అర్ధ రూపాయి విలువ

Story about value of money - Sakshi

మార్కెట్‌  గేటు వద్ద సుబ్బయ్య బియ్యం అమ్ముతూ  ఉంటాడు. రోజులు మంచివైనా కాకపోయినా అతని వ్యాపారం మాత్రం మూడు పువ్వులు ఆరుకాయల్లా ఉండేది. కరువు రోజుల్లో మిల్లులు మూతపడి బియ్యం చేతికందేది  కాదు. అలాంటి పరిస్థితుల్లో  మనుష్యులు కళ్ళు లోతుకి పోయి  రోడ్లపై  ఎప్పుడు పడిపోతారా అన్నట్లు ఉండే వారు.  అలాంటి రోజుల్లో కూడా అతని దుకాణం తెరిచే ఉండేది. కనీసం రెండు బస్తాల్లో బియ్యం నిండుగా ఉండేందుకు అతను తిరగని చోటు లేదు. అలా సంపాదించి అమ్మేవాడు. అటువంటి రోజుల్లో బియ్యం రోజంతా  అమ్మినా నెలాఖరుకు యాభై రూపాయల లాభం వస్తుందనే  ఆశ కూడా ఉండేది కాదు.  దాన్ని వర్తకంలో మందగొడి రోజులనేవాళ్ళు. మనల్ని పోషించే ఆ భగవంతుడికి మాయ ఏమిటో తెలీకుండా ఉంది. ఆయన పంట పుష్కలంగా పండినా, అతి తక్కువగా పండినా, రెండూ అనంగీకారంగానే ఉండేవి. కానీ సుబ్బయ్య పంట కోతకొచ్చిన సమయంలోను, మామూలు వర్తకంలోనూ  కలిగే  ఎత్తు పల్లాలు అన్నీ చవి చూశాడు. బియ్యం వ్యాపారం అతని రక్తంలో కలిసిపోయింది. అతని తండ్రి వాలు డస్కు దగ్గర కూర్చొని డబ్బు లెక్కిస్తుంటే, తను జీత భత్యాలు లేని పనివాడుగా సహాయం చేశాడు. ఆ రోజుల్లో తనని కట్టి పడేసిన ఆ బియ్యం బస్తాలంటే అసహ్యించుకునేవాడు.

ధ్యాసంతా కిక్కిరిసిన వీధులు, సినిమాలు, ఫుట్‌ బాల్‌ ఆటలు, మల్ల యుద్ధాలపై ఉండేది. వాటినన్నిటినీ జనంతో నిండిన  తమ దుకాణం ద్వారంలోంచి చూసేవాడు. కానీ తండ్రి, తనని  దుకాణానికి దాదాపు కట్టి పడేసి, జీవితంలోని ఇతర ఆనందాలకు దూరం చేశాడు. ఆయన అంటుండేవాడు, ‘పిల్లలు దారి దోపిడీ వాళ్ళలా తయారవకుండా ఉండాలంటే వాళ్ళని గుర్రాన్ని కొరడాతో కొట్టినట్లు అదమాయించాలి.’ ఆయన ఈ సిద్ధాంతాన్ని పాటించి పిల్లల్ని ఎలా పెంచాడంటే, ఈ చిన్న పిల్లాడికి  ఆ తరువాత  జీవితంలో బియ్యం తప్ప ఇంకేమీ కనిపించలేదు. తండ్రి చనిపోయాక ఆయన స్థానాన్ని ఎంతగా భర్తీ చేశాడంటే ఎవ్వరూ వాళ్ళిద్దరి మధ్యా తేడా గమనించ లేకపోయారు. చాలామంది ఆ ముసలాయనే అక్కడ కూర్చొని డబ్బు లెక్కిస్తున్నాడు అనుకునేవాళ్లు. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిచింది. సుబ్బయ్య ఇంటి దగ్గర అయిదు ఆవులు, గేదెలు పెంచగలిగాడు. వాటి పాలు, పెరుగు, వెన్నని అతను, భార్య అయిదుగురు పిల్లలు బాగా అనుభవించి గుండ్రంగా బెలూన్లా తయారయ్యారు. పక్క గ్రామంలో ముప్పై ఎకరాల భూమి సంపాదించాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న మనుష్యులకి అధిక వడ్డీకి అప్పులిచ్చి ఓ పది ఇళ్ళు  సొంతం చేసుకున్నాడు.

