పిల్లలు పిడుగులు అండ్ గాడ్స్

పిల్లలు పిడుగులు అండ్ గాడ్స్


కవర్ స్టోరీ

ఈకాలం చిచ్చర పిడుగులుఉన్నారే... వీళ్లను మెప్పించడమంటే మాటలు కాదు. ఆషామాషీ విన్యాసాలు వీళ్లను ఏమాత్రం ఆకట్టుకోలేవు. కాకమ్మ కథలు వినిపిస్తే అమాయకంగా ఊ కొట్టే రకాలు కాదు వీళ్లు. అద్భుతరస ప్రధానమైన సాహస విన్యాసాలు కళ్లకు కట్టాల్సిందే. చూసే కొద్దీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే సాహస విన్యాసాలను, అద్భుత మాయాజాలాలను సునాయాసంగా చేయగల సూపర్‌మేన్, బ్యాట్‌మేన్, స్పైడర్‌మేన్, డోరోమేన్ వంటి కామిక్ కథానాయకులే చిన్నారుల అభిమాన హీరోలు.

  ప్రపంచవ్యాప్తంగా చిన్నారులను వీళ్లు దశాబ్దాలుగా అలరిస్తూ వస్తున్నారు.
మన దేశంలోనూ యానిమేషన్ రంగం ఊపందుకున్న తర్వాత బాలగణేశ, ఛోటా భీమ్, హనుమాన్ వంటి పురాణ పాత్రలు కూడా కామిక్ ‘కథ’నరంగంలోకి అడుగుపెట్టాయి. దేవుళ్లకు, సూపర్‌హీరోలకు ఉన్న తేడా మన చిచ్చరపిడుగులకు తెలుసు... మరి కామిక్‌లను సృష్టించిన దేశాల్లోని పిల్లలకు ఈ తేడా తెలుస్తుందా..?

 

ఆ తరం కాదు... ఈ-తరం పిల్లలు

దేశంలోకి ఇంకా టీవీలు రాని సత్తెకాలం ఒకటి సమీప గతంలోనే ఉండేది. అప్పట్లో చిన్నారులు తాతయ్యలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు చెప్పే పేదరాశి పెద్దమ్మ కథలను, బాలభారత గాథలను, చిన్నికృష్ణుడి లీలను వింటూ పెరిగేవారు. కొంచెం అక్షరజ్ఞానం అలవడ్డాక చందమామ, బాలమిత్రలలోని పట్టువదలని విక్రమార్కుడి కథలను, బ్రహ్మరాక్షసుల పనిపట్టే సాహస వీర రాజకుమారుల కథలను, అల్లావుద్దీన్ అద్భుత దీపం వంటి కథలను, మాయల మరాఠీల కథలను, రామాయణ, భారత, భాగవత గాథలను అత్యంత ఉత్కంఠతో చదువుకునేవారు. వాక్యాలను కాస్త వేగంగా చదవడం అలవాటయ్యాక ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ వంటి అభూత కాల్పనిక గాథలను చదువుతూ ఉద్విగ్నతకు లోనయ్యేవారు.టీవీలు వచ్చిన కొత్తల్లో పిల్లలు ఇవే కథలను బుల్లితెర మీద చూసి ఉర్రూతలూగేవారు. అప్పట్లో దూరదర్శన్ ఒక్కటే ఉండేది. కాలం శరవేగంగా మారింది. టీవీ చానెళ్లు పెరిగాయి. అంతర్జాతీయ చానెళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అక్కడితోనే మార్పు ఆగిపోలేదు. ఇంటర్నెట్ ఇంటింటికీ అల్లుకుపోతున్న రోజులు వచ్చిపడ్డాయి. ఈ-తరం పిల్లలు టీవీల్లో కార్టూన్ నెట్‌వర్క్ ప్రసారాలకే పరిమితం కావడం లేదు, ఆకట్టుకునే కామిక్స్ కోసం యూట్యూబ్‌నూ వదలడం లేదు వీళ్లు.

