శ్మశానం

Special Story Of Crime In Funday On 01/12/2019 - Sakshi

నదీతీరంలో శ్మశానం. అదొక పెద్ద మైదానం. మరుభూమి. నల్లమట్టి గడ్డకట్టిన నెత్తురులాగా.
శ్మశానానికి పక్కగా కొన్ని చెట్లున్నాయి. అక్కడ ఎప్పుడూ శిశిరరుతువే. ఆ చెట్టుశాఖలు క్షామపీడితులైన మనుషుల్లాగా ఎల్లప్పుడూ మేఘాల వంక చూస్తూ ఉండేవి.
ఆ చెట్ల మీద అదేమి కారణమో, కాకులు, గద్దలు తప్ప మరింకొక పక్షి ఏదీ వాలేదేకాదు, అక్కడక్కడ ఎముక ముక్కలు, పుర్రెలు దొర్లుతూ ఉండేవి. నది మెల్లగా ప్రవహించిపోతూ అప్పుడప్పుడు ఉత్సాహం కలిగితే వరదగా వచ్చి శ్మశానంలో వ్యాపించి ఉన్న నిరాశా భావాన్ని చూసి, నాకెందుకని తన దారిని తాను తల వంచుకొని వెళ్ళిపోయేది.
ఒకనాడు కొంతమంది అక్కడికి ఒక శవాన్ని తీసుకొని వచ్చారు. శవాన్ని చితి మీద పెట్టారు. ఒక వృద్ధుడు చితి మీద నెయ్యి పోశాడు. ఒక చిన్న పిల్లవాడు ఆ చితికి నిప్పంటించాడు.
బీదవాడి గుడిసెలాగా చితి భగభగ మండడం ఆరంభించింది.
మొగవాళ్లంతా  ఒకవైపున ఉదాసీనంగా కూర్చున్నారు. ఆడవాళ్లు ఇంకొక వైపున గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు.
చితి భగ్గున మండుతున్నది. ఇద్దరు మనుషులు పెద్ద పెద్ద కర్రలతో శవాన్ని అదుముతున్నారు. సగం కాలిన మాంసం ముక్కలు అటూ ఇటూ ఎగిరి పడుతున్నవి. మంటలు కుక్కలలాగా ఎముకలను పళ్ళకు కరుచుకొని కటకటలాడిస్తున్నవి.
చీకటిపడింది. నక్షత్రాలు ప్రకాశించడం ఆరంభించినవి. ఎటు చూచినా ప్రశాంతత వ్యాపించి ఉన్నది. ఎముకల కటకటలు తప్ప ఇంకే ధ్వని వినపడడం లేదు.
శవంతో వచ్చిన అజబీలోహార్‌ చితిలో నుండి నిప్పు తీసి చిలుము ముట్టించాడు. రెండు మూడు దమ్ములు పీల్చి తనతో మాట్లాడే వాళ్ళెవళ్లయినా ఉన్నారా? అని అటూ ఇటూ చూశాడు. అందరూ ఉదాసీనంగా కనపడ్డారు.
మళ్ళీ రెండు దమ్ములులాగి ఆకాశం వంక చూసి అజ్ఞాతమిత్రుడితో సంభాషణ ప్రారంభించాడు.
‘‘తుపాకీగుండు సరీగా గుండెల్లో  తగిలింది. సైడ్‌ కాలువలో దాక్కొని నేను అన్నీ చూస్తూనే ఉన్నాను. మనవాడు జెండా తీసుకొని ముందున్నాడు. ఉత్సవం చౌకు వరకు అడ్డు లేకుండానే పోయింది. కాని, అక్కడ పోలీసువాళ్ళు అడ్డగించారు. ముందుకు పోకూడదన్నాడు పోలీసు ఇన్‌స్పెక్టర్‌. మిగతా వాళ్ళంతా వెనకడుగు వేశారు. కాని మనవాడు మాత్రం ‘మేము ముందుకే పోతామ’న్నాడు.
‘‘కొంతమందయినా పారిపోవడానికి అవకాశం ఎక్కడ ఇచ్చారు? పోలీసులు రావడం, మీద బడడం రెండూ ఒకేసారి జరిగినవి. జనం పరుగెత్తుతూ కొంతమంది గుర్రాల కాళ్ల క్రిందా, కొంతమంది పక్క కాలవల్లోనూ పడ్డారు. లాఠీదెబ్బలకు ఎంతమంది కాళ్లూ చేతులూ విరిగాయో లెక్కేలేదు’’ అన్నాడు ఛోటూ.
