గుండె మాట వింటే ఇక్కడ వరకూ రానవసరం లేదు

September 29 World Heart Day - Sakshi

కవర్‌ స్టోరీ

సెప్టెంబర్‌ 29 వరల్డ్‌ హార్ట్‌ డే

హార్ట్‌ ఒక హార్డ్‌ వర్కర్‌...! పిండం ఏర్పడ్డ ఆరో వారంలో మొదలైన హార్ట్‌బీట్‌ మరణం నాటివరకూ ఆగదు. అందుకే ఆ హర్డ్‌వర్క్‌ను హార్ట్‌వర్క్‌ అనీ చెప్పవచ్చు. హార్ట్‌ చాలా సిన్సియర్‌...!  ఒంట్లోని అన్ని అవయవాలకూ తానే రక్తం ఇస్తుంది కదా!అయినా సరే... క్యూలో నిలబడి తన వంతు రేషన్‌ తీసుకున్నట్టుగా తన వాటా రక్తాన్ని కరోనరీ ఆర్టరీ ద్వారా ఎంతో సిన్సియర్‌గా  అందుకుంటుంది. జీవితమంతా పనిచేసే అంతటి హార్డ్‌వర్కర్‌నూ, ఆ సిన్సియర్‌నూహాస్పిటల్‌ మెట్ల వరకూ రాకుండా కాపాడుకోవాలా, వద్దా?  మరి అదెలాగో చూడండి. 

గుండె చాలా కష్టపోతు. అదెంత శ్రమ చేస్తుందో చూస్తే గుండె ఝల్లుమనాల్సిందే! దాని పని చూస్తే గుండె పిండేసినట్టవుతుంది. పనిపరంగా చూస్తే... గుండె ఒక అద్భుతం. రోజులో అది దాదాపు  లక్షసార్లు స్పందిస్తుంది. విశ్రాంతి లేకుండా ఇలా స్పందిస్తూ ఉండటం వల్ల ఏడాదిలో అది 3.78,43,200  సార్లూ, జీవితకాలంలో (80 ఏళ్లు అనుకుంటే) దాదాపు 302 కోట్లకు పైగా సార్లు కొట్టుకుంటుందని తెలిస్తే గుండె చెదురుతుంది.  ఇంతా చేస్తే మనిషిలో ఉండేది 5 నుంచి 6 లీటర్ల రక్తమే. అయినా అదే మాటిమాటికీ గుండె ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి నిమిషానికీ 72 సార్లు కొట్టుకుంటూ, దాదాపు రోజులో 6,000 నుంచి 7,500 లీటర్ల రక్తాన్ని తన ద్వారా పంప్‌ చేస్తూ ఉంటుంది. మీకో విషయం తెలుసా? ఇక ఒక రోజులో గుండె నుంచి పంప్‌ చేసే రక్తాన్ని నేరుగా ప్రవహింపజేస్తే అది కవర్‌ చేసే దూరం 19,000 కి.మీ. ఉంటుంది. ఒక మనిషి జీవితకాలంలో అతడి గుండె పంప్‌ చేసే రక్తాన్ని మన ఇంట్లోని ఏదైనా నల్లా/కొళాయి నుంచి ప్రవహింపజేస్తే అది 45 ఏళ్లపాటు ఎడతెరిపి లేకుండా నిరంతరాయంగా అలా కారుతూనే ఉంటుంది. ఇదీ గుండె చేసే పని! ఇలా గుండె చేసే శ్రమ చూశాక ఎవ్వరికైనా గుండె తరుక్కుపోవడం ఖాయం. మరింత కష్టపడే దాన్ని మనం గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి కదా!  

