కట్టుకథలపై కొరడా.. శ్రీలంక ‘సుప్రీం’ తీర్పు

Article On Sri Lanka Supreme Court Verdict On Fake Encounter - Sakshi

విశ్లేషణ

శ్రీలంకలో 2010లో పోలీసు కస్టడీలో ఉన్న ఒక వ్యక్తిని కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌ ముద్ర వేసిన ఘటనపై ఆ దేశ సుప్రీంకోర్టు స్ఫూర్తిదాయకమైన తీర్పును తాజాగా ప్రకటించింది. కరడుగట్టిన నేరస్తుడికి బేడీలు వేయకుండా తక్కువ భద్రతతో బయటకు పోలీసులు తీసుకెళ్లడంలోనే ఎన్‌కౌంటర్‌ కట్టుకథకు మూలం ఉందని తేల్చి చెప్పిన శ్రీలంక సుప్రీంకోర్టు నేరస్తులకు ఉన్న జీవించే హక్కును శాసనం ద్వారా తప్ప హరించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. ‘మనుషులందరిలోనూ రక్తమే ఉన్నట్టు, పోలీసులందరూ చెప్పే కథల్లోనూ ఒకే రకమైన సృజనాత్మకత ఉంటుంది. మనుషులందరూ ఒక్కటే. పోలీసులందరూ ఒక్కటే’ అంటూ ఓ తెలుగు కథలోని ఒక పాత్ర అంటుంది. కానీ, పోలీసులందరిలో ప్రవహించేది ఒకే రక్తమే కానీ, కథనాలు వేరన్న రోజు ఎప్పుడు వస్తుందో ఎదురుచూడాలి.

ఎదురుకాల్పులన్నీ, బూటకపు ఎన్‌కౌంటర్లనేవి మన దేశానికే పరి మితం కాదు. ఇది చాలా దేశాల్లో ఉంది. నేరస్తులను, తీవ్రవాదు లను, అదే విధంగా కరడుగట్టిన నేరస్తులను ఎన్‌కౌంటర్ల పేరుమీద ఏరి వేయడం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎన్‌కౌంటర్లో చనిపోయిన ఓ వ్యక్తి కుటుంబానికి శ్రీలంక సుప్రీంకోర్టు పది లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని చెల్లించాలని శ్రీలంక ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తెలుగులో ఓ కథ ఉంది. ఆ కథలోని ఓ పాత్ర ఇలా అంటుంది. ‘అందరి మనుషుల్లోనూ రక్తమేనన్నట్టు, పోలీ సులందరూ చెప్పే కథల్లోనూ ఒకే రకమైన సృజనాత్మకత ఉంటుంది. మనుషులందరూ ఒక్కటే. పోలీసులందరూ ఒక్కటే’. శ్రీలంక సుప్రీంకోర్టు గత నెలలో చెప్పిన తీర్పుని గమనించినప్పుడు ఈ వాక్యాలు గుర్తుకొచ్చాయి. ఎందు కంటే ఆ కేసులో కూడా పోలీసుల కథనం మన పోలీసుల మాదిరిగానే ఉంది.

రాణా మునేజ్‌ అజిత్‌ ప్రసన్న అనే వ్యక్తి పోలీసు కస్టడీలో సెప్టెంబర్, 2010వ సంవత్సరంలో చనిపో యాడు. పోలీసులు కాల్చి చంపారని ఆరోపిస్తూ అతని భార్య సుప్రీంకోర్టులో దరఖాస్తుని అదే సంవత్సరంలో దాఖలు చేసింది.

పోలీసుల కథనం ప్రకారం అతను అండర్‌ వరల్డ్‌ నేర స్తుడని, ఓ హత్య కేసులో అతన్ని అరెస్టు చేశామని పోలీ సులు కోర్టుకి చెప్పారు. దగ్గర్లో ఉన్న పొదలో తన ఆయు ధాన్ని దాచానని అతను చెబితే, అక్కడికి అతన్ని తీసుకొని వెళ్తున్న క్రమంలో పోలీసుల దగ్గరినుంచి రైఫిల్‌ లాక్కో వడానికి ప్రయత్నం చేశాడనీ, ఆ ఘర్షణలో రైఫిల్‌ పేలి అతను మరణించాడనీ పోలీసులు కోర్టుకి విన్నవించారు.

అయితే కోర్టు ఈ పోలీసుల కథనాన్ని విశ్వసించలేదు. కరడుగట్టిన ముద్దాయికి బేడీలు వేయకుండా, సరైన పోలీసు బలగాలు లేకుండా అతన్ని ఆ రాత్రి ఎందుకు తీసు కొని వెళ్లారని కోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది.