వాటి మీద వచ్చే అద్దెలు ప్రతి నెలా తన బ్యాంక్‌ పొదుపు ఖాతాలోకి వచ్చి పడేవి. సుబ్బయ్య మితి మీరిన డబ్బుతో ఉబ్బిపోయాడు. తన పిల్లల్ని స్కూలుకి పంపి వాళ్లకి  కావలసిన బుట్టా వేసిన టోపీలు, వెల్వెట్‌ కోట్లు కొన్నాడు. రోజూ తన ఇంట్లోని హాలులో దీపం క్రింద కూర్చొని గొంతు చించుకు అరిచే ఒక ప్రైవేటు మాస్టారుని కుదిర్చాడు. ఇంటిపైన పెద్ద గదులున్న ఇంకో రెండు అంతస్తులు కట్టించాడు.  రోజంతా ఇనుప గల్లా పెట్టె దగ్గర కూర్చొని, ఒక పక్క దాన్ని చూసుకుంటూ, రెండవ పక్క తన పని వాళ్ళు సంచుల్లో బియ్యం ఎలా కొలుస్తున్నారోనని  కన్నేసుంచేవాడు. అది అతనికి పూర్తి సంతృప్తిని, కలతలు లేని జీవితాన్ని ఇచ్చింది.  ఆ బియ్యం అమ్మటం, డబ్బులు లెక్కపెట్టుకోవటం నుంచి  విశ్రాంతి చెందేది  నిద్రపోయే సమయంలో మాత్రమే . ఇలా నిరంతరం కొనసాగకుండా ఉండటానికి ఇతర కారణం కనిపించలేదు. అవే పనులు, ఇష్టాలు జరిగి పోయాయి. డబ్బు కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతూ,  దుకాణంలోకి బియ్యం వస్తూ, బయటకి పోతూ జరిగిందే మరల మరల జరగటమే జీవితమైపోయింది సుబ్బయ్యకి. తన తరువాత తన కొడుకుల్లో ఎవరో ఒకడు ఈ కార్యక్రమం సాగిస్తాడని అతని పూర్తి నమ్మకం. జననమరణాలకు, జీవితంలో వచ్చే మార్పులతో సంబంధం లేకుండా నిరంతరం ఇది కొనసాగుతుందని అతని నమ్మకం.