అజబీలోహర్‌ ‘‘అవును. నిజమే. అయినా అతడు వీరుడు. జెండాను కిందకు దింపకుండా అలాగే నిలబడ్డాడు. ఇంతలో అటు నుండి జనం రాళ్లు విసిరారు. ఇటునుండి పోలీసులు తుపాకీ గుండ్లు పేల్చారు.
తుఫానుకు మామిడిచెట్టులాగా అంత బలవంతుడైన వాడూ ఒక్కడు  గుండు దెబ్బకు నేల మీద పడిపోయాడు.
అందరూ శాంతంగా ఆ చితిలో కాలుతున్న వీరుని కళేబరం వంక చూశారు.
‘‘అందరితో పాటుగా అతను పారిపోతే బతికేవాడు. అంత అదృష్టం లే’’ అన్నాడు నాయకుడు.
లక్కూ మేస్త్రీ అందుకున్నాడు–
‘‘నాయకుడా! నువ్వన్నది తప్పు. ఈవిధంగా మాట్లాడితే అతని ఆత్మకు కూడా అపచారం చేసినట్లవుతుంది. అతడు అజ్ఞాని అయితే కావచ్చును. కాని ఇతర్ల వలే పిరికివాడు మాత్రం కాడు. జాతీయ జెండా గౌరవాన్ని రక్షించాడు’’
‘‘అయితే ఈ మూడుమూళ్ల జెండా మీదనే దేశగౌరవం అంతా ఆధారపడి ఉన్నదన్నమాట. భార్యాపిల్లలూ ఉన్నారు. ముసలి తల్లిదండ్రులు మీరున్నారు. అతను చనిపోయాడు. మీ అందరికీ దేశం అన్నం పెడుతుందా? మీ గతి ఏమిటి?’’ అన్నాడు నాయకుడు.
లక్కూ దీర్ఘంగా నిట్టూర్చాడు. నాయకుడు అన్నమాట కూడా నిజమే.
దేశం ధనవంతులకేగాని, బీదవాళ్లకు కాదు. నేలకు బాడుగా, నీళ్లకు పన్నూ, దీపానికి టాక్సూ, చస్తే శ్మశానంలో కాపరికి నజరానా....అంతా డబ్బవుతుంది. పోనీ భగవంతుడున్నాడు కదా అనుకుంటే కానుకలు నజరానాలు ఉంటేనే గాని ఆ దేవుడి దర్శనం కూడా లభించదు. బీదవాళ్లు డబ్బెక్కడ తెస్తారు?
‘‘అయితే పిల్లవాడు మాత్రం మూర్ఖుడా? తన ప్రాణాలను ఎందుకు బలి ఇచ్చాడు?’’ అని లక్కూ ఆలోచించడం ఆరంభించాడు.
పిల్లవాడు నేటి ఉదయం వరకు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఒక్కొక్క సమ్మెట దెబ్బకు ఇనుపకమ్ముల్ని కూడా నీరుగా చేసి పారేశాడు. కాని ఒక చిన్న తుపాకీగుండు అంతటి బలశాలి అయిన అతని గుండెల్లో జొరబడి, ఎముకల్ని విరగగొట్టి, మాంసాన్ని చీరి లోపలకు జొరబడింది. అతను చచ్చిపోయినాడు.
బతకడం ఎంత కష్టం. చావడం ఎంత తేలిక!
‘‘పోనీ దేశం కోసం ప్రాణాల్ని అర్పించాడు. పేరూ, ప్రశస్తీ ఉంటుందనుకుంటే ఇలాంటి వాళ్లను అడిగేదెవరు? పేరు ప్రశస్తులు పెద్దవాళ్ళకూ నాయకులకూను, బీదవాళ్లు బలి అయితే మాత్రం వాళ్ళకు ఊరేమిటి? పేరేమిటి? కొద్దిరోజులు అతని దగ్గరి బంధువులు మాత్రం జ్ఞాపకం పెట్టుకుంటారు. సమయం గడిచినకొద్దీ వాళ్లు కూడా మరచిపోతారు’’
లక్కూ అలాగే కూర్చొని ఆలోచిస్తూనే ఉన్నాడు. రకరకాల భావాలు అతని స్మతిపథంలోకి వస్తున్నవి.
