నల్లకోటు వదిలి... మోటారు పరిశ్రమకు...

నల్లకోటు వదిలి... మోటారు పరిశ్రమకు...


మన దిగ్గజాలు

నల్లకోటుతోనే జీవితాంతం కాలం కొనసాగించి ఉంటే, ఆయన న్యాయవాదిగా మాత్రమే మిగిలిపోయేవారు. న్యాయవాద వృత్తి నుంచి బయటపడ్డాక మొదలుపెట్టిన ‘ఉద్యోగ’పర్వంలోనే కొనసాగి ఉంటే మహా అయితే ఒక అధికారిగా రిటైరయ్యేవారు. ఉన్నత లక్ష్యాలేవీ సాధించకుండా అలాగే మిగిలిపోవాలని కోరుకోలేదు టీవీఎస్ అయ్యంగార్. అందుకే ఆయన మోటారు పరిశ్రమకు పునాదులు వేశారు. ఆయన చేతుల మీదుగా ప్రారంభమైన టీవీఎస్ మోటార్స్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా వెలుగుతోంది.

 

తల్ల వేండం సార్...

అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరునల్వేలి జిల్లా తిరుక్కురుంగుడిలో 1877 మార్చి 22న సంప్రదాయ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు టీవీఎస్ అయ్యంగార్. తండ్రి కోరిక మేరకు లా చదువుకున్నారు. న్యాయవాదిగా కొన్నాళ్లు ప్రాక్టీస్ కూడా చేశారు. అది నచ్చకపోవడంతో ఉద్యోగపర్వంలో పడ్డారు. కొన్నాళ్లు రైల్వేలో, తర్వాత ఒక బ్యాంకులో ఉద్యోగాలు చేశారు. వాటితో సంతృప్తి చెందలేదాయన. సొంతగానే ఏదైనా చేయాలనుకున్నారు. మధురై కేంద్రంగా 1911లో సదరన్ రోడ్‌వేస్ లిమిటెడ్ పేరిట రోడ్డు రవాణా సంస్థ ప్రారంభించారు. దాని ఆధ్వర్యంలో బస్సులు, లారీలు నడిపేవారు.అప్పట్లో మద్రాసు నగరంతో పాటు మధురై, తిరుచ్చి వంటి పట్టణాల్లోనూ ఎడ్లబళ్లు, జట్కాబళ్లు విరివిగా నడిచేవి. వాటిని లాగే గుర్రాలు, ఎద్దుల నాడాలు, వాటికి గుచ్చిన మేకులు తరచుగా ఊడిపోయి రోడ్లపై పడేవి. వాటి వల్ల బస్సులు, లారీల చక్రాలకు పంక్చర్లు పడి అంతరాయం కలిగేది. పంక్చర్లు పడి ఆగిపోయిన బస్సులను ప్రయాణికులే నెట్టాల్సి వచ్చేది. ఈ సమస్యను అధిగమించడానికి టీవీఎస్ అయ్యంగార్ తమ కంపెనీ బస్సులు నడిచే మార్గంలో మాగ్నెటిక్ రోడ్డురోలర్‌ను నడిపేవారు. రోడ్డు రోలర్‌కు అమర్చిన మాగ్నెట్లకు దారిలో పడ్డ మేకులు, నాడాలు అతుక్కునేవి. ప్రయాణికులు నెట్టాల్సిన పని లేకుండానే బస్సులు నిరాటంకంగా నడిచేవి. దాంతో అప్పటి ప్రయాణికులు టీవీఎస్ అయ్యంగార్‌ను ఆప్యాయంగా ‘తల్ల వేండం సార్’ (నెట్టక్కర్లేదు సార్) అని ఆప్యాయంగా పిలిచేవారు.

 

ఆటోమొబైల్ రంగంలోకి...

సదరన్ రోడ్‌వేస్ విజయవంతంగా నడుస్తున్న దశలోనే ఆయన టీవీ సుందరం అయ్యంగార్ అండ్ సన్స్ లిమిటెడ్ పేరిట ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆటోమొబైల్ రంగానికి అవసరమైన సేవలు, ఉత్పత్తులు అందించేందుకు మద్రాస్ ఆటో సర్వీసెస్ లిమిటెడ్, సుందరం మోటార్స్ సంస్థను ప్రారంభించారు. సుందరం మోటార్స్ అప్పట్లో జనరల్ మోటార్స్ ఉత్పత్తి చేసే వాహనాలకు అతిపెద్ద పంపిణీదారుగా ఉండేది. రెండోప్రపంచ యుద్ధం కొనసాగినప్పుడు పెట్రోల్‌కు తీవ్ర సంక్షోభం ఏర్పడింది.ఆ సమయంలో ఇంధన సమస్యను అధిగమించేందుకు అయ్యంగార్ టీవీఎస్ గ్యాస్ ప్లాంట్‌ను నెలకొల్పారు. టీవీఎస్ అయ్యంగార్‌కు ఐదుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. కొడుకుల్లో ఒకరైన దొరైస్వామి చిన్న వయసులోనే మరణించగా, మిగిలిన నలుగురు కొడుకులూ ఆయన వ్యాపార వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. టీవీఎస్ గ్రూప్ పలు రంగాలకు విస్తరించి, ఇప్పుడు దేశంలోనే అగ్రగామి వ్యాపార సంస్థల్లో ఒకటిగా ఘనతను చాటుకుంటోంది.

 

గాంధీ చొరవతో కూతురికి పునర్వివాహం

టీవీఎస్ అయ్యంగార్ స్వతహాగా సంప్రదాయవాది. ఒకవైపు స్వాతంత్య్రోద్యమం సాగుతున్నా, ఆయన తటస్థంగానే ఉంటూ తన వ్యాపారాలను కొనసాగించేవారు. అయితే, వైద్యుడైన ఆయన అల్లుడు సౌందరరాజన్ ప్లేగు రోగులకు చికిత్స చేసే క్రమంలో అదే వ్యాధికి గురై అకాల మరణం చెందడంతో కూతురు సౌందరం చిన్న వయసులోనే వితంతువుగా మిగిలింది. భర్త మరణం తర్వాత ఆమె మధురై నుంచి ఢిల్లీ వెళ్లి, అక్కడి లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో చేరి, మెడిసిన్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అక్కడ చదువుకుంటున్న సమయంలోనే గాంధీ సిద్ధాంతాలపై ఆకర్షితురాలయ్యారు.చదువు పూర్తయ్యాక గాంధీ ఆశ్రమానికి వెళ్లి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సౌందరం పరిస్థితి తెలుసుకున్న గాంధీజీ ఆమెకు మళ్లీ వివాహం చేయాలని అయ్యంగార్‌కు సలహా ఇచ్చారు. గాంధీజీ సలహాతో మెత్తబడ్డ అయ్యంగార్ కూతురికి రామచంద్రన్ అనే యువకుడితో పునర్వివాహం జరిపించారు. వయసు మళ్లిన దశలో నలుగురు కొడుకులకు వ్యాపారాలను అప్పగించి, రిటైర్మెంట్ ప్రకటించిన టీవీఎస్ అయ్యంగార్, 1955 ఏప్రిల్ 28న కోడెకైనాల్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top