 

కామిక్స్ నేపథ్యం

పుస్తక ముద్రణ, పత్రికల ప్రచురణ మొదలైన తర్వాత కామిక్స్ ప్రాచుర్యాన్ని పొందాయి. టీవీ చానెళ్లు వచ్చాక మరింతగా విస్తరించాయి. ఇంగ్లిష్ చిత్రకారుడు, ముద్రాపకుడు విలియమ్ హోగార్త్‌ను ఆధునిక కామిక్స్‌కు ఆద్యుడిగా చెప్పుకోవచ్చు. పద్దెనిమిదో శతాబ్దిలోనే ఆయన ఏడు సంపుటాల నీతి కథలను సచిత్రంగా ప్రచురించాడు. ఆ తర్వాత శతాబ్దానికి కామిక్ కళ మరో మైలురాయిని చేరుకుంది. బ్రిటిష్ హాస్య వారపత్రిక ‘జూడీ’ 1867లో ప్రపంచంలోనే తొలి కామిక్ సీరియల్ ‘ఏలీ స్లోపర్స్ హాఫ్ హాలీడే’ను ప్రచురించింది. ఈ కొత్త ప్రయోగం అంతంతమాత్రం చదువులున్న కార్మిక వర్గాల పాఠకులను, బడికి వెళ్లే చిన్నారులను విపరీతంగా ఆకట్టుకుంది.దాంతో కొన్ని వేల కాపీలు ఉన్న ‘జూడీ’ సర్క్యులేషన్ అమాంతం 3.50 లక్షల కాపీలకు చేరుకుంది. ‘జూడీ’ ప్రభావంతో 1890 నాటికి బ్రిటన్‌లో ‘కామిక్ కట్స్’, ‘ఇలస్ట్రేటెడ్ చిప్స్’ అనే మరో రెండు కామిక్ పత్రికలు ప్రారంభమయ్యాయి. అప్పట్లోనే అమెరికన్ కార్టూనిస్ట్ రిచర్డ్ ఎఫ్ ఔట్‌కాల్ట్ కామిక్స్‌ను ఒక పద్ధతిలో పెట్టాడు. ఔట్‌కాల్ట్‌ను ఆధునిక కామిక్స్‌కు సూత్రకారుడిగా చెప్పుకోవచ్చు. ఆ కాలంలో ప్రపంచంలోని మిగిలిన భాషల పత్రికలు కూడా కామిక్స్ ఒరవడిని అందిపుచ్చుకున్నాయి.

 

సూపర్‌హీరోల యుగం

రిచర్డ్ ఎఫ్ ఔట్‌కాల్ట్ కామిక్ సిరీస్‌లకు ఒక ఒరవడిని తీర్చిదిద్దాక కామిక్స్ రూపకల్పనలోనే కాదు, కామిక్స్ కోసం ఎన్నుకునే కథాంశాల్లోను, రచనా విధానంలోనూ సృజనాత్మకత, కాల్పనికత అనతి కాలంలోనే తారస్థాయికి చేరుకుంది. కామిక్స్ కామెడీకి మాత్రమే పరిమితం కాలేదు. అడ్వంచర్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, డిటెక్షన్ వంటి రంగాలకు విస్తరించి, వైవిధ్యాన్ని సంతరించుకున్నాయి. సూపర్‌మేన్, బ్యాట్‌మేన్, స్పైడర్‌మేన్, ఐరన్‌మేన్, డోరోమేన్ వంటి సూపర్‌హీరోలను సృష్టించి, జనాలకు పరిచయం చేశాయి. అలా జనాలకు పరిచయమైన తొలి సూపర్ హీరో ‘సూపర్‌మేన్.అమెరికన్ ప్రచురణ సంస్థ ‘డీసీ కామిక్స్’ 1938 జూన్‌లో విడుదల చేసిన ‘యాక్షన్ కామిక్స్’ సిరీస్ ద్వారా సూపర్‌మేన్ జనాలకు పరిచయమయ్యాడు. అమెరికన్ రచయిత జెర్రీ సీగల్, కెనడియన్ చిత్రకారుడు జో షూస్టర్‌లు సృష్టించిన ‘సూపర్‌మేన్’ అనతికాలంలోనే చిన్నారులకు ఆరాధ్య కథానాయకుడిగా మారాడు. ‘యాక్షన్ కామిక్స్’ సిరీస్ తొలి సంచికను రెండు లక్షల కాపీలతో మార్కెట్‌లోకి విడుదల చేస్తే, అనతి కాలంలోనే సర్క్యులేషన్ పది లక్షల కాపీలకు పెరిగింది. తొలి సంచిక కాపీని 2014లో ఈ-బేలో వేలం వేసినప్పుడు ఏకంగా 32.07 లక్షల డాలర్లకు (రూ.21.52 కోట్లు) అమ్ముడుపోయింది. కామిక్స్ చరిత్రలోనే ఇది అరుదైన రికార్డు. ‘సూపర్‌మేన్’ ఆవిర్భావంతో కామిక్స్ రంగంలో సూపర్‌హీరోల యుగం మొదలైంది.