గుండె  అధ్యయనం గురించి కాస్తంత చరిత్ర ఇది
అనాదిగా గుండె గురించిన ఊహలూ, అధ్యయనాలూ, పరిశోధనల చరిత్రంతా ఆసక్తికరమే. మానవాళికి తెలిసినమేరకు గుండెకు సంబంధించి కొంత శాస్త్రీయంగా చెప్పింది క్రీస్తుపూర్వం 304 నుంచి క్రీ.పూ. 250 మధ్యకాలంలో జీవించిన గ్రీకు ఫిజీషియన్‌ ఎరాసిస్ట్రేటస్‌. ఆయన తొలిసారిగా మంచి రక్తం, చెడు రక్తం ప్రవహించే రక్తనాళాలు వేర్వేరుగా ఉంటాయని తెలిపాడు. గుండె ద్వారా రక్తం ప్రవహించే తీరును ఆధునిక కాలం నాటి అధ్యయనాలకు దాదాపుగా కాస్తంత దగ్గరగా అంచనా వేశాడు. ఇక క్రీసుశకం 130 నుంచి క్రీస్తుశకం 210 మధ్య కాలంలో జీవించిన క్లాడియస్‌ గెలనస్‌ తొలిసారిగా గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తం వెళ్తుందని చెప్పాడు. అంతేకాదు... గుండె నుంచి మొత్తం శరీరానికి రక్తం అందుతుందంటూ... గుండె స్పందనలకూ, నాడీ స్పందనలకు సంబంధం ఉందని ఊహించాడు.  అయితే ఒకసారి కండరాల కోసం రక్తం ఇంధనంలా దహించుకుపోయాక ఎప్పటికప్పుడు కొత్త ఇంధనంలా రక్తం మళ్లీ మళ్లీ పుడుతుందని గేలనస్‌ ఊహించాడు. మరో పరిశోధకుడు ఆండ్రియాస్‌ వెసాలియస్‌ (క్రీ.శ. 1514–1564) రాసిన  ‘డీ హ్యూమనీ కార్పొరిస్‌ ఫ్యాబ్రికా లిబ్రీ సెప్టమ్‌’ అనే గ్రంథంలోనూ గుండె నిర్మాణం తీరుతెన్నులు వర్ణితమయ్యాయి. ఇక గుండె ఏం చేస్తుందన్నది కరెక్ట్‌గా చెప్పింది మాత్రం ఇంగ్లాండు ఫిజీషియన్‌ విలియమ్‌ హార్వే (క్రీ.శ. 1578–క్రీ.శ. 1657). ఆయన మొట్టమొదటిసారిగా 1616లో గుండె రక్తాన్ని పంప్‌ చేస్తుందని కనుగొన్నాడు. తాను రాసిన ‘ఏన్‌ అనటామికల్‌ డిస్క్విజిషన్‌ ఆన్‌ ద మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ద హార్ట్‌ అండ్‌ బ్లడ్‌’ అనే పుస్తంలో గేలనస్‌ చెప్పిన అంశాల్లోని  పొరపాట్లను సవరించాడు. వాటిని వివరించాడు. ఇలా క్రీస్తుపూర్వం నుంచి గుండెను గురించి చేసిన పరిశోధనలూ, పడ్డ శ్రమ చూస్తే మన గుండెలు తరుక్కుపోవాల్సిందే. ఆ అభూత కల్పనలు చదివితే  గుండెలు జారిపోతాయి. చివరికి హార్వే వల్ల గుండె మిస్టరీ వీడటంతో మానవాళి గుండెలపై నుంచి ఓ బరువు తొలగినట్లయ్యింది. అయితే హార్వే తర్వాత పరిశోధనలు వేగం పుంజుకొని,  కార్డియాలజీ రంగంలో ఎంతో అభివృద్ధి చోటు చేసుకొని, ఈనాటికీ ఎందరో రోగుల్లో గుండెధైర్యం నింపింది... ఇంకా నింపుతోంది. ఆ పురోగతి అలా నిరంతరాయంగా సాగుతూనే ఉంది.
డాక్టర్‌ ఎం.ఎస్‌.ఎస్‌. ముఖర్జీ, డైరెక్టర్, పల్స్‌ హార్ట్‌ సెంటర్, హైదరాబాద్‌ 

