ఆప్తమిత్రుడు

Sakshi Funday Story On Real Incidents

‘‘లలితా! శేషు బాబు వచ్చాడు కాఫీ తీసుకురా’’  వంటింట్లో ఉన్న భార్యకు వినపడేలా అరిచాడు శేఖరం. శేషుబాబు అన్న పేరు వినపడగానే ఉలిక్కిపడింది లలిత. ఆమె ముఖం రంగులు మారి అసహ్యాన్ని పులుముకుంది.  హాలులో కూర్చున్న శేషుబాబు మాటిమాటికీ వంటగది వైపు చూస్తున్నాడు. మనిషి కుర్చీలో కూర్చున్నాడు గానీ.. మనసు మాత్రం లలిత చుట్టూ తిరుగుతోంది. కొద్దిసేపటి తర్వాత కాఫీ గ్లాసులతో హాలులోకి వచ్చిందామె. శేషు చూపులు ఆమెపైనుంచి పక్కకు మళ్లటం లేదు. ఇద్దరికీ కాఫీ అందించి పరుగులాంటి నడకతో వంటింట్లోకి వెళ్ళిపోయింది. పేపర్‌ చదవడంలో నిమగ్నమై ఉన్న శేఖరం ఇదేమీ గమనించలేదు.

మొదటిసారి ఓ మగాడంటే ఆమెకు అసహ్యం వేస్తోంది. ఏమీ చేయలేని నిస్సహాయతతో ఆమె కళ్లు చెమర్చాయి. శేషు దగ్గర భర్త అప్పు తీసుకున్న పాపానికి ప్రతి నిత్యం నరకం అనుభవిస్తోంది. శేఖరం తాగుడికి బానిసైన తర్వాత చేసిన మొదటి తప్పు శేషు దగ్గర అప్పు తీసుకోవడం. పహిల్వాన్‌ శేషుబాబు... ఒకప్పుడు కుస్తీ పోటీల్లో ప్రత్యర్థి కండలు పిండి చేసి డబ్బులు సంపాదించే వాడు. ఇప్పుడు అధిక వడ్డీల రూపంలో అప్పు తీసుకున్న వాళ్ల ముక్కులు పిండి డబ్బులు సంపాదిస్తున్నాడు. భర్తలు అప్పు తీసుకున్న పాపానికి శేషు బాబు చేతిలో బలైన ఆడవాళ్లెందరో.

అప్పు అడగటం అనే సాకుతో తరుచూ శేఖరం ఇంటికి వచ్చేవాడు శేషుబాబు. ఓ రోజు లలిత ఒక్కర్తే ఇంట్లో ఉన్న సమయంలో శేఖరం ఇంటికి వచ్చాడతను. మర్యాద కొద్ది అతన్ని హాల్లో కూర్చో పెట్టింది లలిత. కొద్దిసేపటి తర్వాత కాఫీ తెచ్చి చేతికందించింది. అతడు  కాఫీకి గ్లాసుకు బదులుగా ఆమె చేతిని పట్టుకున్నాడు. సర్రున చేతిని వెనక్కు లాక్కుని, లలిత అతని వైపు కోపంగా చూడగా.. వెకిలి నవ్వు నవ్వాడు. అప్పుడు తనకొచ్చిన కోపానికి అతని రెండు చెంపలు వాయించేదే! కానీ భర్తను అప్పు తీర్చమంటూ ఇబ్బంది పెడతాడేమోనని ఆగిపోయింది.

ఆ తర్వాతి నుంచి అతని వేధింపులు మామూలైపోయాయి. ఈ సంగతి భర్తకు చెప్పలేక, మనసులో దాచుకోలేక ప్రతినిత్యం నరకం అనుభవించేది లలిత. శేషు ఇంటికి వచ్చినప్పుడల్లా లలితకు పట్టరాని కోపం వచ్చేది. ఆ కోపం వంట గదికి మాత్రమే పరిమితమయ్యేది. ఓ రోజు సాయంత్రం ఇంటి బయట అరుగుపై కూర్చుని పూలు కుడుతోంది. ఈ మధ్య ఏ పనైనా యాంత్రికంగా చేయటం అలవాటైంది తనకి. ఏదో ఆలోచిస్తూ పూలు గుచ్చుతోంది.  ఇంతలో గట్టిగా ఏవో అరుపులు వినపడటంతో తేరుకుని అటువైపు చూసింది. ఓ కుక్క ఒంటినిండా గాయాలతో గట్టిగా అరుచుకుంటూ ఇంటి బయట ఉన్న పెరట్లో.. చెట్ల మాటున దాక్కుంది.

