టాలీవుడ్‌ టైటానిక్‌

Tollywood Titanic - Sakshi

మునిగే ప్రసక్తే లేదు

 లాఫింగ్‌ గ్యాస్‌

‘టైటానిక్‌’ సినిమాను నిర్మించిన ట్వంటీయత్‌ సెంచరీ ఫాక్స్‌  సంస్థ మన టాలీవుడ్‌పై కన్నేసింది. ‘టైటానిక్‌’ను తెలుగులో  ఒకేసారి  ముగ్గురు దర్శకులతో  రీమేక్‌ చేయాలని నిర్ణయించుకొని వారితో సమావేశం ఏర్పాటు చేసింది.‘‘లోకల్‌ఫ్లేవర్‌ మిస్‌ కాకుండా, ఇది మన సినిమానే అని ప్రతి తెలుగు ప్రేక్షకుడు అనుకునేలా మాకో సినిమా తీసిపెట్టాలి’’ అని  ఆ డైరెక్టర్లను అడిగింది ట్వంటీయత్‌ సెంచరీ ఫాక్స్‌.  ముగ్గురు దర్శకులు  ఉత్సాహంగా రంగంలోకి దిగి తమ సత్తా చాటారు. ఈ సినిమాలు ఎలా ఉన్నాయో చూద్దామా మరి....రామ్‌గోపాల్‌వర్మ టైటానిక్‌:హుస్సేన్‌సాగర్‌ నీళ్లలో టైటానిక్‌ వేగంగా దూసుకుపోతుంది. షిప్‌ లోపల దృశ్యం: ‘‘అన్నా...అటు చూడు...వాడే శివ’’ పాన్‌పరాగ్‌ నోట్లో పోసుకుంటూ భవానీ చెవిలో చెప్పాడు నానాజీ. ‘‘శివా...శివా..శివా...షిప్‌లో కూడా శివా. ఎటాక్‌ హిమ్‌’’ అని ఆవేశంగా అరిచాడు భవానీ.హాకీ కర్రలు, క్రికెట్‌ బ్యాట్లతో శివను చుట్టు ముట్టింది భవానీ గ్యాంగ్‌.

‘‘ఏమిటలా డీప్‌గా ఆలోచిస్తున్నావు? ఎలా తప్పించుకోవాలనా!’’ తన తల వెంట్రుకలను వెనక్కి తోస్తూ వెటకారంగా నవ్వాడు భవానీ.‘‘నీ గురించి కాదెహే.... మా అఖిల్‌ గురించి ఆలోచిస్తున్నాను. మూడో సినిమా ఏ డెరెక్టర్‌కు అప్పగిస్తే సేఫా అని’’ కూల్‌గా చెప్పాడు  శివ.‘‘ముందు నీ సేఫ్టీ గురించి ఆ భగవంతుడిని ప్రార్థించు’’ అంటూ శివ కణతలపై రివాల్వర్‌ పెట్టాడు భవానీ. ఇంతలో.... పెద్ద శబ్దం!  టైటానిక్‌ ఒక పక్కకు  ఒరిగిపోతుంది. షిప్‌లోని ప్రయాణికులు భయంతో పెద్దగా అరుస్తున్నారు. ఆ అరుపుల దెబ్బకు భవానీ చేతిలోని పిస్టల్‌ జారి  కింద పడిపోయింది. మెరుపు వేగంతో  ఆ పిస్టల్‌ మీద కాలువేశాడు శివ.‘‘ఒరే భవానీ...నా నడుముకు ఏముందో తెలుసా?’’ అంటూ భవానీ జుట్టు పట్టుకొని అడిగాడు శివ.‘‘బెల్ట్‌. కొంపదీసి ఆ బెల్ట్‌తో బాదుతావేంటీ?’’ వణికిపోయాడు భవానీ.‘‘బెల్ట్‌ కాదు...సైకిల్‌ చైన్‌..బాదడం కాదు బాక్స్‌ బద్దలు చేస్తాను’’ అంటూ పటపటమని సౌండ్‌ వస్తుండగా ప్యాంట్‌కు బెల్ట్‌లా ఉన్న సైకిల్‌ చైన్‌ తీశాడు శివ. ఈలోపు టైటానిక్‌లో ఉన్న ప్రయాణికులంతా శివను చుట్టుముట్టి ‘‘ఈ భవానీగాడి  సంగతి తరువాత. ముందు  టైటానిక్‌ మునిగిపోకుండా చూడు...మమ్మల్ని కాపాడు శివా...’’ అని దీనంగా వేడుకున్నారు.‘‘ఎవ్వరూ భయపడాల్సిన అవసరంలేదు. వినాయక నిమజ్జనం ఎప్పుడైంది?’’ అడిగాడు శివ.

‘‘జస్ట్‌ రెండు రోజుల క్రితమే’’ అన్నారు ప్రయాణికుల్లో ఒకరు.‘‘హుస్సేన్‌సాగర్‌ లోతు 32 అడుగులు.  29 అడుగుల వరకు విగ్రహాలే ఉన్నాయి. పూడిక సంగతి సరేసరి. ఇక టైటానిక్‌ ఎలా మునుగుతుంది? హౌ ఇటీజ్‌ పాసిబుల్‌?! మీరు భయపడుతున్నట్లు  టైటానిక్‌ మునగడం లేదు. జస్ట్‌ పక్కకు ఒరిగింది అంతే...’’ అసలు విషయం చెప్పాడు శివ. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత...చేతికిచుట్టుకున్న సైకిల్‌ చైన్‌తో భవానీ ఫేస్‌ మీద ఒక పంచ్‌ ఇవ్వబోయి సడన్‌గా ఆగాడు శివ.‘‘రేయ్‌ భవానీ... నిన్ను సైకిల్‌ చైన్‌తో కొట్టి చంపుతాననుకున్నావా! కానే కాదు. ఈ హుస్సేన్‌సాగర్‌ నీళ్లు జస్ట్‌ ఒక  లీటర్‌ తాగిస్తానంతే’’ అని శివ అన్నాడో  లేదో గ్యాంగ్‌స్టర్‌ భవానీ గుండె ఆగి అక్కడికక్కడే చనిపోయాడు.

