
రకరకాల కారణాలతో దొంగలుగా మారినవారిని చూస్తూనే ఉంటాం కాని, శ్రీకాకుళం నుంచి వచ్చి హైదరాబాద్ పోలీసులను పరుగులు పెట్టించిన ఆ దొంగ కథే వేరు! ఆఫీసు బాయ్‌గా జీవితం ప్రారంభించి, కారు నడపడం నేర్చుకుని, డ్రైవర్‌గా మారాడు. తన యజమాని మతిమరపు కారణంగా దొంగగా మారాడు. పన్నెండేళ్ల వ్యవధిలో పదమూడుసార్లు జైలుకు వెళ్లిన ఈ చోరాగ్రేసరుడి కథలో అనేక మలుపులు ఉన్నాయి. అయితే, 2012 తర్వాత అతడి పేరు పోలీసు రికార్డుల్లోకి ఎక్కలేదు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సేపన్నపేటకు చెందిన అప్పలనాయుడు తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. విధిలేని పరిస్థితుల్లో విజయవాడలో తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న తన బావ పంచన చేరాడు. బావ తనకు పని నేర్పించి, బతుకుతెరువు చూపిస్తాడని భావించాడు. అయితే, ఆ బావ అప్పలనాయుడిని నిత్యం వే«ధించేవాడు. వేధింపులు తట్టుకోలేక అప్పలనాయుడు హైదరాబాద్ పారిపోయి వచ్చాడు. కృష్ణానగర్‌లోని ఓ చిన్నగదిలో మకాం ఏర్పాటు చేసుకున్నాడు. తొలినాళ్లల్లో కొన్ని ప్రైవేట్ ఆఫీసుల్లో బాయ్‌గా పని చేశాడు. ఆ జీవితం నచ్చకపోవడంతో కష్టపడి డ్రైవింగ్ నేర్చుకున్నాడు.
అనేక ప్రయత్నాల తర్వాత 1998లో ఒక సినీ నిర్మాత వద్ద డ్రైవర్‌గా చేరాడు. తన యజమాని దయ తలిస్తే తన జీవితమే మారిపోతుందని భావించాడు. ఆ నిర్మాత కారణంగా నిజంగానే అతడి జీవితం మరోలా మారిపోయింది. ఆ నిర్మాతకు ఉన్న మతిమరపే అప్పలనాయుడిని నేరగాడిగా మార్చింది. ఆ నిర్మాత తన ప్రాణ స్నేహితుడి ఇంట్లో పెళ్లి పనుల కోసం కొన్ని రోజుల పాటు తన కారుతో పాటు డ్రైవర్‌ను స్నేహితుడికి ఇచ్చి పంపారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఆ నిర్మాతకు ఉన్న మతిమరపు రోగం అప్పలనాయుడిని ఇబ్బందుల పాలు చేసింది. పెళ్లి పనుల కోసం కారుతో సహా అప్పలనాయుడు వెళ్లిన రెండు రోజులకు ఆ విషయాన్ని నిర్మాత మర్చిపోయారు. తన కారు తీసుకుని డ్రైవర్ పారిపోయాడని భావించారు. వెనుకా ముందూ ఆలోచించకుండా అప్పలనాయుడిపై పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అప్పలనాయుడిపై పోలీసులు కారు చోరీ కేసు నమోదు చేసుకున్నారు. బాధితుడు సినీ నిర్మాత కావడంతో ముమ్మరంగా గాలించిన పోలీసులు– అప్పలనాయుడిని అదుపులోకి తీసుకుని, కారు స్వాధీనం చేసుకున్నారు. అతడు జరిగినది చెబుతున్నా పట్టించుకోకుండా, అరెస్టు చేసి జైలుకు పంపారు. కారును కోర్టు ద్వారా యజమానికి అప్పగించారు. అలా తొలిసారిగా చేయని నేరానికి జైలుకు వెళ్లిన అప్పలనాయుడు అక్కడి సహచరుల నుంచి నేర్చుకున్న మెలకువలతో నిజంగానే దొంగగా మారాడు. జైలు నుంచి 1999లో బయటకు వచ్చాక దొంగతనాలు మొదలుపెట్టాడు. హైదరాబాద్‌తో పాటు తిరుపతిలోనూ పంజా విసిరి అనేకసార్లు అరెస్టయ్యాడు.
