
దివి నుంచి భువికి దిగివచ్చిన శ్రీహరి సాక్షాత్తుగా కొలువై దివ్యదర్శనమిస్తున్న సుప్రసిద్ధ క్షేత్రమే తిరుమల పుణ్యక్షేత్రం. శేషాద్రి, వెంకటాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, నీలాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి కొండల పై వెలసిన శ్రీవారిని ఏడుకొండలవాడని, సప్తగిరీశుడని పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామి వారు వెలసిన ఆలయానికి వున్న ముఖమండపాన్ని ఘంటామండపమని పిలుస్తారు. 43 అడుగులు వెడల్పు, 40 అడుగులు పొడవు ఉండే మహామండపాన్ని 1417 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్య మంత్రివర్యులు అమాత్య మల్లన నిర్మించారు.
నాలుగు వరుసలలో 16 స్తంభాలు వుండే ఈ మండపంలో స్తంభాల పైన వరాహస్వామి, నృసింహస్వామి, మహావిష్ణువు, శ్రీవేంకటేశ్వరస్వామి, వరదరాజస్వామి శిల్పాకృతులు చెక్కబడి వుంటాయి. శ్రీ మండపంలోనే గరుడాళ్వార్, జయవిజయలు వెలసి వుంటారు. శ్రీవారికి ప్రతి నిత్యం వేకువ జామున సుప్రభాత సేవను ఇదే మండపంలో నిర్వహిస్తారు. ఇక బుధవారం నిర్వహించే సహస్ర కలశాభిషేకం, గురువారం నిర్వహించే తిరుప్పావై సేవలతో పాటు ప్రతి ఏటా ప్రత్యేకంగా నిర్వహించే ఆస్థానాలు ఇదే మండపంలో అర్చకులు నిర్వహిస్తారు. స్వామివారికి నైవేద్య సమయంలో మోగించే ఘంటానాదం ఇదే మండపంలో వుండడంతో మహామండపానికి ఘంటామండపం అని పేరు వచ్చింది.
ఘంటామండపం దాటిన తర్వాత వున్న మండపాన్ని స్నపన మండపం అంటారు. 27 అడుగులు చతురస్రాకారంలో వుండే స్నపన మండపం స్తంభాలపై బాలకృష్ణుడు, యోగనరసింహ స్వామి, శ్రీకృష్ణ కాళీయమర్దనం వంటి శిల్పాలు వుంటాయి. 614వ సంవత్సరంలో పల్లవరాణి సామవై వెండి భోగ శ్రీనివాసమూర్తిని ఆలయానికి బహూకరించారు. ఆ సమయంలో ఇదే మండపంలో స్వామివారికి పూజలు నిర్వహించారట. ప్రస్తుతం ప్రతిరోజు శ్రీవారికి తోమాలసేవ అనంతరం గర్భాలయంలో వున్న కొలువు శ్రీనివాసమూర్తిని ఈ మండపంలో వేంచేపు చేసి బంగారు సింహాసనంపై వుంచి స్వామివారికి కొలువును నిర్వహిస్తారు.
శ్రీవారు మహారాజు కావడంతో ప్రతినిత్యం పంచాంగ శ్రవణం నిర్వహించి ఆ రోజు తిథి, నక్షత్రాలతోపాటు స్వామివారికి హుండీలో లభించిన కానుకల లెక్కలు చెబుతారు. ఇక ఏకాంత సేవ అనంతరం శ్రీవారి హుండీని ఇదే ప్రాంతంలో భద్రపరుస్తారు. ఇక స్వామివారికి అలంకరించే ఆభరణాలు అన్నీ కూడా ఇదే మండపంలో భద్రపరచి వుంటారు. స్వామివారికి ప్రతి శుక్రవారం రోజున ఆభరణాలు అలంకరించడం, గురువారం రోజున సడలింపు చేసిన ఆభరణాలను తిరిగి ఇదే మండపంలో భద్రపరుస్తారు. దీంతో ఈ మండపానికి కొలువు మండపమని, కానుకల భాండాగారం అనే పేర్లు కూడా వచ్చాయి.