కానీ ప్రపంచ  యుద్ధం వచ్చాక  దీనికి అంతరాయం కలిగింది. సుబ్బయ్య భయపడిపోయాడు. మొదట్లో ఇదే ముగింపు అనుకున్నా, కొంత తేరుకున్నాక ఈ పరిస్థితి అంత భయపడవలసిన విషయంగా అనిపించలేదు. అతని లాభాలు ఇదివరకటిలా కుప్పలుగా పెరగకపోయినా, సైగాన్, బర్మాల నుండి బియ్యం సరఫరా కాకపోవటంతో తన వద్ద ఉన్న సరుకుకు  బంగారం విలువ వచ్చింది. ప్రజలు దుకాణం ముందు ఎల్లవేళలా గుమిగూడుతూ గల్లాపెట్టె మూత పడనియ్యలేదు. ఉన్న ఇంటి పక్కనే ఇంకో పెద్ద ఇల్లు కొన్నాడు. దాన్ని గోడౌన్‌గా ఉపయోగించుకొని, ఇంకా కొన్ని గ్రామాలు కూడా కైవసం చేసుకున్నాడు... భార్య ఒంటిమీద నగలు ఒకటి తరువాత ఒకటి, అలా ఇంకా ఇంకా తొడిగాడు. మొత్తానికి రేషనింగ్‌ వచ్చే వరకూ యుద్ధం సుబ్బయ్యకి చాలా బలంగా ఉపయోగపడింది. అతను జీవితంలో మొదటిసారిగా గాభరాపడి చింతించాడు. తను ఏమి అమ్మాలో, ఎంతకు అమ్మాలో నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని భావించాడు. తనంటే ఇష్టపడే కొద్ది స్నేహితులతో తన ఆక్రోశాన్ని వెళ్లగక్కేవాడు ‘‘ప్రభుత్వానికేమి తెలుసు వ్యాపారం సంగతి? పన్నులు కట్టుకుంటూ, దొంగల్ని పట్టుకుంటూ, మురికి కాలువలు త్రవ్వుతూ కాలక్షేపం చెయ్యక దీనిలో తల దూర్చటం దేనికి? ప్రభుత్వాన్ని, ఆహార సంస్థలని పరిహాసం  చేసే  ప్రజల మాటలు విని గొప్పగా ఆనందించేవాడు. వాళ్ళతో పూర్తిగా ఏకీభవించి వాళ్ళతో మొర పెట్టుకునేవాడు,  మీలో చదువుకున్నవాళ్ళు ప్రభుత్వానికి  అసెంబ్లీలో ఈ విషయాలు తెలియజేసి పుణ్యం కట్టుకోరాదా?. ఇది చాలా అవమానకరం.’’

త్వరలో తెలుసుకున్నాడు, తను ఇంకా మనగలుగుతున్నాడు. కానీ ఇంకో వేషంలోకి మారక తప్పదు. ఆఫీసర్ల కోసం పడిగాపులు కాచి  అనేక మందిని కలిసి, ఫారాలని నింపి, చివరికి చౌక ధాన్యం డిపో ద్వారా వ్యాపారం కొనసాగించాడు. అయినప్పటికీ దీనికీ , తన పాత వ్యాపారానికీ ఏ మాత్రం పోలిక లేదు. తన ఊరి పొలాల్లో తన రైతులు  కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వానికి అప్పజెప్పెయ్యాలనే విషయం తెలిసిన తరువాత విచారంగా నిట్టూర్చాడు. ఈ వ్యవహారమంతా దుర్మార్గమనిపించింది. ‘నా పంటకి వాళ్ళు ధర కట్టాలా! నేను పండించుకున్నదాన్ని వాడుకోవటానికి ఒకరి అనుమతి పొందటమా! ఈ ప్రణాళిక అంతా క్రూరంగా బాధించడమే అనిపించింది’ కానీ ఈ పరిస్థితిలో బాహాటంగా ఎక్కువ  వ్యతిరేకతని చూపకుండా  పరిస్థితులకి తలవంచక  తప్పలేదు.అతని జిత్తులమారి మెదడు మాత్రం పనిచెయ్యటం మొదలెట్టింది. అలాంటి ఏ మెదడూ ఎప్పుడూ పనిచేసి ఫలితాలు సాధించక పోలేదు. నిద్ర తక్కువగా పోయేవాడు, భోజనంలో రుచి తెలిసేది  కాదు. రాత్రి సమయమంతా అతని మనసు ఈ సమస్యపైనే. చివరికి ఒక పరిష్కారం దొరికింది.

