అజ్ఞాత వ్యక్తి

Special Story About Crime By Mahaboob Basha On 17/11/2019 - Sakshi

మహబూబ్‌ బాషా

తెల్లతెల్లవారుతుండగా ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ కుమార్‌కి స్టేషన్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. డ్యూటీలో ఉన్న ఎస్సై మాట్లాడుతూ.. ‘సార్‌ గుండమ్మ కాలనీలో ఓ హత్య జరిగిందని కంప్లయింట్‌ వచ్చింది. మిలటరీలో పని చేసే మహేష్‌ అనే వ్యక్తి సెలవు మీద ఇప్పుడే ఇంటికి తిరిగొచ్చాడట. ఇంట్లో భార్య శవం చూసి ఫోన్‌ చేశాడు’ అన్నాడు ఎస్సై. 
‘నువ్వు వెంటనే ఫోరెన్సిక్‌ టీమ్‌ని తీసుకుని అక్కడికి వెళ్లు. నేను కూడా నేరుగా అక్కడికే వచ్చేస్తాను’ అంటూ ఎస్సైకి సూచనలిచ్చి ఫోన్‌ కట్‌ చేశాడు విజయ్‌.
అప్పుడే గోడ గడియారం ఆరు గంటలు కొట్టింది. విజయ్‌ లేచి గబగబా ముఖం కడుక్కుని యూనీఫాం ధరించి వాహనంలో ఘటనా స్థలానికి బయలుదేరాడు. గుండమ్మ కాలనీలో ప్రవేశించినప్పుడు కాలనీ చివర విసిరేసినట్టున్న ఓ ఇంటి ముందు జనం గుమిగూడి ఉండటం కనిపించింది. అదే సిపాయి మహేష్‌ ఇల్లు అని విజయ్‌కి అర్థమైంది.
ఇంటి ముందు వాహనం ఆపి కిందికి దిగాడు. మిలటరీ దుస్తుల్లో విచారంగా నిలుచున్న ఓ యువకుడు విజయ్‌ దగ్గరికొచ్చి నిలబడ్డాడు. ‘సార్, మాలతి భర్త, మహేష్‌ని నేనే’ అన్నాడు. విజయ్‌ అతని వెంట ఇంట్లోకి ప్రవేశించాడు. విజయ్‌ కన్నా ముందే అక్కడికి చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్‌ నిపుణులు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. బెడ్‌ రూమ్‌లోని మంచం పక్కన నేలపై ఓ ముప్ఫై ఏళ్ల యువతి మృతదేహం ఉంది. విజయ్‌ కొద్దిగా వంగి మృతదేహాన్ని పరిశీలించాడు. ఆ యువతి శరీరంపై ఎక్కడా గాయమైన ఆనవాళ్లు లేవు శరీరం రంగు మారలేదు. గొంతు నులిమిన గుర్తులు కూడా లేవు. ఆమె ఎలా చనిపోయిందో విజయ్‌కి అంతుపట్టలేదు.
‘ఏం జరిగిందో వివరంగా చెప్పు’ పక్కనే నిల్చున్న మహేష్‌ని అదిగాడు విజయ్‌.
‘సార్, నేను ఆర్మీలో పని చేస్తున్నాను. మాదొక పల్లెటూరు. రెండేళ్ల క్రితం మాలతితో నా పెళ్లి అయ్యింది. ఆమెకు పల్లెలో ఉండటం ఇష్టం లేదు. అందుకే పట్నంలో ఈ ఇల్లు అద్దెకు తీసుకున్నాను. నాకు సెలవు దొరికినప్పుడల్లా ఇంటికి వస్తాను. ఈ రోజు కూడా అలాగే వచ్చాను. ఐదు గంటలకు ట్రైన్‌ దిగాను. మాలతికి సర్‌ఫ్రెయిజ్‌ ఇద్దామనుకుని ముందే ఫోన్‌ చేయ్యలేదు. మా కాలనీ రైల్వేస్టేషన్‌కి దగ్గర కావడంతో కాలినడకన వచ్చాను. కాలనీకి సమీపించినప్పుడు ఓ యువకుడు వడివడిగా కాలనీలోంచి బయటికి వెళ్లడం కనిపించింది. నేనతడ్ని పట్టించుకోకుండా ఇంటికి వచ్చాను. ఇంటి తలుపు తెరచి ఉంది. లోపలికొచ్చి చూస్తే ఈ దృశ్యం కనిపించింది. వెంటనే స్టేషన్‌కి కాల్‌ చేశాను’ అన్నాడు మహేష్‌.