హార్ట్‌ ఎటాక్‌లూ...  తరుగుతున్న వయసు చెదురుతున్న  గుండెనిబ్బరం
ఒకప్పుడు గుండెపోటు ఏ అరవైలు దాటాకో వచ్చేది. జీవనశైలి మార్పులతో గుండెవ్యాధుల రిస్క్‌ 50లకు వచ్చింది. ఆ తర్వాత క్రమంగా 40లకు పడిపోయింది. ఆశ్చర్యకరంగా ఇరవై–పాతికేళ్లలోపు వారికీ ఇప్పుడు గుండెపోటు వస్తోంది. పాశ్చాత్య దేశవాసులతో పోలిస్తే గుండెపోటుకు కారణమైన ‘కరోనరీ ఆర్టరీ డిసీజ్‌’  వచ్చే అవకాశాలు మన దేశవాసుల్లోనే మరీ ఎక్కువ. ఈ జబ్బు 14 ఏళ్ల చిన్నారికి కూడా రావడం ఎంతో ఆందోళన కలిగిస్తోంది. 1990లతో పోలిస్తే 2020 నాటికి కేసుల సంఖ్య మహిళల్లో 120 శాతం ఎక్కువగానూ, పురుషుల్లో 137 శాతం ఎక్కువగా ఉండవచ్చన్నది గుండె గుభేలుమనిపించే ఒక అంచనా! ప్రమాదకరమైన ఈ గుండెజబ్బులకు కారణాలూ ఎక్కువే. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం. సాధారణంగా మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు  వయసు పెరుగుతున్న కొద్దీ గట్టిబారుతుంటాయి. దీన్నే అధెరో స్కి›్లరోసిస్‌ అంటారు. ఇప్పుడు చాలా చిన్నవయసులోనే ఇలా రక్తనాళాలు గట్టిబారడం కనిపిస్తోంది. ఇలా జరగడానికి కారణాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. రక్తనాళాల్లో పేరుకునే కొవ్వును ‘ఫ్లేక్స్‌’ అంటారు. ఈ ఫ్లేక్స్‌ రక్తనాళాల్లోకి ఎక్కువగా చేరడం వల్ల ధమనులు సన్నబడి, గుండె కండరాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఈ ఫ్లేక్స్‌ ఎక్కువగా చీలిపోయి క్లాట్స్‌ (అడ్డంకులు)గా మారి ఆకస్మికంగా గుండెకు రక్తసరఫరా తగ్గవచ్చు. ఫలితంగా గుండెపోటు రావచ్చు. కొందరిలోనైతే ఎలాంటి లక్షణాలూ కనిపించకుండానే గుండెపోటు వస్తుంది. దీన్నే సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌ అంటారు. యువతలో మాదక ద్రవ్యాలను తీసుకోవడం, ఆల్కహాల్, పొగతాగే అలవాటు కూడా గుండెపోటుకు ఒక కారణం. 
డాక్టర్‌ అనిల్‌ కృష్ణ, సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్, ఎండీ., మాక్స్‌క్యూర్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్, హైదరాబాద్‌

మంచి  ఆహారంతో గుండెకు హాయి
మొదటి నుంచీ గుండెకు మేలు చేసే ఆహారాన్ని తీసుకుంటే అది గుండెజబ్బులను నివారిస్తుంది. ఆహారం విషయంలో కొవ్వులది ఒక విలక్షణ భూమిక. గుండెకు పైన మంచి రక్షణ కోసం ప్యాకింగ్‌ రూపంలో కొవ్వులు మేలు చేస్తాయి. కానీ అవే కొవ్వులు రక్తనాళాల లోపల ఉంటే కీడు చేస్తాయి. గుండె చాలా కీలకం అన్న విషయం తెలిసిందే కదా. అంతటి విలువైన దానికి చిన్నా చితకా దెబ్బలు తగిలినా షాక్‌ అబ్జార్బర్‌లా ఉండేందుకు నేచురల్‌గానే దాని చుట్టూ కొవ్వు ఉండేలా జాగ్రత్త తీసుకుంది ప్రకృతి. అందుకే గుండె బాగుండాలంటే బయట మాత్రమే ఉండి, రక్తనాళాల్లో లేకుండా ఉండేత పరిమిత మోతాదుల్లో కొవ్వుల్ని తీసుకోవాలి. గుండెకు మేలు చేసే ఆహారాలేమిటో చూద్దాం.