దాని గాయాలనుంచి చుక్కలుగా రక్తం కూడా కారుతోంది. లలిత చలించి పోయింది. కొద్దిసేపటి తర్వాత దాని దగ్గరగా వెళ్లటానికి ప్రయత్నించింది. అది భయంతో అరుస్తూ మీదకు రాబోయింది. ఆమె తన ప్రయత్నాన్ని వాయిదా వేసుకుని, ఓ గంట తర్వాత పల్లెంలో అన్నం తీసుకువచ్చింది. ఆమెను చూడగానే అది మొదట అరిచినా దాని ముందు అన్నం పెట్టగానే కొద్దిగా శాంతించింది. ఆమె పక్కకు పోయేంత వరకు ఆగి తర్వాత కడుపారా అన్నం తిన్నది. లలిత మరుసటి రోజు కూడా  అన్నం పెట్టిదాన్ని మచ్చిక చేసుకుంది. దెబ్బలకు స్వయంగా పసుపుతో లేపనం తయారుచేసి రాసింది. ఇలా రోజులు గడవగా ఆనతి కాలంలో దాని ఒంటిపై ఉన్న గాయాలు మానటంతోపాటు అది ఆమెకు మచ్చిక అయ్యింది. లలిత దానికి ముద్దుగా చిన్నా అని పేరుపెట్టుకుంది. పేరు పెట్టి పిలవగానే ఎక్కడ ఉన్నా తోక ఊపుకుంటూ వచ్చేది. అలా చూస్తుండగానే నెలల సమయం గడిచిపోయింది...

ఆ రాత్రి భర్త కోసం ఎదురుచూసున్న లలితకు అలసట కారణంగా తొందరగానే నిద్రపట్టేసింది. అర్థరాత్రి ఇంటి బయటినుంచి చిన్నా అరుపులు వినపడటంతో మెలుకువ వచ్చిందామెకు. ‘చాలా సేపటినుంచి అరస్తున్నట్లుంది ఏమైంది’ అని ఆలోచిస్తూ బయటకు వెళ్లింది. శేఖరం బాగా తాగి ఆరుగుపై పడిపోయి ఉన్నాడు. అతని కాళ్ల పక్కగా చిన్నా నిలబడి చీకట్లోకి చూస్తూ అరుస్తోంది. చీకట్లో ఏదో ఉందనుకున్న లలిత టార్చ్‌లైట్‌ ఆన్‌ చేసి అటువైపుగా వేసింది. ఆ దృశ్యం చూడగానే ఒక్కసారిగా ఒళ్లు జలదరించినట్లయిందామెకు.   నాలుగు అడుగుల పొడవున్న పాము శేఖరం వైపు రావటానికి ప్రయత్నిస్తోంది. కానీ చిన్నా దాన్ని ముందుకు రాకుండా ఆపుతోంది. గట్టిగా అరుస్తూ వెనక్కుపొమ్మని బెదిరిస్తోంది. లలితకు భయంతో చెమటలు పట్టి, శరీరం మొత్తం మెల్లగా కంపిస్తోంది. అంత పెద్ద పామును చూడగానే మొదట భయపడినా! వెంటనే భర్త ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావించి ధైర్యం తెచ్చుకుంది. ఆ వెనువెంటనే పామును కొట్టి చంపకుండా పొడవాటి కర్రతో దాన్ని పక్కకు తోసే ప్రయత్నం చేసింది. పాము బుసలు కొడుతూ లలిత మీదకి రాబోయింది.

చిన్నా అడ్డం వచ్చి దాన్ని వెనక్కు పొమ్మనట్లు అరుస్తూ  గద్దించింది. చిన్నా ఒకవైపు, లలిత మరోవైపు చేరి ఎట్టకేలకు పామును చంపకుండానే బయటకు తరమగలిగారు. లలిత భర్తను అక్కడినుంచి ఇంట్లోకి చేర్చింది.  బయట గుమ్మం దగ్గర కూర్చుని వీధివైపు చూస్తోంది చిన్నా. మంచంపై కూర్చుని దానివైపు అలా చూస్తూ ఉండిపోయింది లలిత. ఆ క్షణం చిన్నా ఆప్తమిత్రుడిలా అనిపించాడు.. భర్తను కాపాడిన దేవుడిలా కనిపించింది. చిన్నా లేకపోయింటే ఎంత ఘోరం జరిగిపోయిండేది. ఆ ఆలోచన రాగానే ఆమె కళ్లు అప్రయత్నంగా చెమర్చాయి. ఎక్కడో మనసు మూలల్లో చిన్నా ఓ కుక్క.. అనే భావన పూర్తిగా పోయింది. ఒంటరైన తనకు చిన్నాతోబుట్టువులా అనిపించింది.