ఫోరెన్సిక్‌ నిపుణులు శవం ఫొటోలు తీసి ఘటనా స్థలంతో పాటు ఇల్లంతా అధారాలు, వేలిముద్రలు సేకరించారు. ఇంటి వరండాలో వారికి కాల్చి పారేసిన రెండు సిగరెట్‌ పీకలు దొరికాయి. గ్లౌజ్‌ ధరించిన చేత్తో వాటిని సేకరించి ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో వేసుకున్నారు. 
‘నువ్వు సిగరెట్లు కాలుస్తావా?’ మహేష్‌ని అడిగాడు విజయ్‌.
‘నాకు పొగ తాగే అలవాటు లేదండీ’ అన్నాడు మహేష్‌.
‘ఈ సిగరెట్‌ పీకలు ఫ్రెష్‌గా ఉన్నాయి. అంటే ఎవరో రాత్రి ఇక్కడ సిగరెట్లు కాల్చారు. మీ బంధుమిత్రులెవరైనా నీ ఇంటికి వస్తుంటారా?’ మహేష్‌ని అడిగాడు విజయ్‌.
‘నాకు తెలిసినంత వరకూ ఎవరూ రారు. మాలతికి ఎవరితోనూ సత్సంబంధాలు లేవు’
కాలనీవాసుల్లో సిగరెట్‌ కాల్చేవాళ్లు ఎవరైనా మీ ఇంటికొస్తుంటారా?’
మహేష్‌ ఓ క్షణం ఆలోచించాడు. ‘ఆ.. గుర్తొచ్చింది సార్‌. కాల్‌సెంటర్‌లో పని చేసే అశోక్‌ రంగనాథం గారింటిపైన గదిలో అద్దెకు ఉంటున్నాడు. అతడు అప్పుడప్పుడూ మా ఇంటికి వచ్చి పేపర్‌ అడిగి తీసుకెళ్లేవాడు. అతడికి సిగరెట్లు తాగే అలవాటు ఉంది’
‘నీ భార్య మెడలో ఉన్న బంగారం పోలేదు. ఇంట్లో వస్తువులేవీ చోరీ కాలేదు. దీన్ని బట్టి చూస్తే ఈ హత్య దొంగతనం కోసం జరగలేదని తెలుస్తోంది. పైగా హంతకుడు..నీ భార్యకు తెలిసినవాడే. అందుకే నిన్న రాత్రి అతనొచ్చినప్పుడు ఆమె తలుపు తెరిచింది. హంతకుడు అశోక్‌ కావచ్చు. అతడికి సిగరెట్లు కాల్చే అలవాటు కూడా ఉందిగా’ అన్నాడు విజయ్‌ కాస్త బలంగా.
‘సందేహం లేదు సార్‌. ఇది వాడి పనే. ఇప్పుడు గుర్తొస్తోంది. నేను కాలనీలోకి వస్తున్నప్పుడు చూసిన యువకుడు వాడే అనిపిస్తోంది. కాస్త ముందు వచ్చి ఉంటే పట్టుకునేవాడ్ని’ ఆవేశంగా అన్నాడు మహేష్‌.
ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ వెంటనే అశోక్‌ని పిల్చుకురమ్మని రంగనాథం ఇంటికి కానిస్టేబుల్‌ని పంపించాడు. కాసేపటి తర్వాత కానిస్టేబుల్‌ తిరిగొచ్చాడు. ‘సార్, అశోక్‌ గదికి తాళం వేసుంది. రంగనాథం దగ్గర అశోక్‌ సెల్‌ నంబర్‌ తీసుకుని ఫోన్‌ చేస్తే..స్విచాఫ్‌ అని వచ్చింది.అశోక్‌ రాగానే మాకు ఫోన్‌ చెయ్యమని చెప్పి వచ్చాను’ అన్నాడు.
ఫింగర్‌ ప్రింట్‌ రిపోర్ట్స్‌ ప్రకారం మహేష్‌ ఇంట్లో ముగ్గురు వ్యక్తుల వేలిముద్రలు లభించాయి. మహేష్, మాలతితో పాటు ఓ అజ్ఞాత వ్యక్తి వేలిముద్రలు దొరికాయి. ఆ అజ్ఞాత వ్యక్తి వేలిముద్రలే సిగరెట్‌ పీకలపై కూడా ఉన్నాయి. ఆ అజ్ఞాత వ్యక్తే మాలతిని చంపిన హంతకుడని విజయ్‌ ఓ ప్రాథమిక నిర్ధారణకొచ్చాడు.
