అది తప్ప సమస్యలేమీ లేవు

Some Health Tips For Pregnancy women In Funday - Sakshi

►ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌. డయాబెటిస్‌ తప్ప ఇతర సమస్యలేవీ లేవు. అయితే కొన్ని విషయాలు విన్న తరువాత కాస్త ఆందోళనగా ఉంది. వీటిలో నిజం ఎంతో తెలియజేయగలరు. డయాబెటిస్‌ గర్భిణులకు తప్పనిసరిగా సిజేయరియన్‌ చేయాల్సి వస్తుంది, మాయ పూర్తిగా బయటకు రాదు, ఇన్‌ఫెక్షన్‌ల ముప్పు ఎక్కువగా ఉంటుంది, చీము ఏర్పడుతుంది.... మొదలైనవి. వీటిలో వాస్తవం ఎంత? – జి.శ్రీలత, తుని, తూర్పుగోదావరి జిల్లా
మీకు డయాబెటిస్‌ గర్భం రాక ముందు నుంచే ఉందా, గర్భం వచ్చిన తర్వాత వచ్చిందా అనేది స్పష్టంగా చెప్పలేదు. డయాబెటిస్‌ ఉన్నంత మాత్రాన తప్పనిసరిగా సిజేరియన్‌ ఆపరేషన్‌ చేయాలనేమీ లేదు. డయాబెటిస్‌ ఉన్నా, బిడ్డ అధిక బరువు లేకుండా, చక్కెర శాతం అదుపులో ఉండి, ఇతర సమస్యలేవీ లేకుండా ఉండి, బిడ్డ తల కిందకు ఉండి, బిడ్డ బయటకు వచ్చే పెల్విస్‌ ద్వారం బిడ్డకు సరిపడా ఉంటే అన్ని వసతులు కలిగిన ఆస్పత్రిలో సుగర్‌ లెవల్స్‌ సక్రమంగా పరీక్ష చేయించుకుంటూ నార్మల్‌ డెలివరీకి ప్రయత్నించవచ్చు. ఎక్కువ మటుకు డయాబెటిస్‌ ఉండి, సుగర్‌ లెవల్స్‌ అదుపులో లేనివారికి, బిడ్డ అధిక బరువు పెరగడం, ఉమ్మనీరు ఎక్కువగా ఉండటం వంటివి ఉంటాయి కాబట్టి సాధారణ ప్రసవానికి ఇబ్బంది ఏర్పడటం, కాన్పు తర్వాత బ్లీడింగ్‌ ఎక్కువగా అవడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు.

సుగర్‌ అదుపులో లేనప్పుడు తొమ్మిదో నెల చివర్లో బిడ్డ కడుపులోనే చనిపోయే అవకాశాలు కొద్దిగా ఉండవచ్చు. కాబట్టి వీరికి అవసరమనుకుంటే 38 వారాలకే రిస్కు తీసుకోకుండా డెలివరీ చేయడం జరుగుతుంది. వీరిలో మాయ బయటకు రాకపోవడం అంటూ ఏమీ ఉండదు. బిడ్డ బరువు ఎక్కువగా ఉన్నట్లే, మాయ కూడా పెద్దదిగా ఉండి అది బయటకు వచ్చిన తర్వాత కొందరిలో బ్లీడింగ్‌ ఎక్కువయ్యే అవకాశాలు ఉండవచ్చు.

సుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటే ఇన్‌ఫెక్షన్లు వచ్చి చీము పట్టే అవకాశాలు చాలా తక్కువ. కాన్పు తర్వాత ఎలాగూ యాంటీ బయోటిక్స్‌ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. బరువు మరీ ఎక్కువగా ఉండి, కొవ్వు ఎక్కువగా ఉన్న వారిలో డయాబెటిస్‌ వల్ల ఇన్ఫెక్షన్స్‌ వచ్చి చీము పట్టవచ్చు. అనవసరమైన భయాలు పెట్టుకోకుండా డాక్టర్‌ పర్యవేక్షణలో సుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ఇందుకోసం కార్బోహైడ్రేట్స్‌ తక్కువగా తీసుకోవడం, స్వీట్లు వంటివి తీసుకోకపోవడం, కొద్దిగా నడక, డాక్టర్‌ సలహాపై చిన్న వ్యాయామాలు చేయడం మంచిది.

►నా వయసు 26 సంవత్సరాలు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌. నాకు అప్పుడప్పుడు చెస్ట్‌ పెయిన్‌ వస్తుంది. ప్రెగ్సెన్సీ సమయంలో ఇది సాధారణమేనా? లేక ప్రత్యేక జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? ప్రస్తుతం నాకు నాలుగో నెల. ఈ నెలలో బిడ్డ కదలికలు తెలుస్తాయని చెప్పారు. కాని నాకు తెలియడం లేదు. కారణం ఏమిటి? – బి.మాలతి, హైదరాబాద్‌
ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్స్‌లో మార్పుల వల్ల రొమ్ములు కొద్దిగా బరువెక్కినట్లయి చెస్ట్‌ పెయిన్‌ వస్తుంది. కొందరిలో ఈ సమయంలో వికారం, వాంతులతో పాటు ఎసిడిటీ ఏర్పడటం వల్ల గ్యాస్ట్రిక్‌ యాసిడ్‌ ఎక్కువ విడుదలై, అది గొంతులోకి వచ్చినట్లయి చెస్ట్‌ పెయిన్‌ వచ్చినట్లనిపిస్తుంది. కాబట్టి దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి, పరీక్ష చేయించుకుని, అవసరమనుకుంటే యాంటాసిడ్‌ మాత్రలు, పారాసెటిమాల్‌ వంటి మందులు తక్కువ మోతాదులో వాడుకోవచ్చు.

ఆహారం కూడా కొద్ది కొద్దిగా త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకోవచ్చు. గర్భాశయంలో మూడోనెల అంటే 8–9 వారాల సమయం నుంచి బిడ్డలో కదలికలు మొదలవుతాయి. అవి స్కానింగ్‌లోనే కనిపిస్తాయి. మొదటిసారి గర్భందాల్చిన తల్లికి పొట్ట పైకి బిడ్డ కదులుతున్నట్లు తెలియాలంటే కనీసం 18–20 వారాలు రావాలి. అంటే ఐదో నెల చివరిలో పొత్తికడుపులో ఏదో పొడిచినట్లు, గట్టిగా గుచ్చినట్లు అనిపిస్తుంది. అంతేగాని బాగా కదిలిపోయినట్లు తెలియదు. పొట్ట మీద కొవ్వు ఎక్కువగా ఉంటే అది కూడా తెలియదు. ఆరో నెల నుంచి బిడ్డలో కండరాలు, నాడీ వ్యవస్థ బలపడే కొద్దీ బిడ్డ తిరగడం బాగా తెలుస్తుంది. రెండోసారి గర్భం దాల్చిన వారికి కొద్దిగా ముందుగానే అంటే ఐదో నెల మధ్య నుంచే తెలిసే అవకాశాలు ఉంటాయి. 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top