అప్పటినుంచి చిన్నాతో మాటల్లో చెప్పలేని ఓ అనుబంధం ఏర్పడిందామెకు. దాన్ని సొంత మనిషిలా ప్రేమగా చూసుకునేది లలిత. చిన్నా కూడా ఆమెపై అంతే విశ్వాసంగా ఉండేది. హద్దులు దాటి ఇంట్లోకి ఎప్పుడూ అడుగుపెట్టలేదు. దాని కారణంగా ఊరి చివరన ఉన్న ఆ ఇంటికి, ఆమెకు ఓ రక్షణ దొరికినట్లైంది. శేషుకు, చిన్నాకు మధ్య ఏ పగలేకపోయినా అతడు ఇంటికి వచ్చిన ప్రతిసారి కోపంగా చూస్తూ గుర్రుమనేది. ముఖ్యంగా లలిత వైపు చూస్తే చాలు గట్టిగా మొరిగేది. ఆ భయంతో శేషు ఆమెవైపు చూడాలంటే కొద్దిగా జంకేవాడు. మనసులోపల చిన్నాను చంపేయాలన్న కోపం వచ్చేదతడికి. చిన్నా ఇంటికి వచ్చి ఏడాది పూర్తయింది. లలిత జీవితంలో చాలా మార్పు వచ్చింది. కష్టాలతో ఒంటరి పోరాటం చేస్తున్న తనకు చిన్నా రూపంలో ఓ తోడు దొరికింది. ఆలోచిస్తూ మధ్యాహ్నం భోజనం తయారు చేయటానికి కూరగాయలు తరుగుతోంది లలిత.

‘‘అక్కా! అక్కా!’’ ఎవరో పిలుస్తున్నట్లనిపించి, గుమ్మం దగ్గరకు వచ్చింది. స్వప్న.. పక్క వీధిలో ఉంటుందామ్మాయి. ఏదో అర్జంట్‌ పని పడితే తప్ప ఇంటి వైపు రాదు. పైగా పరిగెత్తుకుంటూ వచ్చినట్లుంది.. ఆయాసపడుతోంది.’’
‘‘ఏంటి! స్వప్నా ఇలా వచ్చావ్‌!! ఎందుకు ఆయాసపడుతున్నావు’’ ఆదుర్దాగా అడిగింది లలిత.
‘‘అక్కా! మీ చిన్నాను మున్సిపాలిటీ వాళ్లు వ్యానులో తీసుకెళ్తున్నారు’’ ఆయాసపడుతూ చెప్పింది ఆ అమ్మాయి. ఒక్క క్షణం లలిత గుండె కలుక్కుమంది. ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే ఆ అమ్మాయి వెంట పరుగు తీసింది. వాళ్లు అక్కడికి చేరుకునేలోపే వ్యాను దూరంగా వెళ్ళిపోయింది. ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఇంటికి తిరిగొచ్చింది లలిత.   చిన్నాను మున్సిపాలిటీ వాళ్లు తీసుకుపోయి మూడురోజులైంది. ఈ మూడు రోజులు భారంగా గడిచాయి తనకు. నిత్యం సందడిగా ఉండే ఇళ్లు మళ్లీ బోసిపోయినట్లు అనిపిస్తోంది. దూరమైన ఒంటరి తనం మళ్లీ తనను ఆవిరిస్తోంది. దానికి తోడు శేఖరం ఈ మధ్య సరిగ్గా ఇంటికి రావటమే మానేశాడు. తప్పతాగి ఏ అర్థరాత్రి పూటో తలుపుతట్టడం..లేదంటే ఆ గుమ్మం దగ్గరే పడిపోవటం అతడి దినచర్యగా మారింది. దీంతో ప్రతిరోజు భర్తకోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడటం లలితకు ఓ అలవాటైంది. రోజూలాగే ఆ రోజు కూడా భర్త కోసం ఎదురుచూస్తోందామె.

ఇంతలో తలుపు దగ్గర చప్పుడు కావటంతో అటు చూసింది. ఆ దృశ్యం చూడగానే లలిత గుండె ఆగినంతపనైంది. శేషుబాబు.. గుమ్మం దగ్గర నవ్వుతూ నిల్చుని ఉన్నాడు. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న వాడిలా ఆమె వైపు కసిగా చూస్తున్నాడు. భర్త కోసం తెరిచిఉంచిన తలుపును గట్టిగా తన్నుకుంటూ దర్జాగా లోపలికి వచ్చాడతను. అతడు లోపలికి ప్రవేశించగానే భయంతో బయటకు పరుగులు తీయబోయిందామె. అతడు వెంటనే ఆమెను పట్టుకున్నాడు. కొద్దిసేపు ఇద్దరి మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. తనకు సహకరించటంలేదన్న కోపంతో ఆమెను కసితీరా కొట్టాడు శేషు. ఆ దెబ్బలతో ఆమె శక్తి పూర్తిగా నశించింది.