టొమాటోలలో గుండెకు ఆరోగ్యమిచ్చే లైకోపిన్‌ అనే పోషకం ఉంటుంది ∙బాదంపప్పు, అక్రోటులలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే విటమిన్‌ ‘ఈ’ ఉంటుంది ∙బచ్చలి కూర లాంటి ఆకుకూరలు గుండెకు అదనపు బలాన్ని ఇస్తాయి ∙అవిసె గింజలలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువ. పీచు పదార్థం కూడా ఎక్కువే ∙ఓట్‌ మీల్‌ ఒంట్లో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జీర్ణకోశ మార్గంలో ఇది ఒక స్పాంజ్‌లా పనిచేసి, కొలెస్ట్రాల్‌ను నానిపోయేలా చేసి, రక్తంలో ఇంకిపోకుండా ఒంట్లో నుంచి తొలగిస్తుంది. ∙హోల్‌ వీట్‌ బ్రెడ్‌ లాంటి తృణధాన్యాలతో చేసినవి తిన్నా మంచిదే ∙దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. కనీసం మూడు నెలల పైగా దానిమ్మ గింజలు తింటే, గుండెకు రక్తప్రసారం బాగా మెరుగవుతుంది. అలాగే, యాపిల్‌ పండ్లు కూడా ∙విటమిన్‌ ‘సి’ ఎక్కువగా ఉండే బత్తాయిలు, కమలా పండ్ల లాంటి నిమ్మజాతి పండ్లు తినాలి. పండ్ల రసాల్లో పంచదార కలుపుకోకపోతే ఇంకా మంచిది ∙అరటి పండులోని పొటాషియమ్, మెగ్నీషియమ్‌లు రక్తపోటును తగ్గిస్తాయి. గుండెపోటుకు అధిక రక్తపోటు కూడా ఒక రిస్క్‌ఫ్యాక్టర్‌. దీన్ని తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండి, గుండెపోటు రిస్క్‌ తప్పుతుందన్నమాట ∙నేరేడు, బ్లూబెర్రీ, రాస్ప్‌బెర్రీ పండ్లలో ఉండే మ్యాంగనీస్, పొటాషియమ్‌  రక్తపోటును నివారించడం ద్వారా గుండెకు మేలు చేస్తాయి. అలాగే కర్బూజాలో ఉండే  పొటాషియమ్‌ కూడా ∙యాప్రికాట్స్‌ గుండెకు మంచివి ∙సాల్మన్‌ ఫిష్‌ లాంటి చేపలు గుండెకు ఆరోగ్యకరం. గుండె కొట్టుకోవడంలో తేడానీ, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్నీ, ట్రై గ్లిజరైడ్స్‌నూ తగ్గించే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ వీటిలో ఎక్కువుంటాయి. వారానికి కనీసం రెండు సార్లయినా ఈ చేపలు తింటే మంచిదంటూ అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ సిఫార్సు చేస్తోంది ∙డార్క్‌ చాక్లెట్లు, అంటే కనీసం 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు, రక్తం ఊరి గట్టకట్టుకుపోవడం లాంటివి తగ్గుతాయి. అయితే మామూలు మిల్క్‌ చాక్లెట్లు, క్యాండీ బార్‌ల వల్ల ఉపయోగం లేదు. డార్క్‌చాక్లెట్లను కూడా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. 
డాక్టర్‌ సూర్యప్రకాశ్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్, 
కేర్‌ హాస్పిటల్స్, ముషీరాబాద్, హైదరాబాద్‌ 