 

బ్యాట్‌మేన్... జేమ్స్‌బాండ్‌కు తాత

‘సూపర్‌మేన్’ వచ్చిన మరుసటి ఏడాదిలోనే అతడికి దీటుగా ‘బ్యాట్‌మేన్’ దూసుకొచ్చాడు. ‘బ్యాట్‌మేన్’ కూడా డీసీ కామిక్స్ సృష్టించిన సూపర్‌హీరోనే. అమెరికన్ రచయిత బిల్ ఫింగర్, చిత్రకారుడు బాబ్ కేన్ సృష్టించిన ‘బ్యాట్‌మేన్’ అలాంటిలాంటి సూపర్‌హీరో కాదు, జేమ్స్‌బాండ్‌కు తాతలాంటి వాడు.

 

సినిమాల్లో జేమ్స్‌బాండ్ ఎలాంటెలాంటి సాహసాలు చేస్తాడో కామిక్స్‌లో బ్యాట్‌మేన్ అంతకు మించిన సాహసాలను అవలీలగా చేసేస్తాడు. విలాసాల్లో మునిగి తేలుతుంటాడు. అయినా ఆపన్నులను ఆదుకుంటాడు. దుష్టుల భరతం పడుతుంటాడు. కళ్లు చెదిరే కార్లు మాత్రమే కాదు, విమానాలనూ, వాటితో పాటే చిత్ర విచిత్ర వాహనాలనూ నడుపుతాడు. ఊహకందని అధునాతన పరికరాలను, అధునాతన ఆయుధాలను వాడుతుంటాడు. అసలు బ్యాట్‌మేన్ ఆహార్యమే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. గబ్బిలంలా కనిపించే ముసుగు అతడి ముఖాన్ని పూర్తిగా కనిపించనివ్వదు. ఒంటికి దుర్భేద్యమైన కవచం, ఇతర రక్షణ అలంకరణలు బ్యాట్‌మేన్‌ను ప్రత్యేకంగా నిలుపుతాయి. విలక్షణమైన ఆహార్యం, విచిత్రమైన సాహస విన్యాసాలు బ్యాట్‌మేన్‌ను అనతి కాలంలోనే చిన్నారుల అభిమాన హీరోను చేశాయి.

 

బ్యాట్‌మేన్ నిజంగా ఉంటే..!

బ్యాట్‌మేన్ ఒక కాల్పనిక పాత్ర. కామిక్ కథనం ప్రకారం అతడి అసలు పేరు బ్రూస్ వేన్. శతకోటీశ్వరుడు. విలాసవంతమైన జీవితం అతడి సొంతం. అయినా, అమాయకులకు మేలు చేయాలనే సంకల్పంతో, అన్యాయాలను ఎదిరించాలనే సదుద్దేశంతో ముసుగువీరుడిలా ‘బ్యాట్‌మేన్’ అవతారంతో సాహసాలు చేస్తుంటాడు. ఆ సంగతి మనలో చాలామందికి తెలుసు. చిన్నారులకు మాత్రం అతడో నిజమైన హీరో. సినిమా హీరోలను మించిన సూపర్ హీరో. అలాంటి బ్యాట్‌మేన్ నిజంగా ఉంటే... కథా కమామిషూ ఎలా ఉండేవనే ఆలోచనతో ‘మనీ సూపర్ మార్కెట్ డాట్ కామ్’ ఒక అంచనా వేసింది.

 

బ్యాట్‌మేన్ ఆహార్యం, అతగాడి ఆయుధాలు, పరికరాలు వగైరా వగైరాలన్నింటినీ ఒక్కొక్కటే డబ్బులోకి తర్జుమా చేసి లెక్కలేసింది. ఈ లెక్కల మొత్తాన్ని చూస్తే ఎవరికైనా కళ్లు తిరగక మానవు. ‘మనీ సూపర్ మార్కెట్ డాట్ కామ్’ అంచనా ప్రకారం... ఒకవేళ బ్యాట్‌మేన్ గనుక నిజంగానే ఉంటే గింటే... అతడి ఆహార్యం, పరికరాల విలువ ఏకంగా 68,24,51,350 డాలర్లు. మన లెక్కల్లో చెప్పుకోవాలంటే రూ.4580 కోట్లకు పైమాటే! దీనికే నోరెళ్లబెడుతున్నారా? కథనం ప్రకారం బ్యాట్‌మేన్ సంపదను ఇందులో లెక్కవేయలేదు. జస్ట్ అతడి ఆహార్యం, ఆయుధాలు, పరికరాల లెక్క మాత్రమే.