‘‘ఉత్సవ ప్రారంభంలో తన కుమారుడి చేతికి జెండా ఇచ్చిన పెద్దమనుçష్యులెక్కడున్నారు? శ్మశానం దగ్గరకైనా రారేం? వారంతా పెద్దవారు. ఈ శూద్రుల శ్మశానంలోకి వస్తారా? రారు’’
అయితే, పిల్లవాడు తప్పు చేసినట్లేనా? జెండా గౌరవాన్నీ, దేశ గౌరవాన్నీ కాపాడడానికి తుపాకీగుండుకు ఎదురు రొమ్మును సమర్పించాడు, అతనికప్పుడు ఎవ్వరూ జ్ఞాపకం వచ్చి ఉండరా? భార్యా, పిల్లలూ...
ఇంతలో ఆడవాళ్లు ఏడుపు చాలించారు. వాచిన కళ్లతో శవం వంక చూశారు. శవం కాలి బూడిదైపోయింది. కొద్దికొద్దిగా అక్కడక్కడ మంట మండుతున్నది.
లక్కూకు మహాకోపం వచ్చింది,
‘‘ప్రపంచం స్వార్థాంధం, తన కుమారుడు దేశం కొరకు తన జీవితాన్నే బలి చేస్తే–ఇతర్ల కొరకు తన ఎదురురొమ్మును తుపాకీగుండుకు ఎరగా సమర్పిస్తే–చచ్చిపోయిన వాడి భార్యాపిల్లల్నీ, ముసలి తల్లిదండ్రుల్నీ ఓదార్చేవారు కూడా ఎవ్వరూ లేరు’’ కోపమంతా దిగమింగు కొన్నాడు.
ఎవరి మీద కోపం?
‘‘అజబీ! ఇంకా ఎంతసేపు పడుతుందో చూడు, ఆకలికి ప్రాణం పోతుంది’’ అన్నాడు నాయకుడు.
ఛోటూ ఏదో మరిచిపోయిన మాట జ్ఞాపకానికి వచ్చినట్లు ముఖం పెట్టి ‘‘చెప్పడం మరిచిపోయాను. నేను వచ్చేటప్పుడు హవల్‌దార్‌ కరీమ్‌ఖాన్‌ శవంతో శ్మశానందాకా పోయిన వాళ్ల పేర్లు కూడా ప్రభుత్వం వారు రాసుకుంటారని చెప్పాడు’’ అన్నాడు.
‘‘ఆ! అదేమిటి?’’
‘‘చనిపోయిన వాడు ప్రభుత్వం వారికి విరోధి కింద లెక్క. అతను గుండు పేల్చకపోయినా గుండు దెబ్బ తిన్నాడు. అందువల్ల ప్రభుత్వానికి అతనంటే ద్వేషం’’
‘‘నిజమేనోయి ఛోటూ’’ అంటూ నాయకుడు భయంగా అటూ ఇటూ చూడడం ప్రారంభించాడు.
‘‘కరీమ్‌ఖాన్‌ హవల్‌దార్‌ సామాన్యుడా? పెద్ద పెద్ద షావుకార్లలాంటి వాళ్లు కూడా అతన్ని చూసి అదిరిపోతున్నారు. వాడు తలుచుకుంటే ఇళ్లు దోపిడి కూడా చేయించగలడు’’ అన్నాడు అజబీలోహర్‌.
శ్మశానంలో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా కరీమ్‌ఖాన్‌ పేరు వినడంతోనే అదిరిపోయినారు.
అంధకారపూరితమైన అర్ధరాత్రిని చెట్లు బిచ్చమడుగుతున్నట్లుగా నక్షత్రప్రకాశంలో కనిపించసాగినవి.
లక్కూ మోకాళ్ళ మీద అర్ధచేతనావస్థలో కూర్చొని ఉన్నాడు. సహాయానికి వచ్చిన వారంతా మెల్లమెల్లగా ఒక్కరొక్కరే జారుకున్నారు.
కరీమ్‌ఖాన్‌ ఏమి చేస్తాడోనని భయం. చివరకు నలుగురో అయిదుగురో మిగిలారు.
లక్కూ క్షణకాలం లోలోపలనే కుళ్ళికుళ్ళి ఏడ్చాడు. 