గుండె  ధైర్యాన్నిచ్చే...  గుండె పరీక్షలు 
గుండెపోటు మనిషిని అమాంతం అకస్మాత్తుగా ఉనికిలో లేకుండా చేస్తుందని తెలిసింది కదా. ఆ ముప్పునుంచి రక్షించుకోవడానికి మనకు చాలా పరీక్షలే అందుబాటులో ఉన్నాయి. 
ఈసీజీ: ఛాతీ నొప్పి వచ్చిన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా చేయించుకోవాల్సిన పరీక్ష ఇది. గుండెపోటు అయితే 80, 90 శాతం కేసుల్లో ఆ విషయం నిర్ధారణ అవుతుంది. అంతేకాదు... గతంలో వారికి గుండెపోటు వచ్చి ఉండి, అప్పుడా విషయం రోగికి తెలియకున్నా ఈ పరీక్షతో అది తెలిసిపోతుంది. అంటే...గతంలో ఎప్పుడో వచ్చిన గుండెపోటునూ దీంతో గుర్తించవచ్చన్నమాట. 
అయితే కొన్నిసార్లు చాలా చిన్న గుండెపోటును ఈసీజీ గుర్తించలేకపోవచ్చు. గుండెపోటు వచ్చిన వెంటనే ఈసీజీ తీయించినా గుండెపోటు వల్ల కలిగే మార్పులను ఈసీజీ పరీక్ష వెంటనే నమోదు చేయలేకపోవచ్చు. అందుకే గుండెనొప్పి / ఛాతీనొప్పి వచ్చాక 45 నిమిషాల తర్వాత కనీసం 2 లేదా 3 ఈసీజీలను తీశాక కూడా అందులో మార్పులేమీ లేవంటే అప్పుడు గుండెపోటు రాలేదని 99 శాతం కచ్చితత్వంతో చెప్పవచ్చు. ఇక కొందరిలో అబ్‌నార్మల్‌ ఈసీజీ వస్తే ఆందోళన పడాల్సిందేమీ ఉండదు. అంతమాత్రానే  గుండెజబ్బులు ఉన్నాయని నిర్ధారణ చేయలేం. అప్పుడు మరికొన్ని పరీక్షలు అవసరమవుతాయి. 
2 డీ ఎకో పరీక్ష: ఇది గుండెస్పందనల్లోనూ, గుండె కండరంలోనూ వచ్చిన మార్పులను తెలుపుతుంది. ఛాతీ నొప్పి వచ్చినప్పుడు అది గుండెజబ్బు కారణంగానే అని తెలుసుకునేందుకు ఎకో పరీక్ష దోహదం చేస్తుంది.
టీఎమ్‌టీ పరీక్ష: ట్రెడ్‌మిల్‌ అనే పరికరం మీద వేగంగా నడవటం ద్వారా గుండెపై కాస్త ఒత్తిడి కలిగించి చేసే పరీక్ష ఇది. నడక లేదా ఇతర శారీరక శ్రమ సమయంలో గుండె పనితీరును తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. గుండెపోటుకు కారణమైన కరోనరీ ఆర్టరీ డిసీజ్‌ (సీఏడీ) ఉందా లేదా అని ఈ పరీక్షతో తెలుస్తుంది. గుండెకు వెళ్లే రక్తనాళాల్లోని అడ్డంకులనూ ఈ పరీక్ష గుర్తిస్తుంది. గుండె లయ (రిథమ్‌)లో ఉన్న లోపాలనూ పసిగడుతుంది. 
యాంజియోగ్రామ్‌: గుండెపోటు అని సందేహం కలిగినప్పుడు వ్యాధి నిర్ధారణ కచ్చితంగా చేయగలిగే మరో పరీక్ష యాంజియోగ్రామ్‌. కొన్నిసార్లు ఈసీజీ మార్పులు స్పష్టంగా లేకపోయినా, ఎకో పరీక్ష మనకు సరైన క్లూస్‌ ఇవ్వలేకపోయినా ఈ పరీక్ష చేయాల్సి వస్తుంది. ఇందులో గుండె రక్తనాళాల స్థితి, అందులోని అడ్డంకుల వంటివి తెలుస్తాయి. యాంజియోగ్రామ్‌లో వచ్చే ఫలితాలు 99 శాతం కంటే ఎక్కువగా నమ్మదగినవి. యాంజియోతో పాటు సీటీ యాంజియో అనే పరీక్షలో కచ్చితత్వం మరింత ఎక్కువ. 
హైసెన్సిటివిటీ ట్రోపోనిన్‌లు: ఇది ఒక రక్తపరీక్ష. గుండెపోటు వచ్చిన నాలుగు గంటల లోపు రక్తంలో హైసెన్సిటివిటీ ట్రోపోనిన్‌ అనే రసాయనాలు పెరుగుతాయి. ఈ పరీక్షతో ఆ విషయం నిర్ధారణ అయితే... అదెంత చిన్నదైనప్పటికీ గుండెపోటు వచ్చిందన్న విషయం కచ్చితంగా నిర్ధారణ అవుతుంది. 