అదే సమయానికి ఇంటికి వచ్చిన శేఖరం ఆ దృశ్యాన్ని చూసి ఊగిపోయాడు. ‘రేయ్‌! రేయ్‌!’ అంటూ తాగిన మత్తులో కోపంగా తూలుతూ ఇంట్లోకి వెళ్లబోయి గుమ్మం దగ్గరే చతికిలబడ్డాడు. శేఖరం వైపుచూసి గట్టిగా నవ్వుకుని, గోడకు ఆనుకుని భయంతో ఒణుకుతున్న లలిత వైపు నడిచాడు శేషుబాబు. భర్త తనను కాపాడతాడనుకున్న లలితకు నిరాశే ఎదురైంది! తనవైపు వస్తున్న అతడిని చూస్తూ.. ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో మనసులో భగవంతుడ్ని తలుచుకుని కళ్ళు మూసుకుంది లలిత. కొద్దిసేపటి తర్వాత దిక్కులు పిక్కటిల్లేలా శేషుబాబు అరుపులు వినపడుతుండటంతో కళ్లు తెరిచింది. అంతా మసకమసకగా కనబడుతోంది తనకు. నేలపై పడి అటు ఇటు దొర్లుతూ అరుస్తున్నాడు శేషు బాబు. చిన్నా! అతడిపై పడి కండలు ఊడేలా కొరుకుతోంది. చిన్నాను చూడగానే కొండంత ధైర్యం వచ్చిందామెకు. లేచే ఓపిక లేక అక్కడే కూర్చుండిపోయింది.

మూడు రోజులుగా తిండి లేక అలసటగా ఉన్నా.. వెనక్కి తగ్గడం లేదు చిన్నా.  దాని నుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు శేషుబాబు. కిందపడ్డ అతన్ని పైకి లేవనీయటం లేదు చిన్నా. దాని పంటి గాట్లతో శేషు శరీరం తూట్లు పడింది. చావు ఖాయం అనుకున్న శేషుబాబు ఆఖరి ప్రయత్నంగా.. అతి కష్టం మీద బొడ్డులో దోపుకున్న కత్తి తీసి చిన్నా గొంతులో పొడిచాడు. కత్తి గట్టిగా గొంతులో దిగడంతో నొప్పి భరించలేక అతని మీదనుంచి పక్కకు జరిగింది చిన్నా.  శేషు బాబు! లలిత వైపు చూసే ప్రయత్నం చేయలేదు. ప్రాణాలతో ఉంటేచాలని అక్కడినుంచి కాళ్లీడ్చుకుంటూ పరుగులు తీశాడు. నొప్పితో దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తుస్తోంది చిన్నా. దాని అరుపులు లలితకు వినిపించడం లేదు. మూగబోయింది.. చిన్నా గొంతు మూగబోయింది. దాని గొంతు నుంచి రక్తం ధారగా కారుతోంది. అయినా లలితను చేరుకోవటానికి అడుగు ముందుకు వేసింది. మొదటిసారి మనసు మాట శరీరం వినడం లేదు.

శరీరం ముందుకు కదలనంటూ మొండికేస్తోంది. తోకను మెల్లగా నేలపై తడుతూ తనకు తెలిసిన భాషలో లలితపై ఉన్న ప్రేమను తెలియజేసింది. కత్తి గాటు గొంతును చీల్చిన బాధ కంటే తన వాళ్లను కాపాడానన్న ఆనందంతో తోక మెల్లగా ఊగుతోంది. అలా అడుగులు ముందుకు వేస్తూ నేలపైకి ఒరిగింది. శేషు! చిన్నాను కత్తితో పొడిచిన దృశ్యాన్ని చూసిన ఆ క్షణమే నిశ్చేష్టురాలై! అలా ఉండిపోయింది లలిత. తేరుకోవటానికి కొద్దిసమయం పట్టింది. శరీరంలోని ఓపికనంతా కాళ్లలోకి తెచ్చుకుని చిన్నా దగ్గరకు పరుగుతీసింది. నేలపై ఒరిగిన చిన్నాను చూస్తూ ఉండిపోయింది. తన కారణంగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న దాన్ని చూసి విలవిల్లాడిపోయింది. బాధతో కంటనీళ్లు ఆగటం లేదు. తన నిస్సహాయ స్థితిని తలుచుకుంటే మొదటిసారి అసహ్యం వేస్తోందామెకు. చిన్నా కళ్లు చెమ్మగిల్లాయి. అవి బహుశా తన మిత్రురాలిని వదిలివెళ్లిపోతున్నానన్న బాధ వల్ల కావచ్చు. అలా లలిత వైపు చూస్తూ ఉండిపోయింది. అంతిమ వీడ్కోలు చెబుతున్నట్లు కనురెప్పలు అల్లాడించింది...(యదార్థ సంఘటనకు కల్పిత రూపం)
.బండారు వెంకటేశ్వర్లు(వెబ్‌ డెస్క్‌)

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top