్తలు వస్తున్నాయి.

కర్ణాటక ఎన్నికల ప్రస్తావన వొచ్చింది కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు ప్రజలు ఉద్యోగ, వ్యాపార అవసరాల దృష్ట్యా పెద్ద సంఖ్యలో కర్ణాటక రాజధాని బెంగళూరులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కర్ణాటక మాదిరిగానే తెలంగాణాలో కూడా లక్షల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగువాళ్ళు ఉన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన కొత్త రోజుల్లో అక్కడ ఎన్నికల్లో వేలు పెట్టబోయి ఎదుర్కొన్న పరాభవం చాలదన్నట్టు ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో కూడా తల దూర్చడానికి సిద్ధపడ్డారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి.

గతంలో గుజరాత్‌ ఎన్నికల్లోనే బీజేపీ ఓటమి కోసం కాంగ్రెస్‌ వారికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చారన్న ప్రచారం బలంగా ఉంది. బీజేపీ నాయకత్వం ఆ విషయంలో చాలా ఆగ్రహంతో ఉన్నది. మిత్ర పక్షంగా ఉండి కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పుడే ఆ పని చేస్తే ఇప్పుడు ఆ బంధాలన్నీ తెగిపోయాక కర్ణాటకలో బహిరంగంగానే దిగుతున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి కే.ఈ. కృష్ణమూర్తి ఇప్పటికే కర్ణాటకకు ప్రచారానికి వెళ్ళారు. కాంగ్రెస్‌తో ఏర్పడుతున్న కొత్త బంధాన్ని మరింత పదిలపరచుకునే ప్రయత్నంలో అక్కడి తెలుగు ప్రజలను ఇబ్బందుల పాలు చేసే మరో ప్రమాదకర జూదానికి చంద్రబాబు తెర లేపారు. ‘‘కూట్లో రాయి ఏరలేనమ్మ ఏట్లో రాయి ఏర పోయింద’’న్న సామెత ఆయన విషయంలో అక్షర సత్యం.
 

దేవులపల్లి అమర్‌
datelinehyderabad@gmail.com 

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top