ఇదీ ప్రోటోకాల్‌... 
ప్రపంచవ్యాప్తంగా 2012లో ఐరోపా, అమెరికా, వరల్డ్‌ ఫెడరేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందాలతో పాటు పలువురు శాస్త్రవేత్తలు గుండెపోటు నిర్ధారణ కోసం నిర్దిష్టంగా ఒక ప్రొటోకాల్‌ను రూపొందించారు. అది... 
∙హై సెన్సిటివిటీ ట్రోపోనిన్‌లు గుండెపోటు వచ్చిన రోగిలో తప్పక పెరుగుతాయి. ఛాతీనొప్పిని గుండెపోటుగా పరిగణించాలంటే ట్రోపోనిన్‌లు పెరగడంతో పాటు... ఈ కింది అంశాలు ఉండాలి 
∙ఛాతీనొప్పి లేక ఆయాసం గుండెపోటుకు సంబంధించినదని తెలియాలి 
∙ఈసీజీలో మార్పులు కనిపించాలి 
∙ఎకో పరీక్షలో గుండె కండరం స్పందనల్లో మార్పులు కనిపించాలి 
∙యాంజియోగ్రామ్‌ పరీక్షలో రక్తనాళాల్లో రక్తం గడ్డలు కనుగొనాలి. అప్పుడే ఆ ఛాతీ నొప్పిని గుండెపోటుగా నిర్ధారణ చేయవచ్చు. 
డాక్టర్‌ సి. రఘు, చీఫ్‌ కార్డియాలజిస్ట్‌ 
ఏస్టర్‌ ప్రైమ్‌ హాస్పిటల్స్, అమీర్‌పేట్,  హైదరాబాద్‌

గుండెపోటుకు మంచి  నిద్రతో చెక్‌... 
చూడ్డానికి బద్దకం, నిద్రా ఒకేలా అనిపించినా... వీటిల్లో చాలా తేడా ఉంది. నిద్ర ప్రశాంత సముద్రమైతే... బద్దకం తాత్కాలిక అలల్లాంటిది. బద్ధకంతో అలల్లాంటి కల్లోలం నెలకొంటే... ప్రశాంత నిద్రా సంద్రంలో ఎన్నో ఆరోగ్య నిధులు దొరుకుతాయి. గుండె విషయంలోనూ ఇంతే సత్యం. ఎందుకంటే... బద్ధకం శారీరక శ్రమను తగ్గించి  గుండెకు హానిచేస్తుంది. నిక్షేపమైన గాఢ నిద్ర గుండెకు నిధిలా మేలు చేకూర్చుతుంది. నిద్రకు సంబంధించిన కొన్ని జాగ్రత్తలతో గుండెపోటును ఎలా నివారించవచ్చో చూద్దాం. 

∙మధ్యాహ్నం పూట తీసే చిన్న కునుకు గుండెకూ, మెదడుకూ మంచిది. భోజనం తర్వాత ఓ చిన్న కునుకు తీయడం వల్ల మీ సామర్థ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతాయి ∙మరీ తక్కువ నిద్రపోవడం గుండెకు మంచిది కాదు. మరీ ఎక్కువ నిద్రపోవడం డిప్రెషన్‌కు సూచిక ∙తక్కువ నిద్రపోయేవారిలో రక్తపోటు పెరిగే అవకాశాలు ఎక్కువ. తగినంత నిద్రపోయేవారితో పోలిస్తే తక్కువ నిద్రపోయేవారు 70 శాతం ఎక్కువగా జబ్బుపడతారు. నిద్రలేమి ఉండేవారిలో మిగతావారితో పోలిస్తే  కనీసం 25% మెదడు సామర్థ్యం తక్కువ ఉంటుంది ∙నిద్రలేమితో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్రతిరోజూ కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం. రోజూ వేళకు నిద్రపోయి, వేళకు లేవండి. కోపంగా ఉన్న సమయంలో నిద్రకు ఉపక్రమించవద్దు. ఈ జాగ్రత్తలు పాటిస్తే... గుండె గురించి బెంగ లేకుండా హాయిగా గుండెల మీద చెయ్యివేసుకొని నిద్రపోవచ్చు.
డాక్టర్‌ రమణ ప్రసాద్‌ 
స్లీప్‌ స్పెషలిస్ట్, కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

హృదయాధ్మాత్మికంతో సంపూర్ణ ఆరోగ్యం
ఒక వ్యక్తి పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకంగా, మానసికంగానే కాదు... ఆధ్యాత్మికంగానూ ఆరోగ్యంగా ఉండాలంటోది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దాంతో  గుండెను భారతీయ ఆధ్యాత్మికత తాలూకు కోణాల్లోనూ చూడవచ్చని చెబుతున్నారు గుండెనిపుణులు. ఇలా మనం అరిషడ్వర్గాలను గుండెతో ముడేసి కాస్తంత విశ్లేషిద్దాం రండి. అరిషడ్వర్గాలంటే... కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వీటికీ గుండెకూ సంబంధమేమిటంటారా? ఉంది. 