తనలోనే బాధ వ్యక్తం చేసుకున్నాడు.– ‘నాకు పొలాల్లో ధాన్యం ఉంది. గోడౌన్లో సంచుల నిండా సరుకు ఉంది. నా తెలివి వుపయోగించి వాటిని వినియోగం చేసుకోకపోతే నేను నాశనమై పోతాను. ప్రభుత్వం మాత్రం ఏమి కోరుతోంది? అది ఏమి చెయ్యాలని అనుకుంటోందో, దాన్ని కాగితం మీద చక్కని రూపంలో ఉంచుతుంది. దానికి చిక్కున పెట్టే తంత్రాంగం ఏదో ఒకటి చెయ్యాలి. దాని విలువ దానికుంటుంది.’ అమ్మకానికి, తన వాడకానికి కావలసిన బియ్యం దాచి, బయటకు కాగితం మీద గాని కనిపించే రీతిలో గాని ఉంచలేదు. తన వద్ద ఉన్న నిలువలు, లెక్కలు పరిశీలించే వ్యక్తులకు అధిక ధనం కుమ్మరించాల్సొచ్చింది. కానీ అందుకు ఏ మాత్రం బాధపడలేదు. అందుకోసం ఒక పది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తే, దాని అర్థం వేయి రూపాయల విలువ గల  ధాన్యాన్ని వెదికి చూసే కళ్ళని కప్పి వేసినట్లే. పూర్తి అంగీకారంగానే  ప్రజలు డబ్బు ఎంతైనా వెచ్చించి బియ్యం కొనటానికి సిద్ధంగా ఉన్నారు. ధరల నిర్ణయానికి తనే (సోల్‌ మాస్టర్‌). ఈ ఆలోచన రాగానే ఈ నిషిద్ధాలు, అదుపులు అన్నీ తనకి ఒక వరం లాంటివే అని తనలో తనే భాష్యం చెప్పుకున్నాడు. తార్కికంగా అనుకున్నాడు, ‘దేవుడు అన్నీ మంచికే చేస్తాడు’ అని.

వారానికి రెండు సార్లు కొన్ని అణాలు దానంగా ఇచ్చేవాడు. తన విషయంలో దేవుడు చల్లగా చూస్తున్నందుకు ప్రతి శుక్రవారం గుళ్ళో కొబ్బరికాయ కొట్టి వచ్చేవాడు. క్రమేణా తన పనిలో  అనుభవం సంపాదించి అన్ని పరిస్థితులకు తనే యజమానిగా మారిపోయాడు. డిపో దగ్గర హస్త లాఘవంతో బియ్యం కొలిచేటప్పుడు నైపుణ్యాన్ని వినియోగించి ఆ రోజు పూర్తి అయ్యేసరికి ఎవరిదీ కాని కొంత బియ్యం మిగల్చగలిగేవాడు. దుకాణం తెరవటంలో ఆలస్యం, మూసెయ్యటం, తిరిగి తెరవటం లాంటివి పదే  పదే  చేసి బియ్యం అమ్ముడు అయ్యేందుకు అందరూ తన చుట్టూ తిరిగేట్లు చేసేవాడు. వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పుడు  తన దగ్గర బియ్యంలేక, తన దగ్గర బియ్యం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు లేకుండా ఉండేవి. ఈ విధమైన నేర్పరితనంతో ప్రతి వారం చాలా మొత్తంలో బియ్యం నిలువ చెయ్యగలిగేవాడు. తన గ్రామం నుంచి మాత్రం పంటలో కొద్ది భాగం మాత్రమే  ఆహార సంస్థకు చేరేది.