కుమారుడు చనిపోయినందుకు కాదు. సోదరదేశస్థుల పిరికితనానికి. ఒకరోజున అందరూ ఈ చితి మీదకు చేరేవారే. అయినా ఎంత భయం! ఎంత స్వార్థం!!
మళ్ళీ ఆలోచనలు–
‘‘కరీమ్‌ఖాన్‌ మాత్రం సామాన్యుడా? పరమ దుర్మార్గుడు.
‘‘ప్రతాపసింహుడు కాంగ్రెస్‌ సంఘ కార్యదర్శి. దేశభక్తుడు. కరీమ్‌ఖాన్‌ అత్యాచారాలు చేస్తే నన్ను రక్షించలేడూ?’’
‘‘సేuŠ‡ చజ్జూమల్‌–కాంగ్రెస్‌ అధ్యక్షుడు. నా కుమారుడు దేశం కోసం ప్రాణాలను ఇచ్చాడు కనుక నేను ఆయనకు ఇవ్వవలసిన రుణాన్ని రద్దు చెయ్యడూ?’’
‘‘వర్షాకాలం వస్తున్నది. ఇంటికప్పు లేచిపోయింది. కప్పుకోవాలి. ఇంటిగోడ పడిపోయింది. బాగు చేయించుకోవాలి. కొలిమి చెడిపోయింది. బాగు చేయించుకోవాలి, చేతుల్లో శక్తి లేదు. డబ్బు లేదు. ఎవరు సహాయం చేస్తారు?’’
సాటి కూలివాడు – తోటి కూలివాడు చేసిన తుపాకి గుండుదెబ్బకు చనిపోయాడు. ఆశ్చర్యం!
చితి చల్లారింది. ఆడవాళ్ళు కుండతో నీళ్ళు తెచ్చి చితి మీద పోశారు. మొగవాళ్ళు చితి మీద వేడి కన్నీళ్ళు కార్చారు.
‘‘నారాయణ, నారాయణ’’ అని అందరూ భగవన్నామ స్మరణ చేశారు. నక్కలు దూరన్నుండి ‘‘హువా, హువా’’ అని జవాబిచ్చినయి.
అందరూ ఇళ్ళకు బయలుదేరారు. లక్కూ కూడా బయలుదేరాడు. కాళ్ళ  దగ్గర అతనికేదో వస్త్రం కనిపించింది. దాన్ని ఎత్తి చూశాడు. చిరిగి పోయిన మూడురంగుల జెండా. 
మృతవీరుడు–దేశభక్తుడు... చని పోయేటప్పుడు హృదయానికి కప్పుకున్న జెండా!   
అంత అందమైన జెండా ఇప్పుడు ఎంత అందవిహీనమైపోయింది!
కాని, ఇప్పుడది రక్తంలో తడిసి ఎర్రనైపోయింది. ఎరుపు–జీవితానికి, మృత్యువుకూ సంబంధించిన రంగు!!  
ఆ జెండాలో ఏమి మహత్యం ఉన్నదో.
జనం నవ్వుతూ నవ్వుతూ దాని కోసం ప్రాణాలను అర్పిస్తారు.
మామూలు దూది, మగ్గం మీద నేశారు, పచ్చి రంగులు వేశారు.    
దానిలో ఏ విశేషమైనా ఉండనీ, ఇప్పుడది ఒక మనుష్యుని రక్తంతో రంజితమయింది. ఆ రక్తం కూడా వసంతరుతువులోని పుష్పంలాగా, మండుతూ ఉండే అగ్నిలాగా తాజాగా ఉన్నది. తన ఇంట్లో గూట్లో ఉన్న రాతిబొమ్మను తీసివేసి దాని స్థానంలో తన కుమారుని రక్తంతో సిక్తమైన జెండాను ప్రతిష్ఠించ నిశ్చయించుకున్నాడు.
ఏడుస్తూ స్త్రీలు ఇంటికి వెళ్ళారు.      
తేలికగా గాలి వీచింది. రాత్రి కాంత పమిటచెరుగు మంచు వల్ల తడిసిపోయింది. దూరాన్నుండి నది గాయపడిన పక్షిలాగా దీర్ఘంగా మూలిగింది.   
భూమి మీద అగ్ని చల్లారిపోయింది. కాని ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తూనే ఉన్నవి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top