సాధారణంగా దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లల్లోకి చొరబడుతుంటారు. అయితే, అప్పలనాయుడు పంథా పూర్తి భిన్నంగా ఉండేది. మనుషులున్న ఇంట్లోనే తెల్లవారుజామన చోరీలు చేసేవాడు. అప్పట్లో కృష్ణానగర్‌లో నివాసముండే ఇతగాడు పొద్దున్నే భరత్‌నగర్ రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కి, ఫలక్‌నుమా వరకు ప్రయాణించేవాడు. ఈ మార్గంలో రైల్వే ట్రాక్‌లకు సమీపంలో కనిపించిన ఇళ్లల్లో అనువైన దాన్ని టార్గెట్‌గా ఎంచుకునే వాడు. అదే రోజు రాత్రి సెకండ్ షో సినిమాకు వెళ్లి, అది పూర్తయ్యాక కాసేపు కాలక్షేపం చేసేవాడు. తెల్లవారుజామున ఎంచుకున్న ఇళ్లపై విరుచుకు పడేవాడు. కిటికీలు సరిగ్గా మూసి ఉండని ఇళ్లల్లోకి కిటికీ ద్వారానే వెళ్లి, పని పూర్తి చేసుకునేవాడు. అలాగే, సినిమా హాలు నుంచి బయటకు వచ్చేటప్పుడు తనకు నచ్చిన ద్విచక్ర వాహనాన్ని ఫాలో చేసేవాడు. యజమాని ఇంటికి చేరుకునే వరకు వెంబడించి, అతడు ముందు పార్క్ చేసి వెళ్లిపోతే, ఆ వాహనాన్ని తస్కరించేవాడు.
అప్పలనాయుడు ఒకసారి కూకట్‌పల్లిలో అనుమానాస్పదంగా సంచరిస్తూ స్థానికులకు చిక్కాడు. అతడిని వాళ్లు పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. అప్పటికి అతడికి నేరచరిత్ర లేకపోవడంతో అరెస్టు చేయని పోలీసులు అదుపులోనే ఉంచుకున్నారు. ఆ మరుసటి రోజు దీపావళి కావడంతో పండుగకు ఇంటికి వెళ్లివస్తానని కోరినా, పోలీసులు వదిలిపెట్టలేదు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ తన సెల్‌ఫోన్‌లో చాటింగ్‌లో మునిగిపోవడం చూసి, అప్పలనాయుడు పోలీసుస్టేషన్ నుంచి పరారయ్యాడు. అక్కడ నుంచి అమీర్‌పేట వరకు వచ్చి అదే పోలీసుస్టేషన్ ల్యాండ్ ఫోన్‌కు కాల్ చేశాడు. పోలీసుస్టేషన్ నుంచి తప్పించుకున్నది తానే అని, దీపావళి పండుగ కోసం ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు.
తిరిగి వచ్చాక లొంగిపోతానని చెప్పాడు. ఇన్‌స్పెక్టర్ అతడి మాటలు నమ్మలేదు. అప్పలనాయుడు మాత్రం దీపావళి ముగిసిన రెండు రోజులకు మళ్లీ కూకట్‌పల్లి పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఆవు–పులి కథ మాదిరిగా చెప్పినట్లే వచ్చి తన ముందు నిల్చున్న అప్పలనాయుడిని చూసిన ఆ ఇన్‌స్పెక్టర్ ఆశ్చర్యపోయారు. ఎంతో ఇంప్రెస్ అయి, ‘దొంగతనాలు చేయడం కాకుండా నీకు ఏ పని వచ్చు?’ అంటూ అడిగారు. డ్రైవింగ్ వచ్చని చెప్పడంతో పోలీసుస్టేషన్‌లోనే డ్రైవర్‌గా పెట్టుకున్నారు. కొన్నాళ్లు ఆయనే జీతం ఇచ్చి, పోలీసు వాహనం అప్పగించి పంపేవాళ్లు. కాలక్రమంలో ఆ అధికారి పదవీ విరమణ చేయడం, తర్వాత వచ్చిన వాళ్లు పట్టించుకోకపోవడంతో అప్పలనాయుడు మళ్లీ చోరీలు కొనసాగించాడు.
పోలీసులను ముప్పతిప్పలు పెడుతూ 2012 వరకు 13 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. అతడిపై నమోదైన కేసుల్లో దాదాపు అన్నీ కోర్టుల్లో వీగిపోయాయి. 2011 ఆగస్టు 8న పోలీసులు అప్పలనాయుడిని అరెస్టు చేసినప్పుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. అప్పట్లో ఇతగాడు విలేకరులను ఉద్దేశించి ‘కిలో బంగారం చోరీ చేసే వరకు పోలీసులకు దొరక్కుండా ఉండాలని అనుకున్నా. ఆ తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి మరీ దొంగతనాలు మానేయాలని భావించా. కానీ కుదర్లేదు’ అంటూ నిట్టూర్చాడు. కొన్నాళ్లుగా అప్పలనాయుడి పేరు పోలీసు రికార్డుల్లో ఎక్కలేదు.