ఈ కేసులో ఏకైక అనుమానితుడైన అశోక్‌ని అతను పని చేసే కాల్‌సెంటర్‌కి వెళ్లి పట్టుకొచ్చారు పోలీసులు. ‘నిన్న రాత్రంతా ఎక్కడున్నావ్‌?’ అతన్ని ప్రశ్నించాడు విజయ్‌. ‘నిన్న రాత్రి బస్సు దొరక్క బాగా ఆలస్యమైంది. అర్ధరాత్రి దాటాక గదికొచ్చాను. కానీ గది తాళం చెవి ఆఫీసులోనే మరిచిపోయాను.అందుకే నెహ్రూ పార్కుకెళ్లి పడుకున్నాను’ అన్నాడు అశోక్‌.
‘నీ ఫోన్‌  ఎందుకు స్విచాఫ్‌ చేశావ్‌?’
‘బ్యాటరీ డౌన్‌ కావడం వల్ల స్విచాఫ్‌ అయింది. గదిలో ఉంటే చార్జింగ్‌S పెట్టేవాడ్ని’ అనుభవంతో తల పండిన ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కి అశోక్‌ ఏదో దాస్తున్నాడనిపించింది. వెంటనే అతన్ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కి పిలుచుకెళ్లాడు. అక్కడ అతని వేలిముద్రల్ని మహేష్‌ ఇంట్లో దొరికిన అజ్ఞాత వ్యక్తి వేలిముద్రలతో పోల్చి చూశాడు. వేలి ముద్రలు మ్యాచ్‌ అయ్యాయి.
వెంటనే విజయ్‌ అశోక్‌ని అదుపులోకి తీసుకొని థర్డ్‌ డిగ్రీ ప్రయోగించాడు. అప్పుడతను జరిగినదంతా వివరించాడు. ‘సార్, హత్యారోపణ నాపైన వస్తుందనే భయంతో అబద్దం చెప్పాను. నిన్న రాత్రి నేను మాలతి ఇంట్లోనే పడుకున్నాను. గది తాళం చెవి పోగొట్టుకున్నానని చెబితే మాలతి తన ఇంటి వరండాలో పడుకోమని నాకు పరుపు ఇచ్చింది. పడుకొనే ముందు రెండు సిగరెట్లు కాల్చాను. ఆ పీకలే మీకు దొరికాయి. తెల్లవారుజామున ఐదు గంటలకే మాలతి నన్ను నిద్ర లేపి బయటికి పంపేసింది. అప్పుడు పార్కుకెళ్లి పడుకున్నాను. బాగా పొద్దెక్కాక లేచి నేరుగా ఆఫీసుకెళ్లిపోయాను. నేను మాలతిని చంపలేదు సార్‌. నేనామె ఇంట్లోంచి బయటికొచ్చినప్పుడు ఆమె ప్రాణాలతోనే ఉంది. ఎలా చనిపోయిందో నాకు తెలీదు’ అన్నాడు.
‘కట్టుకథ చెబుతున్నావ్‌. నీకూ మాలతికి అక్రమసంబంధం ఉంది. నిన్న రాత్రి ఏదో విషయంలో ఆమె నీతో గొడవపడినట్టుంది. ఆవేశంలో నువ్వు ఆమె చంపేశావ్‌. తర్వాత ఏమీ ఎరగనట్టు పార్కుకెళ్లి పడుకున్నావ్‌ జరిగింది ఇదే’
‘లేదు సార్, మాలతి నాకు సోదరి లాంటిది. నేనామెను చంపలేదు’ రోదిస్తూ అన్నాడు అశోక్‌. అతను చెప్పేది నిజమో, అబద్ధమో విజయ్‌కి అర్థం కాలేదు.
మరుసటి రోజు పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. రిపోర్టు ప్రకారం మాలతి హత్య ఆ రోజు తెల్లవారుజామున ఐదు, ఐదున్నర మధ్య జరిగిందని తెలిసింది. మాలతి చావుకి కారణ మేమిటో రిపోర్టులో స్పష్టంగా పేర్కొనబడింది. దాని గురించి ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ నిపుణులతో చర్చించాడు. అప్పుడు హంతకుడు ఎవరో విజయ్‌కి అర్థమైపోయింది. వెంటనే మాలతి భర్త మహేష్‌ని అదుపులోకి తీసుకున్నాడు. 
‘నా భార్యను నేనెందుకు చంపుతాను? ఆ అశోక్‌ గాడే హంతకుడు. మాలతిని వాడుకుని మోజు తీరాక అడ్డు తొలగించుకున్నాడు’ ఆవేశంగా అన్నాడు మహేష్‌.