మొదటిది కామం. అది ఆరోగ్యకరంగానూ, ధర్మబద్ధంగానూ అవసరమే అన్నది భారతీయ తత్వవేత్తల మాట. అందుకే దాన్ని మూడో పురుషార్థంగా చెప్పారు.  దాన్ని నెరవేర్చడానికి అవసరమైనది అంగస్తంభన. నలభై – యాభై ఏళ్ల వయసులో ఎప్పుడైనా అంగస్తంభనల్లో లోపం కనిపిస్తే ఆందోళన పడాల్సింది ప్రణయానందం కోసం కాదు... ప్రాణాల కోసం! ఎందుకంటే... అత్యంత సన్నటి రక్తనాళాల్లోకి రక్తం వేగంగా ప్రవహిస్తేనే స్తంభన జరుగుతుంది. అలా జరగలేదంటే సూక్ష్మమైన క్యాపిల్లరీస్‌లో కొవ్వులు చేరాయేమో, అందుకే ఆ ప్రక్రియ జరగడం లేదేమో అని అనుమానించాలి. ఇక్కడి క్యాపిల్లరీస్‌లో కొవ్వు చేరినప్పుడు, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరొనరీ ఆర్టరీ ధమనుల్లోనూ కొవ్వు చేరి ఉండవచ్చని సందేహించాలి. ఇలా పురుషార్థాలలో మూడవది ‘ఐదు’ప్రాణాలను... అదే పంచప్రాణాలను కాపాడుతుంది. ఈ విషయంలో మహిళలకు ఒక మినహాయింపు ఉంది. మెనోపాజ్‌ వరకూ వాళ్లలో స్రవించే ఈస్ట్రోజెన్‌ వాళ్లకు గుండెపోటు ముప్పు నుంచి సహజ రక్షణ ఇస్తుంది. మెనోపాజ్‌ తర్వాత మహిళలు కూడా అప్రమత్తంగా ఉండాలి. 

ఇప్పుడు అరిషడ్వర్గపు రెండో అంశమైన క్రోధాన్ని చూద్దాం. ఆగ్రహం, ఆవేశాలప్పుడు ఒంట్లో వచ్చే మార్పులే తీవ్ర ఒత్తిడిలోనూ కనిపిస్తాయి. కోçపంలోనూ ఒత్తిడిలోనూ ఒంట్లో అడ్రినాలిన్‌ అనే జీవరసాయనం స్రవిస్తుంది. జీవరసాయన చర్యలు, ఫిజియాలజీ పరంగా ఒత్తిడిని రెండో అరిషడ్వర్గానికి సమానంగా పరిగణించవచ్చు. ఈ ఒత్తిడి నేరుగా గుండెపైనే ప్రభావం చూపిస్తుంది. నేటి ఆధునిక జీవితంలో ఆఫీసులో పని, సాధించాల్సిన లక్ష్యాలు, టైమ్‌ లోపు  నెరవేర్చాల్సిన టార్గెట్లు, కుటుంబంలో కలహాలు, పిల్లల భవిష్యత్తు వంటివి ఒత్తిడిని మరికొంత పెంచుతాయి. ఇలా ఒత్తిడి పెరిగినప్పుడల్లా గుండె బేజారైపోతుంది. అప్పుడు శరీరం ‘గుండెధైర్యం తెచ్చుకొని పోరాడు లేదా గుండెచిక్కబట్టుకొని పారిపో’ అనే పరిస్థితికి  సన్నద్ధమవుతుంది. ఈ ప్రక్రియలో  ఒంట్లో ఎడ్రినాలిన్, కార్టిజోల్స్‌ అనే రసాయనాలు వెలువడి ఒంట్లోని ప్రతి అవయవాన్నీ దెబ్బతీస్తాయి. గుండెపై ఆ హాని ప్రభావం చాలా ఎక్కువ.