 

బ్యాట్‌మేన్ సమస్త సంపదను లెక్కిస్తే ఎంతవుతుందంటారా..? ‘ఫోర్బ్స్’ పత్రిక పనిగట్టుకుని మరీ లెక్కలేసి, బ్యాట్‌మేన్ అలియాస్ బ్రూస్ వేన్ నికర విలువను దాదాపు 700 కోట్ల డాలర్లుగా (రూ.46,980 కోట్లు) తేల్చింది.

 

కామిక్సా... మజాకా!

సూపర్ హీరోల ధాటి మొదలయ్యాక ప్రచురణ రంగంలో కామిక్స్ పుస్తకాలు దుమ్ము దుమారమే రేపాయి. ఒకానొక దశలో మామూలు పుస్తకాల కంటే కామిక్స్ పుస్తకాల అమ్మకాలే ఎక్కువగా సాగాయి. కామిక్స్ పుస్తకాలు పాఠకులను చెడగొడుతున్నాయంటూ సంస్కరణవాదులు గగ్గోలు పెట్టి గుండెలు బాదుకున్నారు. అక్కడితో ఆగలేదు. కామిక్స్ పుస్తకాల అమ్మకాలు సాధారణ సాహితీ పుస్తకాల అమ్మకాలకు మించిపోవడంతో 1946లో అమెరికాలోని కొందరు ‘సంస్కరణవాదులు’ కామిక్స్ పుస్తకాలను తగులబెట్టారు కూడా. అయినా కామిక్స్ పుస్తకాల ధాటి తగ్గలేదు కదా, మరింత పెరిగింది. టీవీ మాధ్యమం అందుబాటులోకి వచ్చాక పుస్తకాల్లోని కామిక్స్ బుల్లితెర మీదకెక్కడం మొదలైంది.కామిక్స్ ఆధారంగా సినిమాలూ వచ్చాయి. ఇంటర్నెట్ వచ్చాక వెబ్ కామిక్ సిరీస్‌లు మొదలయ్యాయి. అవన్నీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి. ప్రచురణకర్తలకు, నిర్మాతలకు కాసుల పంట పండిస్తూనే ఉన్నాయి. కామిక్స్ ఆధారంగా ఇప్పటి వరకు రెండువందలకు పైగానే సినిమాలు వచ్చాయి. కామిక్స్ ఆధారంగా 2012లో రూపొందిన ‘ది ఎవెంజర్స్’ ఏకంగా 62.30 లక్షల డాలర్లు (రూ.418 కోట్లు) వసూలు చేసింది. కామిక్ ఆధారిత సినిమాల్లో ఇప్పటికి ఇదే అతిపెద్ద రికార్డు.

 

మన సూపర్ హీరోలు వాళ్లే...

పౌరాణిక నేపథ్యంలేని అమెరికా వంటి దేశాల్లో కేవలం కాల్పనిక పాత్రలే సూపర్ హీరోలుగా కామిక్స్ వచ్చాయి. అవి ఖండాంతరాలకూ పాకాయి. ఘనమైన పౌరాణిక నేపథ్యం గల మన దేశంలో కామిక్స్ కొత్త ఒరవడిని దిద్దుకున్నాయి. కేవలం కాల్పనిక పాత్రలకే పరిమితం కాకుండా, పౌరాణిక పాత్రలకు కొంచెం కల్పనను జోడించి కామిక్స్ రూపొందించడం మొదలైంది. మన చిన్నారులను బాలగణేశ, ఛోటా భీమ్, హనుమాన్, శ్రీకృష్ణ వంటి పౌరాణిక పాత్రలు సూపర్ హీరోలకు దీటుగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి.మన చిన్నారులు భలే గడుగ్గాయిలు. వాళ్లకు సూపర్ మేన్‌కు, శ్రీకృష్ణుడికి తేడా తెలుసు. సూపర్‌మేన్ వాళ్లకు సూపర్‌హీరో మాత్రమే. శ్రీకృష్ణుడంటే సూపర్ హీరోను మించిన దేవుడు. సూపర్‌మేన్, బ్యాట్‌మేన్, స్పైడర్‌మేన్, డోరోమేన్‌లను ఆరాధించే మన చిన్నారులు... బాల గణేశ, ఛోటా భీమ్, శ్రీకృష్ణ వంటి వారిని భక్తిగా పూజిస్తారు కూడా. బహుశ ఊహ తెలిసినప్పటి నుంచి పెద్దల నోట పురాణగాథలను వింటూ పెరిగిన ప్రభావం దీనికి కారణం కావచ్చు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top