అద్భుతాలు సరే, ఇంకేం చేస్తారు

Chandrababu Failure In Capital Amaravati Construction - Sakshi

అక్షర తూణీరం

అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఎక్కడైనా నెగటివ్‌ ఓటు బెడద ఉంటుంది. ఎందుకంటే ప్రచారవేళ ఓటర్లకి కావల్సినన్ని ఆశలు పెడతారు. అవన్నీ తీర్చలేమని వాళ్లకి తెలుసు. అయినా ముందు గట్టెక్కేస్తే తర్వాత సంగతి తర్వాత చూద్దామనుకుంటారు. సామాన్యంగా రుణమాఫీలు పారవేస్తారు. ఇంటికో ఉద్యోగం ఆశ పెడతారు. ఇంక పింఛన్లయితే చెప్పక్కర్లేదు. ఈ వలలు పన్నడంలో, ఎరలు వెయ్యడంలో రాష్ట్రాల ఫక్కీ వేరు. కేంద్రం పంథా వేరు. మోదీ ఇంకేముంది ‘‘స్విస్‌ ఖాతాలు తెరుస్తాం, అర్జంటుగా అక్కడి నల్లధనాన్ని అవసరమైతే విమానాల్లో తరలిస్తాం. మనిషికింతనో, ఓటరుకింతనో దామాషా ప్రకారం పంచుకోండి. పంపిణీలో మా ప్రమేయం ఉండదు. మాకు ఓటెయ్యని వారికి కూడా ఆ నల్లధనంలో వాటా ముడుతుంది. కాకపోతే, మేం గెలిస్తేనే కదా మీకీ స్విస్‌ సౌభాగ్యం అంటేది. కనుక మీ విలువైన ఓటు మాకే’’ అనేసరికి అందరికీ బంగారు కలలు రావడం మొదలైంది. మోదీ కల ఫలించింది.

‘‘ఇట్లా ఏరు దాటాక తెప్ప తగలెస్తే ఎట్లాగండీ? ఈసారి ఏరు దాటాలంటే ఏం చేస్తారండీ’’ అని గద్గద స్వరంతో నిగ్గదీశాడొక ఓటరు. నాయకుడు చిద్విలాసంగా నవ్వి, ‘‘తెప్పలు ఆలోచనల్లాంటివి. ఆ తెప్ప పోతే ఇంకోటి పుట్టిస్తాం. ఈసారి భూగర్భ నిధులన్నీ జాతిపరం చేసే కొత్త ఆలోచనతో జనం ముందుకు వస్తాం. ఆ నిధుల విలువని బహిరంగంగా ప్రకటిస్తాం. దామాషా ప్రకారం మీరే పంచుకోండంటాం’’ అని వివరించాడు.

రాష్ట్రాలు కేంద్రం స్థాయి ఆశలు పెట్టలేవ్‌. అందుకనే చంద్రబాబు ఇప్పుడు నెగటివ్‌ ఓటుని నెగటివ్‌తోనే గెలవాలని ప్రయత్నిస్తున్నారు. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యమన్నారుగదా. అందుకని మైకు ముందుకొస్తే చాలు, మోదీ ఎంత ద్రోహం, అన్యాయం, కుట్ర చేసిందీ తీవ్ర స్వరంతో చెబుతున్నారు. ఏపీ ఓటర్లకి అంతా అయోమయంగా ఉంది. నిన్నటిదాకా మోదీ వెనకాల తిరిగారు. మంత్రి పదవులు అనుభవిం చారు. ప్రత్యేక హోదా వద్దన్నారు. ప్యాకేజీ శ్యమంతకమణితో సమానం అన్నారు. ఢిల్లీ కనుసైగల్లో ఉంటే తప్ప రాష్ట్రం ముందుకు నడవదన్నారు. ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు.

ప్రస్తుతం చంద్రబాబు ప్రసంగాలన్నీ మోదీని దుర్భాషలాడటంతోనే సరిపోతున్నాయ్‌. ఇక రాష్ట్రంలో ఉన్న అపోజిషన్‌ పార్టీలని కొంచెం తిట్టాలి కదా. దాంతోనే సరిపోతుంది. కనుక ఆయన్ని మళ్లీ గెలిపిస్తే ఏమేం చేస్తారో చెప్పడానికి ఆయనకి వ్యవధి ఉండటం లేదు. జరిగిపోయిన వాటి గురించి చర్చించి చర్చించి, అందర్నీ వేలెత్తి చూపడంవల్ల అస్సలు ప్రయోజనం ఉండదు. రుణమాఫీలు, మహా కాపిటల్‌ మహత్తర నిర్మాణం వగైరా లాంటి అద్భుతాలు కాకుండా, నిజంగా అసలేం చేస్తారో చెప్పండని అడుగుతున్నారు. ఇవ్వాళ, మేము ప్రాజెక్టులు కడతాం, అవీ ఇవీ చేసి తీర్చి దిద్దుదాం. అంటే ఎవరూ పట్టించుకోరు. తక్షణ ఫలాలు అందాలి. సద్యోగర్భాలు కావాలి. తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ కిలో రెండు రూపాయల బియ్యంతో కదా జనాన్ని జయించారు. అది గుర్తుంచుకోవాలి.


శ్రీరమణ 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top