అతి త్వరలో ఇంటి వెనుక వీధిలో ఉన్న ఒక ఇంటిని గోడౌన్‌గా చేసి, దాన్లో బియ్యం బస్తాల్ని నేలమీద నుంచి కప్పు వరకూ ఒకదానిపై ఒకటి పేర్చగలిగాడు. ‘‘నా నామమాత్రమైన భుక్తి కోసం’’ అంటూ ఆ ఇంట్లో కాగితాలు, పాత బస్తాలు ఉంచి అవన్నీ కాగితం మిల్లుకి ఇవ్వటానికి దాస్తున్నట్లు  అందరికీ అవగాహనయ్యేట్లు చేశాడు. బియ్యం ఎప్పుడూ తనకి బాగా తెలిసిన ఖాతాదారులకే  అమ్మేవాడు. అందులోనూ కొద్ది మొత్తాల్లో మాత్రమే  ఇచ్చేవాడు.  డబ్బు అడ్వాన్సుగా తీసుకొని తరువాత రమ్మనేవాడు. అందరితో ఒక సందేహం వెలిబుచ్చుతూ ఉండేవాడు ‘ఒకతని వద్ద  కొద్ది బియ్యమే ఉన్నాయి. నాకు తెలియదు అతని వద్ద ఇంకా వున్నాయో లేదో. అయితే అయింది, డబ్బు నాకిచ్చి వెళ్ళండి.’ ఒకొక్కసారి ఇచ్చిన డబ్బుని తిరిగి ఇచ్చి వేసి ‘‘క్షమించండి , ప్రస్తుతం సరుకు అందుబాటులో లేదు, ఆ మనిషి తన దగ్గర ఉందన్నాడు. మీకు తెలుసు ఈ రోజుల్లో ఇలాంటివి ఊహించటం ఎంత కష్టమో!......’’

ఒక రోజు సాయంత్రం మామూలుగా దుకాణం మూసేసి తాళం చెవి జేబులో పెట్టుకొని రోడ్డెక్కాడు. అతని ఎదురుగా ఒక మనిషి ఆగి అన్నాడు,‘‘ఓహ్‌! నా అదృష్టం కొద్దీ దుకాణం కట్టేశారు’’ వీధిలో నిలబడి మాట్లాడే వాళ్ళని సాధారణంగా సుబ్బయ్య పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడూ అలా ఎదురుపడ్డ వాళ్ళని తప్పించుకునేవాడు. కారణం వాళ్ళందరూ తన కోసం ఒకే పనిమీద, అంటే బియ్యం కోసమే వచ్చేవాళ్ళు. బియ్యం కోసం వాళ్ళు మొరపెట్టుకోవడం  అతనికి విసుగు తెప్పించేది. బియ్యం దొరకనప్పుడు  బియ్యం, బియ్యం అని రోజంతా అడిగే బదులు జొన్నో, మొక్కజొన్నో ఎందుకు తినరు? మనుష్యులందరూ బంగారం ఎలా సంపాదించలేరో  చాలా మంది బియ్యం కూడా కొనే స్థితిలో ఉండరు. ‘‘ఇప్పుడు నాకు వేరే పని ఉంది. ఇక్కడ ఆగి నీతో మాట్లాడలేను’’ అన్నాడు సుబ్బయ్య. మర్యాద పాటించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను సుబ్బయ్య వెనుకే అడుగులు వేస్తూ వెంబడించాడు. అతను సుబ్బయ్య భుజం పట్టుకొని, ‘‘నువ్వు దుకాణం తెరవాలి, బియ్యం ఇవ్వాలి. నిన్ను నేను వెళ్ళనివ్వను.’’ అతని మాటల్లో తీవ్రతకి సుబ్బయ్య ఆగాడు.