‘పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ ప్రకారం తెల్లవారు జాము ఐదు, ఐదున్నర మధ్య మాలతి హత్య జరిగింది. నువ్వు తెల్లవారుజాము ఐదు గంటలకు ట్రైన్‌ దిగానని అబద్ధంం చెప్పావ్‌. కాని ఆ రోజు ట్రైన్‌ సరిగ్గా నాలుగున్నరకే స్టేషన్‌కి వచ్చిందని మా ఎంక్వైరీలో తెలిసింది. అంటే నువ్వు ఐదు గంటలకల్లా నీ ఇంటి దగ్గరికి చేరుకున్నావ్‌. అదే సమయంలో అశోక్‌ కాలనీలోంచి బయటికెళుతూ నీకు కనిపించాడు. ఐదు గంటల తర్వాత అశోక్‌ నీ ఇంట్లో లేడు గనుక అతను హత్య చేయ్యలేదు. హత్య చెయ్యడానికి నీకు మాత్రమే అవకాశముంది’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌.
‘నా భార్యని నేనెందుకు చంపుతాను? టైమ్‌ చెప్పటంలో నేను పొరబడి ఉండొచ్చు. మాలతికి నిద్రాభంగం కలిగించకూడదనే ఉద్దేశంతో నేను స్టేషన్‌ నుంచి నిదానంగా నడుస్తూ ఇంటికొచ్చాను.అందువల్ల నేను కాలనీ దగ్గరికొచ్చేసరికి సమయం ఐదున్నర అయ్యి ఉండవచ్చు. ఆలోగా అశోక్‌ హత్య చేసి ఇంట్లోంచి బయటపడ్డాడు’ అన్నాడు మహేష్‌.
‘అశోక్‌ ఈ హత్య చెయ్యలేదు’ శాంతంగా అన్నాడు విజయ్‌.
‘ఎందుకు చెయ్యలేదు? అంత కచ్చితంగా ఎలా చెప్పగలరు? అతడికి  చేతుల్లేవా?’ హేళనగా అడిగాడు మహేష్‌.
‘అతనికి చేతులైతే ఉన్నాయి కానీ ఆ చేతులతో సరైన చోట దెబ్బ కొట్టి మనిషిని చంపగలిగే విద్య అతనికి లేదు’ నర్మగర్భంగా అన్నాడు విజయ్‌.
‘మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు’ మహేష్‌ ఆందోళనగా అడిగాడు.
‘పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ ప్రకారం మృతురాలి గొంతు వద్ద ఉండే థైరాయిడ్‌ కార్టిలేజ్‌ విరిగిపోవడం వల్ల చావు సంభవించింది. థైరాయిడ్‌ కార్టిలేజ్‌ ఎక్కడుంటుందో, దానిపై ఎలా వేటు వేయాలో శిక్షణ పొందినవారికే సాధ్యం. నిజానికి ఈ విద్య సైనికులకి శిక్షణలో భాగంగా నేర్పిస్తారు. ఏమరుపాటుగా ఉన్న శత్రువుపై ఎలాంటి ఆయుధం వాడకుండా వెనుక నుంచి అతని మెడ పక్క భాగంలో మెరుపు వేగంతో కొడితే అతను కిక్కురుమనకుండా చనిపోతాడని రిటైర్డ్‌ మిలటరీ అధికారుల ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. శత్రువులపై ప్రయోగించాల్సిన విద్యను నువ్వు అమాయకురాలైన నీ భార్యపై ప్రయోగించావ్‌. ఎందుకిలా చేశావ్‌?’ కోపంగా అడిగాడు విజయ్‌.
‘నా భార్య అమాయకురాలు కాదు.. ఆమెకు ఆ అశోక్‌గాడితో అక్రమసంబంధం ఉంది. ఆ విషయం తెలుసుకోవడానికే ఈసారి సెలవు దొరకగానే మాలతికి ఫోన్‌ కూడా చేయకుండా ఊరు వచ్చేశాను. ఓ చెట్టు చాటున నిల్చొని అశోక్‌ నా ఇంట్లోంచి బయటికెళ్లడం కళ్లారా చూశాను.ఆవేశం పట్టలేక ఇంట్లో కెళ్లి ఒక్క వేటుతో మాలతిని చంపేశాను. ఆమెను హత్య చేసిన నేరంతో అశోక్‌ని ఇరికించాను’
‘అనవసరంగా నీ భార్యను చంపావ్‌. ఆమెకి అశోక్‌తో అక్రమ సంబంధం లేదు’
‘ఆ మాట మీరెలా చెప్పగలరు?’
‘పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ ప్రకారం ఆ రోజు రాత్రి మీ భార్య మాలతి ఎవరితోనూ గడపలేదు. దీని బట్టి ఆమెకు అశోక్‌తో అక్రమ సంబంధం లేదని తెలుస్తోంది’
ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ మాటలు వినగానే మహేష్‌ దిగ్భ్రాంతికి గురై నిలుచున్న చోటనే కుప్పకూలిపోయాడు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top