ఒత్తిడి – గుండె
ఒత్తిడికి సంబంధించి ఇటీవలి ఒక అధ్యయనం ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. ఉద్యోగస్తుల్లో పై అధికారుల ప్రవర్తన, కొలీగ్స్‌ మధ్య పోటీ, ఉద్యోగం పోతుందన్న అభద్రతతో కూడిన ఆందోళన వంటి అంశాలు గుండెపోటు ముప్పును 20 శాతం పెంచుతున్నట్లు తేలింది. ఇలా ఒత్తిడి పెరిగినప్పుడల్లా అది గుండెజబ్బులను తెస్తుంది. ఒత్తిడి శరీరంలో అత్యవసర పరిస్థితిని సృష్టిచడంతో మన అవయవాల్లో ఇన్‌ఫ్లమేషన్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. రక్తపోటు పెరగడం, రక్తంలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) తగ్గడం వంటివి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇవన్నీ మనకు గుండెను దడదడలాడించే అంశాలే. 
డాక్టర్‌  కె. ప్రమోద్‌ కుమార్‌ సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్, 
యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ హైదరాబాద్‌ 

అరిషడ్వర్గాలలో మూడు, నాలుగు లోభ, మోహాలు. వీటిల్లో మోహాన్ని మొదట చూద్దాం. మోహం అంటే ఇక్కడ ప్రాపంచిక కోరికలు. మనకు దక్కంది ఏదైనా కావాలని బలంగా కోరుకున్నప్పుడు ‘గుండెమంట’ పెరుగుతుంది. ఇక లోభం. అంటే ఉన్నదాన్ని పోగొట్టుకోలేకపోవడం. ఈ రెండూ పుట్టగానే కోరింది కావాలనీ, ఉన్నది దక్కదేమోననే ఒత్తిడీ, ఆ ఒత్తిడితో నాళాల్లో రక్తపు వేగం పెరుగుతాయి. ఇలా రక్తపోటు వచ్చి... అది గుండెపోటుకు దారితీయవచ్చు. దాంతో గుండెల్లో పట్టాల నిర్మాణం జరిగి... ఒకసారి గుండెపోటు గానీ వస్తే... తర్వాత రెండో పోటు ఎప్పుడో ఏమోననే  ఆందోళనతో ఆ పట్టాల మీద గుండెల్లో రైళ్లు పరుగెత్తడం నిత్యం జరుగుతూ ఉంటుంది. 

ఆ తర్వాతవి మద, మాత్సర్యాలు. ఈ రెంటి వల్ల గుండెపై పడే ప్రభావాలు దాదాపు ఒకేలా ఉంటాయి. పక్కవారికి ప్రమోషన్లు, ఆదాయాల్లో తేడాల కారణంగా ఈర్ష్యకు ఇంచుమించు సమానమైన మాత్సర్యంలోనూ కలిగేదీ ఒకరకమైన ఒత్తిడే. ఇక మదం విషయానికి వస్తే... ప్రమోషన్లూ, పదోన్నతులు కలిగిన వారు... తమకు ఎవరైనా అడ్డు చెప్పినప్పుడు వారి అహం దెబ్బతింటుంది. దాంతో పెరిగే అహంకారం వల్ల రెండో అరిషడ్వర్గమైన క్రోధం సమయంలో ఒంట్లో కలిగే జీవరసాయనచర్యలే జరుగుతాయి. అందుకే అరిషడ్వర్గాలలోని మొదటిది ఒక పరీక్షలా ఉపయోగపడితే మిగతావన్నీ ఒత్తిడిని తీవ్రంగా పెంచి గుండెకు హాని చేస్తాయి. అందుకే త్రిగుణాలైన సత్వ, రజో, తమో గుణాల్లో...  సాత్వికాన్ని పెంపొందించుకొని, తామస, రజో గుణాలను తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అప్పుడు గుంyð  నెమ్మదించి, మనకు మేలు కలుగుతుందంటున్నారు వైద్యశాస్త్రపు తాత్వికత ఎరిగిన నిపుణులు. అంతేకాదు... భారతీయ ఆధ్యాత్మికత మనకు వరంగా ఇచ్చిన మరో అస్త్రం  ధ్యానం.  అది మనకు గుండెనిబ్బరం ఇస్తుందన్నది తథ్యం. నిరూపితమైన సత్యం. 
 – యాసీన్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top