
టీవీఎస్ మోటార్ ఇటీవలే.. ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఇది దేశీయ విఫణిలో.. ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతున్న ఐక్యూబ్ ఈవీకి అమ్మకాల పరంగా కొంత పోటీ పడుతుంది. రెండూ ఒకే కంపెనీకి చెందినవైనప్పటికీ.. డిజైన్, ఫీచర్స్, ధరల్లో వ్యత్యాసం ఉంది. ఈ వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఆర్బిటర్ vs ఐక్యూబ్: డిజైన్ & ఫీచర్స్
కొత్త టీవీఎస్ ఆర్బిటర్ 845 మిమీ ప్లాట్ సీటు, ఫ్లాట్ ఫ్లోర్ పొందుతుంది. దీని కారణంగా రైడర్ రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్ అనుభవించవచ్చు. ఇది 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కలిగి ఉంది. అండర్ సీట్ స్టోరేజ్ అనేది ఐక్యూబ్‌లో 32 లీటర్లు.

కొత్త ఆర్బిటర్ ముందు భాగంలో హై-మౌంటెడ్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్ ఉంది. ఇది డీఆర్ఎల్ స్ట్రిప్‌తో కలిసి.. ఫ్రంట్ ఆప్రాన్‌లో విలీనం అవుతుంది. ఈ స్కూటర్ రెండు చివర్లలో 14 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 169 మిమీ. ఇది క్రూయిజ్ కంట్రోల్, USB ఛార్జింగ్ పోర్ట్, ఆటోమేటెడ్ హిల్ అసిస్ట్, బ్లూటూత్ కనెక్టివిటీతో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ పొందుతుంది.
టీవీఎస్ ఐక్యూబ్ విషయానికి వస్తే.. ఇది ప్రీమియం డిజైన్ పొందుతుంది. ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ TFT డిస్ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్, డాక్యుమెంట్ స్టోరేజ్, కాల్/ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వంటివి ఉన్నాయి. 12 ఇంచెస్ వీల్స్ కలిగిన ఈ స్కూటర్.. ఆర్బిటర్ కంటే కూడా కొంత తక్కువ అండర్ సీట్ కెపాసిటీ పొందుతుంది.

ఆర్బిటర్ vs ఐక్యూబ్: పర్ఫామెన్స్ & రేంజ్
టీవీఎస్ ఆర్బిటర్ 3.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 158 కిమీ రేంజ్ అందిస్తుంది. ఐక్యూబ్ 3.5 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 145 కిమీ రేంజ్ అందిస్తుంది. ఐక్యూబ్ 3.5 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్ మాత్రమే కాకుండా.. 2.2 కిలోవాట్, 3.1 కిలోవాట్, 5.3 కిలోవాట్ అనే మూడు బ్యాటరీ ఎంపికలలో లభిస్తుంది. ఆర్బిటర్ ప్రారంభ ధర రూ. 99000కాగా.. ఐక్యూబ్ ప్రారంభ ధర రూ. 1.15 లక్షలు (ఎక్స్ షోరూమ్).