వి.వి. వినాయక్‌  టైటానిక్‌:
ధవళేశ్వరం  గోదావరి జలాల్లో  టైటానిక్‌ దూసుకువస్తుంది. కాటన్‌ బ్యారేజీ మీద తెల్లటి టాటా సుమోలు బారులు తీరి ఉన్నాయి. అందులో నుంచి నల్లటి తుమ్మ మొద్దుల్లాంటి గూండాలు, నల్లటి బాంబులతో దిగారు. ‘‘అదిగో టైటానిక్‌...ఆదిసుబ్బుసాంబసింహాద్రినాయుడు దాంట్లోనే ఉన్నాడు. ఏసేండ్రా బాంబులు’’ అని అరిచాడు అందులో ఒక వ్యక్తి. ఆ సమయంలోనే పెద్ద శబ్దంతో టైటానిక్‌ గోదావరిలో మునగడం మొదలైంది. షిప్‌లో ఉన్న ప్రయాణికులు భయంగా అరుస్తూ  ‘‘మీరే రక్షించాలి’’ అంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌ను చుట్టుముట్టారు. ‘‘మీరేం భయపడవద్దు. తాతగారు తరచుగా ఒక మాట అంటుండే వారు... ‘కర్మనేషు కార్పణ్యం కనామి సునామి అని.’’ అన్నాడు ఎన్టీఆర్‌. ‘‘దాని మీనింగ్‌ ఏమిటండీ?’’ ఆసక్తిగా అడిగాడు ఒక అభిమాని. ‘‘ఈ టెన్షన్‌లో నీకు మీనింగ్‌ అవసరమా?’’ అని తీవ్రంగా విసుక్కున్నాడు ఎన్టీఆర్‌. టైటానిక్‌ మరింత లోతులోకి మునిగిపోతుంది. ఏడుపులు, పెడబొబ్బలు ఎక్కువయ్యాయి. ‘‘ఆపండి’’ అని గట్టిగా అరిచాడు  ఎన్టీఆర్‌. పిన్‌ డ్రాప్‌ సైలెన్స్‌. ‘‘అమ్మతోడు...ఈ షిప్‌ను అమాంతం పైకి లేపుతా’’ అని మీసం తిప్పుతూ  తొడ కొట్టడం స్టార్ట్‌ చేశాడు. మునిగిపోతున్న టైటానిక్‌ వేగంగా  పైకి లేవడం మొదలైంది. ‘రామయ్యా వచ్చాడయ్యా...టైటానిక్‌ లేపాడయ్యా’ పాట షిప్‌లో హోరెత్తిపోయింది. 

రాజమౌళి  టైటానిక్‌:
విజయవాడ కృష్ణా నది జలాల్లో   ప్రయాణిస్తున్న టైటానిక్‌ ప్రమాదానికి గురై మునగడం మొదలైంది. షిప్‌లోని ప్రయాణికులు అంతులేని శోకాలు పెడుతూ బాహుబలిని  చుట్టుముట్టారు.‘దండాలయ్యా...దండాలయ్యా... మునుగుతున్న టైటానిక్‌ను లేపాలయ్యా... లేపాలయ్యా’ అని పాడటం మొదలు పెట్టారు.‘ఓస్‌...అదెంత పని!’’ అని షిప్‌లో నుంచి నదిలోని నీళ్లలోకి దూకాడు బాహుబలి.‘‘సేవ్‌ చేయమంటే... జంప్‌ చేశాడేమిటి?’’ అని తలలు పట్టుకున్నారు ప్రయాణికులు. టైటానిక్‌ మరింత లోతులోకి మునుగుతుంది. షిప్‌లోకి నీళ్లు రావడం మొదలైంది.  ఏడుపులు, పెడబొబ్బలు ఆకాశాన్ని అంటాయి.  ఈలోపే...‘‘మీ ఏడుపులు ఆపండహే’’ అంటూ  పెద్ద గొంతు ఒకటి  వినిపించింది.ఇప్పుడు టైటానిక్‌ కృష్ణానది నీళ్లలో లేదు. ఆ నీళ్లలోనే ఉన్న బాహుబలి భుజాల మీద ఉంది. ‘బాహుబలి–1’ సినిమాలో మహాశివలింగాన్ని భుజాల మీద మోసినట్లు, ఇప్పుడు టైటానిక్‌ షిప్‌ను భుజాల మీదమోస్తూ ఒడ్డుకు చేరుకున్నాడు బాహుబలి. ‘సాహోరే బాహుబలి... సేవ్‌ చేశాడ్రో టైటానిక్‌ని’ అంటూ పాట అందుకున్నారు షిప్‌లోని ప్రయాణికులు. ఈ మూడు సినిమాలు ‘టైటానిక్‌ థీమ్‌’తోనే తయారై,  ఒకేసారి విడుదలై రికార్డ్‌లు బద్దలు కొట్టి టాలీవుడ్‌ను షేక్‌ చేశాయి.శుభం
– యాకుబ్‌ పాషా 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top