‘‘నా ఇద్దరు పిల్లలు తిండి లేక ఏడుస్తున్నారు. నా ముసలి తల్లి శోష వచ్చి పడిపోయే స్థితిలో ఉంది. వాళ్ళు ఆకలితో మలమలా మాడుతున్నారు. నా రేషన్‌ కార్డ్‌ మూడు రోజుల క్రితమే ఉపయోగించాను. ఇంకేమాత్రం వాళ్ళని ఆ స్థితిలో చూడలేను... దయచేసి ఎలాగో అలా బియ్యం ఇయ్యి. ఇవ్వాళ బియ్యం కోసం ఊరంతా తిరిగాను... కానీ ఎక్కడా ఒక్క గింజ కూడా దొరకలేదు. నేను బియ్యం తెస్తానని ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటారు. వాళ్ళు... దేవుడికే తెలియాలి నేను ఉట్టి  చేతులతో వెడితే ఏమి చేస్తారో.’’ ‘‘అయితే ఎంత కావాలి?’’ ‘‘ఒక శేరు ఇప్పించు. ఇంటి దగ్గర ఆరు ప్రాణాలు ఉన్నాయి తినటానికి.’’  సుబ్బయ్య అతన్ని చీదరగా చూస్తూ, ‘‘పెందలాడే ఎందుకు రాలేక పోయావు?’’ అన్నాడు. ‘‘చెప్పాను కదా ఊరంతా తిరిగానని.’’ ‘‘నీ దగ్గర ఎంత ఉంది?’’ అతను అర్ధ రూపాయి తీసి చూపించాడు. ఆ నాణాన్ని సుబ్బయ్య విసుగ్గా చూసి,‘‘దానితో నీకు శేరు  బియ్యం వస్తాయనుకుంటున్నావా !’’‘‘కానీ రూపాయకి మూడు శేర్లు  వస్తాయి కదా? అవునా, కాదా?’’ ‘‘అదంతా ఇప్పుడు మాట్లాడకు. రేషనింగ్‌ ధరలు లేదా, ఇంకా అలాంటి అసందర్భపు మాటలు మాట్లాడితే పస్తులు ఉండాల్సి వస్తుంది.’’ ఉద్రేక పడ్డాడు. కడుపు మాడుతున్నప్పుడు కూడా ప్రజలు పిచ్చి పిచ్చి అభిప్రాయాలను పట్టుకొని వేలాడుతుంటారు .

‘‘నీ దగ్గర ఇంకొక అర్ధ రూపాయి ఉంటే చెప్పు, బహుశా ఒక శేరు బియ్యం వస్తాయి’’ సుబ్బయ్య అన్నాడు. బాధపడుతూ అతను తల ఊపాడు, ‘‘ఇది నెలాఖరు, నా దగ్గర ఇదే ఉంది.’’ ‘‘అయితే నీకు ఒక శేరు మాత్రమే వస్తాయి. నాకు తెలిసిన ఎవరైనా ఈ ధరకి ఒప్పుకుంటారు.’’ ‘‘సరే’’  అన్నాడు ఆ మనిషి, ‘‘ఏమీ లేనిదానికంటే నయం’’ ‘‘ఆ నాణాన్ని ఇలా ఇయ్యి’’ సుబ్బయ్య అన్నాడు. ఆ నాణెం తీసుకొని ‘‘నాతో రాకు. అతనున్నాడు చూశావూ, చాలా అనుమానం మనిషి. ఎవరినైనా నాతో చూస్తే వెంటనే వద్దు అంటాడు. నువ్వు ఇక్కడే ఉండు. ఇప్పుడే వస్తాను. అతను ‘వద్దు’ అంటే  అది నీ అదృష్టం  మీద ఆధారపడుతుంది. అంతే. నాణెం ఇవ్వు.’’ సుబ్బయ్య ఆ అర్ధ రూపాయి తీసుకొని వెళ్ళాడు. ఆ రెండవ మనిషి వీధి మూల నిలబడ్డాడు. ‘ఎంతసేపు నేనిలా నిలబడాలి?’ అని వెనక్కి తిరిగిన సుబ్బయ్యని అడుగుదా మనుకున్నాడు. కానీ అది అతన్ని చికాకు పరుస్తుందని భయపడి మానుకున్నాడు. తనకొచ్చిన సందేహం తీరింది, ఎందుకనంటే సుబ్బయ్య వెళ్లి మూడు గంటలు పైగా అయింది. ఇంకా అతని జాడ లేదు. రాత్రి బాగా పొద్దు పోయింది. జన సంచారం పలుచబడింది. మనుష్యులు నీడల్లా మాత్రమే కనిపిస్తున్నారు. ఊరు సద్దుమణిగింది. అతను చాలా సార్లు తనలోనే గొణుక్కున్నాడు, ‘‘ఏమి జరిగుంటుంది? సుబ్బయ్య ఎక్కడ? ఎక్కడికెళ్ళి ఉంటాడు అబ్బా! ఇంటికెప్పుడు వెళ్ళాలి, అన్నం ఎప్పుడు వండుకోవాలి? పిల్లలు, ఆహా!’’