స్నపన మండపాన్ని దాటగానే వచ్చే మండపం రాములవారి మేడ. 12 అడుగుల పొడవు, 10 అడుగులు వెడల్పు వుండే ఈ మండపం 1262–65 సంవత్సరానికి ముందు లేదని, ఇప్పుడున్న వైకుంఠ ప్రదక్షణ మార్గంలో కలసి వుండేదంటున్నారు పరిశోధకులు. రాములవారి మేడలో ఎల్తైన అరుగుల మీద దక్షిణం వైపు శ్రీవారి పరివార దేవతలైన అంగద, హనుమంత, సుగ్రీవ తదితర ఉత్సవ విగ్రహాలు వుండేవి. ఉత్తరం వైపున విష్వక్సేన, అనంత, గరుడ ఉత్సవమూర్తులు కొలువై ఉంటారు. అలాగే ప్రస్తుతం గర్భాలయంలో వున్న శ్రీ సీతారామలక్ష్మణ స్వాముల విగ్రహాలు కూడా ఇదే మండపంలో వుండేవట. అందుకే ఈ మండపానికి రాములవారి మేడ అని పేరు వచ్చిందట. భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో రాములవారి విగ్రహాలను గర్భాలయంలోకి, పరివార దేవతలను అంకురార్పణ మండపంలోకి తరలించారు.
రాములవారి మేడ దాటిన తర్వాత లోపలికి ప్రవేశించే మండపం శయన మండపం. శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై విరాజిల్లుతున్న గర్భాలయానికి ముందున్న మండపం శయన మండపం. పదమూడున్నర అడుగుల కొలతలో వుండే ఈ మండపాన్ని అర్ధ మండపం అని కూడా పిలుస్తారు. శ్రీవారికి ప్రతిరోజు రాత్రి వేళలో ఏకాంత సేవను ఈ మండపంలోనే నిర్వహిస్తారు. భోగ శ్రీనివాసమూర్తికి కూడా ఇదే మండపంలో ఏకాంత సేవను నిర్వహిస్తారు. ఇక శ్రీవారి నైవేద్య సమర్పణ ఈ మండపంలోనే నిర్వహిస్తారు. స్వామివారికి భోజనశాలగా, శయనశాలగా ఉపయోగపడు తున్న పవిత్ర మండపం శయన మండపం.
అటు తర్వాత వుండే మండపమే సాక్షాత్తూ ఆ కలియుగ వేంకటేశ్వర స్వామివారు వెలసి వున్న ప్రాంతం. అదే శ్రీవారి గర్భాలయం. 7.2 అడుగుల మందంతో, 12.9 అడుగుల చతురస్ర మండపం గర్భాలయం. స్వామివారి గర్భాలయంపై ఆనంద నిలయం 1244–50 సంవత్సరాల మధ్య నిర్మించారట. సాలగ్రామ శిలామూర్తిగా శ్రీవేంకటేశ్వరస్వామి వారు వెలసి వుండే ఈ గర్భాలయంలో శ్రీవారికి పూజాకైంకర్యాలను నిర్వహించే అర్చకులు, జీయంగార్లకు మినహా మరెవ్వరికీ అనుమతులు వుండవు.
శ్రీవారి పంచబేరాలు ఈ గర్భాలయంలోనే వుంటాయి. మూలమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మలయప్పస్వామి వారి ఉత్సవ విగ్రవాలు ఇక్కడే వుంటాయి. శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్, రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు, శ్రీసీతారామలక్ష్మణ స్వాముల విగ్రహాలు ఇక్కడే వుంటాయి. కలియుగ ఇల వైకుంఠ నాథుడు వెలసిన పుణ్యస్థలానికి ప్రత్యక్షంగా చేరుకోవాలి అంటే ఇన్ని మండపాలను దాటుకుని వెళ్ళాలి. ప్రతిపుణ్యస్థలాన్ని దాటుకుంటూ వెళ్లాలి. ప్రతి మండపానికి విశిష్టత తెలుసుకుంటూ వెళ్ళాల్సిందే.