కోర్టు తన తీర్పులో ఇలా పేర్కొంది. ‘కోర్టుకి సమ ర్పించిన ఆధారాల ప్రకారం అతను కరడుగట్టిన నేరస్తుడు. కిరాయి హంతకుడు. అండర్‌వరల్డ్‌కి చెందిన వ్యక్తి. అతను చాలా అపాయకరమైన వ్యక్తి అని పోలీసులు భావించి అతన్ని ప్రత్యేక రక్షణలో ఉంచారు. 17, 18 తేదీలలో అతన్ని అత్యంత భద్రత మధ్య స్టేషన్‌కి తరలించారు. ఈ పరిస్థితులు ఉన్నప్పుడు 18 రాత్రి అతనికి సంకెళ్లు వేయ కుండా ముగ్గురు పోలీసులు, డ్రైవర్‌తో సరైన నిర్వహణలేని వాహనంలో తీసుకొని వెళ్లడానికి ఎలాంటి సంతృప్తికరమైన సమాధానాన్ని పోలీసులు కోర్టుకి వివరించలేకపోయారు.

పోలీసుల ప్రకారం– అతను చాలా తీవ్రమైన నేరాల్లో ప్రధాన పాత్ర ఉన్న వ్యక్తి. అది నిజమైతే పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాల్సింది. తుపాకులని ఉపయో గించడం బాగా తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి సంకెళ్లు వేయకుండా లోడెడ్‌ తుపాకులతో ఎందుకు తీసుకుని వెళ్లారనే విషయానికి పోలీసుల దగ్గర సరైన సమాధానం లేదు. అందుకని ప్రతివాదుల (పోలీసుల) వాదనని ఆమో దించలేమని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.

పోస్టుమార్టం నివేదికలో అతను చనిపోవడానికన్నా ముందే అయిన గాయాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. అవి అన్నీ మొరటుగా, బలంగా తగిలినట్టు ఉన్నాయని కోర్టు భావించింది. శ్రీలంక రాజ్యాంగంలోని అధికరణ 13(4) ప్రకారం– కోర్టు ఉత్తర్వులు లేకుండా ఏ వ్యక్తిని నిర్బంధించడానికి, చంపడానికి వీల్లేదు. శిక్ష పడిన ముద్దాయి జీవితాన్ని కూడా ఏకపక్షంగా అంతం చేయ డానికి వీల్లేదు. శాసనం ప్రకారం మాత్రమే అతని జీవి తాన్ని అంతం చేయాల్సి ఉంటుంది.

శ్రీలంక రాజ్యాంగం వ్యక్తులకి జీవించే హక్కుని ప్రత్యే కంగా పేర్కొనలేదు. కానీ అంతర్జాతీయ ఒప్పందాలపై శ్రీలంక సంతకం చేసింది. అందుకని వ్యక్తులకి జీవించే హక్కు ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుందని శ్రీలంక సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.

ఈ కారణాలని పేర్కొంటూ శ్రీలంక సుప్రీంకోర్టు మృతుని భార్య దాఖలు చేసిన దరఖాస్తుని ఆమోదించి శ్రీలంక ప్రభుత్వం పది లక్షల రూపాయలని అతని భార్యకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దేశంలోని ప్రతి పౌరుడిని రక్షించాల్సిన బాధ్యత ‘రాజ్యం’పై ఉందనీ, ఆ బాధ్యతలో రాజ్యం విఫలం అయిందని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

ఇక్కడితో సుప్రీంకోర్టు ఊరుకోలేదు. మృతుని ప్రాథ మిక హక్కులకి భంగం కలిగించిన నలుగురు పోలీసు అధికారులు ఒక్కొక్కరు సొంతంగా రూ.2,50,000లు చెల్లించాలని, తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించని మరో ముగ్గురు పైఅధికారులు ఒక్కొక్కరు సొంతంగా రూ. 25,000లు చెల్లించాలని కూడా శ్రీలంక సుప్రీంకోర్టు ఆదేశించింది. ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ ఈ తీర్పుని 17, డిసెంబర్‌ 2019న వెలువ రించింది.

రోజురోజుకీ ఎన్‌కౌంటర్లు పెరిగిపోతున్న మన దేశంలో కూడా ఒకటీ అరా ఇలాంటి తీర్పులు వస్తున్న ప్పటికీ ఎలాంటి గుణాత్మకమైన మార్పు కనిపించడం లేదు. ఏమైనా తీర్పుని మన నేర న్యాయ వ్యవస్థతో సంబంధం ఉన్న వ్యక్తులు చదవాల్సిందే. పోలీసులందరిలో ప్రవహించేది ఒకే రక్తమే కానీ, కథనాలు వేరన్న రోజు ఎప్పుడు వస్తుందో ఎదురుచూడాలి.

వ్యాసకర్త : మంగారి రాజేందర్‌, గతంలో జిల్లా, సెషన్స్‌ జడ్జిగా పనిచేశారు
మొబైల్‌ : 94404 83001

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top