వెనక్కి తిరిగి సుబ్బయ్య వెళ్ళిన దిశలోనే నడిచాడు. కానీ గమ్యాన్ని చేరలేకపోయాడు. ఎందుకంటే, సుబ్బయ్య ఆ దిక్కుగా వెళ్ళినట్లు నటించి  తన రహస్య గోడౌన్‌ ఎక్కడో తెలుస్తుందని వేరొక పక్కకి వెళ్ళాడు. ఆ వ్యక్తి నిశ్శబ్దంగా ఉన్న వీధుల్లోంచి పైకి క్రిందికీ తిరిగి, సుబ్బయ్య దుకాణానికి తిరిగి వచ్చాడేమోనని చూడటానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడా లేడు. వేసిన తలుపు  తాళం వేసినట్లే  ఉంది.  ఏమి చెయ్యాలో తోచక గమ్యం లేకుండా ఆ వీధిలోనే తచ్చాడి, చివరికి సుబ్బయ్య ఇంటికి వెళ్లి తలుపు కొట్టాడు. సుబ్బయ్య భార్య తలుపు తీసింది. వచ్చింది తన భర్తే అనుకోని ‘ఈ రోజు బాగా ఆలస్యమయింది...’ అని కొత్త మనిషిని చూసి తన తప్పు తెలుసుకుంది. అతను అడిగాడు, ‘‘సుబ్బయ్య ఇంట్లో ఉన్నాడా?’’ ‘‘లేదు ఆయన ఇంకా ఇంటికి రాలేదు.’’ అని కంగారుగా చూసింది.

మరుసటి ప్రొద్దున్న ఆరు అయ్యే సరికి వాళ్లకి ధైర్యం సన్నగిల్లింది. ఆమె అడగక తప్పలేదు, ‘‘గోడౌన్‌ లో చూశావా?’’ ‘‘ అది ఎక్కడ?’’ ఆమెకి చెప్పక తప్పలేదు. ఆమెకు మాత్రమే ఆ స్థలం ఎక్కడో  తెలుసు కనుక. వాళ్ళిద్దరూ సందులు దాటుకుంటూ ఒక బిల్డింగ్‌ దగ్గరికి  చేరారు. దాని తలుపు లోపల గడియ వేసి  ఉంది. తలుపు కొట్టారు. ఆ ఇల్లు మంచి రక్షణకోసం బలంగా కట్టినది. ఎలుకలు కూడా రాజమార్గంలోంచి మినహా లోపల ప్రవేశించ లేవు. చివరికి ముందు వెంటిలేటర్‌  బద్దలు కొట్టాల్సి వచ్చింది. గదిలో ఒక మూల టార్చి లైట్‌ నేల మీద పడి  ఉంది.  దానికి కొద్దిగా ప్రక్కన అర్ధ రూపాయి నాణెం, ఇంకా కొద్దిగా అవతల గుట్టగా క్రింద పడిపోయి ఉన్న బస్తాల కిందనుంచి ఒక చెయ్యి బయటకి వచ్చి కనిపించింది. విచారణలో తేల్చిందేమిటంటే, ‘ప్రమాదవశాత్తూ బియ్యం బస్తాలు దొర్లి మీద పడటం వల్ల ప్రాణం పోయింది’ అని.   
 

- మూలం : డాక్టర్‌ ఆర్‌.కె.నారాయణ్‌
- అనువాదం: వేమవరపు భీమేశ్వరరావు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top